శకుని
"దుష్ట చతుష్టయం" ఆ రాణివాసపు అంత:పురాంతర్భాగాలనుంచి హేళనతో కూడిన నవ్వు. గాలి అలలపై తేలి వచ్చి కాస్త బిగ్గరగానే వినిపించిందా మాట. భగ్గున మండింది శకుని మనసు. ఇప్పుడే... బాల రారాజుకు నాలుగు బుద్ధి మాటలు చెప్పి, తన భవనం నుంచి వెలుపలిదాకా వెంట వచ్చి సాగనంపి వస్తున్నాడు. వస్తూ వస్తూ ఏమి కుట్రలు జరుగుతున్నాయో తెలుసుకుందామని కుంతి అంత:పుర సమీపంలో కాపలా భటుల కంట పడకుండా తచ్చాడుతుంటే చెవులను బద్దలు చేస్తూ వినిపించింది ఆ కర్ణకఠోర శబ్దం. అవును... ఆ పలుకుతున్నది బ్రాహ్మణ యువకుడు ధౌమ్యుడే. ఎవరు దుష్టులు... అకారణంగా దండెత్తి వచ్చి గాంధార దేశాన్ని భస్మీపటలం చేసి తన సోదరి గాంధారిని పట్టి తెచ్చి అంధ రాజుకు కట్టబెట్టిన బీష్ముడా ? యోగ్యత లేకున్నా, తగుదునమ్మా అంటూ ఆ అందాల రాశిని చేపట్టి ఆమె చూపును చెరబట్టి బతుకు దుర్భరం చేసిన ధృతరాష్ట్రుడా ? బ్రాహ్మణ మూకల దన్నుతో హక్కు లేని తన కుమారులకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడానికి అంత:పుర కుట్రలు పన్నుతున్న కుంతియా ? సుయోధనుని వంశ పారంపర్య హక్కును అంగీకరించక సన్నాయి నొక్కులతో పెద్దలందరినీ మెప్పించి హస్తినాపుర సింహాసనాన్ని కాజేయడానికి కుతంత్రములు చేస్తున్న ...