కలడో... లేడో!
తెల్లవారుజామున 1.45 గంటలకు సుపథం క్యూ కాంప్లెక్స్ 1 లో రిపోర్ట్ చేశాము నేను, నా సతీమణి ప్రవీణ. ఏడుకొండలవాడి సుప్రభాత సేవకు వెళ్లాలంటే అదే సమయమట. తెల్లవారుజాము 2 గంటలకు మొదలైన క్యూ ప్రస్థానం, 2.50 కి వెంకన్న వైకుంఠం సప్తద్వారాల ముందు నిలిచింది. క్యూలో "గోవింద"లు తక్కువే కానీ, ఇక్కడకు చేరేసరికి ఎక్కువయ్యాయి భక్తుల గొంతులు. ఇంకా ద్వారానికి ఉన్న తెర తొలగలేదు.
పది నిముషాలు వేచాక, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్పీకర్ నుంచి శ్రావ్యంగా మొదలైంది. ఆ సుస్వర ఝరి 3 గంటల 19 నిముషాల 42 సెకన్ల దాకా సాగి ఆగింది. గిర్... ర్... ర్... మన్న శబ్దంతోపాటు ఒక్కసారిగా గోవిందలు ఆ వైకుంఠ సప్తద్వారాల ముందున్న ఆలయ ప్రహరణం దాటి మిన్నంటాయి. ఉలిక్కిపడి చూద్దునుగదా... ఘంటారావంతో తెర తొలగింది. అంతలోనే మూతపడి, మళ్లీ రెండు నిముషాలకల్లా ఓ వారకు తెర జారింది. సప్తద్వారాలలోకి జనప్రవాహం వెల్లువైంది.
సప్తద్వారాలు దాటుతున్నప్పుడు భక్తులకు ఎంత ఆత్రమో... ఇక్కడినుంచే తమ స్వామిని చూడాలని. ఒకరి తలపై నుంచి ఒకరు నిక్కి చూస్తూ... ఒకరి భుజాలను ఒకరు నెట్టుకుంటూ...!
ఇంకొద్ది క్షణాల్లో మనమూ ఆ ముందు వరుసకు వెళ్లి, ఆయన ఎదుట నిలుచుంటాము కదా... ఇంతలోనే ఈ జనానికి ఎందుకీ తహతహ అనిపించింది.
హఠాత్తుగా కిందికి దిగి పల్లంగా మారిన పాదాల కింది నడక దారిని కాస్త పడకుండా చూసుకుని, అందరూ సర్వమంగళ విగ్రహంగా వేనోళ్ళ స్తుతించే ఏడుకొండల వాసుని నేనూ కాసేపు దర్శిద్దామని తలెత్తేలోగానే...
హరిహరీ...
ఇంకెక్కడి విగ్రహం... ఇంకెక్కడి దర్శనం...!
మా దేహాలు మా ప్రమేయం లేకుండానే, సప్తద్వారాలు కాదు, పొడవాటి క్యూలైన్ కూడా దాటి ఈవలకు వచ్చి పడిపోయాయి. కాదు కాదు... శ్రీవారి సేవకులనేవారు ఈడ్చి, నెట్టి, గుంజి ఆపని చేసిపడేశారు, ఇంకొన్ని భక్త దేహాల భుజాలు పట్టి కనిపించారు.
సప్తద్వారాల కీవల, తలనీలాలు నీకర్పించిన భక్త గుండుల మీదినుంచి దూరంగా... గర్భాలయంలోని మసక వెలుగులో ఆ పద్మావతీపతి ఏం కనిపించాడో... అదే మాకు దక్కిన దర్శనం. సమయం అప్పటికి తెల్లవారుజాము 3.50 గంటలు.
కళ్ళుమూసి తెరిచేలోగా కాదు- ఆల్చిప్పల్లా ఇంతలేసిగా తెరచిపెట్టుకున్న కన్నులకే దిక్కులేదు. దివ్యమంగళ విగ్రహుడని లోకం కొనియాడే ఏడుకొండల వాడిని ఒక్క క్షణంసేపైనా తృప్తిదీరా చూసి "ఎలా ఉన్నారని" పలకరించే భాగ్యం దక్కలేదు.
"సుప్రభాత సేవకు"లకే పరిస్థితి ఇదైతే... మరి రూ.300 ప్రత్యేక దర్శనం, ధర్మ దర్శనం భక్తుల మాటేమిటి? వందల వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి, గంటల తరబడి... ఒక్కోసారి రోజులతరబడి పైబడి క్యూలైన్లలో ఓపికగా నిరీక్షించే అపర భక్తకోటి గతియేమిటి?
అయినా స్వామీ, నాకొకటి తెలియక అడుగుతాను.
భక్తజనం ఇన్ని వ్యయప్రయాసలకోర్చి నీ సన్నిధికి వచ్చేది నిన్ను చూసి తరించడానికి కానీ, నీ భృత్యుల భుజం లాగుళ్లు... వీపు నెట్టుళ్లకు కాదుకదా. ముటటలాడే వారి ముఖారవిందాల దర్శనాలకు అంతకంటే కానేరదు కదా!
"కలడందురు దీనుల యెడ
కలడందురు భక్త యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో!"
క్షమించండి స్వామీ... ఈ సందేహం నాది కాదు.
భక్త పోతన్నది.

Comments
Post a Comment