లోయ అంచుల్లో
చిరాకుగా ఉంది. నిలబడి నిలబడి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. నేను ఎక్కాల్సిన ట్రైను ఇప్పటికే గంట ఆలస్యం. కాలం గడుస్తూనే ఉంది. ప్లాట్ఫామ్ మీద జనం పెరుగుతూ పోతున్నారు తప్ప ట్రైను మాత్రం రావడంలేదు. దాని తర్వాతి ట్రైనుకు వెళ్లాల్సిన జనం నేను ఎక్కాల్సిన ట్రైను జనంతో వచ్చి కలిసిపోతున్నారు. చూస్తుండగానే క్రిక్కిరిపోయింది ప్లాట్ఫామ్. ఇంతలో అనౌన్స్ మెంట్ వినిపించింది. త్వరలోనే నేను ఎక్కాల్సిన ట్రైను రెండవ ప్లాట్ఫామ్ మీదికి వస్తుందట. ‘వెరీ సూన్...’ ఈ మాట విని నాకు నవ్వొచ్చింది. తర్వాతి ట్రైనుకు వెళ్లాల్సిన జనం కూడా బ్యాగులు సర్దుకుంటుంటే ఏడుపు వచ్చింది. రెండు ట్రైన్స్ సగం దూరం దాకా ఒకే రూటులో వెళతాయి. అందుకనే ఈ రెండు ట్రైన్ల జనమూ నేను వెళ్లాల్సిన ట్రైను ఎక్కడానికి రెడీ అయిపోతున్నారు. రానే వచ్చింది ట్రైను. రిజర్వేషన్ దొరక్క పోవడంతో అప్పటికప్పుడు స్టేషన్ కు వచ్చి జనరల్ టికెట్ తీసుకున్నాను. అందుకని జనరల్ కంపార్టు మెంటు ఆగేచోట నిలుచున్నాను. అందరిదీ ఇదే పరిస్థితి కదా... ఫుట్ బోర్డు మీద కూడా వేలాడుతూ నిలుచున్నారు జనం. ఎక్కడానికి వీలు కాలేదు. రెండుమూడు రిజర్వేషన్ కంపార్టు మెంట్లు చూశాను. అన్నీ ఇలాగే ...