శకుని
"దుష్ట చతుష్టయం"
ఆ రాణివాసపు అంత:పురాంతర్భాగాలనుంచి హేళనతో కూడిన నవ్వు. గాలి అలలపై తేలి వచ్చి కాస్త బిగ్గరగానే వినిపించిందా మాట.
భగ్గున మండింది శకుని మనసు.
ఇప్పుడే... బాల రారాజుకు నాలుగు బుద్ధి మాటలు చెప్పి, తన భవనం నుంచి వెలుపలిదాకా వెంట వచ్చి సాగనంపి వస్తున్నాడు. వస్తూ వస్తూ ఏమి కుట్రలు జరుగుతున్నాయో తెలుసుకుందామని కుంతి అంత:పుర సమీపంలో కాపలా భటుల కంట పడకుండా తచ్చాడుతుంటే చెవులను బద్దలు చేస్తూ వినిపించింది ఆ కర్ణకఠోర శబ్దం.
అవును... ఆ పలుకుతున్నది బ్రాహ్మణ యువకుడు ధౌమ్యుడే.
ఎవరు దుష్టులు...
అకారణంగా దండెత్తి వచ్చి గాంధార దేశాన్ని భస్మీపటలం చేసి తన సోదరి గాంధారిని పట్టి తెచ్చి అంధ రాజుకు కట్టబెట్టిన బీష్ముడా ?
యోగ్యత లేకున్నా, తగుదునమ్మా అంటూ ఆ అందాల రాశిని చేపట్టి ఆమె చూపును చెరబట్టి బతుకు దుర్భరం చేసిన ధృతరాష్ట్రుడా ?
బ్రాహ్మణ మూకల దన్నుతో హక్కు లేని తన కుమారులకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడానికి అంత:పుర కుట్రలు పన్నుతున్న కుంతియా ?
సుయోధనుని వంశ పారంపర్య హక్కును అంగీకరించక సన్నాయి నొక్కులతో పెద్దలందరినీ మెప్పించి హస్తినాపుర సింహాసనాన్ని కాజేయడానికి కుతంత్రములు చేస్తున్న ధర్మజుడా ?
నెయ్యము నెయ్యమంటూనే కయ్యానికి కాలు దువ్వించే యత్నాలు చేస్తూ, సకల కురువంశ వినాశనాన్నీ కోరుకుంటున్న ఆ కపట నాటక సూత్రధారియా ?
దుష్టులు ఎవరు ?
నెమ్మదిగా నడుచుకుంటూ తన భవనంలోకి నడిచాడు శకుని.
మండుతున్న మనసును మధిరలో ముంచడానికి ప్రయత్నించాడు.
ఉహూ... ఏమాత్రం చల్లారలేదు రగులుతున్న బడబానలం.
ఇంకా పసి ఛాయలు వీడని సుయోధనుని ముద్దు మోము గుర్తుకు వచ్చింది.
దుశ్శలతో సహా ఆతని శతస్సహోదరులూ కనుల ముందు వరుస కట్టారు.
యువరాజు ప్రియ మిత్రుడు కర్ణుని శాపగ్రస్త వదనం తలపులో మెదిలింది.
చివరగా...
నల్లటి గంతల వెనుక అణగారిపోయిన సోదరి గాంధారి కన్నుల దు:ఖ నదుల ఉప్పెనలు ఆలోచనలను ముంచెత్తాయి.
ఉక్కిరిబిక్కిరయ్యాడు శకుని.
ఏమి పాపం చేశారు వీళ్లంతా...
ఏ తప్పూ చేయకనే ఎందుకు శాపగ్రస్తులుగా మిగుల బోతున్నారు ?
సురాపానము అధికమై, ఆసనము మీదనున్న శరీరము తూలింది.
భళ్ళున శబ్దమయింది. ఎదురుగా ఉన్న దర్పణము బద్దలయింది.
"వీళ్ళందరి గురించి జాలి పడుతున్నావ్. ఇంతకీ నువ్వెవరు ? వారికి ఏమవుతావు ?"
ముక్కలైన దర్పణమునందలి శతానేక ప్రతిబింబాలు నిలదీశాయి.
తత్తరపాటుకు గురయ్యాడు శకుని.
"అదేమిటి... ఈ రాజ్య పట్టమహిషి గాంధారీదేవి మురిపెంపు సోదరుడిని... ఈ భవ్య హస్తినాపుర మహా సామ్రాజ్యానికి కాబోయే రారాజుకు ముద్దుల మేనమామని..."
"అదే నిజమైతే నీ ఈ హీన స్థితి ఏమి ?"
చుట్టూ పరికించాడు శకుని...
హంసతూలికా తల్పం... రత్న ఖచిత ఉచితాసనం... మణులు పొదిగిన బంగారు పాత్రల నిండుగా మధిర...
మందిరమందు ఎటుచూసినా వజ్ర వైఢూర్య మరకత మణిమాణిక్యాలతో కూడిన వస్తు సంచయమే.
"ఏమి తక్కువ నాకు ? నాకు ఏమి లేదు ? ఈ వైభవ ప్రాభవాలు అన్యులకు వశమా..." అతిశయం పొడమింది.
"మరొక్కమారు మనసు పెట్టి పరికించు..." ప్రతిబింబాలు చెప్పాయి.
భవనాన్ని కలియజూశాడు చూశాడు శకుని.
దృతరాష్ట్ర పట్టమహిషి గాంధారి... హస్తినాపుర రారాజు సుయోధనుడు... వారి అభిజాత్యాలకు నిరూపణగా ఈ అంతులేని ఐశ్వర్య ప్రదర్శనలు...
"వెలుపల కాదు... నీ లోలోపలికి"
గమనించనే లేదు...
దగ్గరైన మనుషులు ఏరీ... ఆత్మీయమైన మనసులు ఏవీ...
"ఎవరున్నారు నాకు ? నాకంటూ ఏమి మిగిలింది ?"
ఏమీ లేనితనం ఆవహించి భయపెట్టింది ఒక్కసారిగా.
"హ్హ... హ్హ... హ్హా..." ప్రతిబింబాలు పరిహసించాయి.
నడుమున దోపిన పాచికలు ప్రాణం పోసుకున్నాయి.
శకుని హృదయ గహన సీమలలో అణచిపెట్టిన ప్రతీకార జ్వాలలు ఉవ్వెత్తున ఎగశాయి...
కురువంశ మహోత్కృష్ట కంకాళాలు... కురుక్షేత్ర రౌద్ర రణరంగ రుధిరంలో తడిశాయి...!
Comments
Post a Comment