రక్త కన్నీరు
లోపలికి ఎక్కాము. రెండు వారలా అటూఇటూ ఉన్న బెడ్లమీదా, కిందా అంతా రక్తం మరకలు. చెమ్మగా ఉన్న లోపలిభాగం, కడిగినట్లు తెలుస్తోంది కానీ, అప్పటికే గడ్డకట్టిన మరకలు పూర్తిగా పోలేదు. ఒకటా రెండా ఎనిమిది మృత దేహాలు. లోయలో, ఆ కన్నుగానని ఆ రాత్రిపూట... బీభత్స భయానక దృశ్యం కట్టెదుట మళ్ళీ కనబడి ఒళ్ళు జలదరించింది. మొబైళ్ళు, టార్చిలైట్ల వెలుగుచీకట్ల నడుమ, ఎరుపూనలుపులు కలగలిసిన రక్తం పులుముకున్న మానవ దేహాలు... కాళ్ళుచేతులు విరిగి, తలలు పగిలి...
సరిగ్గా
గుర్తులేదు కానీ ఐదారేళ్లయింది
ఇది
జరిగి. పాలారు-కంగుంది మధ్య లోయలో మామిడి లోడుతో వెళ్తున్న వెహికల్ అదుపు తప్పి పడిపోయిందట. అందులో పైన
మూటలమీద కూర్చుని ప్రయాణిస్తున్న కూలీలు, డ్రైవరు, క్లినరుతో సహా మొత్తం 28 మంది చనిపోయారట. రాత్రి ఎనిమిదిన్నర గంటలు దాటుతుండగా అందిన
సమాచారం. కుప్పానికి కనీసం ఇరవై కిలోమీటర్ల
దూరం. మెలికలు తిరిగిన సన్నటి గుట్టల మార్గం. కన్ను పొడుచుకున్నా కానరాని చిమ్మ చీకట్లు.
తప్పదు...
వెళ్ళాలి, వెళ్లి తీరాలి.
మామూలు సంఘటన ఇఛ్చి ఊరుకోవడం కాదు. వేరే జర్నలిస్టులెవరూ ఇవ్వలేని మానవీయ
కథనం ఫైల్ చేయాలి.
"సార్, యాక్సిడెంటట, ఇరవై ముప్పైమంది చనిపోయారంటున్నారు.
వెళ్తున్నా. అక్కడ సెల్ సిగ్నల్స్
అందకపోవచ్చు. మళ్ళీ కుప్పం తిరిగి వచ్చాక కాల్ చేస్తాను. వీలైనంత త్వరగా రావడానికి ట్రై చేస్తా"
డెస్కుకు కాల్ చేసి ఇంటినుంచీ బయట పడ్డాను. అప్పటికే నా శిస్యుడు శ్రీనాధ్ సిద్ధంగా
ఉన్నాడు. ఏదైతే అదయిందని టూ
వీలర్లో
స్పాట్ కు వెళ్ళడానికి తయారయ్యాము. లక్కీగా తహసీల్దారు కారు వస్తూ కనిపించింది. రిక్వస్ట్ చేసి అందులో
ఎక్కి స్పాట్ చేరేసరికి తొమ్మిదిన్నర.
నిజంగా అంతమంది చనిపోయారా ? కాకపోయినా కనీసం పదీ పదిహేనుమందైనా
చచ్చి ఉంటే బావుణ్ణు... ఇంత
రిస్క్ చేస్తున్నందుకు వర్కవుట్ అవుతుంది. లేదంటే వేస్ట్ .
ఆంధ్రా జనాలకంటే తమిళ జనాలే ఎక్కువక్కడ. ఆ
రాష్ట్ర సరిహద్దు కేవలం పదీపన్నెండు కిలోమీటర్ల
దూరం కావడం, ఆ మామిడి కాయలు
లోడ్డు వెళ్ళేది తమిళనాడే కావడం కారణం.
కూలీలు కూడా అక్కడివారే.
అక్కడ చూశాను నేను...
మానవత్వం విశ్వరూపాన్ని.
పాతిక, ముప్పై అడుగుల లోతుంటుందా లోయ. చెట్లు, పుట్టలు, ముళ్ళ కంపలతో నిండి ఉంది. లుంగీలు ఎగ్గట్టి, లోపల ఫుల్ డ్రాయర్లున్నవారు కాళ్లకు
అడ్డు పడుతున్న పంచెలు ఊడదీసి...
దిగిపోతాతున్నారు లోయలోకి. ఎవరూ క్షణమాత్రం ఆలోచించడం లేదు. యాభై అరవై మంది గ్రామీణులు లోయలో.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు వల్ల కావడం లేదు. అంతా వీరే అయ్యారు.
ముందుగా ప్రాణంతో మిగిలి ఉన్నవారిని భుజాలమీదా, రెండు చేతులమీదా మోసుకొచ్చి రోడ్డుమీద
చేర్చారు. తర్వాత మృత దేహాలు.
యాక్సిడెంటులో
చనిపోయింది ఎనిమిదిమందే. మనుషుల్లోని మానవత్వ పరిమళాలు, మిగిలిన ఇరవై మందికీ ఊపిరి పోశాయి.
అక్కడికి కేవలం పాతిక కిలోమీటర్ల దూరంలోని
తమిళనాడు రాష్ట్రం వాణియంబాడి
ప్రభుత్వాసుపత్రికి
మృత దేహాలను, మృత దేహాలను, క్షతగాత్రులను చేర్చారు. తహసీల్దారు కారు కూడా ఆటే
వెళ్ళిపోయింది. చూస్తుండగానే ఒక్కొక్క వాహనమూ, ఒక్కొక్క మనిషీ అక్కడినుంచీ
అదృశ్యమయ్యారు. రెండుమూడు టూ వీలర్లు,
నలుగురైదుగురు
మనుషులు మాత్రం మిగిలారు. వారినడిగితే ఇటు రాము, ఆటే వెళ్తామన్నారు. మాకిప్పుడు వాహనం లేదు.
ఎలా వెళ్ళాలి కుప్పం ? ఆ నలుగురైదుగురు ఖాళీ చేసేశాక, మేమిద్దరమే మిగిలాం రోడ్డుమీద ఒంటరిగా. ఇద్దరుమున్నాం... ఒంటరి అనకూడదేమో .
పైన తళుక్కుమంటున్న చుక్కల వెలుగు... చీకట్లను మరింత చిక్కన
చేస్తోంది. ఆ నట్టడవిలో దూరంగా ఏదో అలికిడి
వినిపిస్తోంది. ఏనుగులా... వెలుగుబంట్లా ? పక్కనే
ఎనిమిది మందిని మింగేసిన మృత్యు
లోయ... నోరు తెరుచుకుని ఆవలిస్తోంది. రోడ్డుపై నల్లగా రక్తం ప్రవహించడం మాని... ఇప్పుడిప్పుడే
గడ్డ కడుతొంది.
దూరంగా
ఎక్కడో దడలాడింది... గుండె గుబగుబ రెట్టింపయింది.
మితిమీరిన వేగంతో మా ముందునించీ వెళ్ళిపోతున్న
అంబులెన్సు. క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చి వాణియంబాడి నుంచీ తిరిగి కుప్పం
వస్తున్న ఆంధ్రా వెహికల్ అది.
రోడ్డుకడ్డం
పడి ఆపాను.
"సార్...
ఇందులోనా..." నేరుగా మృత్యువు నోట్లోకే వెళ్తున్నంత భయం, నా శిష్యుని ముఖంలో... మాటలో...
ఫరవాలేదన్నట్టు భజం
తట్టి, లోపలికి నెట్టి నేనూ
ఎక్కాను.
మానవత్వం మరిచిన నాలాంటి
మనుషులను చూసి వొణకాలి... మృత్యు కోరలకందనివ్వకుండా పరుగులు తీసి ప్రాణాలు
కాపాడిన అంబులెన్సు అంటే భయమెందుకు... ప్రేముండాలి కానీ.
అప్పటికి
రాత్రి పదిన్నరైంది.
రాయిగా మారిన జర్నలిస్టు గుండెలో ఎక్కడో
దాగిన మానవత్వపు ఊట ఊరి... రెండు కన్నీటి బొట్లుగా మారి బుగ్గలపై జారింది.
-----------------------------------------------
( గో తెలుగు.కామ్ వెబ్ మేగజైన్ లో 2022వ సంవత్సరం ప్రచురితం )
Comments
Post a Comment