ఆకుపచ్చటి అనుబంధం

ఉదయం ఆరు గంటలు అయింది. ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు. వరుసగా వారం రోజులనునుంచి మబ్బులు కమ్ముకోవడమే. అప్పుడప్పుడూ నాలుగు జల్లులు పడడం తప్ప ఒక గట్టి వాన లేదు.

అప్పుడే నిద్రలేచి అప్పటికే తెరచివున్న డోర్ తీసుకుని గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు రాఘవరావు. ఎడమ చేత్తో నడుము పట్టుకుని, కుడి చేత్తో ముగ్గు దిద్దుతోంది ముంగిట జానకమ్మ. కారిడార్ వెంట అటుఇటు చూపులు సారించాడు. నిర్మానుష్యంగా ఉంది. ముగ్గులు వేయడం కాదుకదా, మానవమాత్రులన్నలన్నవారు కనిపించలేదు కంటికి. కోపం ముంచుకొచ్చింది.

జానకీ, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా చేయవద్దని. కొంపలు మునిగిపోయేటట్టు తెల్లారాకుండానే నిద్రలేచి ఆ ముగ్గులేయడం ఏమిటి? నువ్వు ఇంకా మీ పల్లెటూళ్ళోనే ఉన్న కన్నెపిల్ల అనుకుంటున్నావా? లేస్తే కూర్చోలేవు. కూర్చుంటే లేవలేవు. నీకీ ముగ్గులు వేయడం, ఆ తర్వాత నడుము నొప్పితో ముక్కుతూ మూలుగుతూ ఉండడం... ఇవన్నీ నీకవసరమా చెప్పు.నోరు చేసుకున్నాను అనుకున్నాడు. మాట మాత్రం సౌమ్యంగానే గొంతులోనుంచి బయటకు వచ్చింది. ఇంకా ఏదో అనబోతుంటే ఆయాసం తన్నుకుని వచ్చింది. ఆ వెంటనే దగ్గుతో సతమతమై పోయాడు.

అయ్యో... ఇంత పొద్దున్నే మిమ్మల్ని ఎవరు లేచి బయటకు రమ్మన్నారండీ. మీకసలే ఆయాసం, ఉబ్బసం. చెబితే వినరు.వేస్తున్న ముగ్గు సగంలో ఆపేసి దగ్గరగా వచ్చి రాఘవరావును పొదివిపట్టుకుని ఇంట్లోకి నడిపించింది లక్ష్మి.

అలా వాకింగ్ కు వెళ్ళివద్దామనీ...కుర్చీలో కూర్చుంటూ చెప్పాడు ఆయన, ఆయాసాన్ని అదుపు చేసుకుంటూ.

అసలే మీ ఆరోగ్యం అంతంతమాత్రం. ఇంత ఉదయం పూట వాకింగ్ వద్దన్నారుగా డాక్టరుగారు. కాస్త పొద్దు ఎక్కాక టిఫిన్ చేసి తర్వాత వెళ్ళవచ్చుగా అంటే వినరు. విసుక్కుంది జానకమ్మ, ఫ్లాస్క్ లో వేడిచేసి ఉంచిన నీళ్ళు తాగడానికి భర్త చేతికి అందిస్తూ.

జానకీ, ఇలా వచ్చి నా పక్కన కూర్చో.గ్లాసుతోపాటు భార్య చేతిని పట్టుకుని నెమ్మదిగా లాగాడు రాఘవరావు. మామూలుగా అయితే ఆయన మాటలు వినేదో లేదో కానీ, ఇంకా కొద్దిగా ఆయాసపడుతుండడం చూసి, మారు మాట్లాడకుండా కూర్చుంది.

చూడు లక్ష్మీ, మనం ఉండేది అయిదు అంతస్తుల అపార్ట్మెంట్ లోని రెండో అంతస్తులో. అటు నాలుగు, ఇటు నాలుగు వరుసల ఇళ్ళు. మధ్యలో నాలుగు అడుగుల కారిడార్. ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా ఇంటిముందు రెండు ముగ్గు గీతలు పెట్టడం చూశావా నువ్వు. పైగా నువ్వు పెడుతున్న ముగ్గులవల్ల తమ ముంగిలి  పాడైపోతున్నదని ఎదురింటి సాఫ్ట్వేర్ అమ్మాయి ఎన్నిసార్లు చికాకు పడుతుందో నాకు తెలుసు. పైగా నీకు కీళ్ల నొప్పులు. ఇంత తెల్లవారి లేచి ఈ ముగ్గులు పెట్టడం అవసరమా నీకు?”

చూడండి, నేను పల్లెటూరిలో పుట్టి పెరిగాను. ఈ అపార్టుమెంటుకు రావడానికి ముందు కూడా మీ ఉద్యోగంకోసం చిన్న టౌన్లో అద్దె ఇంట్లో కాపురం ఉన్నాము. ఎక్కడా ముగ్గులు వేయడం మానలేదు. కొడుకుతో కలిసి ఇంటికి చుట్టపుచూపుగా ఎప్పుడైనా వచ్చినప్పుడు ముగ్గు వేయడానికి కోడలుపిల్ల ముచ్చటపడినా, వద్దని చెప్పేదాన్ని. ఎందుకంటే ముగ్గు వేయడం నా విషయంలో కష్టం కాదు. తరతరాలుగా మనం కాపాడుకుంటూ వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలకు రంగవల్లి ఒక ప్రతీక.

నువ్వు చెప్పేదీ నిజమే. కానీ ఏ సంస్కృతి సంప్రదాయాలను పాటించడంలో అయినా స్థలకాలాలలను బట్టి పట్టువిడుపులు ఉండాలి.చెప్పాడు రాఘవరావు.

ఆ విషయం మీరు నాకు చెబుతున్నారు... ఏదీ ఒకసారి ఆ ముఖం ఇటు తిప్పండి కొంచెం విస్తుపోతున్నట్టుగా భార్య పెట్టిన ముఖ కవళికలు చూసి మాటలు పొడిగించలేకపోయాడు రాఘవరావు.

ఎలాగూ లేవనే లేచారు. వెళ్ళి దంతధావనం పూర్తి చేసుకుని రండి. నాలుగు మిరియాలు, పుదీనా ఆకులు పాలలో వేసి మరిగించి ఇస్తాను.భర్తనుంచి ఇక సమాధానం రాదని తెలుసు కనుక, చెప్పి కిచెన్లోకి నడిచింది లక్ష్మి. కొడుకు ఏదో ప్రాజెక్ట్ మీద భార్యాపిల్లలతో ఫారిన్ వెళ్లకముందు కొన్న ఫ్లాట్ అది. కిచెన్ అంటే వేరుగా ఏమీ లేదు, రెండు పడకగదులు గల ఆ చిన్నపాటి ప్లాటులోని హాలులో ఒక పక్క పార్టిషన్ పెట్టిన చిన్నపాటి స్థలమే. అక్కడ జరుగుతున్న అన్ని పనులూ, మాటలూ హాల్లోని వారికి కనిపిస్తూ, వినిపిస్తూనే ఉంటాయి.

ట్రింగ్... ట్రింగ్... టీవీ కింద టీపాయ్ మీద ఉంచిన మొబైల్ రింగ్ అయింది. లేవలేదు రాఘవరావు. ఆయనకు మొబైల్ లో మాట్లాడడం చేతకాదు. అంటే విషయం ఉంటే మాట్లాడుతాడు. కానప్పుడు ఏమి మాట్లాడాలో తెలియక అయోమయానికి లోనవుతాడు.

అప్పటికే కాగిన పాలు రెండు గ్లాసుల్లో పోసి కొంచెం చల్లార్చి తీసుకొని వచ్చి ఒక గ్లాసు భర్త చేతికి అందించింది జానకమ్మ. రెండవ గ్లాసు అలాగే పట్టుకుని వెళ్ళి, మొబైల్ ఆన్ చేసి హలో భావనా.. నువ్వు, అబ్బాయి, పిల్లలు అందరూ బావున్నారా?” మాట్లాడుతూ వచ్చి రాఘవరావు కుర్చీకి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది.

అందరం బాగున్నాము అత్తయ్యగారూ. మీరెలా ఉన్నారు? మామయ్యగారి ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్లు ఏమి చెప్పారు?” అమెరికాలో ఉన్న కోడలు అభిమానంగా అడిగింది.

నాకేమమ్మా, గుండ్రాయిలా ఉన్నాను. ఎటొచ్చీ మీ మామయ్యగా...అంటుండగా రాఘవరావు కొంచెం ముందుకు వంగి ఆమె చేతిని మృదువుగా స్పృశించి కళ్ళతోనే వారించారు వద్దన్నట్టు.

అత్తయ్యగారూ... ఏమైంది ఆగిపోయారు..,” ఒకింత కంగారుగా అడిగింది భావన.

ఏమీ లేదమ్మా, పొయ్యిమీద పెట్టిన పాలు పొంగిపోతుంటే స్టవ్ ఆఫ్ చేసి వస్తున్నాను. మామయ్యగారి ఆరోగ్యం కూడా మెరుగ్గానే ఉంది. అబ్బాయి డ్యూటీకి వెళ్లాడా? పిల్లలు వచ్చేశారా నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా సాగుతోంది? ” అసంపూర్ణంగా ఆపేసిన వాక్యం పూర్తిచేసి, బదులు ప్రశ్నలు వేసింది జానకమ్మ.

మీకు మొన్ననే చెప్పాను కదత్తయ్యా, రామ్ జాబ్ నుంచి ఫైర్ అయ్యారు. వేరే ట్రై చేస్తున్నారు కానీ అంత సులభంగా దొరికేలా లేదు. నా వర్క్ కూడా ఎంతకాలం ఉంటుందో చెప్పలేను. ఆయన మీకు తెలియనివ్వకూడదు అనుకున్నారు. నేనే అలా ఉండలేకపోతున్నాను. కన్నవాళ్లకు చెప్పకుండా ఎలా అని...

అవునవునమ్మా... చెప్పావు కదా... అంతా త్వరలోనే సర్దుకుంటుంది లేమ్మా, బాధపడకండి. వాడున్నాడా?” భర్త ముఖం చూసి మొబైల్ వ్యాల్యూమ్ తగ్గించింది.

ఉన్నారు అత్తయ్యా, ల్యాప్ లో ఏదో సెర్చ్ చేస్తున్నారు.

అర్థమైంది జానకమ్మకు, కొడుకు మాట్లాడే మూడ్ లో లేడని. వాడెప్పుడూ ఇంతే, వాళ్ళ నాన్నలాగే మాట్లాడడం చిరాకు. కానీ తల్లిదండ్రుల మీద ప్రేమకు కొదువలేదు. ఆయనకు ఏదో హెల్త్ చెకప్ చేయాలంటే ఈమధ్యనే ఒక లక్షదాకా పంపాడు. అది పంపకముందే జాబ్ పోయిందని తర్వాత తెలిసింది. అర్థం చేసుకుంది ఆమె.

సరేనమ్మా, మీరు ఏమీ దిగులుపడకండి. అవసరమైతే ఇండియా వచ్చేయండి. ఇక్కడే ఏదో ఒకటి చూసుకుని కలిసి ఉందాం అందరం.చెప్పింది.

చూద్దాం అత్తయ్యా. ఇక్కడ ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ అస్సలు బాగాలేదు. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయ్. కొత్త ఉద్యోగాలకు దారి లేదు. అయినా ప్రయత్నిస్తున్నాము. వీలు కాకపోతే అప్పుడు మీరు అన్నట్టు చేయక తప్పదు కదా, బై.

అలాగేనమ్మా బై.కాల్ కట్ చేసి, కిచెన్లోకి నడవబోతూ ఒకసారి భర్త ముఖం వంక చూసింది. కళ్ళు మూసుకుని ఉన్నాడు రాఘవరావు. ఆయన భృకుటి ముడిపడి ఉంది. ఎడమ దవడ కండరాలు బిగుసుకుని ఉన్నాయి. అత్తాకోడళ్ల సంభాషణ విని లోలోపల బాధ పడుతుంటాడు, తెలుసు తనకు.

అలా అని అక్కడినుంచి వెంటనే వెళ్లలేకపోయింది. ఎందుకో కాస్త తేడాగా అనిపించింది ఆయన పరిస్థితి. జాగ్రత్త జానకమ్మగారూ. ప్రస్తుతానికి గండం గడిచింది. అలాగని మరీ ఎక్కువ రోజులు ఆలస్యం చేయడానికి వీలులేదు. ఎంత త్వరగా బైపాస్ చేస్తే అంతా మంచిది. ప్రస్తుతానికి మెడిసిన్స్ రాస్తున్నాను. అయితే ఒక్క విషయం. ఆయన మనసుకు బాధ కలిగించే విషయాలకు సాధ్యమైనంత దూరంగా ఉంచాలి.మైల్డ్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్ చెప్పిన మాట గుర్తుకొచ్చింది.

ఏమండీ... ఇటు చూడండి. ఏమైంది మీకు, మాట్లాడండి...ఒక్క ఉదుటన దగ్గరగా వెళ్ళి చెంపలు తడుతూ పిలవసాగింది జానకమ్మ. ఇప్పుడిప్పుడే ముడతలు పడుతున్న ఆమె బుగ్గలమీదికి కన్నీళ్ళు కారసాగాయి నిశ్శబ్దంగా.

*                                   *                                 *

తలంతా దిమ్ముగా ఉంది. దేహం గాలిలో తేలిపోతున్నట్టు, శరీరంలో ఏవేవో సూదులు గుచ్చుతున్నట్టు అనిపిస్తోంది. మూతిముక్కును కలిపి ఎవరో అదిమేస్తున్నారు. జానకీ...పిలుస్తూ, ముఖం మీద ఉన్న ఎవరిదో చేతిని బలంగా పట్టుకుని పక్కకు నెట్టేశాదు రాఘవరావు.

అయ్యో, పేషెంట్ మాస్క్ తీసేశారు..వినిపించిన గావుకేకతోపాటు, తెల్లటి దుస్తుల్లో దేవత ఎవరో కళ్ళముందు ప్రత్యక్షమైంది.

మరో తెల్లటి దుస్తుల దేవత ముఖాన్ని మళ్ళీ అదిమేస్తూ ఏదో వస్తువుపెట్టి బిగించింది. పరిశీలనగా చూశాడు రాఘవరావు. వాళ్ళు దేవతలు కారు, నర్సులు. తను తొలగించి విసిరేసిన మాస్కు తిరిగి మూతికి బిగించారు. పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది. కొంచెం పక్కలకు చూపు సారించాడు. తెల్లటి కర్టెన్లు కనబడ్డాయి. వాటితోపాటు బెడ్ పక్కనే నిలుచుని తన ముఖంవంక ఆందోళనగా చూస్తున్న ప్రభాకర్ కూడా.

వీడెప్పుడు వచ్చాడు. జానకి ఏదీ? అసలు తనకు ఏమైంది? హాస్పిటల్లో ఎందుకు ఉన్నాడు?

ఖంగారు పడకు రాఘవా, నీకేమీ కాలేదు. ఇంట్లో కొంచెం అస్వస్థతకు లోనైతే, పక్క ప్లాటు వారెవరి సాయంతోనో చెల్లెమ్మ నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది. తర్వాత నాకు ఫోన్ చేస్తే ఇలా వచ్చాను.స్నేహితుడి ముఖంలో పలికిన భావాలు అర్థం చేసుకున్న ప్రభాకర్ మృదువుగా చెప్పాడు.

ముఖానికి మాస్క్ ఉండడంతో ఏదో మాట్లాడాలని రాఘవరావు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆయాసంగా కూడా ఉంది.

చెల్లెమ్మ డాక్టర్ పిలిస్తే వెళ్ళింది, అదిగో వచ్చేస్తోంది...అతని పరిస్థితి గమనించి మళ్ళీ తనే చెప్పాడు ప్రభాకర్.

అంతా సర్దుకుంటుంది అండీ, బాధపడకండి.భర్త దగ్గరగా వచ్చి ఆయన చేయి పట్టుకుంటూ చెప్పింది జానకమ్మ. ఆవెంటనే అటు తిరిగి కన్నీళ్ళు ఒత్తుకుంది.

అంటే తనకు మళ్ళీ స్ట్రోక్ వచ్చిందా? ఆపరేషన్ అంటోంది, అంత డబ్బులు ఎక్కడినుంచి తేవాలి?

మొబైల్ లో మాట్లాడడమే కాదు, కన్నీళ్ళు పెట్టడం కూడా చేతకాదు రాఘవరావుకు. కంటి బయట కురవాల్సిన కన్నీళ్లను లోలోపలే అదిమిపెట్టి, గుండెలోకి దిగమింగుకోవడం వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చింది.

డ్రిప్స్ పోతూనే ఉన్నాయి. మెడిసిన్స్ ఇస్తున్నారు. శరేరానికి అమర్చిన ఏవేవో వైర్లు తల వెనుక ఉన్న యంత్రాలకు అమర్చారు. సాయంత్రానికి రాఘవరావు పరిస్థితి కొంత మెరుగుపడింది. మూతికి ఉన్న మాస్క్ తొలగించారు. ఇంకా ఆయాసం, నీరసం పూర్తిగా తగ్గలేదు కానీ, రెండు మాటలు మాట్లాడగలుగుతున్నాడు. బెడ్ పక్కన కూర్చున్న జానకి వంక చూశాడు.

ఇంకా ఎన్నిరోజులు ఉండాలట ఇక్కడ?” అడిగాడు మెల్లగా భార్యను.

ఎల్లుండి ఆపరేషన్ చేస్తారట. దానికి ముందు ఈరోజు, రేపు ఏవో చాలా టెస్టులు చేయాలట...

ఇప్పుడు ఆపరేషన్ వద్దు, డిశ్చార్జి చేసేయమని చెప్పు డాక్టర్లకి. నా ఆరోగ్యం బాగానే ఉంది, ఇంటికి వెళ్లిపోదాం.చెప్పాడు లేని శక్తిని కూడదీసుకుంటూ.

మొన్న కూడా ఇలా భీష్మించుకోవడంవల్లే చివరికి ఈ పరిస్థితికి వచ్చారు. ఆపరేషన్ కచ్చితంగా చేయాలట, డాక్టర్లు చెప్పారు. మీ మాటలు ఇక నేను వినను. గొంతులోకి లేని కరుకుదనం తెచ్చుకని ఖరాఖండిగా అంది జానకి.

మన పరిస్థితులు తెలుసుగా జానకీ. అబ్బాయికి అక్కడ జాబ్ పోయింది. అవసరమున్నా లేకున్నా సమకూర్చుకున్న వస్తువులకు వాయిదాలు చెల్లించలేక సతమతమవుతుంటాడు. ఇక అమ్మాయి అంటావా...కూతురిని తలచుకోవడం కూడా ఇష్టం లేనట్టు సగంలోనే మాట మింగేశాడు.

ఏం మనం వాళ్ళిద్దరి దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి బతకాలా?”

వద్దు. అందుకే డిశ్చార్జి అయి వెళ్లిపోదాం. తర్వాత దేవుడు ఎలా రాసిపెట్టి వుంటే అలా జరుగుతుంది.

ప్రభాకరన్నయ్య సాయం చేస్తానన్నారు మీ ఆపరేషన్ కు. తర్వాత మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో కొద్దిగా సేవ్ చేసుకున్నాం కదా, అవి ఉన్నాయి. అన్నయ్య సాయం తీసుకుని, మన ఊళ్ళో ఉన్న కొద్దిపాటి పొలం కూడా అమ్మేసి తర్వాత అప్పు తీర్చేద్దాం.

వాడా... మొన్ననే చిన్న కూతురి పెళ్లి చేశాడు. కొడుకు ఆఫీసులో ఏదో ఫ్రాడ్ చేస్తే అక్కడ మిగిలిన సేవింగ్స్ కట్టేసి వాడి ఉద్యోగం నిలబెట్టాడు. వాడి దగ్గరమాత్రం ఎలా వస్తాయి చెప్పు, అన్నేసి డబ్బులు.

లేదండీ, అన్నయ్యగారు నాతో చెప్పారు. ఈమధ్యనే వాళ్ళ స్వంత ఊళ్ళో ఫ్యాక్టరీ ఏదో పెట్టడానికి వీళ్ళ పొలం అడిగారట. అమ్మేసి కొడుక్కు కొంత ఇచ్చి, మిగిలింది తమ భార్యాభర్తల పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేశారట. అది ఇచ్చి సాయం చేస్తామన్నారు. మీరు నాకు కావాలండీ. మళ్ళీ మళ్ళీ ఈ టెన్షన్లు, భయాలు నేను పడలేను.కళ్ళల్లో ఊరుతున్న నీళ్ళను చీరకొంగుతో తుడుచుకుంటూ చెప్పింది జానకమ్మ.

మారు మాట్లాడలేకపోయాడు రాఘవరావు. సరే, కానివ్వు. నీకోసం ఒప్పుకుంటున్నాను. కానీ ఆపరేషన్ అయిన వెంటనే మన ఊళ్ళో మిగిలిన చేరెడు మడిచెక్కతోపాటు, చాలకపోతే నీ నగలు కూడా అమ్మేసి, భాస్కర్ రుణం తీర్చేయాలి.అన్నాడు.

అలాగే ఆండీ. మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? అయితే ఆపరేషన్ విషయంలో మాత్రం మీరు నామాట వినితీరాల్సిందే.ముఖంలోకి వెలుగు వస్తుంటే చెప్పింది జానకమ్మ.

*                                *                                    *

రాఘవరావు తీరిగ్గా కూర్చుని టీవీలో వార్తలు చూస్తున్నాడు.

ఎవరో యువ రైతు... కాదు, ఎవరో కాదు ప్రకాషే. కుప్పంలో అరటి నార్లతో సిరులు పండిస్తున్నాడట. ఏదో చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు నర్సరీ ముందు నిలబడి. తన ఉపాధ్యాయ జీవితంలో ఎక్కువ భాగం గడిపింది ఆ కుప్పంలోనే. ఎస్జీటీగా కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు, మళ్ళీ స్కూల్ అసిస్టెంటుగా పదోన్నతి పొందినప్పుడు.. వెళ్ళక తప్పలేదు.

సహజమైన ఉత్సుకతతో చైర్లో కొంచెం ముందుకు జరిగాడు.

వ్యవసాయం దండగన్న అభిప్రాయంలోనే ఉన్నారు ఇంకా చాలా మంది. అంత ఎందుకు మా మామయ్యగారిది కూడా ఇప్పటికీ ఇదే అభిప్రాయం. అగ్రికల్చర్ బీస్సీ చేసిన ఆయన ముద్దుల కూతురు సునంద, పండ్లు కూరగాయ మొక్కలను ఆధునిక పద్ధతుల్లో అంటుకట్టి, ఇంకా అత్యాధునిక సాంకేతిక పద్ధతులపై రైతులకు శిక్షణ ఇచ్చే కుప్పంలోని  సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కు ఇంటర్న్ షిప్ కోసం వచ్చింది. ఆమెతో నాకు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. సునందను నాకిచ్చి పెళ్లి చేయడానికి నా కులం మతం కంటే కూడా ఆయన దృష్టిలో కూడు పెట్టనినా వ్యవసాయ నేపథ్యం అడ్డు వచ్చింది. నేరుగా నాతోనే ఆ విషయం చెప్పారు కూడా.

మరి సునందగారితో మీ పెళ్లి అయిందా సార్?” యాంకరమ్మాయి అడిగింది.

సునందా ఇలా రా...పిలిచాడు వెనక్కు తిరిగి.

అరటి నార్లను ఆర్డర్ చేసిన వారి వ్యానుకు లోడ్ చేయిస్తున్న ఒకమ్మాయి చేతులు దులుపుకుంటూ వస్తున్న దృశ్యాన్ని కెమెరా క్యాప్చర్ చేసింది.

తన మాట కాదని ప్రకాష్ ను పెళ్లి చేసుకున్నందుకు నాన్నకు చాలా కోపం వచ్చింది. మా ఇద్దరి ముఖం మీదే తలుపు మూసేశాడు. భర్త మాట జవదాటలేని ఫక్తు తెలుగింటి ఇల్లాలు మా అమ్మ. అమ్మానాన్నలకు దూరమయ్యానని తప్ప, ఇక ఏ లోటూ లేదు నాకు. మేమిద్దరం అగ్రికల్చర్ బీస్సీ చేశాం. సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తూ నర్సరీ నడుపుతూ రెండు చేతులా ఆదాయం ఆర్జిస్తున్నాం.ఎంత సంతృప్తో సునంద ముఖంలో.

అవును, వ్యవసాయం కూడు పెట్టదు, అన్న అభిప్రాయం చాలా తప్పు. ఎన్నెన్నో సాంకేతిక వ్యవసాయ విధానాలు, యంత్రాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తగిన శిక్షణ పొంది, అమలు చేశామా... చేరెడు నేలలో అయినా సిరులు పండించవచ్చు.ముక్తాయించాడు ప్రకాష్.

జానకీ...కేక వేశాడు రాఘవరావు.

ఎందుకలా గావుకేక పెడతారు. ఇదిగో, వెనుకనే నిలుచున్నా. మీ కూతురు, అల్లుడు ఇస్తున్న ఇంటర్వ్యూ మీతోపాటే టీవీలో చూస్తున్నా.భుజం తట్టి చెప్పి, పక్కనే వచ్చి కూర్చుంది జానకమ్మ.

ఎందుకో సిగ్గుగా అనిపించింది భార్యవంక చూడాలంటే రాఘవరావుకు.

నిజం చెప్పు, నా ఆపరేషన్ కు సాయం చేసింది ప్రభాకరమేనా?” అడిగాడు మెల్లగా.

పాపం అన్నయ్యగారు... చాలా తపన పడ్డారు కానీ, చేయలేకపోయారు. నాకు తెలియకుండా మీ అల్లుడికి ఫోన్ చేసి మీరు హాస్పిటల్లో ఉన్న విషయం చెప్పారు...ఏమంటారోనాన్న సంశయంతో ఉన్న విషయం బిడియంగానే బయటపెట్టేసింది జానకమ్మ.

కాసేపు మాట్లాడలేదు రాఘవరావు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తర్వాత భార్య ముఖంవంక ధైర్యంగా చూశాడు.

ఇంకో వారం రోజుల్లో వినాయకచవితి వస్తోంది కదా... ఆ మొబైల్ అందుకో, అల్లుడికి ఫోన్ చేసి పండక్కు సునందతో కలిసి ఇంటికి రమ్మని పిలవాలి.భుజం మీది తువ్వాలు అనవసరంగా సర్దుకుంటూ చెప్పాడు.

గుండెల మీదనుంచి గంపెడు బరువేదో దిగిపోయినట్టు నిట్టూర్చిన జానకమ్మ, ముసిముసిగా నవ్వుతూ టీపాయ్ వైపు నడిచింది.

---------------------------------------------------------------
# “
వార్త” దినపత్రిక ఆదివారం అనుబంధం, 29 మార్చి, 2026 #

Comments

Popular posts from this blog

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ

పుట్టింరోజు