మర్యాదలు
డోర్ తీసుకుని లోనికొచ్చాడు హర్ష. రెండు చేతుల్లో రెండు క్యారీ బ్యాగులు. ఒక దాంట్లో కూరగాయలు, రెండో బ్యాగులో ఏవో ఇంటికి కావాల్సిన సరుకులు. తన వద్దనున్న రెండో తాళం చెవితో బయటినుంచే లాక్ ఓపెన్ చేసి, కాలింగ్ బెల్ అవసరం లేకుండానే హఠాత్తుగా అల్లుడుగారు ఇంట్లో దూరేసరికి బిత్తరపోయింది మా ఆవిడ. హాల్లో ఉన్న సోఫాలో రెండు కాళ్ళూ బార్లా జాపేసి, ఎడమ మోచేతిపై తలను ఆన్చి కుడి చేతిలో రిమోట్ పట్టి పాల కడలిపై శేష తల్పమున శయనించిన విష్ణుమూర్తి ఫోజుతో టీవీలో సీరియలాస్వాదన చేస్తున్నదల్లా చటుక్కున లేచి అల్లుడికి గౌరవమివ్వ బోయింది. ఈవిడ మర్యాద సరే, ఇన్నాళ్లూ ఇంటిల్లిపాదికీ చాకిరీ చేసిచేసి అరిగి తరిగిపోయిన ముసలి ఎముకలకు ఓపికుండొద్దూ. నడుం కలుక్కుమని లేవలేక “కుయ్”మంటూ మూలిగి గతుక్కుమని చూసింది... అప్పటికే అల్లుడి చేతిలోంచి బ్యాగులు అందుకోవడానికి పైకి లేచిన నావంక. నవ్వొచ్చింది నాకు. ఆపుకున్నాను, ఉడుక్కుంటుందని.
“అయ్యో, నడుం పట్టేసిందా అత్తయ్యా. అయినా మీరెందుకు లేవడం, పడుకోండి పడుకోండి, ఎన్నిసార్లు చెప్పినా వినరు కదా. మామయ్యా, మీరూ
తప్పుకోండి. నేను లోపల పెడతాను కదా. అసలే కరోనా కాలం. బయట ఎక్కడెక్కడో తిరిగేసి
వచ్చాను. ముట్టుకోవద్దు.” వారిస్తూ కిచెన్లోకి వెళ్ళి,
బజారునుంచి తెచ్చిన సరుకులు సింక్ దగ్గరే పెట్టి, నేరుగా
బాత్ రూంలో దూరిపోయాడు అల్లుడుగారు.
హాల్లో ఇంత జరుగుతున్నా పక్కనే డోర్ తెరిచే
ఉంచిన బెడ్ రూమ్ లోని మాస్టర్ బెడ్ మీద పిల్లోకు చేరగిలబడి అలసటగా కళ్ళు మూసుకున్న
భవ్యలో మాత్రం ఉలుకూపలుకూ లేదు.
పైగా “అమ్మా... బాత్ రూంలోంచి ఫ్రెషప్ అయి రాగానే, నాకు కాస్త కాఫీ కలిపి ఇవ్వమని
ఆయనకు చెప్తావా...?” చెప్పింది క్యాజువల్ గా. ఆ పురమాయింపుతో
శాంత, అదే మా ఆవిడజి
చిర్రెత్తుకొచ్చింది.
“ఇటు పుల్ల అటు ఎత్తి పెట్టనివ్వకుండా నెత్తిన
పెట్టుకుని నిన్ను నేనే చెడిపేశానే. నిన్నని ఏం లాభం, నా పెంపకం అలా ఏడ్చింది. అందుకు నన్ను
నేను చెప్పుతో కొట్టుకోవాలి...” ఇంకా ఏదో అనబోయేలోగానే అల్లుడు హాల్లోకి
ఎంటరయ్యాడు.
“ఏంటత్తయ్యా, భవీ మీద మళ్ళీ దండెత్తినట్టున్నారు... పాపం, రాత్రి
పది నుంచీ ఇప్పటిదాకా కంపెనీ కాల్స్ అటెండ్ చేస్తూనే ఉంది కదా. అలిసిపోయి ఉంటుంది.
నేను రాత్రి కదా కూర్చోవాలి. ఇప్పుడే మనందరికీ కాఫీ కలుపుకుని
వస్తానుండండి.” ఎప్పుడు వీళ్ళిద్దరి సంభాషణ విన్నాడో... నీళ్లు ఇంకా కారుతున్న తల తువ్వాలుతో
తుడుచుకుంటూనే కిచెన్లోకి దూరాడు హర్ష.
“థ్యాంక్యూ రా హబ్బీ... యూ క్యూట్ అండ్ సో
స్వీట్...” రెండు చేతులతో మొగుడి బుగ్గలు పుణికి, ముద్దు పెట్టుకున్నట్టు అభినయించింది అమ్మాయి బెడ్
రూంలొంచే. ఇదేం చోద్యమంటూ బుగ్గలు నొక్కుకుంది ఆ కూతురిని కన్న తల్లి.
కూతురూ, అల్లుడూ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. బెంగళూరులో ఒకే కంపెనీలో పని
చేస్తుండగా పరిచయం. అభిరుచులు కలిశాక డేట్ కూడా చేశారేమో మాకు తెలియదు. మా వరకూ
ప్రేమ విషయం వచ్చాక, పెళ్లి చెయ్యడానికి ఎటువంటి అభ్యంతరమూ
కనబడలేదు. పోయినేడాది కరోనా విరుచుకు పడడానికి సరిగ్గా నెల ముందే పెళ్ళయి పోయింది.
తర్వాత విజృంభించిన కోవిడ్, ఆపైన వచ్చిపడ్డ లాక్ డౌన్ పరిస్థితులతో
వాళ్ళక్కడికి శ్రీకాళహస్తికి మావద్దకు రావడానికి, మేమైనా ఇక్కడికి
రావడానికి వీలు కాకుండా పోయింది. అయితే అమ్మాయితోపాటు అల్లుడూ పోరు పెట్టడంతో, వారం రోజులముందే బెంగళూరు వచ్చాము. ఇంకా పిల్లలు లేరు వారికి. అబ్బాయి
తల్లిదండ్రులు కూడా ఎక్కడో హైదరాబాదులో పెద్ద కొడుకు దగ్గర ఉంటున్నారు. అల్లుడికీ, కూతురికీ మధ్య ఏ సరదాలూ, సరసాలూ సాగకుండా అడ్డుగా
ఉంటున్నామన్న బాధే కానీ, వారిలో అటువంటి భావమేమీ కనిపించదు
మాకు. వారిద్దరి అన్యోన్యం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంటుంది.
“అయ్యయ్యో... అబ్బాయి కాఫీ కాసి మనకు
ఇవ్వటమేమిటండీ... దానికి సిగ్గు లేకపోతే మనకుండద్దా... నేను వెళ్ళి కలుపుకోస్తా. ఇలా
వచ్చి నాకు కొంచెం చేయందించి లేపండి.” మళ్ళీ న్యూస్ పేపరు పఠనంలో మునిగిపోయిన
నన్ను పిలిచింది శ్రీమతి.
సరేనంటూ లేచివెళ్లి చెయ్యి అందించాను. నడుందాకా
కష్టమ్మీద లేపగలిగింది కానీ,
మోకాళ్ళు పట్టేయడంతో “అమ్మా” అంటూ అలాగే తిరిగి కూలబడింది సోఫాలో. ఆరోగ్యం ఏమాత్రం
సహకరించకున్నా అల్లుడికి తెగ మర్యాదలు చేసేయాలన్న దాని తాపత్రయం… ఎప్పుడో పదిహేనేళ్ళ క్రీతంనాటి నా మేనకోడలి పెళ్ళిలోకి నా ఆలోచనలను
లాక్కెళ్ళింది.
# # #
“రారా రారా హరీ, శాంతా బావున్నారా...
యేమే భవ్యా ఇప్పటికైనా గుర్తుకొచ్చామా ?” అందరినీ ఒకేసారి
పలుకరిస్తూ ఆప్యాయంగా ఆహ్వానించింది అక్కయ్య. మమ్మల్ని వీధి మొదల్లోనే చూసిన
మేనల్లుడు దినేష్, మా బ్యాగులను బైకులో తెచ్చి అప్పటికే లోపల
పెట్టేశాడు.
“కనిపించడంలేదూ అక్కయ్యా. అంతా బాగానే ఉన్నాం
దుక్కల్లా. ఎక్కడ... ఆఫీసు పని. వీలు పడలేదు ఎక్కడికి రావడానికీ. ఇప్పుడొచ్చాము
కదా, ఇప్పటికీ కుదిరింది.
మీరు మెడపట్టి గెంటినా ఇప్పట్లో వెళ్లొద్దని డిసైడ్ చేసుకునే వచ్చాం.” బదులిస్తూ
బయటే పెట్టిన పెద్ద టబ్బులోంచి నాలుగు చెంబులు నీళ్ళతో ముఖం కాళ్లూచేతులూ
కడుక్కుని ఇంట్లోకి అడుగు పెట్టాను.
లోనికి ఫెల్లీవెళ్ళగానే పెద్ద షాక్ తగిలింది. ఆ
సరికే దిగిపోయిన మా పెద్దొదిన, సోఫాలో బాసింపట్టు వేసుకొని కూర్చుని ఉంది.
“ఏమ్మరిదీ బావున్నారా...” అడిగింది రాణిసం ఉట్టిపడేలా.
ఎప్పుడు ఎక్కడ బంధుమిత్రులిళ్ళల్లో శుభాశుభ కార్యాలు జరిగినా ఠంచనుగా హాజరై
పోతుందీవిడ. అటూయిటూ తిరిగేస్తూ ఏవేవో పనులు చేసేస్తూ తెగ హడావుడిగా కనిపిస్తుంది.
అసలే భర్త మేనకోడలి పెళ్లి. పెళ్లి కూతురు విరి అంటే తెగ ఇష్టం కూడా. ఇంకెంత
హడావుడి చేయాలి. ఇప్పుడు అదేం కనిపించడంలేదు. ఇంకో సనాతన లక్షణముంది మా
పెద్దొదినలో. మగ పురుషుడు ఎవరు ఎదురైనా సరే తెగ గౌరవవించేస్తుంది. కొంగు నిండుగా
కప్పెసుకుని వంగిపోయి మాట్లాడుతుంది. తనకంటే వయసులో చిన్నోళ్లే అయినా, వారు ఎదురుగా ఉన్నంత సేపూ నిలబడే
ఉంటుంది. అటువంటి పెద్దొదిన, చెట్టంత మరిదిని నేను ఎదురుగా
ఉన్నా సరే కనీసం లేస్తున్నట్టు ఒక్క చిన్న కదలిక కూడా ఇవ్వకుండా, గుండ్రాయిలా కదలా మెదలక సోఫాను అంటిపెట్టుకుని కూర్చొనే ఉండడం... షాక్
కాక మరేమిటి.
చిన్నన్నయ్య చిదంబరం, చిన్నొదిన కనకం వాళ్ళు ఊడిపడ్డారు
ఇంతలో. కాస్త జరిగి న్నయ్యకు పక్కనే చోటిచ్చాను. చిన్నొదిన మాత్రం వచ్చీరాగానే
ఉస్సురంటూ, సోఫాలో కూర్చున్న నా కాళ్ళ ముందే చటుక్కున కింద కూలబడింది.
ఖంగారుగా వెనక్కు లాక్కున్నాను నేను పాదాలను.
“అరెరే, అదేంటి కనకొదినా, కాళ్ళ దగ్గర కూర్చున్నావు... లే, లేచి అక్కడ కుర్చీ ఉంది వెళ్ళి కూర్చో” చెప్పాను.
“ఇంతమంది మొగోళ్ళు, పెద్దోళ్ళు ఉండంగా రాణుల్లాగా సోఫాలూ, కుర్చీలూ ఎక్కి ఇరగబడడం మన ఇంటావంటా లేదన్నయ్యా మరిదీ.” ఇంతమాత్రం నీకు
తెలియదా అన్నట్లు. ఆమె ఎవరినైతే టార్గెట్ చేసిందో వారినే వెళ్ళి తాకాయా మాటలు గురి
తప్పకుండా. అంతదాకా ఎవరితోనో పెళ్లి విషయాలు ముచ్చటిస్తున్న పెద్దొదిన చటుక్కున మాటలాపి ఇటు తిరిగింది.
“రే విన్నీఇలా రారా. అక్కడ డ్రెస్సింగ్
టేబుల్ మీద కాలి బ్యాండు పెట్టుండాను, ఇలా తెచ్చివ్వరా.”
గుమ్మానికి వెలుపల ఎవరితోనో మాట్లాడుతున్న కొడుకును పిలుస్తూనే...
“మర్యాదలు ఒకరు నేర్పిస్తే నేర్చుకొనే
పరిస్థితిలో ఇక్కడెవరూ లేరు. కిందికి దిగొద్దని డాక్టరు చెప్పబట్టి కానీ...”
దీర్ఘం తీసింది.
మా ఏడేళ్ళ భవ్యను ఒడిలో కూర్చొబెట్టుకుని, వేరొక సోఫాలో పద్మాసనం వేసుకుని
చిన్నపిల్లలా ఏదేదో గలగలా మాట్లాడేస్తున్న పెళ్లికూతురు విరిజ చివుక్కున పైకి
లేచింది. వేటగాడి తూటా దెబ్బ తిన్న పక్షిలా విలవిల్లాడిన భావం ఆమె ముఖంలో. భవ్యను
నడిపించుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది. చిన్నొదిన మాటలకు ఆ అమ్మాయి కూడా చిన్నబుచ్చుకున్నట్లే
ఉంది.
“ఓహో... ఈమె కాలికేదో దెబ్బ తగిలింది కాబోలు” అనుకున్నాక,
పెద్దొదిన నన్ను చూసి కూడా సోఫాలోంచి లేవక పోవడమనే షాక్ నుంచి నాకు ఉపశమనం
లభించింది. ఆడవాళ్ళ మాటల్లో తల దూరిస్తే ఏమవుతుందో తెలిసిన అనుభవజ్ఞుడిని కాబట్టి, అక్కడి నుంచీ మెల్లగా తప్పించుకుని బయట వేసిన షామియానా కిందికి వచ్చి
కూర్చున్నాను. అప్పటికే అక్కడున్న అన్నలు, మామలు, పెదనాన్నలు, తమ్ముళ్ళు,
చెల్లెళ్లతో మాటల్లో పడ్డాను.
పెళ్లి ఇంకా మూడు రోజులే ఉంది. ఇప్పుడు
దిగిపోయిన వారంతా దగ్గరివారే. ఎవరూ కొత్తవారు లేరక్కడ. ఇంతలో “మామయ్యా” అంటూ ఇంట్లోంచి షామియానా కింద
ఉన్న నా దగ్గరికి వచ్చింది మేనకోడలైన పెళ్లికూతురు విరిజ. దానికి నా దగ్గర
చనువెక్కువ. చిన్నప్పుడు కొన్నేళ్లు మా ఇంట్లోనే ఉండి చదువుకుంది కూడా. చిన్నత్త, అదే నా భార్య అంటే ప్రాణం పెట్టేస్తుంది. ఇంతలో శాంత కూడా అక్కడికి
వచ్చింది. ముగ్గురం ఆ పక్కనే గోడ కింద వేసిన వైరు మంచం మీద కూర్చుని మాటలు మొదలు
పెట్టాం.
ఎక్కడినుంచో ఇంట్లోకి వెళ్లబోతున్న మా చిన్నత్త
కూతుళ్ళు ఇద్దరు వచ్చారు దగ్గరకు “ఏం బావా బాగున్నారా” అంటూ. మంచమ్మీద కాస్త
పక్కకు సర్దుకునేలోపే, వంగని
మోకాళ్ళను పట్టుకుని ఆపసోపాలు పడుతూ కింద పోసిన ఇసుకలో కూర్చునేసి, మంచం కోళ్ళకు ఆనుకున్నారు. వాళ్ళల్లో ఒకరికి ఈ మధ్యనే కాలికి చిన్న
ఆపరేషన్ కూడా అయింది. కింద కూర్చోవాల్సి రావడంతో వాళ్ళు పడుతున్న ఇబ్బంది నాకు
స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
“మంచం మీద ఖాళీ ఉంది, లేదంటే కుర్చీలు బోలెడున్నాయి, అంత కష్ట పడుతూ కింద
ఎందుకు, పైన కూర్చోవచ్చు కదా...” అన్నానో లేదో...
“అయ్యయ్యో బావ ముందు ఆయనతో సమానంగా పైన కూర్చుని తైతక్కలాడడం మాకు చేతనవునా. మేము అంత
అగౌరవంగా ప్రవర్తించడం నువ్వెప్పుడైనా చూశావా బావా?” ఏదో
ఘోరమైన పాపం చెయ్యమన్నట్టు అనేశారు. లెంపలేసుకొడమే తక్కువ. పాపం, వాళ్ళు సిన్సియర్ గానే అన్నట్టుంది.
వాళ్లలా చేయడంతో, ఎవరూ లేరు కదా అని అంతదాకా నా పక్కనే ఉన్న మా ఆవిడా లేచి కింద
కూర్చోక తప్పలేదు. ఈవిడ వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు
నాకు తెలిసి ఏం లాభం... అక్కడ పరిస్థితులు నా చేతుల్లో లేవు. మేమిప్పుడు వచ్చి
దిగుండేది మర్యాదల లోకం. మనం ఏమైపోయినా సరే, ఎదుటివారికి
ఇవ్వాల్సిన గౌరవాలు ఇచ్చి తీరాల్సిందే. లేదంటే సూటిపోటీ మాటలు, వినాల్సిందే. ప్రపంచంలోనే ఇంత అమర్యాదకరమైన మనుషులు లేరన్న బిరుదు
మోయాల్సిందే. ఆడవాళ్ళు ఇటువంటి ఫంక్షన్లలో పనులు చేసుకునేటపుడు తప్ప, అందరి ముందూ రోజంతా నిలబడుకునే ఉండాలి, మరీ శోష
వచ్చి పడిపోయే పరిస్థితి ఉంటే తప్ప కిందైనా సరే ఎట్టి పరిస్థితుల్లో
కూర్చోరాదన్నది మా కుటుంబాల్లో కనిపించే అప్రకటిత నిబంధన. ఆ నిబంధనలు తెంచుకుని
బయట పడడానికి ప్రయత్నించి అప్పుడప్పుడూ మాత్రమే విజయం సాధిస్తుంటుంది నా మేనకోడలు విరి.
చాలాసార్లు ఓడిపోతుంటుంది కూడా. ఇందాక ఇంట్లో జరిగిన ఎపిసోడ్ లాగా విఫలమై
గాయపడుతుంటుంది.
“నేను లోపలికి వెళ్తున్నాను మామయ్యా... చిన్న
పనుంది.” ఇక అక్కడ తనుండదగ్గ వ్యక్తి కాదనుకుందేమో, అత్తయ్యవంక జాలిగా చూస్తూ, ఇంట్లోకి
తుర్రుమంది... నేను స్పందించేలోగానే.
గంటలతరబడి నిలబడలేక, కింద కూర్చోలేక, అలాగని
“మర్యాదల”ను తోసి రాజని కుర్చీల పైకెక్కి “తైతక్క”లాడలేక, ఆ
రోజంతా శాంత పడ్డ బాధ వర్ణనాతీతం. ఏ పనులు చేస్తున్నా,
ఎవరితో మాట్లాడుతున్నా, ఈవిడ అవస్థ గమనిస్తూనే ఉంది పెళ్లి
కూతురు. రాత్రి అన్ని పనులు పూర్తయ్యేసరికి పన్నెండు గంటలు దాటింది. అందరూ నిద్రకు
ఉపక్రమిస్తున్నారు. పెళ్ళికోసమే పక్కన ఇంకో ఇల్లు అద్దెకు తీసుకున్నారు అక్కయ్యా
వాళ్ళు.
“శాంతా, వెళ్ళి మనం ఆ
పక్కనింటిలో పడుకుందామా...” పిలిచాను. ఆమె
మీద ప్రేమ ఎక్కువై కాదు. భార్య అనేది పక్కనుంటే మెత్తటి పడక,
దాహమైనప్పుడు చెంబులో నీళ్లందించడం, పొద్దున లేస్తూనే కాఫీ
పట్టుకొచ్చివ్వడం, బ్రష్షు, దానిమీద పేస్టు వేసి దంత ధావనంతోపాటు
స్నానపానాదులు చేయించడం... వంటి సకల సదుపాయాలూ సమకూరుస్తుంది కదా ఆనంతే.
“అత్తయ్య నాతో నా గదిలోనే పడుకుంటుంది లే
మామయ్యా.” పెళ్లికూతురు నా గొంతెమ్మ కోర్కెలకు అడ్డుకట్ట వేసింది.
అంతమందిలో మారు మాట్టాడలేక పోయాను. కాదని నాతోనే
రమ్మని పట్టుబడితే,
“ఇంతమందిలో పెళ్ళాంతో తైతక్కలాడాలనుకుంటున్నాడు, ఈయనకు ఇదేం పాడు బుద్ధీ, సిగ్గు లేకుండా...” అని అమ్మక్కలు బుగ్గలు నొక్కుకుంటారేమోనని, సైలెంటుగా వెలుపలికి వచ్చేశాను.
వెంట రాకుంటేనెం... నా మేనల్లుడి ద్వారా తాను
చేయగల సకల సదుపాయాలూ విడిది ఇంట్లో కల్పించింది మా ఆవిడ. ఉదయం స్నానపానాదులు
అక్కడే ముగించుకుని, శాంత
పంపిన కొత్త బట్టలు ధరించి, చక్కగా ముస్తాబై పెళ్ళింటికి
చేరుకున్నాను.
“శాంతా, శాంతా...” పిలుస్తూ లోపలికి వెళ్ళిన నాకు, దిమ్మ
తిరిగే షాక్ తగిలింది. ఓ మూలగా వేసిన ఒక కుర్చీలో నిమ్మళంగా కూర్చుని ఉంది మా ఆవిడ.
ఇక్కడి మర్యాదలను తోసి రాజనేంత సాహసం ఈవిడకు ఎప్పుడొచ్చింది ?
హఠాత్తుగా నన్ను చూడగానే తత్తరపడ్డ శాంత
లేవబోయింది. అప్పుడే తన గదినుంఛీ హాల్లోకి వచ్చిన మేనకోడలు, అది గమనించి ఖంగారుగా ఆవిడ భుజాలు పట్టి
ఆపింది.
“అత్తయ్య, లేవలేదు
మామయ్యా. నా గదిలోని బాత్ రూములో రాత్రి జారి పడింది. పెద్ద దెబ్బలేమీ తగల్లేదు కానీ
పాదాలు బెణికి, మోకాళ్ళు కూడా కొద్దిగా వాపు వచ్చాయి, తమ్ముడిని పంపి అయోడెక్స్ తెప్పించి రాశాను. కుడి కాలు మరీ నొప్పేస్తుంటే
బ్యాండెజ్ వేశాను.” చెప్పింది గుక్క తిప్పుకోకుండా.
నిజమేనా అన్నట్టు చూశాను నా సతీమణివైపు. ఆవిడ
చాలా ఇబ్బందిగా, ఏదో తెలియని
బాధతో చూసింది నావైపు. “సరే... జాగ్రత్త” అంటూ, బయటకు వచ్చేశాను.
అక్కడే పెడుతున్న టిఫిన్ లాగించి బంధుగణంతో పిచ్చాపాటీలో పడ్డాను. పెళ్ళింట్లో
ఉన్న మూడునాలుగు రోజూలూ కుర్చీ దిగలేదు నా భార్య. అలా అనేదానికంటే ఆవిడను
దిగనివ్వలేదు విరి అంటే సరిగ్గా అతుకుతుంది మాట. మేనకోడలు అప్పగింతలదాకా ఉండి, ఇంటికొచ్చేశాం. వచ్చిన రోజే
బ్యాండు విప్పి పడేసి, ఇంటి చాకిరీలోకి దిగిపోయింది
మా శాంత. పెళ్ళిలో ఆవిడ “కాలి” ఎపిసోడ్ పై ఏదో అనుమానం తొలుస్తూనే
ఉంది నాలో.
రెండుమూడు నెలలు గడిచిన తర్వాత విరి పుట్టింటికి
వచ్చిందని తెలిస్తే,
క్షేమసమాచారాలు కనుక్కుందామని ఫోన్ చేశాను. మా ఆవిడ లోకాభిరామాయణం మాట్లాడి
వంటింటిలోకి వెళ్ళాక అడిగేశాను ఉండబట్టలేక...
“నీ పెళ్ళిలో మీ అత్తయ్య నిజంగానే జారి పడిందా
లేక ఆవిడ బాధ చూడలేక నువ్వు...”
“ఇప్పుడదంతా ఎందుకులే మామయ్యా... సరే, ఇంకేం విశేషాలు లేవు కదా, ఉంటా మరి.” ముసిముసిగా నవ్వుతూ ఫోన్ కట్ చేసింది.
అర్థమైంది నాకు. అప్పుడే కాదు, ఈనాటిదాకా కూడా మా ఆవిడ వద్ద ఆ ఎపిసోడ్
తీసుకు రాలేదు నేను.
# # #
“యేమండీ...” శాంతి పిలుపుతో ఈలోకంలోకి వచ్చాను. సతీమణిని
సోఫాలో యథా ప్రకారం పడుకోబెట్టాను. వచ్చి కుర్చీలో కూర్చుని పేపరు చేతిలోకి
తీసుకోబోతూ...
“అల్లుడు చెబుతున్నాడు కదా. ఈ నొప్పులు లేనంత
కాలం అన్నీ నువ్వే చేశావా లేదా. మర్యాదలంటూ హడావుడి చేసి, మళ్ళీ నువ్వు ఎక్కడైనా జారి పడితే మందు
రాసి, బ్యాండేజ్ వేసేందుకు నా మేనకోడలు కూడా ఇప్పుడిక్కడ
లేదు.” పెదవులు దాటనివ్వని నవ్వుతో చెప్పాను కొంటెగా... ముసలోళ్ల మైపోయాక ఏం
చేస్తుందిలే అన్న ధైర్యం.
“అయితే అన్నీ తెలుసన్న మాట. వద్దు, బాగుండదని ఎంత చెప్పినా అది వినలేదండీ.
లేని గాయానికి బ్యాండేజీ కట్టి కుర్చీలో కూచోబెట్టేవారకూ పోరు పెట్టింది, ఊరుకోలేదు. అయినా అప్పుడు అదలా చేసి ఉండకపోతే,
నాకున్న కీళ్ల నొప్పులకు నెలా రెండు నెలలలదాకా పడకలో పడి ఉండడం తప్పేది కాదు... పదేళ్ళ పసివాడి ముందు కూడా గుంజీలు తీయలేక.” కోడలిని
తలచుకుంటూ అభిమానంగా అంది.
“మరిప్పుడు అల్లుడుగారికి మర్యాదలు
చేయలేకపోవడం... ఈ నొప్పులు కూడా ఉత్తుత్తివేనా...”
తనకే సాధ్యమైన రీతిలో గమ్మత్తుగా మూతి ముడిచింది
శాంత. ఆవిడ పక్కనే ఉన్న జండూబామ్ డబ్బా సరసంగా వచ్చి నా ఛాతీని సుతారంగా తాకి ముద్దెట్టుకుంది.
-----------------------------------------------------------------------
# “వార్త” తెలుగు దినపత్రిక 09.10.2022 న ప్రచురితం.
#
Comments
Post a Comment