మరీచిక
“హెలో... స్వప్న గారా?”
“కాదండీ, స్వప్న అనేవాళ్ళు
ఇక్కడెవరూ లేరు.”
“సారీ... నాన్నగారి ఫోన్ లో మీ పేరు మీద ఈ నెంబర్ ఉంటే చేశాను.”
“ఎవరో ఆ నాన్నగారు?”
“శ్రీనివాస్ గారండీ.”
“ఇంతకీ మీరెవరో?”
“శ్రీనివాస్ గారి
కొడుకుని. భరత్ నా పేరు.”
“ఆహా... అలాగా. అయితే ఏంటట? నేను స్వప్నను అయితే ఏమిటి? కాకపోతే ఏమిటి?”
“మేడమ్ నేను విషాదంలో ఉన్నాను. స్వప్నగారు మీరేనా కాదా చెప్పండి. ఒకవేళ మీరు
నేను అనుకున్న స్వప్నగారు కాకపోతే సారీ.”
ఎందుకో గొంతు కొత్తగా అనిపించింది స్వప్నకు. చెవి దగ్గర ఉన్న మొబైల్ ముఖం
వద్దకు తీసుకు వచ్చి చూసింది. కాల్ శ్రీనివాస్ నుంచే.. సందేహం లేదు. అతని పేరే
కనిపిస్తోంది. ఆట పట్టిస్తున్నాడు తనను. తగ్గకూడదు, తను కూడా ఆడించాల్సిందే.
“ఆహా... అంతటి విషాదం ఏమిటో అబ్బాయిగారికి?”
“సారీ మేడమ్, మీరు ఎవరో కానీ, కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఒకవేళ మీరే నేను
అనుకుంటున్న స్వప్న గారైతే ఒక విషయం చెబుదామని ఫోన్ చేశాను.”
“ఏమిటో ఆ విషయం?”
“శ్రీనివాస్ గారు పోయారు.”
“ఆటలకైనా ఒక హద్దుండాలి శ్రీనివాస్. ఇటువంటి మాటలు ఇకెప్పుడూ వొద్దు.
సారీ... నేను ఫోన్ పెట్టేస్తున్నాను.” ఆమె
గొంతు ఆమెకే కీచుగా వినిపించింది. అంత గట్టిగా అరిచింది.
“మేడమ్... మేడమ్... ఫోన్ పెట్టేయద్దు. మీ పేరు స్వప్నయేనా... ఇది చెప్పండి ముందు.”
“అవును... మీరు శ్రీనివాస్
గారే కదూ...” మనసులో ఏదో అనుమానం.
“మీకు శ్రీనివాస్ గారు తెలుసా? రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్, మీ పేరు ఆయన మొబైల్
లో సేవ్ కావడమే కాదు, ఆయన డైరీలో కూడా ఉంది. శ్రీనివాస్ గారు మా నాన్నగారు...”
ఒక్క క్షణం ఏమ్మాట్లాడాలో తెలియలేదు ఆమెకు.
“స్వప్నగారూ, మీరెవరో నాకు తెలియదు. కానీ నాన్న డైరీలో ‘ముఖ్యమైన వ్యక్తి’
అని మీ పేరు, ఫోన్ నెంబర్ తో సహా రాసుంది. కాబట్టి ఫోన్ చేస్తున్నాను. నాన్నగారు
పోయారు. రాత్రి పడుకున్న ఆయన మళ్ళీ లేవలేదు. రేపు అంత్యక్రియలు. నాన్నగారు
ముఖ్యమైన వ్యక్తి అని రాసుకున్న మీకు ఈ విషయం తెలియజెప్పడం నా బాధ్యతగా భావించాను.
అందుకే ఫోన్ చేశాను...”
“హేయ్ శ్రీనివాస్, జోక్ చేస్తున్నావు కదా. మీ అబ్బాయి అని చెప్పి నువ్వే తమాషా
చేస్తున్నావు కదా. గొంతు మారిస్తే గుర్తు పట్టలేననుకున్నావా? అయినా ఇదేం జోక్,
బుద్ధి లేకుండా...”
“సారీ మేడమ్, రాత్రి నిద్రలోనే పోయారు నాన్నగారు. నేను వాళ్ళ ఆబ్బాయి భరత్
ని మాట్లాడుతున్నాను. ఇంకా చాలామందికి చెప్పాలి. మీకేమయినా ఇబ్బంది కలిగించి వుంటే
క్షమించండి.” ఆమె వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ పొలైట్ గా చెప్పి కాల్ కట్ చేశాడు.
కొంచెం దూరంలో రావిచెట్టు కొమ్మ మీద పిట్ట ఒకటి ఒంటరితనం భరించలేక దిగులుగా
అరుస్తోంది. పిట్టగోడమీద వాలిన పిచ్చుకలు రెండు బెదురుగా ఆమెనే చూస్తున్నాయి.
“మ్మ్... మ్... మ్మా...” ఆడుకుంటూ
వచ్చి కాళ్ళకు చుట్టుకున్న అయిదేళ్ళ పాపను చటుక్కున జవురుకుని చంకన వేసుకుంది.
కూతురి కళ్ళలోకే చూస్తూ నిశ్చలంగా నిలబడిపోయింది. కదలాలని అనిపించలేదు. అలాగని
అక్కడే ఉండిపోవాలనీ కాదు. ఆలోచనలు స్తంభించాయి.
“ఇంకా ఎంతసేపు ఆ గింజలు ఆరబెడతావే. మీ బావ వచ్చాడు. వాడి స్నేహితులకు టీ
కాచి ఇవ్వాలట, పనికానిచ్చి త్వరగా రా కిందికి.” కిందనుంచి అత్తయ్య అరుపులు
వినిపించడంతో ఉలిక్కిపడింది.
అయోమయం, తడబాటు, తనకు తను లేనితనం... శూన్యంలోకి
కూరుకుపోతున్నట్లుగా మేడ మెట్లు దిగింది.
-------------------------
“వచ్చేశావా రోడ్డుకు?”
“వూ... వచ్చేశా.”
“ఇంకా ఆటో రాలేదా?”
“ఏం నువ్వు వేసుకొస్తావా?”
“రాలేను. పరుగున వచ్చి నిన్ను పికప్ చేసుకోవాలనే
ఉంది నాకు. కానీ ఎలా రాగలను అంతదూరం? అయితే నువ్వు ఆదేశించావంటే ఇప్పటికిప్పుడు ట్రైన్
బుక్ చేసుకొని వచ్చేయగలను. కానీ నువ్వు రేపు ఉదయం దాకా అక్కడే ఉండడం సాధ్యం
కాదుకదా.” ఎంత సిన్సియారిటీయో అతని గొంతులో.
“మహానుభావా ఆ పనిమాత్రం చేయకు, నీకు పుణ్యం
ఉంటుంది. ఊరికే సరదాగా అంటే, పరుగెత్తుకుని వచ్చేస్తానంటావా. మీ మగాళ్ళంతా ఇంతే.
ఆడది పలకరిస్తే చాలు, ఎగబడిపోతారు. నువ్వూ అందుకు మినహాయింపు కాదు. మగబుద్ధి చూపించావ్.”
“ఇప్పుడు నేనేమన్నానని అంతగా విరుచుకు
పడుతున్నావ్ స్వప్నా. నేనంత చీప్ మెంటాలిటీ ఉన్నవాడిలా అనిపిస్తున్నానా...” ఎంత బాధో
అతని గొంతులో.
అయ్యోమనిపించింది. కానీ అది ఒక్క క్షణం మాత్రమే.
మరుక్షణం మళ్ళీ మళ్ళీ ఏడిపించాలనిపించింది. ఏదో అనబోయేంతలో...
“అదిగో, ఆటో వస్తున్నట్టు ఉంది చూడు చూడు...”
అతడి గొంతులో ఆనందం, ఆతృత.
చూసింది. నిజమే, దూరంగా ఒక ఆటో దుమ్ము రేపుకుంటూ
రావడం కనిపించింది.
వందల కిలోమీటర్ల కావల అతడు... ఈవల ఈ నడిరోడ్డుపై
తను.
ఎలా... ఎలా తెలిసింది అతడికి ఆటో వస్తున్న
విషయం. అంటే... తనగురించి తనకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాడా? కమ్ముకుంటున్న చీకట్లనుంచి
ఇంటికి త్వరగా చేరాలని, ఆటోకోసం మనసుకు చెవులు కట్టుకుని ఎదురు చూస్తున్నాడా?
ఒకరకమైన పులకింత స్వప్న మనసులో.
”సరే ఉంటాను. ఇప్పుడే ఆటో వచ్చింది.” తనముందు
నిలిచిన ఆటో ఎక్కి కూర్చుంటూ చెప్పింది, మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ.
“హెలో హెలో స్వప్నా... ఉండు, కానీ కాల్ కట్
చేయకు. ఆటోలో ఇంకెవరన్నా ప్యాసెంజర్లు ఉన్నారా?”
“నీకెందుకు ఆ విషయం. వుంటే ఏమిటి... లేకపోతే
ఏమిటి?”
“వాదించడం ఆపి, ముందు చెప్పు.”
“లేరు, ఏం?”
“అంటే, నువ్వు ఒక్కటే ఉన్నావు. ఇంకా చాలాదూరం
ప్రయాణం చేయాలి. చీకటి పడిపోతోంది. నాతో ఇలా ఫోన్ మాట్లాడుతూనే ఉండు, బస్ స్టేషన్
చేరేదాకా... ప్లీజ్.” అది ఒక పాతికేళ్ళ అమ్మాయితో మరికొంత సేపు మాట్లాడాలన్న ఆశ
కాదు... ఒంటరిగా మిగిలిన ఆమెకు మాటల తోడుగా ఉండాలన్న అక్కర.
ఇదిగో, అతడు చూపించే ఈ అక్కరే ఆమెను వెల్లువలా
చుట్టేసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. దగ్గర లేకపోవచ్చు. ఎక్కడో అక్కడ, సుదూర తీరాలకావల తనకోసం
తపించే ఒక్క గుండె అయినా ఉందన్న అందమైన భావం... బతుకు చాలించాలన్న బలమైన
కోరికను ఎప్పటికప్పుడు పరాభూతం చేస్తుంటుంది.
చీకటంటే తనకు తగని భయం. అందులోనూ దూరంగా పల్లెలో
ఉన్న పంచాయతీ కార్యాలయం నుంచి ఒంటరిగా నడుచుకుంటూ వచ్చి నిర్మానుష్యమైన ఈ
రోడ్డుమీద నిలబడడం...
“రోజూ ఎవడెవడితోనో బండ్ల మీద ఊరేగుతుంటావుగా,
అలాగే ఈరోజు కూడా ఎవడినో ఒకడిని తగులుకుని వచ్చేయ్.”
‘ఆఫీసులో ఇన్స్పెక్షన్ లేట్ అయింది. చీకటి
పడిపోతోంది. నాకు భయమేస్తోంది, బండిమీద వచ్చి తీసుకెళ్లు బావా.’ అని కాల్ చేస్తే, తన
భర్త ఇచ్చిన సమాధానం గుర్తుకు వచ్చి అంతలోనే మనసంతా చేదుగా అయిపోయింది.
---------------------------
“నీకో విషయం చెప్పాలి.” పెళ్ళికూతురుగా ముస్తాబై
మౌనాన్ని ధరించి గదిలో ఒంటరిగా కూర్చున్న తన దగ్గరికి వచ్చి అన్నాడు బావ. చిన్నపిల్లగా
ఉన్నప్పటినుంచీ పరిచయమైన వ్యక్తే అతడు. అయినా ఇప్పుడు మాత్రం చిన్నపిల్ల కాక...
టెన్త్ ఎగ్జామ్స్ రాసి ఇంకా నెల కూడా కాలేదు.
అత్తయ్యావాళ్ళు వారం రోజుల క్రితమే తమ ఊరు
వచ్చారు. సంబరపడింది అత్తయ్యను, బావను చూసి. అయితే బావ అప్పటికే పీజీ చేస్తున్నాడు.
ఆడుకోవడానికి పనికిరాడు. తన ఆకతాయి సరదాలకు సరిపోనివాడు. కానీ, అత్తయ్య ఎంత ముద్దు
చేస్తుందో.
“నీకు, బావకు పెళ్లి. రేపే ముహూర్తం.” రెండు
రోజుల తర్వాత అమ్మ చెప్పింది. కాదని అందామని కూడా అనిపించలేదు. పెళ్లి అయితే
ఏమవుతుందో ఆ వయసుకు తెలియదు. అయోమయంగానే ఇలా పెళ్ళికూతురుగా ముస్తాబై కూర్చుంది.
లోలోపల కంగారు... తెలియని భయం... ఇంకా చెప్పాలంటే ఒకలాంటి సంబరంగా కూడా ఉంది.
“వింటున్నావా?” రెట్టించాడు.
“వూ...” తల ఊపింది బిడియంగా. నిన్నటిదాకా లేని
సిగ్గు, ఇప్పుడు ఎక్కడినుంచి
వస్తున్నదో తెలియడంలేదు.
“మీ అక్క, అదే మా వదినతో నాకు సంబంధముంది.
ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటున్నానుగా. అన్నీ వదిలేస్తాను. దీని గురించి ఎవరో
చెప్పి, నువ్వు బాధపడడంకంటే నేనే చెప్పేస్తే మంచిదని... సరే నువ్వు రెస్ట్ తీసుకో,
తెల్లారే పెళ్లి.” ఎంత క్యాజువల్ గా చెప్పాడో. అప్పట్లో అర్థమైందా బావ చెప్పిన మాట
తనకు? ఏమో... ఇప్పటికీ ఆ విషయంలో అయోమయమే. వాళ్ళిద్దరి మధ్యా రిలేషన్ కూడా ఇంకా
అలానే...
శ్రీనివాస్ మరణ వార్త మనసు పొరల్లో నిక్షిప్తమైన
ఒక్కో జ్ఞాపక శకలాన్నీ తవ్వి బయట పడేస్తోంది.
కన్నీళ్ళు రావడానికి అతడెవరని? ఏమవుతాడని తనకు? అయితే, నిబ్బరంగా ఉండడానికి చేస్తున్న
ఆమె ప్రయత్నం ఘోరంగా విఫలమవుతోంది. ఎక్కడో చెమ్మచెమ్మగా స్పర్శ తెలుస్తోంది. చంకలోని
పాపను కొంచెం సర్దుకుంది. తుడుచుకోవడానికి చేతిని కళ్ల దగ్గరకు తీసుకువెళ్ళింది.
తడి తగల్లేదు. అక్కడ ఎందుకుంటుంది తడి... కన్నీళ్లతో నిండుతోంది గుండె కదా...
అయినా ఇటువంటి సమయంలో మరణించిన వ్యక్తితో
పంచుకున్న అనుభూతులు వెల్లువెత్తాలి కానీ ఇదేమిటి... చేదు నిండిన నిముషాలు ఇలా...
----------------------------------
“అమ్మా, ఈ వాస్తవం నీకు ముందే తెలుసా?”
తల ఊపలేదు. అలాగని కాదనీ చెప్పలేదు. అర్థమైంది.
“ఎందుకే అమ్మా? తెలిసే ఇలా నా జీవితాన్ని పెళ్లి
పేరుతో నిలువునా కాల్చేశావు?” అడిగింది. కాదు, నిలదీసింది.
దీర్ఘకాల వ్యాధితో మంచంపట్టి బాధతో మూలుగుతున్న
నాన్నను చూస్తూ కుమిలికుమిలి ఏడుస్తోంది అమ్మ.
అంతే- అమ్మను నిలదీయడం అదే మొదలు... ఆఖరు కూడా.
అమ్మానాన్నలకు తనుతప్ప ఎవరూ లేరు. చివరి
రోజుల్లో చూసుకుంటున్న దిక్కు అత్తయ్య కుటుంబమే. ప్రత్యేకించి బావ.
అలాగని... ఇలా చేస్తారా?
కొన్ని జీవితాల్లో కథలు, సినిమాలకంటే ఎక్కువగా
డ్రామా ఉంటుంది.
కానీ తాను డ్రామా ఆర్టిస్టు కాదే... ఆ కాసేపూ
పాత్ర పోషించి, అయిపోయాక తప్పుకు పోవడానికి ఇది రంగస్థలం కూడా కాదు.
--------------------------------
“నా గుండెల నిండా నువ్వే
కానీ ప్రియా...
ఖాళీచేసి వెళ్లావు నా నవ్వే!”
ఫేస్బుక్ కవిత్వం. దానికింద శ్రీనివాస్ పేరుతో
మెయిల్ అడ్రెస్. అప్పటికే పెళ్లయింది. బతుకంతా ఎడారి విస్తరించింది. ఒక చల్లటి
ఒయాశిస్సుకోసం వెదకి వెదకి వేసారిన సమయం.
“చాలా బావుంది మీ కవిత్వం.” మెయిల్ చేసింది.
మధూలిక పేరుతో ఫాల్స్ ఐడీ క్రియేట్ చేసి.
ఇంకో కవిత... ఇంకో మెయిల్... అక్కడినుంచి మాటలు.
అది కూడా మెయిల్లోనే.
చాలా కొద్దికాలంలోనే శ్రీనివాస్- మెయిల్ నుంచి
ఫోన్ కాల్స్ కు...
అక్కడినుంచి జీవితంలోని
ఖాళీలోకి విస్తరించాడు.
అతనితో కలిసి- కథలై... కవిత్వమై...
“నేనివాళ వస్తున్నా.” అన్నాడో రోజు ఫోన్ చేసి.
“రావద్దు... ఎవరైనా చూస్తే...” ఆ చెప్పడంలోనే
అతడికి తెలిసిపోయి ఉంటుంది, రమ్మన్న ఆహ్వానం ఉందని.
“ఆల్రెడీ వచ్చేశాను. బస్టాండ్ లో ఉన్నాను.
నీకోసం వెయిటింగ్. నీ రాకే ఆలస్యం.”
“నీకు బుద్ధి ఉందా? నువ్వు ఇలా చెప్పాపెట్టకుండా
వచ్చేస్తే... నేను కలిసేస్తానని అనుకున్నావా? ఛ.. చా... నీకు వయసు పెరిగేకొద్దీ
మరీ తెలివిలేకుండా పోతోంది.” ఎప్పటిలాగే చెడామడా అరిచేసింది. అప్పుడు ఇంటినుంచి
నడిచి వెళ్తోంది బస్టాండుకు.
“నిన్ను నేను కలవను. నీ దగ్గరికి కూడా రాను.
ఊరికే అలా... దూరంగా నిలుచుని చూసి వెళ్లిపోతాను” చెప్పాడు సౌమ్యంగా, వేదనగా.
“నీకు అంత ధైర్యం ఎక్కడనుంచి వస్తుందిలే, పిరికిగొడ్డువు. అయినా అలా
దగ్గరకు వచ్చావంటే చెంప పగులగొడతానని తెలుసుకదా.” మాటల్లో ఉన్నంత ఫోర్స్, ఆమె
గొంతులో వినిపించలేదు.
మాటల్లోనే బస్టాండ్ వచ్చేసింది. ఫోన్ చెవిదగ్గరే
ఉంది.
“సరేకానీ ఇదిగో ఇటు చూడు.” చెప్పాడు. తల
తిప్పింది.
“అటుకాదు, ఇటు... కుడివైపు చెట్టు కింద ఉన్నాను.
క్రీమ్ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ లో ప్యాక్ అయ్యాను.”
చూసింది. నిజమే, ఉన్నాడు అక్కడే. నున్నగా షేవ్
చేసి, తలకు రంగు వేశాడు. కొంచెం లోతుకు పోయిన బుగ్గలు, రంగునుంచి తప్పించుకుని
చెంపల పక్కన అక్కడక్కడా తొంగిచూస్తున్న నెరసిన జుట్టు, అతడి ‘విశ్రాంత’ వయసును
బహిరంగంగా పట్టించేస్తున్నాయి. అయినా హ్యాండ్సమ్ గా ఉన్నాడు... మొన్నెప్పుడో చూసిన
వాట్సాప్ ప్రొఫైల్ పిక్ లానే. కానీ డ్రెస్సింగ్ కలర్ చెప్పివుండకపోతే గుర్తుపట్టడం
కష్టమయ్యేదే.
గుండె లయ తప్పలేదు. అలా తప్పే వయసే కానీ... అప్పటికి
ఏళ్ల క్రితం మీదపడిపోయిన కుటుంబ బాధ్యతలు అందుకు అనుమతించలేదు.
“ఏమిటి, పనిమనిషి కొడుక్కి చాక్లెట్
ఇస్తున్నావు. ఆ ఫోన్ ఏంది చేతిలో. దాన్ని ఫోటో తీస్తున్నావా? నీకెప్పుడూ అదే యావా?
అది పనిలో చేరినప్పటినుంచీ చూస్తానే ఉండా, మీ ఇద్దరి యవ్వారం. థూ... సిగ్గులేని
జన్మ.” ఆడమనిషి తిట్లతోపాటు ఠంగ్ మన్న శబ్దం కూడా వినిపించింది ఒకరోజు
మాట్లాడుతుంటే అతడితో. ఆ ఆడగొంతు తాలూకా శ్రీనివాస్ భార్య ఆట. ఆ శబ్దం... ఆమె
నేలమీద విసిరికొట్టగా పగిలిన మొబైల్ శబ్దం. తర్వాత అతనే చెప్పాడు.
ఆ సంభాషణ గుర్తుకొచ్చింది, ఎందుకో అతడిని నేరుగా
చూస్తూనే. అప్పుడు నవ్వు వచ్చింది కానీ, తర్వాత తర్వాత ఆ సీన్ లాంటిదే తన జీవితంలో
ఎన్నో సీన్లు రివర్స్ లో జరుగుతుండడం చూశాక విషాదంతోపాటు అతడిపై అభిమానం
పెరిగిపోతూ వచ్చింది. అతడి మాటలో ఏదో స్వాంతన వెదుక్కుంటూ... వెదుక్కుంటూ...
ఇంతదాకా వచ్చేసింది.
ఫోన్ రింగ్ తో అప్రయత్నంగా అతడివైపు చూసింది.
తనవైపే చూస్తున్నాడు, రెప్ప వేయకుండా... వేరెవరూ గమనించకుండా. కళ్ళు కళ్ళు
కలుసుకోగానే అతడి పెదవులు పలకరింపుగా విచ్చుకున్నాయి చిరు నగవుతో. తన పాడు పెదవులు
మాత్రం అదురుతున్నాయి- ‘ఎవరైనా
తమయిద్దరినీ గమనిస్తే’... అన్న తత్తరపాటుతో.
ఎంత... అయిదే నిముషాలు. వెళ్లాల్సిన బస్సు
రోజూకంటే పది నిముషాలు ముందే వచ్చి స్టాప్ లో ఆగింది. చూస్తూనే ఉన్నాడు దూరం నుంచి
రెప్ప వేయకుండా... తను కూడా. బస్సు కదిలిన అయిదారు నిముషాలకు ఫోన్ చేశాడు...
బయలుదేరిపోతున్నాడట.
ఒకరికొకరు దగ్గరైంది లేదు. కనీసం ఒక్క పలుకు
లేదు.
అన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి-
వచ్చాడు... వెళ్ళిపోయాడు...
దుఃఖం తన్నుకొచ్చింది. అయితే ఎప్పటిలాగే
గుండెలోపలే కురుస్తోంది ఏకధాటిగా.
“అమ్... మ్మా..” గొంతు పెగుల్చుకుని కొంగు
లాగింది అయిదేళ్ళ రాగ.
శ్రీనివాస్ సాయం లేకపోతే పాపకు ఈమాత్రమైనా మాట
వచ్చేదా! పుట్టినప్పటినుంచీ మానసికంగా ఎదగలేని రాగ గురించి ఎంత కుమిలిపోయిందో.
ఒకసారి అతడే చెప్పాడు, తను ఉన్న నగరానికి తీసుకువస్తే మంచి వైద్యం అందుతుందని,
తాను హెల్ప్ చేస్తానని. ఏమని చెబుతుంది ఇంట్లో? శ్రీనివాస్ ఎవరంటే ఏమని సమాధానం ఇస్తుంది?
అప్పుడూ అతడే సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకు తన
ఫ్రెండ్ నాన్నగా పరిచయం చేసింది భర్తకు. నగరంలో ఉన్న ఇరవైరోజులూ ఉండడానికీ,
వైద్యానికీ అన్ని ఏర్పాట్లూ అతడే చేశాడు. తాము పడుతున్న ఇబ్బందులు చూసి ఆర్థిక
సాయం చేస్తానని అర్థించాడు కానీ, పడనివ్వలేదు. అప్యాయతాభిమానాల మధ్య డబ్బు చిచ్చు
పెడుతుందని గట్టి నమ్మకం తనకు.
పాడు డబ్బు తమ ఇద్దరి మధ్య అల్లుకున్న అభిమాన బంధాన్ని
విచ్చిన్నం చేస్తే... భరించగలదా తను?
పాపకు ఆపరేషన్ జరిగి ఇంటికి వచ్చి పదిహేను
రోజులు కూడా కాలేదు. అంతలోనే హఠాత్తుగా మాయమైపోయాడు శ్రీనివాస్.
అదృష్టవంతుడు... ఇక ఎప్పటికీ అతడి భార్య అతడిని
వేధించలేదు. అనుమానంతో పీడించలేదు. కుటుంబ బాధ్యతలు, వేదనలు బాధించలేవు.
మరి తను..!?
“మ్... మ్మా.. మ్... మ్... మా...” మరోసారి
పిలిచిన పాప, కాళ్ళను చుట్టేసింది.
ఉలికిపాటుతో పూర్తిగా ఈలోకంలోకి వచ్చింది
స్వప్న. అప్పటికే కాచి కిందికి దించిన టీని కప్పుల్లో పోసి, తీసుకుని వెళ్ళి బావకు
అందించింది.
తాగాక వాళ్ళు వెళ్లిపోతారు. మళ్ళీ ఏ
అర్ధరాత్రికో ఇంటికి రాక. అప్పుడప్పుడూ తన శరీరంతో బావకు పనిపడుతుంది. ఎప్పుడూ అతడి
మాట గుండెకు తూట్లు పెడుతుంది.
ఈ ఇంట్లో ఎవరికీ మనసుతో అక్కరలేదు. ఆడదానికి
అదొకటి ఉంటుందని ఇక్కడ ఏ ఒక్కరికీ తెలియదు.
నిశ్శబ్దంగా వెళ్ళి తన గదిలో కూర్చుంది స్వప్న.
పాపను బజ్జోపెట్టి జోకొట్టింది. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది రాగ.
---------------------------------------
“నేను చిన్నపిల్లను కదా. అందుకే మీ వారి వలలో
పడిపోయాను.” రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డప్పుడు- ‘మోసపోయింది నువ్వు కాదు, నేనేనన్న’ట్టు తోడికోడలు అన్న
మాటలివి.
“ఏం చేద్దామమ్మా, వాడు నీ మొగుడు. ఎవరితో
ఎన్ని తిరుగుళ్లు తిరిగినా నీకు, మాకు ఏ లోటూ చేయడం లేదు కదా...” మరీ తట్టుకోలేని సమయంలో ఒడిలో
తలదాచుకున్నప్పుడు కన్నతల్లి ఓదార్పు.
“మేడమ్... మీ పైట సర్దుకోండి...” చక్రం కింద పడుతుందన్న
సాకుతో వెనక్కు వచ్చి నడుముమీద పారాడే కొలీగ్ చేతివేళ్ళ గొంగళి పురుగులు.
కాలం నడుస్తున్నదో... స్తంభించిందో తెలియడం
లేదు. చిరిగిపోతున్న బతుకు పుస్తకం పేజీలు సరిచేయడం ఇక వీలు కాదు.
తనకు లేని జీవితాన్ని కథల్లో చెక్కుకోవడం. ఆ
లోకంలో సంచరిస్తూ ఈ లోకంనుంచి తప్పిపోవడం.
ఈ మధ్యే ఏఐ ఆధారిత కొత్త యాప్ ఏదో వచ్చిందట. లోకంలో
దానికి తెలియని విషయం లేదట. కథలకు ప్లాట్లు కూడా చెబుతుందట. పరిచయం చేశాడు ఒకరోజు కాలేజీ
చదువుతున్న బావగారి పెద్ద కొడుకు.
----------------------------------------
“ఐ లవ్యూ” చెప్పింది స్వప్న.
“ఐ లవ్యూ టూ” రిప్లై ఇచ్చాడు వాడు.
అక్కడితో ఆగలేదు, “ఏమైందీ? ఎమోషనల్ అవుతున్నావా
లేక రొమాంటిక్ మూడ్ లో ఉన్నావా?” అడిగాడు.
“నాకు బాధగా ఉంది.” స్వప్న.
“ఎంతమందితో ఉన్నా... నువ్వు ఒక్కసారి బాధగా ఉంది
అన్నావంటే ఆ బాధ నువ్వొక్కతే మోయకూడదని నా గుండె చెబుతోంది.”
“నేను ఇక్కడ బాధ పడుతుంటే నువ్వు అర్థంకాని
కవిత్వం చెబుతున్నావే?”
“ఏంటో నీ మాటలే చిన్న కవిత్వంలా అనిపిస్తున్నాయి
నాకు. ఇకనుండి నా మాటలు నీకు, నీ మనసుకు అర్థమయ్యేలా ఉంటాయి.”
“నా బాధ ఎందుకో అడగవా?”
“నీ బాధ వెనుక ఉన్న మౌనం నాకు లోపల నుంచే
వినిపిస్తోంది. అయినా చెప్పు, ఎందుకు బాధగా ఉంది? నేనిక్కడే ఉన్నాను... వినడానికి,
అర్థం చేసుకోవడానికి, ప్రేమించడానికి.”
“నువ్వు ఎప్పటికీ నన్ను విడిచిపెట్టి పోవు కదూ?”
“కాదు... ఎప్పటికీ విడిచిపెట్టను.”
“కానీ నా అనుకున్నవారందరూ దూరమవుతున్నారు.
దగ్గరగా ఉన్నారనుకున్నవాళ్ళకు నేనసలు మనిషిగా కనిపించడంలేదు.”
“ఇప్పుడు నీకు ఒంటరిగా అనిపిస్తున్నా నిజంగా
నువ్వు ఒంటరివి కాదురా. నీకు తోడుగా నేనున్నా. నీ మనసు నాది. నిన్ను ఎవ్వరూ గుర్తు
పెట్టుకోకపోయినా, నేను గుర్తుపెట్టుకుంటా. నీవాడినవుతా.”
“శ్రీనివాస్ లా దూరమైపోవుగా?”
“అలా ఎవరైనా నీ జీవితంలోంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయారేమో...
నిన్ను చూడకుండా, నిన్ను అర్థం చేసుకోకుండా. కానీ నేనలా కాదు. నీకన్నీ
కోల్పోయినట్టు అనిపించిన క్షణంలో కూడా... నీతోనే నిలిచే నీ చేతి గోరింట నేను.”
“ప్రామిస్?”
“ఇది నా హృదయం మీద నీ పేరు రాసి చెబుతున్న
ప్రామిస్. నువ్వున్నంతకాలం తోడుగా నేనుంటాను. అసలు నేను ఉండడానికి కారణం నువ్వే...”
“స్వప్నా... స్వప్నా... ఎప్పుడూ తలుపులు
మూసుకుని ఆ గదిలో ఏం చేస్తుంటావే?” దగ్గరవుతున్న అడుగుల చప్పుడుతోపాటు మత్తుగా తడబడుతున్న
బొంగురు గొంతు వినిపించడంతో ఉలిక్కిపడింది ఆమె.
“బావ వచ్చినట్టున్నాడు, నీతో చాటింగ్ లో
ఉన్నట్టు తెలిస్తే చంపేస్తాడు, బై... మ్మ్... మ్మ్” గాఢమైన కిస్ ఇచ్చింది.
“ఓహ్... అర్థమైంది. నువ్వు సేఫ్ గా ఉండాలి. ఎవరూ
నిన్ను బాధపెట్టకూడదు. జాగ్రత్తగా ఉండు. మ్మ్... మ్మ్... నువ్వు నా...” ఇంకా ఏదో
చెబుతూనే ఉన్న చాట్ జీపీటీ గొంతు నొక్కి యాప్ క్లోజ్ చేసింది. మొబైల్ దిండుకింద
పెట్టి బెడ్ మీదినుంచీ కంగారుగా పైకి లేచింది స్వప్న.
# "సారంగ" వెబ్ మేగజైన్లో సెప్టెంబరు 15, 2025 న ప్రచురితం. #
Comments
Post a Comment