సాయిబంగడి

“ఏమే, బాషాకు నీళ్లివ్వు. ఎండనపడి వచ్చాడు పాపం.” నాయన కేకతో నీళ్ళు రాలేదుకానీ, వరండాలో వాలు కుర్చీలో తీరుబడిగా కూర్చుని సాయికోటి రాసుకుంటున్న మా అవ్వ చివ్వున తలెత్తి చూసింది.

ఆమె చూపులు చురచురా తాకాయి కాబోలు- వాకిట్లో సైకిలు స్టాండు వేసి, వెనుక క్యారేజీ మీద వున్న బియ్యం మూట దింపి భుజాన వేసుకుని గుమ్మంలోకి వస్తున్న అంగడి సాయిబు కొడుకు ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు. ఏం చేయాలన్నట్టు బెరుకుగా నాయనవైపు చూశాడు.

“ఫరవాలేదు బాషా, లోపలికి వెళ్ళి అదిగో ఆ తలుపు వారగా దించేయి.” భరోసా ఇచ్చాడు నాయన. అలాగే అన్నట్టు తలూపి, గబగబా గడప దాటి వెళ్ళి నాయన చెప్పిన చోట బియ్యం మూట దించి ముఖానికి పట్టిన చెమటను రెట్టకు తుడుచుకుంటూ ఇవతలకు వచ్చాడు బాషా.

“ఇదిగో ఇది ఉంచు.” పది రూపాయల నోటు చేతికి ఇవ్వబోయాడు నాయన. తీసుకోలేదు అతడు.

“వద్దు సార్, అబ్బాజాన్ తిడతాడు.” చెప్పాడు. ఈలోగా లోపలినుంచి అమ్మ తెచ్చి ఇచ్చిన నీళ్ళ చెంబు చేతిలోకి తీసుకుని పైకి ఎత్తి గొంతులో పోసుకుని గటగటా తాగేసి, వాకిట్లో ఉన్న కుళాయి తిప్పి కడిగి ప్రహరీ గోడపైన పెట్టాడు. “వెళ్లొస్తాను సార్” అన్నాడు సైకిలు స్టాండు తీస్తూ.

“అలాగే, జాగ్రత్త.” అతడిని సాగనంపి వాకిట్లో నుంచి లోపలికి వచ్చాడు నాయన.

“నీకెన్ని సార్లు చెప్పాను ప్రకాశం, తురకోళ్ళకు చనువు ఇయ్యద్దని. ఒక్కనాడన్నా నామాట విన్నావా?” రుసరుసలాడింది అవ్వ. అవ్వంటే మా నాయనకు అమ్మన్న మాట.

ఎప్పటిలాగే చిన్న నవ్వు నవ్వేశాడు నాయన. “నీకు తెలియదులేవే అమ్మా. అంగడి సాయిబు ఎంత మర్యాదస్తుడో, మంచివాడో” అన్నాడు.

“అవునవును, అంతా మీకే తెలుసు. మా ఇద్దరికేమీ తెలియదు. ఆ తురకాయన మర్యాదస్తుడు, మీరేమో నిదానస్తుడు. మిమ్మల్ని అమాయకుడిని చేసి ఆడిస్తున్నాడు ఆ అంగడి సాయిబు.” లోపలినుంచి అందుకుంది మా అమ్మ.

“ఎందుకే మీ అత్తాకోడళ్ళు పాపం సాయిబు మీద విరుచు పడతారు. ఎందుకు అతనంటే ఇంత కోపం?” కొంచెం కరుగ్గానే విసుక్కున్నాడు నాయన.

“ఎందుకా... గుళ్ళో గురూజీ ప్రవచనాలకు రారా అంటే రావు. కనీసం పొద్దున్నే టీవీలోనన్నా ప్రవచనాలు వినరా అంటే వినవు, ఆ న్యూస్ పేపరు పట్టుకోని కుచ్చుంటావు...” అవ్వ కొడుకుతో కొట్లాడాలనే నిర్ణయించుకుంది.

“ఏం చెప్పారో మీ గురూజీ?” నాయనా తగ్గలేదు.

“జకాత్ అంట నాయనా. ఈ తురకోళ్ళు దాన ధర్మాలు చేయాలంట. దేనికనుకున్నావు? అవేందో తురకోళ్ళ బడులంట కదా మదరసాలని, వాటికి. వాటిల్లో మన దేశంపై కుట్రలు చేసే చదువులు చెప్తారంట. అక్కడ మన దేవుళ్ళను అవమానిస్తారంట. హవ్వా... ఎంత అన్యాయం. ఈ దేశం కూడుదింటా ఈ దేశాన్నే కూల్చేయాలనుకోవడం.. పాలు దాగి అమ్మ రొమ్ము గుద్దే రకాలు ఈ తురకోళ్ళు. ఎడారి దేశాల నుంచీ పొట్ట చేతిలో పట్టుకొచ్చినోళ్ళంట ఈ మూకంతా. మన గుళ్ళముందు టెంకాయలు, పొండ్లు, పూలు అమ్ముకోని బతకతా, మళ్ళీ మన దేవుళ్ళనే అవమానిస్తారా? గురూజీ చెప్పే మాటలు వింటావుంటే ఎంత కడుపు రగిలిపోతాదో.” అవ్వ శరసంధానం చేసింది.

నాయన మునిగాళ్ల మీద నిక్కి కుడివైపు చూశాడు. మా ఇంటికి, మసీదులో నమాజు చదివే సాయిబు ఇంటికి మధ్యలో ఒక ఇల్లు మాత్రమే ఉంది. ఆ నమాజు సాయిబు ఎక్కడ అవ్వ మాటలు వింటాడేమోనని ఆయన భయం. అయితే, నాయన అదృష్టం... ఆయన ఇంట్లో ఉన్నట్టు లేడు.

“ఆ గురూజీ చెప్పింది నిజం కాదే అమ్మా. జకాత్ అంటే దేశ ద్రోహులకు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించడం కాదు. జకాత్ అంటే, ప్రతి ముస్లిం తాను సంపాదించిన దాంట్లో రెండున్నర శాతాన్ని పేదసాదలకు దానం చేయడం. ఇంక మదరసాలు అంటావా. వాటిల్లో వాళ్ళ మత విద్య బోధిస్తారు అంతే. మన దేవుళ్ళను అవమానించడం అనేది నిజం కాదు.” సమాధానపరచడానికి ప్రయత్నించాడు నాయన.

“నువ్వు ఎన్నయినా చెప్పురా, ఈ తురకోళ్లని నమ్మకూడదు. గురూజీ గెట్టిగా చెప్పినాడీ మాట. ఏమే సుశీలా నిన్న ఆ సాయిబంగడి నుంచి మీ ఆయన తెచ్చిన సామాన్ల మూట ఇలా తేవే. సాయిబు ఎంత నమ్మకస్తుడో నీ మొగుడికి చూపిస్తా.” కోడలిని కేకేసింది అవ్వ.

“అవునవును, ఆ సామాన్లు ఈయనగారి ముందే విప్పితే తెలుస్తుంది, ఈయన నెత్తికి ఎక్కించుకుంటున్న సాయిబు మర్యాదస్తుడో, లేక నమ్మినవాళ్ళను నట్టేట్లో ముంచే రకమో.” రుసరుసలాడుతూ సామాన్ల మూట తెచ్చి నాయన ముందు ఉంచింది అమ్మ.

రాస్తున్న సాయికోటి పుస్తకం పక్కన పెట్టి వాలు కుర్చీలోంచి లేచి కింద కాళ్ళు చాపుకుని కూలబడింది అవ్వ. మూట విప్పి అందులోని సామాన్ల పొట్లాలు బయట పెట్టింది. కోన్ ఆకారంలో కాగితంలో చుట్టిన చింతపండు పొట్లం చేతిలోకి తీసుకుని దారం విప్పింది. బయట పడిన చింతపండు నాయన కళ్లముందు పెట్టి “చూడు, ఎంత నాసినంగా ఉండాదో.” అంది.

నాయనకే కాదు, నాకు కూడా అర్థం కాలేదు.. తెల్లగా నిగనిగలాడుతూ ఉండే ఆ పండు నాసినం ఎందుకైందో.

“బంగారంలాంటి పొండు, దీనికి ఏం తక్కవ?” కొంచెం జంకుతూనే అన్నాడు నాయన.

“నిజిమే, ఏం తక్కవ. చిటికిడు పొండుకు రొండుమూడు ఇత్తులు. ఈ ఇత్తులను పెరట్లో నాటుకుని చింతచెట్లు పెంచి పుట్లకు పుట్లు చింతపొండు పండించి తినీ, అమ్ముకోనీ మహారాజులై పోవచ్చు.” పొండు విచ్చదీసి నల్లటి చింతగింజలు ఏరేరి వీధిలో విసిరి వేస్తూ గయ్యిమంది అవ్వ.

“అత్తమ్మా, ఇదిగో ఈ కందిపప్పు చూడు.. ఎట్టా పురుగు పట్టిందో...” ఇంకో పొట్లం అప్పటికే విప్పిన అమ్మ, అవ్వ కళ్లముందు పెట్టింది.

“చూశావా ప్రకాశం, మీ అంగడి సాయిబు ఎంత మర్యాదస్తుడో. ఈ తురకోళ్ళ బుద్ధే అంత. నమ్మక ద్రోహం వాళ్ళ రక్తంలోనే ఉంటుంది. నీకు నువ్వు తెలుసుకోవు, నాబోటివాళ్ళం చెబితే వినవు. మన మతం, సంప్రదాయం ఎంత గొప్పవిరా. ఆ తురకోడి దగ్గర తెస్తావు కదరా సామాన్లు. ఈ మైల పడిన సామాన్లతో చేసే పదార్థాలు కడుపుకు కొట్టుకుంటున్నాను చూడు, నేనెంత పాపిష్టిదాన్ని...” అవ్వ ఎత్తుకుంది.

ఇక ఆమె నోరు ఆగదని తెలుసు. అందుకే, చల్లగా అక్కడినుంచీ జారుకున్నాడు నాయన.

“ఏమండీ, టీ తాగి వెళ్ళండి...” అమ్మ పిలుస్తున్నా వినిపించుకోనుండా సైకిలు ఎక్కాడు. వెనుక క్యారేజీలో ఎప్పటిలాగే మడత పెట్టిన ఖాకీ సంచి ఉంది. పనేమీలేకున్నా అ పోవడం- అమ్మా, అవ్వల దాడినుంచి తప్పించుకోవడానికే అని నాకే కాదు, వాళ్ళిద్దరికీ కూడా తెలుసు.

“హూ... అరిచి అరిచీ నా నోరు పోవడమే కానీ, వీడా తురకతో స్నేహితం మాత్రం వీడేది లేదు.” అస్త్రసన్యాసం చేసిన అవ్వ, మళ్ళీ వాలు కుర్చీ ఎక్కి సాయికోటి పుస్తకం అందుకుంది.

“నాయనా ఎందుకు ఇంత మొండిగా ఉంటావు? అవ్వా, అమ్మా చెప్పేది కూడా నిజమే కదా. ముస్లిం అని నాకు భేదభావమేమీ లేదుకానీ, ఆ అంగడి సాయిబు అన్నీ నాసిరకం సామాన్లు అంటగడుతున్నాడు మనకు. నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నాడు. నువ్వు కూడా చూశావు కదా. అంగడి మార్చేద్దాం.” ఒకసారి ఇంట్లో ఇటువంటి తగువే జరిగినప్పుడు నేను నాయనకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాను.

“మీకు ఇప్పుడు తెలియదురా...” అన్నాడు నాయన. మాకు తెలియనిది, నాయనకు మాత్రమే తెలిసినది ఏమిటో అప్పట్లో అర్థం కాలేదు నాకు.

ప్రాథమిక పాఠశాల బడిపంతులు అయిన నాయన, హైస్కూల్ టీచర్ గా ప్రమోషన్ కోసం ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షలు రాశాడు. తర్వాత ఇన్ సర్వీస్ కింద బీయీడీలో చేరి, వారానికి రెండు రోజులు తిరుపతిలో జరిగే క్లాసులకు హాజరయ్యేవాడు. ఆయనతోపాటు ఇంకో ఇద్దరుముగ్గురు స్నేహితులైన టీచర్లు కూడా. అలా ఒకరోజు తిరుపతి వెళ్ళిన నాయన సాయంత్రం చాలా పొద్దుపోతున్నా ఇంటికి రాలేదు. కంగారు పడిన అమ్మ, అవ్వ నన్ను సాయిబంగడికి తరిమారు.

సాయంత్రం స్కూల్ వదిలిపెట్టాక ఆ అంగడివద్ద చాలామంది టీచర్లు కలిసి పిచ్చాపాటీ మాట్లాడుకోవడం అలవాటు. ఒక్కొక్కరు రెండుమూడు టీలు ఉఫ్ మని ఊదేసేవాళ్ళు. చాలాసార్లు నాయనే అన్నింటికీ డబ్బులు చెల్లించేవాడు. అందుకని సాయిబంగడికి వెళ్ళడం. అయితే అక్కడ మిగిలిన టీచర్లు ఉన్నారు కానీ, నాయన కనిపించలేదు. ఆయనతోపాటు తిరుపతి క్లాసులకు వెళ్ళే టీచర్లు కూడా లేరు. వాళ్ళెవరూ నాయన గురించి తెలియదన్నారు. 

టీచర్లని కంగారుగా అడగడం చూసి కౌంటర్ లో ఉన్న అంగడి సాయిబు దగ్గరగా రమ్మని చేయి ఊపాడు. ఏవో లెక్కలు రాసుకుంటూ, ఎవరెవరో తెచ్చిన సామాన్ల లిస్టు చదివి, అంగట్లో ఉన్న ఇద్దరుముగ్గురు పిల్లోళ్ళ చేత పొట్లాలు కట్టిస్తూ చాలా బిజీగా ఉన్నాడాయన. నాయనతో ఉన్న స్నేహాన్ని, ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని నాసిరకం సామాన్లు అంటగడుతున్నాడని సాయిబుమీద నాకెందుకో ఒకరకమైన ద్వేషం. అయిష్టంగానే దగ్గరకు వెళ్ళాను.

“బాగుండారా సార్? నేనే మీ ఇంటికి పిల్లోడిని పంపదామని అనుకుంటున్నాను సార్. ఇంతలో మీరే వచ్చేశారు. టీ తాగండి.” తనముందు ఈగలు ముసురుతున్న టీ గ్లాసు ముందుకు తోశాడు. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా, అప్పటికే సాయిబు వయసు యాభై కి పైనే అయినా నన్ను కూడా సార్ అనే పిలుస్తాడు ఆయన.

“వొద్దు నా. నాయనకోసరం వొచ్చినాను. ఇక్కడ ఉంటాడనుకున్నా, లేడు. ఇంకా తిరుపతి నుంచి రాలేదా నాయనోళ్ళు?” నాయన గురించిన సకల విషయాలు అంగడి సాయిబుకన్నా ఎక్కువగా తెలిసినోడు లేడు ఈ భూ ప్రపంచంలో. అందుకే అడిగాను.  అప్పట్లో మొబైల్స్ కాదుకదా, ల్యాండ్ ఫోన్స్ ఉండడం కూడా తక్కువే. అందుకే ఇంకా ఇంటికి చేరని నాయనకోసం ఈ ఆరాలు.

“ముందు ఈ నీళ్ళు తాగండి, చెప్తాను.” నన్ను ఎందుకో సంసిద్ధం చేస్తున్నట్టు పక్కనే పెట్టుకున్న గాజు సీసా ముందుకు జరిపాడు.

“వొద్దు నా, నాయన వచ్చాడా లేదా? వస్తే ఎక్కడున్నాడు? మీకు తెలిస్తే చెప్పండి.” ఆతృతగా అడిగాను.

“మీరు కంగారు పడొద్దు సారూ. నాయన తిరుపతి నుంచి వొచ్చేశాడు. కొంచెం జ్వరంగా ఉంటే కూడా ఉండే సార్లు హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు.” మెల్లగా చెప్పాడు అంగడి సాయిబు.

అంతే, నాకు అనుమానం ఎక్కువైపోయింది. జ్వరం కాదుకదా, నాయనకు ఇంతదాకా చిన్న జలుబు చేసింది కూడా నేను చూడలేదు. పైగా చిన్నచిన్న రోగాలకు లొంగి హాస్పిటల్ కు వెళ్ళే మనస్తత్వం కాదు.

“నిజం చెప్పునా. నాయనకు ఏమైంది? ఏ హాస్పిటల్ కు వెళ్లారు?” చేయి పట్టుకుని ఊపేస్తూ అడిగాను.

“నాయనకు ఏమీ కాలేదు, మీరు భయపడకండి సారూ. ఆర్టీసీ బస్టాండు కాడ మన పౌర్ణవారి కండ్రిగ డాక్టర్ చంద్రశేఖర సార్ ఉండా, ఆయన దగ్గరికి తీసుకుని వెళ్లారు.” భుజం మీద చేయి వేసి సముదాయిస్తున్నట్లు చెప్పాడు.

ఇక ఒక్క క్షణం కూడా నిలవలేదు అక్కడ నేను. పరుగులు పెట్టాను హాస్పిటల్ ఉన్న దిక్కుకు. డాక్టర్ చంద్రశేఖర్ అంటే గుండె జబ్బుల డాక్టర్. నాకు ఒళ్ళంతా దడగా ఉంది.

నేను వెళ్ళేసరికి బెడ్ మీద నాయనను పడుకోబెట్టి ఈసీజీ తీస్తున్నారు. కొంచెం ఆయాస పడుతున్నాడు. పక్కనే ఒక ఫ్రెండు, ఆ గదికి ఇవతల ఇంకో ఫ్రెండు నిలుచుని ఉన్నారు.

నీరసంగా ఉన్న నాయనను చూస్తూనే నాకు దుఖం ముంచుకు వచ్చింది. అణచిపెట్టుకుని దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను. నన్ను చూస్తూనే తన ఆయాసాన్ని అదుపు చేసుకుని అంతా బాగా ఉన్నట్టు కనిపించడానికి నాయన చేస్తున్న ప్రయత్నం అర్థమవుతోంది.

“ఏమైంది సార్?” అడిగాను, అక్కడే నిలబడివున్న నాయన ఫ్రెండును.

“ఏమీ కాలేదు నాయనా. కొంచెం...” నాయన చెప్పబోతుంటే నర్సు వారించింది.

నన్ను బయటకు తీసుకువచ్చి చెప్పాడు నెమ్మదిగా సార్, “టీ తాగుతుండగా గుండెల్లో నొప్పి అన్నాడు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందని, అదే పోతుందని చెప్పాడు. కానీ అయిదు నిమిషాలు గడిచేసరికి ఎక్కువైంది నొప్పి. తీసుకొచ్చి ఇక్కడ చేర్చాము.”

“ఏమీ లేదు, మైల్డ్ స్ట్రోక్ అంతే. మందులతో నయమైపోతుంది.” రాత్రికి తన ఛాంబర్ లో డిశ్చార్జ్ షీట్ రాస్తూ ధైర్యం చెప్పాడు డాక్టర్.

“పద వెళ్దాము.” పక్కనే ఉన్న నాయన ఫ్రెండు చెప్పి లేచాడు.

“సార్... హాస్పిటల్ బిల్లు...” సందిగ్ధంగా ఆగాను. అయినా సంపాదించి సంసారాన్ని పోషించేది నాయనే. ఈ పరిస్థితుల్లో ఆయనను ఎలా అడిగేది?

--------------------------------------------------

(“సారంగ” వెబ్ మేగజైన్ డిసెంబరు 15, 2025 సంచికలో ప్రచురితం.)

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ