అనగనగా...!
💦 అనగనగా...! 💦
"అనగనగా ఒక ఊరు"కి వెళ్లి ఎన్నేళ్ళు గడిచిపోయాయో. చల్లటి వేపచెట్లకింద నులకమంచం వాల్చుకుని, కాలుమీద కాలు వేసుకుని "బాలచంద్రిక" కథల్లోకి పరిగెత్తిన బాల్యం, అప్పుడే అక్కడే తప్పిపోయింది.
నా కథ సరే... నా పిల్లలు_ రేపేప్పుడో కాదు, ఇప్పుడే బాల్యం నుంచి తప్పిపోతున్నారేమో అన్న బెంగ. అలా తప్పిపోతే రేపు పెరిగి పెద్దయ్యాక వాళ్ళకంటూ బాల్య జ్ఞాపకాలు మిగలవేమోనన్న బాధ. "అనగనగా ఒక ఊరు"కు వాళ్ళనీ తీసుకెళ్లాలన్న తపన.
బాలచంద్రికలు, చందమామలు తెచ్చివ్వాలన్నా ఇప్పుడేవీ?
అందుకే నేను ఇక్కడ కుప్పంలో ఓ చిన్న ప్రభుత్వ గ్రంథాలయాన్ని వాళ్ళకి వెదికి పెట్టాను. అందులోని అలమరల్లో పేర్చిన పుస్తకాలలోంచి "అనగనగా ఒక ఊరి"లోకి చేయిపట్టి నడిపించాను.
ఇప్పుడు నా పిల్లలు నిజంగానే బాల్యాన్ని దొరకబుచ్చుకున్నారు. రెండు వారాలకోసారి ఆదివారాల పూట గ్రంథాలయానికి నాతోపాటు వచ్చి, రెండుమూడు కథల లోకాలను వెంట తెచ్చుకుంటున్నారు. చదువులు ముగిసిన తీరిక వేళల్లో ఆ కథల లోకాలలోకి సునాయాసంగా తప్పిపోతున్నారు. హబ్బా... ఎంత సంబరంగా ఉందో నాకు.
ఇదిగో ఇక్కడ ఉన్న పుస్తకాలు అటువంటి రెండు కథల లోకాలు. ఆ లోకాలలోంచి మా పిల్లలు ఏరితెచ్చి, చవులూరేలా నాకు వినిపించిన చిన్న కథ ఇది. మీకూ ఆ అమృతాన్ని పంచుదామని... మీ పిల్లల బాల్యాన్ని కూడా అప్పుడప్పుడూ అయినా ఇలా కథల లోకంలోకి తప్పిస్తారని... చిన్న ఆశతో...!
కథ
❤️The Python (కొండచిలువ)❤️
అనగనగా ఒక ఊరిలో ఒక రాజంట. ఆ రాజుకు ఇద్దరు భార్యలున్నారంట. పెద్ద భార్య పేరు శోభ చాలా దయగలది అంట. చిన్న భార్య రూప అస్సలు దయలేని గయ్యాళి అంట. ఒకరోజు చిన్న భార్య మాటలు విని, ఏమీ చేయలేక రాజు తన పెద్దభార్య శోభను, ఆమె కూతురు దేవిని రాజ్యం నుంచి బహిష్కరించాడంట. అప్పుడు కూడా వాళ్ళు ఆనందంగా ఉండడం చిన్న భార్య రూప సహించలేక పోయిందంట. దేవిని పశువులు మేపడానికి వెళ్ళమని ఆదేశించిందంట.
అలా ఒకరోజు దేవి పశువులు మేపుతుండగా, "నన్ను పెళ్లి చేసుకొంటావా?" అని ఎవరో అడగడం వినిపించిందంట. కానీ తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించలేదంట. అలా కొన్ని రోజులు జరిగాక ఈ విషయం వాళ్ళ అమ్మకు చెప్పిందంట. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఇంకోసారి గనుక అలా వినిపిస్తే, సరేనని చెప్పు. రేపు తెల్లారి తమ ఇంటి తలుపు దగ్గర వేచి ఉండమని చెప్పమని అందట. సరేనన్న దేవికి మరుసటి రోజు పశువులు కాయడానికి వెళ్ళినప్పుడు మళ్లీ "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అన్న అలిసిపోయిన గొంతు వినిపించిందంట. అప్పుడు ఆమె, వాళ్ళ అమ్మ చెప్పినట్టే 'సరే రేపు ఇంటికి రా, పెళ్లి చేసుకొంటాను.' అని చెప్పిందంట.
మరుసటి రోజు తెల్లారి లేచిన దేవి వాళ్ళ అమ్మకు తలుపు తీయగానే ఒక పెద్ద కొండచిలువ కనిపించిందంట. ఆమె భయపడి గట్టిగా అరిచిందంట. అప్పుడా పాము ఆమెకు గుడ్మానింగ్ చెప్పిందంట. ఇంతలో లోపలి నుంచి దేవి బయటకు వచ్చిందంట. భటులు ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాజు చిన్నభార్య రూప వీళ్ళ ఇంటికి వచ్చిందంట. ఇచ్చిన మాట వెనక్కు తీసుకోకూడదని చెప్పి, దేవికి, ఆ పాముతో బలవంతంగా పెళ్లి చేసిందంట. పాపం ఏడుస్తున్న దేవిని, పాముతోపాటు ఒక గదిలోకి పంపి తలుపు వేసేశారంట.
అయితే తెల్లారి లేచి శోభ ఆ గది దగ్గరికి వెళ్లి తలుపు కొట్టేసరికి లోపలినుంచి దేవితోపాటు ఒక అందమైన యువకుడు బయటకు వచ్చాడంట. అడవి దేవతల శాపంవల్లనే తాను పాముగా మారానని, యువరాణి దేవిని పెళ్లి చేసుకోవడం వల్ల శాపవిముక్తి అయిందని చెప్పాడంట. దీంతో అమ్మాకూతుళ్ళు చాలా సంతోషించారంట.
ఈ సంగతి తెలుసుకున్న రాజు చిన్నభార్య రూపకు కుళ్లు ఎక్కువైపోయిందంట. అడివిలో ఎక్కడైనా పెద్ద కొండచిలువ ఉంటే పట్టుకొని రమ్మని భటులను పంపిందంట. వాళ్ళు వెదగ్గా వెదగ్గా ఒకేఒక్క కొండచిలువ కనిపిస్తే దాన్ని తీసుకొని ఇంటికి వచ్చారంట. ఆ పాముతో తన కూతురు తారకు పెళ్లి చేసి, వాళ్ళిద్దరినీ ఒక గదిలోకి పంపిందంట రాజు చిన్నభార్య.
తెల్లారి లేచి తలుపు తీసేసరికి కొండచిలువ తారను మింగేసి ఇంతపెద్ద కడుపుతో కనిపించిందంట. భయపడిపోయిన చిన్నభార్య రూప , భటులతో ఆ పామును చంపి, తన కూతురు తారను బయటకు తీయించిందంట. రాజు చిన్నభార్య కుళ్ళబోతుతనానికి దానికి తగిన శాస్తే జరిగిందంటూ ఆ ఊరి జనం సంబరపడ్డారంట.
ముని ✍️
😊😊😊




Comments
Post a Comment