తెల్లవారుజామున 1.45 గంటలకు సుపథం క్యూ కాంప్లెక్స్ 1 లో రిపోర్ట్ చేశాము నేను, నా సతీమణి ప్రవీణ. ఏడుకొండలవాడి సుప్రభాత సేవకు వెళ్లాలంటే అదే సమయమట. తెల్లవారుజాము 2 గంటలకు మొదలైన క్యూ ప్రస్థానం, 2.50 కి వెంకన్న వైకుంఠం సప్తద్వారాల ముందు నిలిచింది. క్యూలో "గోవింద"లు తక్కువే కానీ, ఇక్కడకు చేరేసరికి ఎక్కువయ్యాయి భక్తుల గొంతులు. ఇంకా ద్వారానికి ఉన్న తెర తొలగలేదు. పది నిముషాలు వేచాక, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్పీకర్ నుంచి శ్రావ్యంగా మొదలైంది. ఆ సుస్వర ఝరి 3 గంటల 19 నిముషాల 42 సెకన్ల దాకా సాగి ఆగింది. గిర్... ర్... ర్... మన్న శబ్దంతోపాటు ఒక్కసారిగా గోవిందలు ఆ వైకుంఠ సప్తద్వారాల ముందున్న ఆలయ ప్రహరణం దాటి మిన్నంటాయి. ఉలిక్కిపడి చూద్దునుగదా... ఘంటారావంతో తెర తొలగింది. అంతలోనే మూతపడి, మళ్లీ రెండు నిముషాలకల్లా ఓ వారకు తెర జారింది. సప్తద్వారాలలోకి జనప్రవాహం వెల్లువైంది. సప్తద్వారాలు దాటుతున్నప్పుడు భక్తులకు ఎంత ఆత్రమో... ఇక్కడినుంచే తమ స్వామిని చూడాలని. ఒకరి తలపై నుంచి ఒకరు నిక్కి చూస్తూ... ఒకరి భుజాలను ఒకరు నెట్టుకుంటూ...! ఇంకొద్ది క్షణాల్లో మనమూ ఆ ముందు వరుసకు వెళ్లి, ఆయన ఎదుట నిలుచుంటా...