లోయ అంచుల్లో
చిరాకుగా ఉంది. నిలబడి నిలబడి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. నేను ఎక్కాల్సిన ట్రైను ఇప్పటికే గంట ఆలస్యం. కాలం గడుస్తూనే ఉంది. ప్లాట్ఫామ్ మీద జనం పెరుగుతూ పోతున్నారు తప్ప ట్రైను మాత్రం రావడంలేదు. దాని తర్వాతి ట్రైనుకు వెళ్లాల్సిన జనం నేను ఎక్కాల్సిన ట్రైను జనంతో వచ్చి కలిసిపోతున్నారు. చూస్తుండగానే క్రిక్కిరిపోయింది ప్లాట్ఫామ్.
ఇంతలో అనౌన్స్ మెంట్ వినిపించింది. త్వరలోనే నేను ఎక్కాల్సిన ట్రైను రెండవ
ప్లాట్ఫామ్ మీదికి వస్తుందట.
‘వెరీ సూన్...’ ఈ మాట విని నాకు నవ్వొచ్చింది. తర్వాతి ట్రైనుకు వెళ్లాల్సిన
జనం కూడా బ్యాగులు సర్దుకుంటుంటే ఏడుపు వచ్చింది. రెండు ట్రైన్స్ సగం దూరం దాకా
ఒకే రూటులో వెళతాయి. అందుకనే ఈ రెండు ట్రైన్ల జనమూ నేను వెళ్లాల్సిన ట్రైను
ఎక్కడానికి రెడీ అయిపోతున్నారు.
రానే వచ్చింది ట్రైను. రిజర్వేషన్ దొరక్క పోవడంతో అప్పటికప్పుడు స్టేషన్ కు
వచ్చి జనరల్ టికెట్ తీసుకున్నాను. అందుకని జనరల్ కంపార్టు మెంటు ఆగేచోట
నిలుచున్నాను. అందరిదీ ఇదే పరిస్థితి కదా... ఫుట్ బోర్డు మీద కూడా వేలాడుతూ
నిలుచున్నారు జనం. ఎక్కడానికి వీలు కాలేదు. రెండుమూడు రిజర్వేషన్ కంపార్టు మెంట్లు
చూశాను. అన్నీ ఇలాగే ఉన్నాయి. జనరల్ టికెట్ తో రిజర్వేషన్ కంపార్టుమెంటులో ప్రయాణం
చేయడం నాకు ఇష్టంలేదు. ఇష్టం లేదు అనడం కంటే, టీసీ వచ్చి దిగిపొమ్మంటే తోటి
ప్రయాణీకుల ఎదుట జరిగే అవమానం భరించలేక పోవడం దానికి కారణం.
ఇప్పుడు తప్పదు, ఏదో ఒక కంపార్టుమెంటు ఎక్కేయాలి. అది కూడా కష్టమే,
క్రిక్కిరిసి ఉన్న జనం మధ్య. రైలు కూత వేసింది... ఇక నీ ఇష్టం అన్నట్టు. ‘ఇక నీ ఇష్టం...’ అన్నట్టుగా. ఏదైతే అది అయింది, ఆలోచిస్తూ నిలుచుంటే లాభం లేదు. జర్క్ ఇచ్చి
కదులుతున్న ఎదురుగా ఉన్న ట్రైను కంపార్టుమెంటులోకి చొరబడిపోయాను. రెండే క్షణాలు...
వాష్ రూమ్స్ సమీపంలోకి వచ్చి పడ్డాను. జనం నెట్టేస్తున్నారు, మోచేతులతో. ఊపిరి
ఆడడంలేదు. దిగేయాలన్నా ఇక వీలు కాదు, అప్పటికే రైలు మెల్లగా వేగం పుంజుకుంటోంది.
ఇంతలో- “ఏందట్టా, డోరుకు అడ్డంగా ఉండారు. ఈడ ఇంకెవురూ మనుషులు ఎక్కొద్దా.
జాగా ఇడసండి. ఏయ్ పిల్లోడా నీకే చెప్పేది. జరుక్కో... వారకి జరుక్కో...” ఒక ఆడమనిషి
పరిగెత్తుతూ వచ్చి, డోరు పక్కగా ఉన్న రాడ్ పట్టుకుని జనాన్ని తోసుకుంటూ కంపార్టుమెంటులోకి
చొరబడింది.
ఆమె నెత్తిన సీతాఫలాల గంప, చంకలో చంటి బిడ్డ. చేతిలో చిన్న బ్యాగు కూడా లేని
నేను, ఇందులో ఎక్కడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది? ఇదేమిటి ఈ మనిషి ఇంత అలాగ్గా
దూరేసింది?
“సీతాపలం పొండ్లమ్మా... సీతాపలం పొండ్లో...” అదోరకమైన మాడ్యులేషన్ తో ఆమె
లయబద్ధంగా తీస్తున్న రాగం, కంపార్టుమెంటులో వ్యాపించింది. జుయ్యిమని వీస్తున్న
గాలిలో తేలి, బయటకు కూడా దూకిందేమో తెలియదు.
ఆలోచనలో ఉన్న నాకు మోచేతి పోటు తగిలింది. చూస్తే ఆ ఆడమనిషి.
“సారూ, దీన్ని కొంచెం పట్టుకోండి...” చంకలోని బిడ్డను దాదాపు దౌర్జన్యంగా నా
చేతుల్లో పెట్టేసింది.
గంపలోని సీతా ఫలాలను ఆపక్కనే ఉన్న ఎవరి చేతిలోనో పెట్టి డబ్బులు వసూలు
చేసింది.
“ఇంగ ఇలా ఇయ్యి సారూ...” నా చేతుల్లోని రెండేళ్ల చంటిదాన్ని లాక్కుని చంకలో
వేసుకుంది.
ఈ రెండు చర్యలూ నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి.
“ఏవూరు సారూ మనది?” ఆ మనిషి అడిగింది చనువుగా. ఆమె చంటిబిడ్డ కొద్ది
నిముషాలు నా చేతిలో ఉన్నందుకేమో ఆ చనువు.
సమాధానం చెప్పాలనిపించలేదు నాకు. విననట్లు ఉండిపోయాను. ఆమె కూడా మళ్ళీ
రెట్టించలేదు.
ఇటూఅటూ మోచేతుల పోట్లు... ఎవరెవరివో కాళ్ళు, బ్యాగుల కింద నలిగిపోతున్న పాదాలు... జనం కరకరా
నములుతూ అంటిస్తున్న సమోసా నూనెలు... అలవోకగా ఎగురుతూ వచ్చి దేహాన్ని తాకుతున్న
పల్లీల తొక్కలు... అప్పుడప్పుడూ నా తలమీదుగా ఫ్లై చేస్తూ వెళ్ళి తెరచిన డోరు గుండా
బయటపడి తుంపర్లుగా మారి వెనక్కు వెళ్లిపోతున్న పువ్వాకు, వక్కాకు కలిసిన ముదురు
ఎరుపు ఎంగిళ్లు...
నరకం ఎక్కడో లేదు- గ్రామీణ రైలు సర్వీసుల్లోనే ఉందిరా భగవంతుడా!
ట్రైను స్లో అయింది. చూద్దునుగదా, అంతదాకా కంపార్టుమెంటులో గిరికీలు కొట్టిన
ఆడమనిషి పాడిన “అమ్మకపు” పాట కంపార్టుమెంటు లోనుంచి కిందికి దూకేస్తోంది. అయ్యో, ఆ
పాట ఇలా మధ్యలోనే వెళ్లిపోతే ఈ ఆడమనిషి సీతాఫలాలు ఏమి కావాలి? ఆ ఫలాలే కాదు, ఆ
రాగం లేకుండా ఈ మనిషి కూడా బతకలేదేమో...
ఆ అమ్మకపు రాగాన్ని దొరకబుచ్చుకుని పట్టేసుకుని ఆమె గొంతులో వేసేద్దామన్న
తపనతో చటుక్కున ముందుకు వంగాను. ఊహూ చిక్కలేదు. సరికదా, చంటిదాన్ని చంకలో వేసుకుని
నెత్తిన సీతాఫలాల గంప పెట్టుకున్న ఆడది కూడా దిగేస్తోంది.
దిగిపోతూ... పోతూ... నావంక చూసింది. “సారూ నువ్వు దిగవా?” అడిగింది.
మారు మాట్లాడకుండా దిగేశాను. ఎందుకు దిగానో తెలియదు... దిగేశాను అంతే.
ఒక్కోసారి మన చర్యలకు అర్థం ఉండదని ఎక్కడో చదివినట్లు గుర్తు. ఆ మాట నిజమే.
సీతాఫలం పొండ్లమ్మా... సీతాఫలం పొండ్లో...
ముందు పాట... తర్వాత ఆడమనిషి... ఆమె వెనుక నేను... నడుస్తున్నాము ఒకే వరుసలో.
బయలుదేరుతున్నానన్నట్లుగా కూత పెట్టింది రైలు. వెనుదిరిగి చూశాను.
కదులుతోంది. అప్పుడు గుర్తుకు వచ్చింది... నేను దిగాల్సిన స్టేషను ఇది కాదు. ఇది
కానప్పుడు మరి ఏదో గుర్తుకు రాలేదు.
“పోతే పోనియ్యండి సారూ. దానితో నీకెందుకు? మనం పోదారి పదండి.” ఆడ మనిషి మాటలు
వినిపించాయి.
ఆందోళనగా ఉన్న మనసు నిమ్మళించింది. అవును, నేను దిగాల్సిన స్టేషను ఇదేనేమో.
ఈమె నన్ను తెలిసిన మనిషేనేమో.
అయినా ఎక్కడ దిగాలో నేనెలా మరచిపోయాను? అసలు ఈ ఆడమనిషి ఎవరు...!
“నేననే కాదు... అసలు నీకు ఏ ఆడమనిషి గురిచ్చి అయినా తెలుసునా సారూ?” నా
మనసులోని ఆలోచనలు పసిగట్టినట్లే అడిగింది ఆమె.
చూశాను, నాలుగు అడుగులు ముందు నడుస్తోంది. నిజంగా మాట్లాడింది ఆమెనా? లేక నా
లోపలి నుంచి వచ్చిన ప్రశ్నా అది?
ఎక్కడి నుంచి వచ్చినా, అది పిచ్చి ప్రశ్న. నాకు ఆడమనిషి తెలియకపోవడం ఏమిటి?
అమ్మ, భార్య, నా ముద్దుల కూతురు, నేను రోజుమార్చి రోజు అరటి పండ్లు కొనే బూబమ్మ...
“అబ్బో, శానా మంది ఆడోళ్ళే తెలుసునే నీకు?” ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ
వినిపించింది మళ్ళీ అదే గొంతు.
ఆలోచనలు పసిగట్టేసిందా... ఎలా?
దానికంటే ఆమె మాటలో ధ్వనించిన వెటకారానికి ఒళ్ళు మండింది నాకు.
“ఆడమనిషి తెలియకపోవడం ఏమిటి? నువ్వు కూడా ఆడమనిషివే కదా. పోనీ ఇంకెవ్వరూ
తెలియదనుకుందాం... నా తల్లి, భార్య, కూతురి గురించి తెలియదా? నేను రోజూ పండ్లు
కొనే బూబమ్మ కూడా తెలుసు. ఇంకా చాలామందే నాకు పరిచయం.” ఉడుకుమోత్తనం వచ్చింది.
“సరే సారూ, నా గురిచ్చి ఏం తెలుసు నీకు?”
“ఇప్పుడే కదా కలిశావు. ఏం తెలుసంటే ఏం చెప్పేది? నా కళ్ళకు కనిపిస్తున్న
దాన్ని బట్టి నువ్వు ఒక తల్లివి. రైలులో పండ్లు అమ్ముకుని బతుకుతున్న కష్ట జీవివి.
నేను అనుకునేది... నీకు జీవితంలో సుఖసంతోషాలు లేవని.”
“నేను రెక్కల కష్టంతో బతుకు ఈడస్తా వుండే ‘అమ్మ’నే. కానీ నా బతుకులో సుకం
లేదని నీకెట్టా తెలుసును?”
“ఇలా కొండకోనల్లో చంటిబిడ్డను చంకనేసుకుని పండ్లు అమ్ముకునే నువ్వు
కష్టాల్లో కదా ఉండాలి. మరి సుఖం ఎక్కడినుంచి వస్తుంది?” నిలదీశాను.
ఆమెలోనుంచి ఆకుపచ్చటి వాసన గుప్పుమంది. రంగురంగుల సీతాకోక చిలుకలు
పదులుపదులుగా రెక్కలల్లార్చుకుంటూ నా మీదికి దూసుకుని వచ్చాయి.
ఉన్నట్టుండి అలా జరగడంతో, ఒక్కడుగు వెనక్కి వేశాను.
అంతలోనే రెండు సెలయేటి పాయలు ఆమె పాదాల నుంచి పుట్టి గలగలా లోయలోకి
ప్రవహిస్తున్నాయి. వందలో... వేలో... రకరకాల పువ్వులు ఆడమనిషి దేహమంతా పుట్టుకు
వస్తున్నాయి.
అప్పుడు చూశాను- చుట్టూ కొండలు... ఇరువైపులా లోయలు... ఆకాశంలో ఎగురుతున్న
పిట్టల బారులు... గాలికి తలలూపుతున్న లేలేత రెమ్మలు...
“బయపడినావా సారూ?” కిలకిలమనే నవ్వుల మధ్య అదే గొంతు.
సీతాకోక చిలుకలు... సెలయేళ్లు... పువ్వులు... కొండకోనలు... అన్నీ అలానే
ఉన్నాయి. వినిపించడం తప్ప, ఆడ మనిషి మాత్రం ఎక్కడా
కనిపించలేదు.
అప్పుడు వేసింది భయం. పరిసరాల స్పృహ కూడా అప్పుడే కలిగింది.
అసలు ఇది ఏ ప్రాంతం? నేను దిగింది స్టేషన్లో కదా... ఈ కొండల్లోకి ఎలా
వచ్చాను?
అసలు తాను వెంటబడి వచ్చిన ఆడమనిషి ఎవరు?
వెనుదిరిగి పారిపోవాలన్న ఆతృత మనసును ఊపేసింది. అదే సమయంలో... జీవితాంతం
ఇక్కడే, ఈ ప్రకృతి మధ్యే ఉండిపోవాలన్న కాంక్ష బలంగా కలిగింది.
“అయితే నీకు సారూ, మా ఆడోళ్ల గురిచ్చి తెలుసునంటావు?”
“ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? అసలు నువ్వు ఎక్కడ?
కనిపించవేమిటి?” భయంతో కూడిన ఆందోళన నా కంఠంలో.
“బయపడబాక సారూ, నీకు తెలిసిన ఆడమనిషినే గదా. నేను నిన్ను తీసుకొని రాలేదు
సారూ, నువ్వే నా ఎనకాల వొచ్చేసినావు. ఇంగ నేను ఎక్కడని అడిగినావు గదా. నీ ముందు,
ఎనక, పైనా, కిందా... ఉండేదంతా నేనే. అసలు నేనుండాను గాబట్టే నువ్వుండావు.” కనిపించకుండా
వినిపిస్తున్న ఆ గొంతులో హఠాత్తుగా ఎక్కడలేని మార్దవం. అమ్మ జోలపాటలోని అమృత తుల్యమైన
లాలిత్యం.
ఈ మార్దవాలు... లాలిత్యాలు... ఇవన్నీ వట్టి మాయ. వాటికి దాసోహమైతే జీవితమంతా
ఈ ఆడమనిషి అజమాయిషీలో బానిసత్వంలోనే మగ్గాలి.... ఆ ఎరుక నాకుంది.
“ఇదిగో, నాతో ఆటలాడకు? ఏమనుకున్నావు నేనంటే?” బింకం ప్రదర్శించాను.
“ఏమీ అనుకోలేదు సారూ ఇంకా.”
“ముందు నువ్వు కనిపిస్తావా లేదా? నేను మా ఊరు వెళ్లిపోవాలి. లేదంటే నిన్ను
ఏం చేస్తానో నాకే తెలియదు.”
“నిజమే సారూ, నువ్వేం చేస్తా వుండావో నీకు తెలీదు.” పకపకా నవ్వు.
కొంపదీసి ఈ ఆడది దెయ్యమా?
దేవుణ్ణి, దెయ్యాన్ని నమ్మని నాకు, ఆక్షణంలో దెయ్యం గుర్తుకు రావడం
విచిత్రం.
“నన్ను విడిచిపెడతావా లేదా? లేదంటే నిన్ను... నిన్ను...” లేని ధైర్యం
తెచ్చుకుని బింకంగా మాట్లాడుతున్నానే కానీ- బరితెగించిన ఆడదాన్ని ఎవరైనా ఏమి
చేయగలరు?
“నేను పట్టుకుంటేగా సారూ... నిన్ను వదలడానికి? సరే, పట్టుకున్నాను
అంటావుండారు గాబట్టి, వొదిలిపెట్టడానికి ఒక కండిషను...”
అసలు ఎలా తగులుకున్నాను దీని మాయలో నేను. కొందరు కొండజాతి ఆడవాళ్ళు ఏవో
శక్తులు కలిగి వుంటారట. నాగరిక మనుషులను మాయజేసి, గూడేలకు రప్పించుకుని చంపేసి
తింటారట. ఎక్కడో చదవాను నేను. చాలా హాలీవుడ్ సినిమాల్లో కూడా చూశాను అడవి మనుషుల
క్రూరత్వం.
నిజమేనా... నిజంగా ఆడమనిషి చేసిన మాయవల్లనే నేను దాని వెనకాల వచ్చానా?
లేక నల్లగా నిగనిగలాడుతూ సగానికి పైగా నగ్నంగా కనిపిస్తున్న దాని దేహంపై
ఆశతో మైమరచి వెంటపడ్డానా?
ఏది నిజమో అర్థం కావడంలేదు. అసలిక్కడ కనిపిస్తున్న పరిసరాలు వాస్తవమో మాయో
తెలియడంలేదు.
కానీ బయట పడాలంటే ఈ విచిత్రమైన ఆడమనిషి పెట్టబోయే కండిషన్ అంగీకరించడం తప్ప
ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.
“సరే, నీ కండిషన్ ఏమిటో చెప్పు?” ఎటువంటి తలనొప్పి తెచ్చిపెడుతుందో అని
భయపడుతూనే అంగీకరించాను.
“పెద్దగా ఏమీ లేదు సారూ, ఆడోళ్ల గురిచ్చి బాగా తెలిసిపోయిన మీలాంటోళ్లకు
కష్టం గూడా గాదు. శానా సులువైంది.”
“ఊరికినే వేధించకుండా వెంటనే చెప్పు మరి.”
“నీ పెళ్ళాం గురిచ్చి తెలుసునన్నావుగా సారూ...”
“ఎందుకు తెలీదు?”
“సరే ఒక ప్రశ్న అడగతా వుండాను చెప్పు. నీ పెళ్ళానికి ఇష్టమైన రంగేంది? ఈ
ప్రశ్నకు జవాబు చెప్తే నిన్ను వొదిలేస్తాను.”
నవ్వొచ్చింది దాని ప్రశ్నకు. ఆమాత్రం చెప్పలేనా... ఈ పనికిమాలిన ప్రశ్నకు
ఆన్సర్ చేయడానికి బ్రహ్మ విద్య కావాలా...
“లైట్ బ్లూ కలర్.” ఠక్కున చెప్పాను.
“కాదు.” అంతే షార్ప్ గా అన్నదా ఆడమనిషి.
“నిజం, దానికి ఎక్కువగా లైట్ బ్లూ కలర్ చుడీదార్ లే ఉన్నాయి. మోస్ట్లీ
శారీస్ కూడా అదే కలర్ కడుతుంది.”
“కాదు సారూ, ఆ లేత నీలం రంగు నీకు ఇష్టమైన రంగు.”
అప్పుడు తట్టింది. నిజమే నాకు ఇష్టమనే నా భార్య ఆ కలర్ దుస్తులు ఎక్కువగా
కొంటుంది. మరి దానికి ఇష్టమైన కలర్ ఏమిటి?
ఎప్పుడైనా అడిగి ఉంటేగా తెలిసేది...
నోటికి వచ్చిన కలర్ చెప్పబోయి ఆగాను. నాకు ఇష్టమైన కలర్ ఏమిటో పసిగట్టేసిన ఈ
దెయ్యం మనిషికి, విహితకు ఇష్టమైన కలర్ కూడా తెలిసే ఉండాలి. అబద్ధం చెబితే మళ్ళీ ఏం
తంటా వస్తుందో. మరెలా...!
“సరే వొదిలెయ్యండి సారూ. ఇంకొకటి అడగతా వుండా చెప్పండి. నీ పెళ్ళాం ఇష్టంగా
తినే కూరేంది? దీనికి జవాబు చెప్తే ఇడిసి పెట్టేస్తాను.”
“ఓస్ ఇంతేనా... ఏ కూరైనా తింటుందది.” నా మాటలో ఎంత రిలీఫో.
“అట్టా కాదు సారూ, ఆమి ఇష్టంగా తినే కూరేంది అని.”
“అయితే ఉండు. ఆ... ఎక్కువసార్లు ములక్కాడల సాంబారు చేస్తుంది విహిత. నాతో
కలిసి తింటుంది, ఇష్టంగానే. అదే ఆమెకు ఇష్టమైన కూర.”
“మళ్ళీ తప్పే చెప్పినావు సారూ. ములక్కాడల సాంబారు నీ పెళ్ళానికి కాదు, అది నీకిష్టమైన
కూర.”
నిజమే అనిపించింది ఈ ఆడమనిషి చెప్పింది. ఎందుకంటే,
నాకు ఇష్టమైన కూర కాబట్టే, ములక్కాడల సాంబారు ఎక్కువగా చేస్తుంది విహిత. మరి నా
భార్యకు ఇష్టమైన కూర ఏమిటి...!?
ఇంతలో ఎక్కడో ఏదో అలికిడి అయింది.
చూద్దును కదా... వేవేల సీతాకోక చిలుకలు ఎగురుతూ కనిపించాయి. మధ్యలో ఆమె
ఎవరు? అరె... అది, ఆమె నా భార్యే.
“మరి ఆడమనిషి గురిచ్చి తెలునన్నావుగా సారూ. నీ ఇంటి ఆడదాని ఇష్టాయిష్టాలే చెప్పలేక
పోతావుండావు. ఇంగ ఏ ఆడమనిషి గురిచ్చి తెలుసును అనుకుంటా వుండావు నువ్వు?” నిలదీసింది
ఆ సీతాఫలాల ఆడమనిషి గొంతు.
“నీ దిక్కుమాలిన ప్రశ్నలు పాడుగానూ. అదిగో అటుచూడు అక్కడ ఆకాశంలో సీతాకోక
చిలుకలు నా భార్యను ఎత్తుకుని వెళ్లిపోతున్నాయి ఆపు... అపు వాటిని ముందు.” పరుగులు తీస్తున్నాను నేలమీద.
కిలకిలా నవ్వులు... గలగలా నవ్వులు...
“ఎందుకా పిచ్చినవ్వు?” కోపం వస్తోంది. మరోవైపు భయం వేస్తోంది. పరిగెత్తి,
పరిగెత్తి అలుపుతో గుండెలు అదురుతున్నాయి.
“పోనియ్యండి సారూ. పాపం ఊహల్లోనన్నా ఆమిని స్వేచ్చగా వొదిలెయ్యండి.”
చిరు జల్లుల్లో స్వేచ్చగా నృత్యం చేస్తున్న అమ్మాయి... పొడవాటి కొంగుతో
బాల్కనీలో నిలబడి ఆకాశంలోకి చూస్తున్న ప్రౌఢ... అప్పుడే నిద్రనుంచి లేచి విండో
దగ్గర టీ కప్పుతో కలల కళ్ళతో నిలబడ్డ యువతి...
నా చిన్నారి కూతురు లాస్య గీసిన రంగురంగుల చిత్రాలు ప్రాణం పోసుకొని కట్టెదుట
నిలుచున్నాయి.
ఆయా చిత్రాలకు తగినట్టుగా నేను రాసిన స్త్రీ స్వేచ్చా గీతాలను పాడుతూ...
నన్ను చూసి పరిహశిస్తున్నాయి.
ఎక్కడినుంచో పరుగులు పెడుతూ వచ్చి నా ఎదురుగా నిలుచుందో అమ్మాయి. నన్ను
బెరుగ్గా వగరుస్తోంది.
“ఎవరు నువ్వు?” కాసేపు నా భార్యను మరచిపోయి అడిగాను.
“నేను నేనే.” జవాబిచ్చింది.
“ఆ సీతాఫలాలు అమ్ముకునే ఆడమనిషి ఏమైపోయింది?” కంగారు నాలో.
“నేనే ఆమెని.”
“కాదు, నువ్వు ఆమె కాదు. అది... ఆ బిచ్ ఏదో కనికట్టు చేస్తోంది. నిన్ను...
కాదుకాదు, మిమ్మల్ని ఇద్దరినీ పీక పిసికి చంపేస్తాను.” ఆవేశం కట్టలు తెంచుకుంది.
“మమ్మల్ని నువ్వు చంపలేవు. ఎందుకంటే నువ్వు సృష్టించిన అనేక పాత్రల సారాంశ రూపాలు
మేము.”
“నా పాత్రలు ఎప్పుడూ నాకు ఎదురు చెప్పవు...”
“నిజమే, నీ చుట్టూ ఉన్న ఆడమనుషులను కూడా ఎదురు చెప్పనివ్వవు. నువ్వలా
వాళ్ళని మెస్మరైజ్ చేసి సంకెళ్లల్లో బంధిస్తావు. ఇలా ఎప్పుడైనా మేము ఎదురువచ్చి
ప్రశ్నించబోతే- ‘మీకేమైంది... బోలెడంత స్వేచ్చ ఇచ్చాను కదా...’ అని నోళ్ళు
మూయిస్తావు.”
“తిక్కతిక్కగా మాట్లాడకు. అసలు నువ్వు ఎవరైతే నాకెందుకు? అయ్యో, విహిత... నా
భార్య. అప్పుడే ఎంత దూరం ఎగిరి వెళ్లిపోయిందో. ఇలా కాదు, ఆ సీతాకోక చిలుకలను
పట్టుకుని రెక్కలు విరిచేసి... పక్కకు తప్పుకో, అవి నా భార్యను ఎక్కడికో మోసుకుని
వెళ్లిపోతున్నాయి... ముందు దాన్ని పట్టుకోవాలి. జరుగు... పక్కకు జరుగు.”
“కంగారు పడకు. ఆమె ఎక్కడికీ వెళ్లడంలేదు. నువ్వు భయపడుతున్నట్లుగా నీలాంటి
మరో అహంకారాన్ని సమీపించి, మళ్ళీ ఇదే బందీ జీవితం గడపడానికి ఆమేమీ పిచ్చిది కాదు.”
“నేను చెప్పానా, అది లేచి వెళ్లిపోతోందని?” ఆవేశం ఉధృతంగా తన్నుకు వచ్చింది.
“నేనా పదం వాడానా? అయినా ప్రతిదానికీ మాటలు అక్కరలేదు, అంతర్లీనంగా ధ్వనించే
భావం చాలు.” సౌమ్యంగా ఉన్నదా అమ్మాయి గొంతు. లేదా కరుకుగానా... తెలియడంలేదు
కచ్చితంగా.
“మాటలతో మాయ చేయడానికి చూస్తున్నావు నువ్వు.”
“లేదు, మాయ చేస్తోంది నేను కాదు. ఆ పని చేస్తున్నది నువ్వు. నన్ను, నాలాంటి
ఎన్నో పాత్రలను సృష్టించి, నీలో లేని స్త్రీ
స్వేచ్చా బావాలను పలికిస్తున్నావు. వాటన్నింటి ప్రతిరూపమైన నేను భరించలేకపోతున్నాను.”
“భరించలేకపోతే ఏ నూతిలోనన్నా దూకి చావు.”
“అవును, ఆ పని చేయడానికే వచ్చాను. నీ ముందు ఆత్మహత్య చేసుకుందామనే వెంట పడి
నిన్ను ఇంతదూరం తీసుకొచ్చాను.”
“నువ్వు ఎక్కడైనా చావు. నేను వెళ్ళాలి, నా భార్యను ఎలాగైనా పట్టుకుని
ఆపాలి.”
“అది నీ తరం కాదు...”
“ఎందుకు కాదో నేనూ చూస్తాను...” పట్టలేని కోపంతో బలంగా ఆ యువతిని పక్కనున్న
లోయలోకి నెట్టేశాను... కాదు నెట్టేశానని
అనుకున్నాను.
అయ్యో... అయ్యో... ఇదేమిటి నా పాదాలు గాలిలోకి లేస్తున్నాయి. అమ్మో...
తలకిందులు అయిపోతున్నాను.
విపరీతమైన వేగంతో జర్రున జారుతున్న దేహం, బయటకు పొడుచుకు వచ్చిన పెద్ద బండరాయికి
కొట్టుకుంది.
“హబ్బా...” భరించలేని బాధతో కేక పెడుతుండగా, అప్పటిదాకా భయంతో మూసుకున్న
కనురెప్పలు అప్రయత్నంగా విచ్చుకున్నాయి.
భయంకరంగా నోరు తెరచుకుని లోలోపలికి మింగేస్తోంది ఆకుపచ్చటి లోయ.
నాకు తెలియకుండా చూపులు పైకి మళ్ళాయి.
సుదూరంగా... లోయ అంచుల్లో నిలబడి, పడీపడీ నవ్వుతోంది సీతాఫలాల ఆడమనిషి...
కాదు... కాదు... నేను సృష్టించిన పాత్రనంటూ క్షణం క్రితం ఎదురైన యువతి...
అరె, యువతి కూడా కాదు- ఆ అమ్మాయి విహిత... నా భార్య.
లేదా ఆ ముగ్గురూ ఒక్కరేనా...!?
----------------------------------------------
# “ఈమాట” ఎలక్ట్రానిక్ మేగజైన్ నవంబరు 2, 2025 సంచికలో ప్రచురితం. #
Comments
Post a Comment