మర్డర్ వితిన్
వెల్లువలా చుట్టుకు పోయింది అతడిని. గాలి కూడా చొరబడడానికి సందేహించేంతటి సామీప్యం. ఒకరి గుండె చప్పుళ్ళు మరొకరికి వినిపిస్తున్నాయి. కలయికకోసం తహతహలాట. శరీరాల పెనుగులాటలో అపరిమిత సుఖం వెదుక్కోవాలనే వెంపర్లాట. గోడ మీద ఏదో నీడ ప్రత్యక్షమైంది. మెల్లగా పాకుతోంది. అంతదాకా తనదే సామ్రాజ్యం అన్నట్లు రికామీగా తిరుగుతూ పురుగులను వేటాడుతున్న బల్లి, ఎక్కడిదక్కడ ఆగిపోయింది. కిచకిచ శబ్దాలు కూడా లేవిప్పుడు. కేవలం ఆ జంట గుండెల చప్పుడు మాత్రమే. నిశ్శబ్దం అంతటి భయంకరం ఇంకోటి లేదేమో. బీరువా చాటుగా ఆగిన నీడ మెల్లగా ఇవతలికి కదులుతోంది. ఆ నీడనే గమనిస్తున్న బల్లి, భయంతో పరుగులు పెడుతూ వెళ్ళి, కరెంటు మీటరు వెనుక దాక్కుంది. “నీకోసం ఎంతగా ఎదురు చూశానో. ఇంత లేట్ గానా రావడం. నిన్ను ఈరోజు ఏం చేస్తానో చూడు...” గోముగా అంటూ అతడిని అలాగే బెడ్ పైకి తోసింది ఆమె. ఇక ఎంతమాత్రం భరించలేకపోయింది గోడ మీది నీడ. ఆ నీడ చేతిలో పదునైన చాకు తళుక్కున మెరిసింది. హఠాత్తుగా వెలుగులోకి వచ్చి కసిగా చాకు పైకి ఎత్తింది... ల్యాప్ కీ బోర్డు మీద చకచకా టైప్ చేస్తున్న లిఖిత్ చేతి వేళ్ళు ఆగిపోయాయి. కారణం... ఆ గోడ మీద నీడ తనలా మారిపోవ...