పాటల్ని అతుక్కోవాల్సింది నేను కదా

వద్దనుకుంటూనే ఉంటాను
వినని వేళ్ళు లోలోపలికి చొచ్చుకుని పోతాయి
ఇన్ని ఇసుక రేణువులనో
ఇంత మట్టి పరమాణువులనో జవురుతాయి

ఇకప్పటినుంచీ తలపోత
జలజలా రాలిపోతున్న వేటినో
ఒడిసిపట్టాలన్న తాపత్రయం
బతుకు బతుకుకూ ఈ యాతన
లేకపోతే నువ్వున్నా లేనట్టేనట
ఎక్కడినుంచో ఒక సుగంధమేదో వీస్తుంది
ఇటుపక్కనెక్కడో ఎండిన పువ్వొకటి రాలుతుంది

ఏది నిజమో తెలియదు
రాత్రంతా గుచ్చుకున్న కలలు
చిరుచీకట్ల తెల్లారగట్ల ఏమవుతాయో కనిపించవు

పక్క తడిసింది కురిసిన చినుకులతోనా
కాగిన కన్నీటి చుక్కలతోనా

దూరంగా ఒక ఆకాశం
తెల్లబోయి చూస్తున్న చందమామతో పనేమి

తప్పించి వొంపుకున్నాను
ఎగిరిపోబోతున్న చుక్కలన్నీ పలపలా మెరిశాయి
ఎక్కడో జారిపోయిన రెక్కల్ని తడుముకున్నాను

ఇక్కడిదాకా మోసుకొచ్చింది
భారాన్నా లేక గాయాన్నా
బహుశా తేడా లేదేమో...

నిజానికి ఉన్నదేమో కూడా
వాడికేం... అలా నవ్వుతూనే ఉంటాడు

విరగ్గొట్టిన పాటల్ని అతుక్కోవాల్సింది నేను కదా

ఇప్పటికైనా గుప్పెడు పొగడపూలను ఏరుకోవాలి
ఇన్ని చెమటచుక్కల్ని పూసి పదునుగా పేనుకోవాలి

నడిచొచ్చిన దారుల్లో నన్ను నేను వెదుక్కుంటూ
వెలుతురు గొంతు నులిమేసిన చీకట్లకోసం
బోలెడన్ని ఉరికంబాలను చెక్కుకోవాలి
------------------------------------------------------------
(సారంగ వెబ్ మేగజైన్ లో ఫిబ్రవరి 15, 2026 న ప్రచురితం)

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ