తాగని టీ

 అలారం మోగింది.


దిగ్గున లేచింది సుష్మ. ఉదయం ఐదవుతోంది. బాత్రూంకి కూడా వెళ్లకుండా గేటు బీగాలు తీసి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గేసింది.

అక్కడినుంచి వంటింట్లోకి పరుగు. స్టవ్వుమీద ఒకవైపు టీ పెట్టింది. మరోవైపు ఇడ్లి సాంబారుకోసం పప్పు గిన్నెలో వేసి నీళ్లు పోసింది. ఫ్రిజ్లోనుంచి బెండకాయలు బయటకు తీసి కట్టుపీట ముందు కూర్చుంది. ఇంతలో పొయ్యిమీది టీ పొంగడంతో ఉన్నపళంగా పైకి లేచి మంట తగ్గించింది. మళ్ళీ కింద కూర్చుని బెండకాయలు తరిగింది. ఇంకా ఆయన, పిల్లలు లేవలేదు. టీ గిన్నె తీసి పక్కన పెట్టి, ఇడ్లీ గిన్నెను స్టవ్ ఎక్కించింది. పిండి కలిపి ఇడ్లీలు పెట్టింది. అప్పుడు బాత్రూంకు వెళ్ళొచ్చింది. చిన్న గ్లాసుతో మూడు గ్లాసుల బియ్యం తీసుకొని మూడుసార్లు కడిగింది. ఉడికిన సాంబారు కిందికి దించి, బియ్యం కుక్కర్ పెట్టింది. ఈలోగా ఉడికిన ఇడ్లిలు విడదీసి, గిన్నెలు సింక్ లో పడేసింది. సందు చూసుకుని పిల్లలిద్దరినీ లేవగొట్టి పేస్టు వేసి బ్రష్షులు చేతికిచ్చింది. మూడు విజిళ్ళు వినిపిస్తే మళ్ళీ వంటింట్లోకి నడచి కుక్కర్ కిందికి దించింది. అందులోని అన్నాన్ని హాట్ ప్యాక్ లోకి తీసి మూత పెట్టింది. తరిగిన బెండకాయ ముక్కలు ఒక గిన్నెలో తీసుకుని పులుసుకోసం స్టవ్ మీద ఉంచింది. ఈలోగా పిల్లలు బ్రష్ చేసి వచ్చేశారు. వారికి పాలు కలిపి ఇచ్చింది. తాగాక ఇద్దరికీ స్నానాలు చేయించింది. మళ్ళీ వంటింట్లోకి నడిచి ఉడికిన బెండకాయ పులుసు కిందికి దించింది.

ప్రతి ఉదయమూ వంటింట్లో ఆమె బతుకు నృత్యమే.

అప్పుడు తీరిగ్గా లేచి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాడు భర్త భానుప్రకాష్.

హడావుడిగా టీ గిన్నె స్టవ్ ఎక్కించి వేడి చేసింది. ఒక గ్లాసులో టీ తీసుకువెళ్లి భర్తకు ఇచ్చింది సుష్మ.

"నీకెన్నిసార్లు చెప్పాను, నేను లేచేముందు మాత్రమే టీ ఫ్రెష్ గా కాచి ఇవ్వమని. నీకోసమని నువ్వు లేచినప్పుడే కాచుకుని తాగేస్తావు. ఆ మిగిలిన టీని తర్వాత నా మొఖాన కొడతావు. నీ మొఖంలా ఉన్నాయి ఈ టీ." ఇంతెత్తున ఎగిరి, గబగబా వచ్చి సింక్ లో ఒంపేశాడు భాను.

చివుక్కుమంది సుష్మ మనసు.

అది కొంచెంసేపే. ఇంకా చేయాల్సిన పనులు బోలెడు మిగిలిపోయాయి.

సింక్ లో పడేసిన బోకులు కడగడం... తనకూ, పిల్లలకూ, ఆయనకూ క్యారేజీలు కట్టడం... ఎన్నో. అన్నిటినీ ఏకబిగిన పూర్తి చేసింది. నిలబడుకునే రెండు ఇడ్లీలు నోట్లో కుక్కుకుంటుంటే అడిగాడు..

"ఏమికూర చేశావ్ ?"

"బెండకాయ పులుసు"

"ఆ బెండకాయ తప్ప నీకింకేమీ దొరకదా ? అంత ఇష్టమైతే నువ్వు ఆ పులుసు చేసుకుని తాగి కావాలంటే నెట్టిన కూడా కుమ్మరించుకో. మాకు మాత్రం ఏదైనా తినదగ్గ కూర చేసి తగలడు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవా ?" లంచ్ బాక్స్ విసురుగా టేబుల్ మీద పడేసి బయకు నడిచాడు.

బెండకాయ తిననంటే తిననని మొండికేసి చిన్నప్పుడు అమ్మచేత తిన్న దెబ్బలు గుర్తొచ్చాయి. మాట్లాడడానికి ఏమీ లేదు.

పిల్లలను రెడీ చేసి లంచ్ బాక్సులు చేతికిచ్చేసరికి స్కూల్ బస్సు హార్న్ వినిపించింది. పరుగున వెళ్ళి వారిని బస్సు ఎక్కించి టాటా చెప్పింది.

వీధిలోనుంచి తిరిగి ఇంట్లోకి వస్తుంటే వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసిన విషయం గుర్తుకువచ్చింది. మెషీన్ లోనుంచి తీసిన బట్టలు పెద్ద బకెట్ నిండుగా వేసి మోస్తూ మెట్లవైపుగా నడిచింది.

అక్కడ వంటింట్లో.. టైం లేక ఆమె తాగలేకపోయిన టీగిన్నెలో అలాగే ఉండిపోయి ఈగలు ముసురుతున్నాయి.
-------------------------------------------------------------

(మే 10, 2025న "నెచ్చెలి" అంతర్జాల వనితా మాస పత్రికలో ప్రచురితం)

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

పువ్వాకు ఎంగిలి