"కాలా"తీతుడు కొడవటిగంటి
❤️ కాలాతీతుడు "కొడవటిగంటి" ❤️
నేను పదకొండో ఏట రజస్వల అయినాను. మరి మూడు నెల్లకు నా భర్త సన్నిపాతం వచ్చి చచ్చిపోయినాడు. సన్నిపాతం క్రిములవల్ల కలుగుతుందని శాస్త్రజ్ఞులు చెబుతారు. భార్యలు దుష్ట నక్షత్రాన రజస్వల అయితే భర్తలకు సన్నిపాతం వచ్చి మూడో వారంలో కొట్టేస్తుంది. ఈ రహస్యం దైవజ్ఞులకే తెలుసు... ఏమైతేనేం నేను కూడా ఒక హత్యకు కారకురాలైన దాన్నయినాను. యమధర్మరాజు కోర్టులో ఎప్పటికైనా నా మీద హత్యకేసు నడవకపోదు.
...
ఇట్లా ఉండగా ఒకరోజు - నా పదమూడో ఏట - ఒక పెద్ద మనిషి - మా బంధుకోటిలో వాడే - ఎవరూ లేని సమయంలో నన్ను తన వొళ్ళోకి తీసుకొని, నా శరీరమంతా ఎంతో ప్రేమతో నిమిరి, నన్ను గట్టిగా తన రొమ్ముకు అదుముకుని, నన్ను ఉద్రేకంగా ముద్దులాడాడు.
ఆయనను నేను ప్రేమించానని చెప్పలేను. ప్రేమను గురించి కథలలో చదువుతున్న కొద్దీ దాని స్వభావం ఏమిటో బొత్తిగా తెలియకుండా పోతున్నది. గమ్యస్థానం తెలియక దిక్కులేని పక్షిలాగా తిరుగుతున్న కామేచ్ఛ ఈ సంఘటనతో ఆయన మీద వాలింది.
ఈ సంఘటన జరిగాక నా బాల్యం అంతమై యవ్వనదశ ఆరంభమైంది. నాకది ఒకవిధమైన రెండో పుటక. అనేక రోజులపాటు, నెలలపాటు, ఈ సంఘటన గురించే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వొళ్ళు పులకరించి నా హృదయాన్ని ఎవరో గట్టిగా నొక్కేస్తున్నట్టుగా బాధకలిగేది. నిద్రాహారాలూ మిగతా ప్రపంచమూ మరిచిపోయి, మొహం మొత్తేవరకు ఆ అనుభవాన్నే పొందాలని ఆరాటంగా ఉండేది.
-- ఒంటి స్తంభం మేడ (ఆంధ్రజ్యోతి మాసపత్రిక, మే, 1949), కొడవటిగంటి కుటుంబరావు కథలు.
---------------------------
నా పక్కన ఆమె కాళ్ళు కొంచెం ముడుచుకుని పడుకుంది. నన్ను గాఢంగా కౌగిలించుకొని నా గుండెల్లో తలదాచుకొని కలవరపాటుగా తనలో తాను "నువ్వు ఉన్నావుగా, నిజంగా నాకోసం ఉన్నావు కదా" అంటోంది.
...
అట్లా నన్ను హత్తుకున్న ఆమెని నేను నిస్సిగ్గుగా అడిగాను "దేహానికి కూడా వాంఛ ఉంటుందిగా. అది ఎట్లా చల్లబడుతుంది" అని.
"వాంఛలు తీరేందుకు అవకాశమో, ధైర్యమో లేని చోట ఆడవాళ్లకి ఆ కాంక్ష మెల్లిగా చచ్చి పోతుంది. మోయలేనంత ఒంటరిటనపు బరువు, భయం, దిగులు మాత్రం మిగిలిపోతుంది." అని. ఒక క్షణం తర్వాత "నాకు కూడా అట్లానే అనుకుంటా, దేహం మెలకువ ఎరుగని నిద్రపోయింది." అంది.
...
ఆ రాత్రి మా మధ్య ఏమీ జరగలేదని చెప్పినా ఎవరూ నమ్మరు అనుకున్నాను. మళ్లీ ఎవరికో జవాబు, ఎవరికో సంజాయిషీ... ఆమే కాదు, నేను కూడా నిజంగా గీతల్ని పూర్తిగా దాటానా...?
-- దేహ కాంక్ష, విమల, ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం, 22 మార్చి 2026.
తెలుస్తూనే ఉంది కదా, కొడవటిగంటి కుటుంబరావు తన కాలానికంటే ఎంత ముందున్నారో. ఆయన 1949 లో రాసిన కథలో అమ్మాయి పదకొండో ఏటే భర్తను కోల్పోయిన పడమూడేళ్ల పిల్ల. విమల రాసిన ప్రస్తుత కాలానికి చెందిన రెండవ కథలో హీరోయిన్ భర్త నిరాదరణకు గురై ఏళ్లతరబడి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న నలభై ఐదేళ్ల ప్రౌఢ.
మొదటి కథలో పిల్లది "కామేచ్ఛ". ఎటువంటి తొట్రుపాటు, ముసుగు లేకుండా ఎంత స్పష్టంగా చెప్పారో కుటుంబరావు. అనుకోకుండా తెలియని వయసులో కలిసిన మనిషితో ఆ ముచ్చట తీర్చుకుంటుంది. అప్పటికది అసహ్యమైనిపించినా, తర్వాత ఆ పిల్లకు మళ్ళీ ఆ అనుభవం కావాలనిపించిందని మొహమాటం లేకుండా చెప్పేస్తారు రచయిత.
రెండో కథలో ప్రౌఢది "దేహ కాంక్ష". అంటే "కామేచ్ఛ" అన్న పదానికి సంస్కృత సమాసంతో గౌరవమైన రూపు ఇచ్చారు. మళ్లీ ఆ ప్రౌఢ కాంక్ష అణగారి పోయిందంటారు రచయిత్రి. ఎంతోకాలంగా పరిచయమై, ఒట్టి అభిమానం, ప్రేమే కాదు... అతడి స్పర్శ కూడా ఆనందించగలిగే స్థాయికి ఆమెను తీసుకెళ్తారు. అయితే అంతవరకే. చివరికి ఇద్దరిమధ్యా ఆత్మీయమైన కౌగిలింత తప్ప, మరేమీ జరగలేదని కథ చివరలో ముక్తాయిస్తారు రచయిత్రి.
ఎందుకో నాకు మొదటినుంచీ కొడవటిగంటి అంటే ఒకరకమైన విముఖత. ఆయన రచనలు ఏవీ చదవకపోయినా, ఎందుకీ విముఖత్వం ఏర్పడిందో తెలియదు. బహుశా కొన్ని తరగతులకు ఒకప్పుడు ఆ రచయిత "చదువు" నవలిక పాఠ్యాంశంగా ఉండడం కారణమేమో. కానీ కథా స్రవంతి శీర్షికన ప్రచురితమైన "కొడవటిగంటి కుటుంబరావు కథలు" సంకలనంలోని కథలు చదివాక, ఆయన చాలా ఇష్టుడైన రచయితగా మారిపోయాడు.
ముని ✍️

Comments
Post a Comment