రాయలేని కత
“నాయినా, నాయినా మీ గూనోడి కత జెప్పవా....” మాయమ్మ ముగ్గేసి మజ్జలో బెట్టిన దాసాని పూలు జూస్తా నిల్చుకోని వుండే నన్ను రొండు చేతులు పట్టుకోని ఊపేసినారు పిలకాయలు. మేము ఎదురుగా వుండే ఇంట్లోనే పాలు పొయ్యించుకొనేది. ఆయావులు ఏసిన ప్యాడ పదడుగుల దూరంలో పచ్చగా మెరస్తా వుండాది. మా వాకిట్లో జూస్తే, బోగి ఎయ్య డానికి ఒక్క కట్టిపుల్ల గూడా ల్యా. “హూ...” ముక్కల గుండా పొడుగ్గా గాలి వొదిలినాను. “నాయినా ఇంటా వుండావా, నీకే జెప్పేది. గూనోడి కత అడగతా వుంటే ఆ మాదిర్తో గాలి వొదలతా వుండావేంది?” ఇదేందో పెద్ద యవ్వారమే ఉండాదనుకోని వాకిలి మెట్ల మింద కుచ్చున్నారు పిలకాయిలు. పొద్దు ఎనిమిద్దాటినా పొగమంచు కురస్తానే ఉండాదింకా. సగించినట్టు నీరెండ కాస్తా వుండాది. వొగసారి రొండు అరచేతులూ పరపరా రుద్దుకోని, చెంపలకు ఆనించుకొన్నాను. “మీ నాయమ్మ జూడరా వాకిట్లోనే ప్యాడ కళ్ళుకళ్ళుగా పడివుండాదా. అయినా గొబ్బెమ్మలు పెట్టడం ల్యా. కనాకష్టం మీయమ్మన్నా పట్టిచ్చుకుంటాదా అంటే అదీలేదు. బోగి ఏసేదానికి ఒక్క కట్టి పుల్లన్నా లేదే, రేపు ఏంజేసేది? దేంతో బోగీ ఎయ్యాల... మనం యాడికి బోవాల?” నేను ఒదిలి...