పుట్టింరోజు
నోట్లో పెట్టుకోబోతా వుండే చద్ది ముద్ద గిన్నిలో వొదిలేసి
అమాన సెల్లు ఎడమ సెతిలోకి తీసుకొన్నా.
మా మేడాము పుట్టింటి కెల్లుండాది. నాధ్
గాడికి పొయ్యిన కాణ్ణించి ఒకటే పడిసింపట్టుకోనుండాదంట.. నిన్న మాపటేల కాణ్ణే
ఫోంజేసి జెప్పింది. ఈలుంటే ఒగసారొచ్చి పొమ్మనుండాది. పెడద్దరం మనిసిని గదా...
నేంబోతానా ? ఇపుడేం ఉబద్దరొచ్చి పడుండాదో. నాద్ గాడికేమైందోనని దిగులొకపక్క... నా
పెల్లాము ఏం దొబ్బులు పెడతందోనని బయమింకోపక్క.
“ఉన్నారా లైన్లో... ఏమండీ... “ ఆయమ్మి
ఆర్సిన అరుపుతో చెవ్వు గియ్యిమనింది. ఎప్పుడు ఆనయ్యిండాదో ఆనయ్యిండాది సెవ్వులో
వుండే సెల్లు. నాకు తెలికండానే సెవ్వుగ్గూడా అంటుకొనేసుండాది.
“ఆ... ఆ... ఉండా... ఉండా... ఇంటా ఉండా...
“
“హ్యాపీ బర్త్ డే అండీ...”
సెప్పలేనంత ఇస్టమంతా జేర్చి... గుత్తొంకాయి కూర్లో మసాల పట్టించుండే మిరిం
మాదిరిగా అబ్బా ... బలే ఉండాదా గొంతు.
“యేందీ... ’’ ఆ
మూర్స నించీ తేరుకొనేదానికి నాకు నిమిసమన్నా పట్టుంటాది. ఆ పనవ్వగానే అడిగేసినా.
ఆయమ్మేంజెప్తా వుండాదో నిజ్జింగా
నాకర్తంగాలా.
“మీ బర్త్ డే ఈరోజు ’’
నాకు బలే కుశాలైపొయ్యింది. మీ
పాసుగూలా... బర్త్ డే అని గాదురా అబ్బా. అచ్చింతలేం బళ్లేదని.
ఆయమ్మీకొక ట్యాంకు జెప్పేసినా.
“టిఫిన్ జేసినారా లేదా... ఏం దింటా
ఉండారు... అదిగో ఆ ప్రిజ్జులో కిందర్లో ఊరగాయుండాది ఎత్తుకోండి... స్టవ్వు కాపక్క
గుడ్డు పెట్టిండా మజ్జానానికి అట్టేసుకొని నంజుకోండి... ఏదోగటి దినకుండా కాలీ కడుతో ఉండొద్దు... ’’ ఏందెందో జెప్తా పోతా ఉండాది.
అమ్మోళ్ళింటి కెళ్లినా ఆయమ్మి మొనుసంతా
ఈణ్ణే ఉండిపొయ్యిన ఈ మొండోడి మిందే.
అన్ని కొసింలికీ నా జవాబు వొట్టి “ఆ...’’ నే.
“ఈ జన్మలో నువ్వు సుద్దంగా జవాబు
చెప్పవా ?’’
“నువ్వు కొసింలేడ యాస్తా
ఉండావు ? చాగంటి
కోటేస్సర్రావు మాదిర్తో బోదిస్తా వుండావు గదా. మంచి జెప్పేటప్పుడు చెవులు
యాలాడేసుకోని బక్తిగా ఇనాల. కొసింలేగూడదు...’’ ఇంగా నేం
జెప్తా ఉండేది అయిపోలా.
“నువ్వీ జన్మకి మార్తావనేది డౌటే...’’
ఆయమ్మికా పక్క మండిపొయ్యింది గావాల...
టపీమని పోను ఆపేసింది.
ఈ యవ్వారమంతా జరిగిండేది అప్పుడెప్పుడో
పదీ పదకొండేల్ల కింద మా పెల్లైన కొత్తల్లో.
అదీ... మొదులీ పుట్టింరోజు కతకు.
సిన్నప్పుడెప్పుడూ ఈ యాపీలు... బర్తు
డేలు… డెత్తు డేలు (అపశుకునం ఉపశమించుగాక...) చేసుకోనుండే గెవనమే లేదు నాకు. పెళ్లై
పెళ్లామొచ్చినాకనే ఆయమ్మే మొదులు బెట్టింది. అంటే- కేకులు గోసేసి... దీపాలార్పేసి
(అదే... కొవ్వొత్తులు ఊది ఆర్పతాంగదా అది) స్వీట్లు పంచేసి.. ఈ గోలంతా ఏందీ
లేదులే. తలకి పోసుకోమంటంది... ఉంటే కొత్త గుడ్డలు, లేదంటే
ఉతికిన గుడ్డలు కట్టుకోమంటంది. నేనింట్లో దిరిగేది ఉట్టి లుంగీతోనే గదా. ఇంగా
మిగిలిండే ఒల్లు మొత్తం... మొలకాయినించీ తలకాయిదాకా పైనంతా అ”ఘోర’ అవతారమే. ఆ ఒక్క లుంగీ గుడ్డపీలికైనా కనాకష్టం ఉతికింది కట్టుకోమని
పోరతంది.
ఇంటే నేన్నాదముని కొడుకెందు కవతాను ?
పెళ్ళాం మాటింటే అయినోల్ల దెగ్గిర ఎంత నామర్దా... మెడమింద తలకాయ తటక్కన ఊడి కింద బడిపోదా
?
నాకెప్పుడూ పుట్టింరోజు గెవనం ఉండనే
ఉండదు. “ఇదిగో... నువ్వీ దినం ఈ బూమ్మింద పణ్ణావు రా కొడకా... ’’ అని మా నాయినెప్పుడూ నాకు జెప్పలేదు... నేను గూడా అడగలా. నేనెలగ బెట్టిన
సదువుల సర్టిపికిట్లు జూసేసి మా మేడాము ఈ బర్తు డే కత మొదులు బెట్టింది.
ఏం ఉద్దారకం జేశానని పుట్టింరోజులు
జరుపుకోవాల ?
మా వొబ్బుగాడు జూడు... కతలమింద కతలు ఎడమ
సేత్తో గిలికి పారేస్తా వుండాడు.
మా కిష్టడు... ఒకే ఒక్కడు... నాయుడుపేట్లో
టీ ఆంగిడి పెట్టుకోని ఒంటి చేత్తో సంసారాన్ని ఆలాగ్గా లాక్కోనొస్తా వుండాడు.
కడాన మా లాస్య గూడా... బొమ్మలమింద
బొమ్మలు గీసేసి నా ఫేస్బుక్కు పేజీల్లో తప్పట్లు కొట్టించుకుంటా వుండాది.
నాద్ గాడు... ?
బ్యాటు బిగించి పట్టుకోని నీలిగి కొట్టినాడంటే బాలు... తొంబై ఆమడల దూరంలో పడాల...
ఈటిల్లో ఒక్కటైనా నావల్లవతాదా...?
కట్జేస్తే...
ఇదిగో ఈ పుట్టింరోజుగ్గూడా తలకి
పోసుకోలేదు.... ఒల్లికే. అదే మాసింటవల్తో ఒళ్ళు తుడుసుకొన్నా. కొత్తదెక్కడ...
ఉతికిన లుంగీ గూడా కట్టుకోలా .. రొండు
దినాల్నాడుదే ఇదిలించి నడుంకు బిగదీసినా. ఇదిగో... ఇక్కడ కంప్యూటరు ముందర
కుచ్చున్నా.
నా పెండ్లాం రేత్రే ముదిగారంగా చెవిలో
పోరు బెట్టినా నా పెడద్దరం చేస్టాలు నాయే...
కుచ్చున్నానే గానీ నా లోపల.... అంటే
అదేందో మొనుసంటారే అక్కడ అంతర్మథనం (అదేందో పుస్తకంలో ఈ మాట సదివినాన్లే... ఈడ మన
గురిచ్చి చెప్పుకొనేదానికి బరువుగా, గంబీరంగా ఉంటాదని ఏసినా... )
మొదులైంది.
ఇదేందిది ? ఈ మాదిరిగా ఆలోసిస్తే
బతికేదానికేనా ? మన గురిచ్చి మనం డప్పు కొట్టుకోకపోతే ఎవురు
గొడ్తారింగ ? ఎవురు మతిస్తారు మనల్ని ?
నన్ను మీరీపాటికే
పనికిమాలినోన్ననుకొనేసినారా ఏంది నా మొగలాయితనం ఎవురికీ తెలీదు. నా గొప్ప ఇదీ అని
నేనెప్పుడూ... ఈదిన బడి టాంటాం ఎయ్యిలా. పుసిక్కిన మీరా మాదిర్తో అనుకోనేస్తే నా
మొనుసు సివుక్కు మనీదా ?
ఆమాదిరి అనుకోబాకండి అయ్యల్లారా. నేను
పైంజెప్పిందంతా తూచ్... ఇప్పున్నిజ్జిం జెప్తా. నేనేం తక్కవ దింలా.
నిజ్జింగా... మీమీదొట్టు.
మా పిలకాయిలు హొంవొర్కు పుస్తకాలెత్తుకొంటే
ఎంత నేగ్గా రూంలోoచీ తప్పించుకోనొచ్చేస్తా... రాత్రి పొడుకొన్న పడకలేడ ఎత్తాల్సొస్తాదోనని
పొల్లుబుల్ల నోట్లో ఏసుకోని ఎంత నైసుగా ఈదిలో కెల్లబార్తా...
ఇయ్యన్నీ ఎందుగ్గానీ... తెల్లార్లేసి
కిటికీ పక్కనే ఏసిన కుర్చీలో కుచ్చోని నా మాదిర్తో ఎవురైనా న్యూసు పేపర్ను
ప్రకటనల్తో గూడా పనీబాట లేకండా మజ్జానందాకా ఊది పారీ గల్రా...?
ఎన్నని జెప్పేది నా టాలెంట్లు ? ఏమంజెప్పేది...
నాకు దప్ప ఎవురికీ అలివిగాని, అనావసంగా జేసి పారేసే
గొప్పగొప్ప పంలు ?
సెల్లు సేతిలోకి దీసుకొంటే... అబ్బో నా
ఒల్లు పుల్సిపొయ్యింది. పదో తరగతి సావాసగాళ్ళు జట్టు కట్టిన వాట్సాపు గ్రూపులో
ఎన్నెన్ని పుట్టింరోజు సుబాకాంచలో .
“గోపాలా... నువ్వు సల్లగా ఉండాల...”
అంటా అటుమాటోళ్ళంతా నా ఫోటోను పెట్టి ఆ బగమంతుణ్ణి కోరుకొంటా ఉంటే ఒల్లు పుల్సి...
పుల్సి... రెండో ఫేసులో జిలబరించి పోయ్యింది. వోల్లల్లో రచీతలుండారు...
ఇంజినీర్లుండారు... డాక్టర్లుండారు... యాక్టర్లుండారు... కల్లల్లో నీల్లు గిర్రన
తిరిగినాయి వోల్ల అబిమానానికి.
నేనెంత గొప్పోన్ని గాకపోతే ఇంతమంది
గొప్పోళ్ళంతా నాకు సుబాకాంచలు జెప్తారు ?
నా ఎదుర్రొమ్ము సిన్నప్పుడూదిన
బుడ్డమాదిరిగా ఓ... మంటా ఉబ్బిపొయ్యింది.
“మ్మేయ్...
’’ ఒక్క గావుకేక పెట్టినా.
అసలే కల్తీకాలం కాలం. గుండిలు,
ఊపిరితిత్తులు చెడిపొయ్యి ఎక్కడ కుచ్చున్నోళ్లక్కడ నిలవనా కూలబడి పుటుక్కు మనేస్తా
ఉండారుగదా. నాగ్గూడా పొయ్యేకాల మొచ్చేసిందనుకొనిందో ఏమో పాపం...
“యేమండీ... ’’
బయపడి పొయ్యింది గావాల... కేకలు
పెట్టుకుంటా, శమట్లు కక్కుకుంటా లగెత్తుకొనొచ్చింది బెడ్రూములోకి.
“ఉడుకు నీల్లు బెట్టు, తలకి బోసుకోవాల. మొన్న గుట్టిచ్చిండ్లా...
పండక్కు. వోటిల్లో ఏసుకోకండా ఆణ్ణే బెట్టేసిన
గుడ్డలెత్తి పెట్టు... ఏసుకోవాల.’’
సెల్లు సేతులో పెట్టుకోని,
కాలుమింద కాలేసుకోని సిద్విలాసంగా పొనుకోని ఆర్డరేస్తావుండే నన్ను జూసి ఆ పిల్లకు
కాల్తాదా... కాల్దా... ?
కాలింది... గంగమ్మ పూని, ఆగ్రహం ఆపుకోను అలివిగాక ఆయమ్మిసిరిన
గెంటితో, నా నెత్తికి మూడింది.
-----------------------------------------------------------------------
“కౌముది” తెలుగు వెబ్ మంత్లీ లో మార్చి, 2023 న ప్రచురితం.
Comments
Post a Comment