Posts

Showing posts from July, 2025

శకుని

"దుష్ట చతుష్టయం" ఆ రాణివాసపు అంత:పురాంతర్భాగాలనుంచి హేళనతో కూడిన నవ్వు.  గాలి అలలపై తేలి వచ్చి కాస్త బిగ్గరగానే వినిపించిందా మాట. భగ్గున మండింది శకుని మనసు. ఇప్పుడే... బాల రారాజుకు నాలుగు బుద్ధి మాటలు చెప్పి, తన భవనం నుంచి వెలుపలిదాకా వెంట వచ్చి సాగనంపి వస్తున్నాడు. వస్తూ వస్తూ ఏమి కుట్రలు జరుగుతున్నాయో తెలుసుకుందామని కుంతి అంత:పుర సమీపంలో కాపలా భటుల కంట పడకుండా తచ్చాడుతుంటే చెవులను బద్దలు చేస్తూ వినిపించింది ఆ కర్ణకఠోర శబ్దం. అవును... ఆ పలుకుతున్నది బ్రాహ్మణ యువకుడు ధౌమ్యుడే. ఎవరు దుష్టులు... అకారణంగా దండెత్తి వచ్చి గాంధార దేశాన్ని భస్మీపటలం చేసి తన సోదరి గాంధారిని పట్టి తెచ్చి అంధ రాజుకు కట్టబెట్టిన బీష్ముడా ? యోగ్యత లేకున్నా, తగుదునమ్మా అంటూ ఆ అందాల రాశిని చేపట్టి ఆమె చూపును చెరబట్టి బతుకు దుర్భరం చేసిన ధృతరాష్ట్రుడా ? బ్రాహ్మణ మూకల దన్నుతో  హక్కు లేని తన కుమారులకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడానికి అంత:పుర కుట్రలు పన్నుతున్న కుంతియా ? సుయోధనుని వంశ పారంపర్య హక్కును అంగీకరించక సన్నాయి నొక్కులతో పెద్దలందరినీ మెప్పించి హస్తినాపుర సింహాసనాన్ని కాజేయడానికి కుతంత్రములు చేస్తున్న ...

పున్నమి పూట

ఆరుబయట నిలుచుంటానా... చేదు వేపల తీయని నీడలలో అప్పటిదాకా ఆడుకుంటున్న బాల్యం తప్పిపోయిన గోళీని వెదికిపెట్టమని కాళ్ళను నేలకు తపతపా కొట్టుకుంటుంది వెన్నెలకుప్పలాటల సందడిలోంచి సందుచేసుకుని ఈవలకు వచ్చిన వెన్నెల పాప ఆడదాం రమ్మంటూ చేయిపట్టుకు లాగుతుంది అప్పుడెప్పుడో తెగిపోయిన ఊయల స్మృతుల చెట్టుకొమ్మకు మళ్లీ ముడిపడుతుంది ఎప్పుడు విన్నదని నా మాట మనసు? ఒక్క గంతుతో ఊయలెక్కి ఊగుతూ  నిస్తేజంగా నిలబడ్డ నన్ను చూసి వెక్కిరిస్తుంది

మర్యాదలు

  డోర్ తీసుకుని లోనికొచ్చాడు హర్ష. రెండు చేతుల్లో రెండు క్యారీ బ్యాగులు. ఒక దాంట్లో కూరగాయలు , రెండో బ్యాగులో ఏవో ఇంటికి కావాల్సిన సరుకులు. తన వద్దనున్న రెండో తాళం చెవితో బయటినుంచే లాక్ ఓపెన్ చేసి , కాలింగ్ బెల్ అవసరం లేకుండానే హఠాత్తుగా అల్లుడుగారు ఇంట్లో దూరేసరికి బిత్తరపోయింది మా ఆవిడ. హాల్లో ఉన్న సోఫాలో రెండు కాళ్ళూ బార్లా జాపేసి , ఎడమ మోచేతిపై తలను ఆన్చి కుడి చేతిలో రిమోట్ పట్టి పాల కడలిపై శేష తల్పమున శయనించిన విష్ణుమూర్తి ఫోజుతో టీవీలో సీరియలాస్వాదన చేస్తున్నదల్లా చటుక్కున లేచి అల్లుడికి గౌరవమివ్వ బోయింది. ఈవిడ మర్యాద సరే , ఇన్నాళ్లూ ఇంటిల్లిపాదికీ చాకిరీ చేసిచేసి అరిగి తరిగిపోయిన ముసలి ఎముకలకు ఓపికుండొద్దూ. నడుం కలుక్కుమని లేవలేక “కుయ్”మంటూ మూలిగి గతుక్కుమని చూసింది... అప్పటికే అల్లుడి చేతిలోంచి బ్యాగులు అందుకోవడానికి పైకి లేచిన నావంక. నవ్వొచ్చింది నాకు. ఆపుకున్నాను , ఉడుక్కుంటుందని.   “అయ్యో , నడుం పట్టేసిందా అత్తయ్యా. అయినా మీరెందుకు లేవడం, పడుకోండి పడుకోండి , ఎన్నిసార్లు చెప్పినా వినరు కదా. మామయ్యా , మీరూ తప్పుకోండి. నేను లోపల పెడతాను కదా. అసలే కరోనా కాలం...

నీవే తల్లివి... తండ్రివి...!

" అవునా , మీకు పెళ్లయిందా ... అప్పుడే ." ఆశ్చర్యపోయాడు రామన్ . " అంతేనా ... ఇద్దరు పిల్లలు కూడా . పాపేమో నైంత్ , బాబేమో సెవెంత్ ." సుజాత . నోరు తెరిశేశాడు రామన్ . చివరికి నిరాశగా ... " అలా కనిపించరే " అన్నాడు . " అవునా , మా ఫ్రెండ్సు కూడా అదే చెబుతారు " మురిసిపోయింది . " మీ హజ్బండ్ ఏమి చేస్తారు ?" అడిగింది అంతదాకా వారి మాటలు వింటూ మౌనంగా కూర్చున్న మధుమిత . " ఏదో కంపెనీలో నైట్ వాచ్మేన్ గా పని చేస్తాడు . ఆమధ్య యాక్సిడెంటు అయి అతడి కాలికి చిన్న దెబ్బ తగిలింది . నేనే కట్టు కట్టి ట్రీట్మెంటు ఇచ్చాను . అది గ్యాంగ్రైనుగా మారింది .   నడవలేని స్థితికి వచ్చాడు ." " అయ్యో ఎంత కష్టమొచ్చింది . ఇప్పుడేమి చేస్తున్నారు . ఒక్క జీతంతో ఇల్లు ఎలా గడుస్తోంది ." జాలి చూపబోయాడు రామన్ . " ఇల్లు భార్య , పిల్లలను అతడు ఎప్పుడు పట్టించుకున్నాడని . వాడిని దూరంగా పెట్టి చాలాకాలం అయింది . ఆ తర్వాతే యాక్సిడెంటు జరిగింది . ఎంతైనా భర్త కదా . పైగా నర్సును . ఉండబట్టలేక నేనే ట్రీట్మెంటు ఇచ్చాను . అప్పుడప్పుడూ వెళ్ళి చూసి వస్తున్న...