ద జర్నీ

 ఊగుతూ తూగుతూ వెళ్తున్న బస్సులో ఆపాటి కదలిక కూడా ఆగిపోయింది. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న నేను డ్రైవరువైపు చూశాను విసుగ్గా. అతడికి కళ్ళు నిలువుగుడ్లు పడున్నాయి. ఊపిరి ఆడనట్లుగా ఎగశ్వాశ తీస్తున్నాడు. ఎదురుగా రోడ్డు మీదకు చూస్తున్నాడు.

నేను అప్రయత్నంగా అటు తల తిప్పాను. ఎవరో ముసలి వ్యక్తి. రోడ్డుకడ్డంగా నిలబడి బస్సు ఆపమన్నట్టు చేయి ఊపుతూ ముందుకొస్తున్నాడు. తెల్లటి పంచె, తలకు తువ్వాలు చుట్టి అచ్ఛం ఈ కుప్పం ప్రాంతం పేద రైతులాగే ఉన్నాడు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడా దగ్గరిలో గ్రామాలేవీ లేవు. అది పలమనేరు దాటాక వచ్చే గుట్టలతో కూడిన అడవి ప్రాంతం. అప్పటికి అర్ధ రాత్రి పన్నెండున్నర అవుతోంది. కుప్పం నుంచి బస్సు బయలుదేరి రెండు గంటలు దాటింది.

ఈ వేళప్పుడు, ఈ ముసలి రైతు ఇక్కడ ఎందుకున్నాడు ? దయ్యాలు, భూతాల మీద ఇక్కడి జనానికి నమ్మకం ఎక్కువ. అతడిని డ్రైవర్ దెయ్యమనే అనుకున్నాడా ? ఆ షాక్ వల్లే అలా అయిపోయాడా ?

మళ్ళీ డ్రైవరు వైపు చూశాను. షాక్ నుంచి కాస్త తేరుకున్నట్టు కనిపిస్తున్నాడు కానీ, అతని ఒంట్లో వొణుకు మాత్రం తగ్గడంలేదు.

"ఏం చౌడప్పా, బాగుండావా ? ఈమజ్జ మా నాయనూరు రూట్లో రావడం లేదేంది ?" డ్రైవరును చనువుగా పలకరిస్తూ బస్సు ఎక్కాడు వృద్ధుడు.

"ఆ ఆ... బా... బా... గ... గ్గ... నే ఉండా" డ్రైవరు మాటలో స్పష్టమైన  వొణుకు.

"ఎక్కినప్పటి నుంచీ చూస్తున్నాం. ఇది ప్యాసింజరా ఎక్స్ ప్రెస్సా ? మనిషి కనిపిస్తే చాలు, ఆపేస్తా ఉండారు. ఇంక మేము ఈ కాలానికి తిరుపతి చేరినట్లే." నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయిన ప్యాసింజర్లు గొడవకు దిగారు.

"నాయన్నాయనా నన్ను మీరు క్షమించాల. నా మనవరాలు ఆడ సావుబతుకుల్లో ఉండాది. ఇదే లాస్టు బస్సు. నేను ఎల్లి కాపాడుకోవాల." అని వారిని వేడుకుంటూ నా పక్కనే వచ్చి కూర్చున్నాడు వృద్ధుడు.

"నువ్వు పదప్పా... నేను అర్జంటుగా పోవాల." తలకు చుట్టుకున్న తువ్వాలు తీసి విదిలించి ముఖం తుడుచుకుంటూ డ్రైవరును అదిలించాడు. అదోరకమైన అజమాయిషీ ధ్వనించింది అతని గొంతులో.

అంతదాకా ఏదో రిపేరంటూ నత్త నడక నడిచిన బస్సు, ఒక్కసారిగా వేగం పుంజుకుంది.

ఆశ్చర్యపోతూ డ్రైవరువైపు చూశాను. ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు యాక్సిలేటర్ అడుగంటా తొక్కిపట్టి పెదాలు బిగదీసి స్టీరింగ్ తిప్పుతున్నాడు. అంతదాకా అతడిలో ఉన్న భయం, వొణుకు ఏవీ కనిపించడంలేదు విచిత్రంగా.

"ఎక్కడినుంచప్పా... ?" వృద్ధుడు అడగడంతో ఆశ్చర్యం నుంచి కోలుకుని చెప్పాను... "కుప్పం నుంచీ"

"మాపక్కోడిలా కనిపించడం లేదే...?"

"చిత్తూరు జడ్పీ ఆఫీసునుంచి వచ్చాను. ఇక్కడ మండలాఫీసులో పని చూసుకుని వెళ్తున్నా" ఈ పల్లెటూరి బైతులు, తమకు సంబంధం లేని వ్యక్తులను ఇలా ఆరాలతో వేధించడం ఎప్పుడు మానుకుంటారో.

"అట్టా జెప్పు మరి"

ఆ వృద్ధుడు వచ్చి పక్కన కూర్చున్నప్పటినుంచీ ఏదో కుళ్ళిన కంపు. భరించలేక పోతున్నాను. అంతే కాదు, అది నడి వేసవి అయినా ఎందుకో విపరీతమైన చలి గాలులు తాకుతున్నాయి శరీరానికి. కిటికీ క్లోజ్ చేసినా ఆగడంలేదు. గుండెల్లో నుంచి ఒకటే వణుకు.

పొద్దంతా రికార్డుల వెరిఫికేషన్ తో క్షణం తీరిక లేక ఏర్పడ్డ అలసట వల్ల, ఆ చలి గాలుల గురించి కానీ, కుళ్ళు కంపు గురించి కానీ ఆలోచించే ఓపిక లేకపోయింది. మాగన్నుగా నిద్ర పట్టేసింది.

ఎవరో తట్టి లేపినట్లు మెళకువ వచ్చింది. ముఖంలో ముఖం పెట్టి తట్టి చూస్తున్నాడు వృద్ధుడు. తట్టి లేపింది కూడా అతడే.

క్షణంసేపు ఎక్కడున్నానో అర్థం కాలేదు. ఉన్నది బస్సులోనని అర్థమయ్యాక చిత్తూరు బస్టాండు వచ్చేసిందేమోనని చుట్టూ చూశాను. కారు చీకట్లు. దూరంగా ఏవో మంటలు కనిపిస్తున్నాయి. విండో గ్లాసు పక్కకు జరిపి మరింత పరిశీలనగా చూశాను. మంటలు... చుట్టూ అంధకారం తప్ప మరేమీ కనిపించలేదు. తల తిప్పి బస్సు లోపలికి చూశాను. వృద్ధుడు, నేను తప్ప ప్యాసింజర్లలో ఎవరూ మెళకువగా లేరు. వాళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నట్టు గురక శబ్దాలు వింబడుతున్నాయి.

ఏదో అనుమానం వచ్చి జేబులో ఉన్న మొబైల్ తీసి టైమ్ చూశాను. అర్ధ రాత్రి 12 గంటలు. మళ్ళీ మరోసారి చూశాను, టైంలో ఏ మార్పూ లేదు.

కారణం... పలమనేరు దాటాక గుట్టల్లో వృద్ధుడు బస్సు ఆపి ఎక్కిన సమయం కూడా అదే.

అంటే బయలుదేరిన చోటే ఉన్నామా ? గుండె గతుక్కుమంది.

బస్సు చెడిపోయిందా? ఒకవేళ రిపేర్ అయినా వృద్ధుడు ఎక్కిన తర్వాత మధ్యలో జరిగి ఉండాలి. అంటే కొంచెమైనా టైమ్ ముందుకు జరిగాలి. కానీ పన్నెండు ఫగ్గరే ఉండిపోయిందే...

అయినా ఇంత అంత మొద్దు నిద్ర ఎలా పట్టేసింది నాకు ? అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే.

"బాబూ, వాడిని ఆపండి బాబూ. నా మనవరాలిని చెడిపేస్తా ఉండాడు. మీకు పుణ్యముంటాది... వాడిని చంపైనా నా బిడ్డను కాపాడండి బాబూ..." నా శరీరాన్ని రెండు చేతులతో కుదిపేస్తూ కిటికీ నుంచి బయటికి చూస్తూ ఏడ్చేస్తున్నాడు వృద్ధుడు.

కంగారుగా అతడు చూపించిన వైపు చూశాను.

అరే అక్కడ దూరంగా మైదానంలో...  స్కూలు బ్యాగు తగిలించుకున్న ఆ పదిహేనేళ్ల  పిల్లను పొదల్లోకి లాక్కెళ్తోంది డ్రైవర్ చౌడప్ప కదూ. అయ్యో, గొంతు నులిమేస్తున్నాడే. చితి పేరుస్తున్నాడు, అందులో వేసి కాల్చేస్తాడా ? అయ్యయ్యో బట్టలు లేని ఆ పసి పిల్లను లాక్కొచ్చి మంటల్లో పడేశాడు. ఘోరం, కాలిపోయింది.

తల తిప్పి, బస్సులో చూశాను. స్టీరింగ్ మీదకు వాలిపోయి ఉన్నాడు చౌడప్ప. అతడి నోట్లోనుంచి కారుతున్న రక్తంతో సీటు ముందుభాగం అంతా తడిసిపోయింది. గుండె పోటు వచ్చిందా ? అయితే రక్తం ఎందుకు కక్కుకున్నాడు? ఇక్కడ డ్రైవింగ్ సీటులో చచ్చి పడివున్న చౌడప్ప, బస్సు బయట ఆ పసిపిల్లను మంటల్లో ఎలా కాలుస్తున్నాడు? అసలు ఇంత అర్ధ రాత్రి పూట, ఈ అడవి ప్రాంతంలో ఆ పిల్ల ఎందుకుంది?

"రేయ్ చెప్తా ఉండేది నీక్కాదూ... కాపాడరా నా చిట్టి తల్లిని. అమ్మా అమ్మా నా తల్లీ, వొస్తావుండా, నేనూ నీతో వొచ్చేస్తావుండా ?"

నన్ను బతిమాలడం  మానేసి గుండెలు బాదుకుంటూ బస్సు దిగాడు వృద్ధుడు. గుట్టలు, పుట్టలు దాటుకుంటూ పరుగులు తీసి కాలుతున్న చితిలో దూకేశాడు.

"డ్రైవరుకు ఏమైంది ? కండెక్టర్, ఎందుకు బస్సు కదలడం లేదు ?" ప్యాసింజర్ల అరుపులు ఎక్కడో లీలగా వినిపించాయి. నిద్ర మత్తు వదిలింది.

"చౌడప్పా, చౌడప్పా... అయ్యో హార్ట్ అటాక్ వచ్చినట్లు ఉంది. ఎవరైనా వన్నాట్ ఎయిట్ కు వెంటనే ఫోన్ చేయండి." దు:ఖంతో గొంతు జీర పోతుండగాస్టీరింగ్ మీద తల వాల్సేసి ఉన్న డ్రైవరును లేపడానికి ప్రయత్నిస్తూ అరుస్తున్నాడు కండెక్టర్.

అంతదాకా ప్రయాణికుల్లో ఉన్న చిరాకు, భయంగా పరిణామం చెందింది. బస్సులో కలకలం బయలుదేరింది. ఎవరో వన్నాట్ ఎయిట్ కు ఫోన్ చేశారు. బస్సులోనే ఉన్న డాక్టరు ఎవరో ప్రథమ చికిత్స ప్రారంభించడానికి ప్రయత్నించి అన్నాడు, “లాభం లేదు, హీ ఈజ్ ఆల్రెడీ డెడ్.”

"నా పక్కన ఒక వృద్ధుడు ఓల్డ్ మ్యాన్ ఉండాలి. ఎటెళ్ళాడో మీరు చూశారా ? ఇక్కడ బస్సు ఆపి ఎక్కాడు..." కండక్టర్ ను అడిగాను నెమ్మదిగా.

"బస్సు ఆగంది నిజమే కానీ, డ్రైవరే ఎలాగో చాకచక్యంగామేనేజ్ చేశాడు. లేకపోతే పక్కనున్న లోయలో పడి మనందరి ప్రాణాలూ గాల్లో కలిసిపోయేవే. పాపం టెన్షన్లో హార్ట్ ఎటాక్ వచ్చిందేమో... స్టీరింగ్ మీద వాలిపోయాడు. ఓల్డ్ మ్యాన్ ఎవరు మధ్యలో..." చిరాకు పడ్డాడు.

కుళ్ళు కంపు... చలిగాలి... గుండెల్లో వణుకు... వృద్ధుడు వచ్చి పక్కన కూర్చున్నప్పటినుంచీ అనుభూతులు వరుస కట్టాయి.

ఆ కండక్టరుకి తెలియదు. మమ్మల్నందరినీ బతికించింది డ్రైవరు కాదు... వృద్ధుడు. వృద్ధుడికి కావాల్సింది మా ప్రాణాలు కాదు... డ్రైవరువి.

అప్పుడెప్పుడో ఆ పల్లెటూరి అమాయక తాతా మనవరాళ్ల ఉసురు తీసిన బస్సు డ్రైవర్ ను చంపి ప్రతీకారం తీర్చుకుంది ఆ వృద్ధుడి ఆత్మే.

నాకు అర్థమైంది...

ఒక్కసారిగా వొళ్ళు గగుర్పొడిచింది.
-----------------------------------------------------------------------------
(
# ఊ... కొడతావా!? ఉలిక్కి పడతావా!!” కథా సంకలనం. డిసెంబరు 2025, ఫస్ట్ ఎడిషన్. # )

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ