ఆకుపచ్చటి అనుబంధం
ఉదయం ఆరు గంటలు అయింది. ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు. వరుసగా వారం రోజులనునుంచి మబ్బులు కమ్ముకోవడమే. అప్పుడప్పుడూ నాలుగు జల్లులు పడడం తప్ప ఒక గట్టి వాన లేదు. అప్పుడే నిద్రలేచి అప్పటికే తెరచివున్న డోర్ తీసుకుని గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు రాఘవరావు. ఎడమ చేత్తో నడుము పట్టుకుని , కుడి చేత్తో ముగ్గు దిద్దుతోంది ముంగిట జానకమ్మ. కారిడార్ వెంట అటుఇటు చూపులు సారించాడు. నిర్మానుష్యంగా ఉంది. ముగ్గులు వేయడం కాదుకదా , మానవమాత్రులన్నలన్నవారు కనిపించలేదు కంటికి. కోపం ముంచుకొచ్చింది. “ జానకీ , నీకెన్నిసార్లు చెప్పాను ఇలా చేయవద్దని. కొంపలు మునిగిపోయేటట్టు తెల్లారాకుండానే నిద్రలేచి ఆ ముగ్గులేయడం ఏమిటి ? నువ్వు ఇంకా మీ పల్లెటూళ్ళోనే ఉన్న కన్నెపిల్ల అనుకుంటున్నావా ? లేస్తే కూర్చోలేవు. కూర్చుంటే లేవలేవు. నీకీ ముగ్గులు వేయడం , ఆ తర్వాత నడుము నొప్పితో ముక్కుతూ మూలుగుతూ ఉండడం... ఇవన్నీ నీకవసరమా చెప్పు. ” నోరు చేసుకున్నాను అనుకున్నాడు. మాట మాత్రం సౌమ్యంగానే గొంతులోనుంచి బయటకు వచ్చింది. ఇంకా ఏదో అనబోతుంటే ఆయాసం తన్నుకుని వచ్చింది. ఆ వెంటనే దగ్గుతో సతమతమై పోయాడు. “ అయ్యో... ఇంత పొద్దున్నే మిమ్మల్ని ఎవరు లేచి ...