పుల్లరెక్కల పెట్ట

  "మ్మోవ్, ఊరంతా దిరిగినా ఎక్కడ కోడినమ్మేవోడే కనబళ్ళా. యాంజేసేదో అర్తం గావడంల్యా.” పందుంబుల్ల నోట్లో పెట్టుకోని పద్దననగా పైగుడ్డ బుజిమ్మిందేసుకొని ఈదిలో పడిన నాయిన, పందిలి నీడ చిన్న రాయికాడికొచ్చినాక ఇంటికొచ్చినాడు ఈసురోమంటా. పందిలి ముందు యాపసెట్టు కింద ఉండే బండ మింద సతికిలబడినాడు.

"అయ్యో, ఈ పాడుబడిన ఊళ్ళో ఒక్కటంటే ఒక్క కోడిని అమ్మేవోడు గూడా లేడా. దుదుగుంటోళ్ల రమణయ్యను అడిగినావా? ల్యాకపోతే నీ సావాసగాడు నాగయ్యను కనుక్కోరాదా సిన్నోడా..”  రాగం దీసింది అవ్వ.

“ఆ ఇద్దురినీ అడిగినా. వోల్లు లేదన్నాకే, ఊరుమింద బడినా. చెంచత్త, పొట్టేక్క, పుల్లారెడ్డి మావ, నారి బావ.. ఎవుర్ని అడిగినా లేదనేవోళ్ళే.” మళ్ళోసారి తుండుగుడ్డతో మొగం తుడుసుకున్నాడు. కొక్కో... ర్... కొక్కర్... క్రో.. ర్..  అంటా దిబ్బలో యారక తింటా ఉండే కోళ్ళ గుంపు అదే టయానికి ఈపక్క వొచ్చింది. వోటిని కొంచేపు ఎగాదిగా జూసింది మాయవ్వ.

ముక్కలగుండా ఇంత పొడగన గాలి వొదిలింది. “ఇంగేమి జెయ్యాల సిన్నోడా, మన పుల్ల రెక్కల బూడిద పెట్టనే కొయ్యాల. సిన్నమ్మోళ్ళు సిత్తానూరు నించి ఎప్పుడైనా దిగొచ్చు. కోడికూరైనా పెట్టకపోతే మీ బావ దెగ్గిర బగిశాట్లై పోతావుండ్లా..." అవ్వ ఎత్తుకునింది.

అంతే మా పిలకాయిలందరికీ కుశాలై పోయింది. అక్క, నేను, ఇద్దురు చెల్లిల్లు, అమ్మా నాయినా, అవ్వా ఇందరం కలిసి కోడిని పట్టుకునేదానికి మల్లుకున్నాం. ఆ కూశాల్లోనే దిగులు గూడా ఉండాది తల్లా. ఎందుకో జెప్పడానికే గదా నేనుండా.

ఆదేమన్నా పారం కోడా.. బోన్లోనించి దీసి బయట ఇడిసిపెట్టినా ముండమాదిరితో ముడుక్కుని నన్ను కోసి కూరొండుకోని పున్నెం గట్టుకోండి అమ్మలాలా అయ్యలాలా అంటా కాళ్ళసుట్టే తిరగడానికి. మా పుల్ల రెక్కల బూడిద పెట్ట గురిచ్చి మీకు తెలీదు. అది శానా ముండమోపి కోడి. యేశాలమారి కోడి. అదీ మజ్జినే పక్కింటి రామలచ్చమ్మోల్ల ఎర్ర కోడిపుంజుతో జతగట్టింది. మొగుణ్ణి మూకుడితో మూసిపెట్టి, ఉంచుకున్నోడితో దిరిగే జాణ మాదిర్తో ఇడిసిపెట్టేసింది. ఆ పుంజుతో ఇలాసంగా తిరగతా, దానిమాదిరే గెడ్డివాములు, వామిలి చెట్లు ఎక్కి ఎగిరి దూకడాలు నేర్సింది. ఇన్ని వొడ్ల గింజిలు అరిసేతులో బోసుకొని తినిపించబోతే, ముక్కుతో పొడిసేసి, రెక్కలు టపటపా కొట్టుకుంటా దూరంగా పరిగెత్తతా ఉండాది. అనాకెప్పుడో మనం లేని టైము జూసి, సడీసప్పుడు గాకండా వొస్తాది. సత్తు గిన్నిలో పెట్టిన గింజిల్ని కింద దోసుకోని పటపటా ముక్కుతో పొడిసి పొడిసి తినేసి, ఆపక్కనే పందిలి గుంజకు ఆనించి ఉండే చిప్పలో నీళ్ళు తాగేసి, ఆ మిండగాడు ఎర్ర పుంజుతో జతకట్టను ఆత్రంగా పక్కింటికి ఉరువులేకుండా పోతా ఉండాది. ఈమజ్జ మెడ్రాసులో ఉండే కూతురు, అల్లుడు పిలకాయిలతో వొచ్చినారు గదా. మొన్న వక రోజు రామలచ్చమ్మ, వాళ్ళ తెల్లపూల నల్లపుంజును కోసి, కూరొండి పెట్టేసింది వోల్లకి. ఆ తెల్లపూల నల్లపుంజుకు పట్టిన గెతి గురిచ్చి ఎర్రపుంజు దీని చెవ్వులో ఊది ఉండాదేమో.. ఒకపట్టాన మొనుసులను దెగ్గిరికి రానీడం ల్యా ఈ నాసినం పెట్ట.  అయినా మన బంగారం మంచిదైతే వగర్ని అని ఏం లాబం? ముందు మా ముండమోపి అవ్వను అనాల.

అసలుకి మనం కోడికూర తినాల అన్న తీర్మానం ముందు రోజే జెయ్యాల. అందురూ సరేననుకున్నాక మనం కోసి కూరొండుకుని తినాలనుకున్న కోడిని బాగా గెవనించుకోవాల. సజ్జలు, రాగులు అన్నీ పెట్టి మాలిమి జేసుకోవాల. అన్ని కోళ్లతో కలిపేసి ఒకే గూట్లోకి తోసేసి మూసెయ్యగూడదు. పొద్దు గూకతానే కోళ్ళ గుంపు ఏదోవక మూలకు వొచ్చి ముడుక్కోని కూసుంటాయి గదా, అప్పుడు మెల్లగా ఎల్లి, మనం తెల్లారినుంచి బాగా మేపి మాలిమి జేసుకున్న కోడిని చటుక్కున పట్టుకోని కడగా, ఏరే గంపకింద మూసిపెట్టాల. తెల్లారి అన్ని కోళ్లతో ఇడిసిపెట్టకుండా, గంప కొంచెం పైకిలేపి, చేతిని దానికింద దూర్చి మెల్లగా ఈ కోడి కాళ్ళు పట్టుకోని బయటకు తియ్యాల. పందిలి గుంజకు కట్టేసి, ఇన్ని వొడ్ల గింజిలు చల్లి, చిప్పలో నీళ్ళు పెట్టాల. అట్టా మాలిమి జేసుకొన్నాక, మనకు కావాల్సినప్పుడు దాని రొండు కాళ్ళు అలాగ్గా పట్టుకోని కట్టు ఇప్పి తొట్టి దెగ్గిర ఏసిన బండమీదకు తీసుకోనెల్లి కోసి కూరొండుకోవాల.

ఇంగా కోళ్లతో కలిసి గూట్లో ఉన్నప్పుడు గూడా పట్టుకోవచ్చు గానీ దానికి శానా చాతుర్యం గావాల. అది చాతుర్యం మా అవ్వకి ఒక్కరికే ఉండాది కుటుంబరం మొత్తానికి.

యాడ, మా అవ్వ పడనిస్తాదా? మొండికెత్తుకునింది. మా నాయిన ఆమికు వంత పాడడం మోదులుపెట్టినాడు.

 “ఆ పెట్ట రొండు రోజుల్లో గుడ్లు పెట్టడానికి వస్తాదిరా. రామలచ్చమ్మోల్ల ఎర్రపుంజు ఎంత తొక్కినా కాలేదుకానీ, మన బెరస పుంజు ఎక్కడానికి మల్లుకున్నాక బూడిద పెట్ట నడక మారింది నువ్వ జూసినావోలేదో. దాని కేకరింతల్లో తేడా వొచ్చిండాది గెవనించినావా? కాబోయే బిడ్డల తల్లిని కోసుకొని కడుపు నింపుకోడం మహా పాతకంరా నాయినా.  అయినా మన కళ్ళముందు పుట్టి పెరిగిన బిడ్డలు, ఎంత ఆడబిడ్డ ఇంటికి వస్తావున్నా ప్రేమగా పెంచుకున్న ఈ బిడ్డలను చేతులారా ఎట్టా మెడ కోసి, సట్టిలో ఉడకబెట్టి కడుపుకు కొట్టుకునేదిరా? నావల్లగాదురా నాయనా, నాకు చేతులు రావు..” అంటా రేత్రి పాడిందే పాటగా పాడతా ఉండిపొయ్యింది.

“మ్మో... నువ్వు జెప్పేది నిజిమే మా. నేను గూడా ఆ పాతకానికి వొడిగట్టలేను.” మా నాయిన ఆమికు పాడిన వొంత ఇది.

రేతిరంతా అమ్మాగొడుకులు ఇద్దురూ ఇదే సంత.

రేత్రి ఆ అమ్మాగొడుకు లిద్దురూ కోళ్ళ మింద, వోటి పేణాల మిందా అంత యావ జూపించగుండా ఉంటే, ఈయాలకు మా పుల్లరెక్కల పెట్ట సచ్చి కూరాకు సట్టిలో తునకలుగా మారి కుతకుతా ఉడకతా వుండేది. అప్పుడీ బాదుండేది గాదు.

ఊళ్ళో కోళ్ళమింద పడింది వోళ్ళ కన్ను. ఇరై రూపాయిలు గాకపోతే యాపై రూపాయిలైనా తగలేసి, ఎవురిదో వగ కోడిని పట్టుకోనొచ్చి ఊరినుంచి వొచ్చే కూతురు అల్లుడికి కూరజేసి పెడదామని ఆలోసన జేసినారు.

తెల్లారి లేసి కొడుకును ఊళ్ళోకి పంపిచ్చి అంతా తిప్పించినాక, ఏరే కోడి దొరకదని అర్తమైంది ముసిలికి.

ఇప్పుడు ప్రేమగా పెంచుకున్న కోళ్ళకంటే, ఆమి పాలుపెరుగు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి మింద ప్రేమ ఎక్కువైంది.

వక్కాకు ఎంగిలి తుపక్కన ఊస్తా పుల్ల రెక్కల పెట్ట సావుకు ముహూర్తం పెట్టింది. ఇప్పుడు తీరిగ్గా చెప్పి సచ్చింది ఈ ముసిల్ది. ఇప్పుడు యాడ సచ్చేది?

కానీ పిలకాయిలం గదా. కోడిని పట్టుకోమనేసరికి కుశాల పెరిగిపొయ్యింది. దానికంటే ముందు ఆ కోడి మా తొట్టి బండ మీద తునకలుగా మారి, సట్టిలోకి చేరి, అనాక మా సత్తు గిన్నిల్లో ఎర్రగా మసాల కూరగా కనిపిచ్చేసరికి నోట్లో నీళ్లూరి ఉషారు ఇంకా ఎక్కవయింది. పోలోమంటా కోడి ఎనకాల పడ్డాం అందురూ.

పందిలెక్కింది కోడి. అమాన ఆన్నించి కంపమీదకు ఎగిరి దూకింది. మళ్ళీ పొట్టి యీతసెట్టు మీద వాలింది. అక్కడే గమ్మునుంటే అది పుల్లరెక్కల కోడేందుకవతాది ? "మీరు మొగోల్లయితే నన్ను పట్టుకొండి నాబట్టల్లారా సూద్దామన్న"ట్టు ఆ రౌడీ కోడిపూరింటి పైకప్పుమిందకెక్కి రెక్కలల్లాడిస్తా "కొక్కొరొక్కో..." అంటా కూతేసి సవాల్జేసింది. ఆన్నించి ఎగిరి కిందుండే నిలువు రోలుమిందకు దూకింది. తిరగలరాయి మిందికి, దానిమీదినుంచి మిరపరాతిమిందికి ఎగిరింది. గస పెడతా ఉండాది కోడి. చుట్టూరా కమ్ముకునేసినాము పిలకాయిలం అందురూ. ఇంగ దొరికింది నాబట్టా కోడి అనుకొనే లోపలే, "క్కొక్కొక్కొ..." మంటా అమాన మిరప రాతిమింద నుంచీ ఒక్క గెంతు గెంతింది. నా తలను గోళ్లతో గీరేస్తా ఆపక్క ఎగిరిదూకి రామలచ్చమ్మోలింట్లోకి పరిగెత్తి, గెడ్డివామి కింద దాక్కునేసింది.

ఇంగ మావల్లగాలా. యాడోళ్ళం ఆడే ఆవు పేడతో పచ్చగా అలికి ముగ్గులేసుండే తలాకిట్లో సతికిలబడి పొయ్యినాము.

అప్పుటిదాకా ఈ బోగాతం జూస్తా నిలబడిన మా అవ్వ. నమలతా ఉండే వక్కాకు తుపక్కన కంప మొదుట్లో వూసింది.

“ఈ మునెమ్మ మనవరాళ్ళు, మనవళ్లు వగ పెట్టను పట్టలేక పొయ్యినారంటే ఊళ్ళో నాకు ఎంత బగిశాట్లు రా. థూ, మీరూ... మీ పిట్ట తిండీ..” ఇదిలించి పారేసింది అవమానంతో.

“చూస్తా ఉండండి, కోడిపెట్టను ఎట్టా పడతానో. చూసి నేర్సుకోండి ఇప్పుడైనా.” ఆర్డర్ ఏసింది మా పిలకాయిల దిక్కు జూసి.

నాకు దెలుసు, ఆ పెట్ట రౌడీ అయితే, మా అవ్వ పహిల్వాను. పరుగులు తీసితీసీ అలుపొఛ్చి మేమంతా సాలించున్నాక, అవ్వ చార్జి తీసుకునింది. కొంగు బొడ్లో ఎగదోపుకునింది. చీరను మోకాళ్లదాకా పైకెత్తి, రెండు కాళ్ళ సందునుంచీ ఎనక్కి తీసుకోనెల్లి నడుం దెగ్గిర కట్టులో గుచ్చుకునింది.

“బొ... బొ... బ్బో... బ్బో... “ నోటితో ఇచిత్రమైన శబ్దం జేస్తా పుల్ల రెక్కల పెట్ట ఎనకాల పడింది అవ్వ.

అప్పటికే యాడ బొయ్యిందో గానీ అయిపు లేయకండా బొయ్యింది కోడిపెట్ట. కనాకస్టం అది గొరిస్తా ఉండే సౌండ్ గూడా ఇనిపిచ్చడం ల్యా.

మా ఇంటికి, రామలచ్చమ్మ వోల్ల ఇంటికి మజ్జ కంప అడ్డంగా కట్టి వుండాము. ఆ అడివి మండల కంప మజ్జిలో రొండు మూడు కొమ్మిచెట్లు, గొంజిచెట్లు కలగలిసి గుంపుగా పెరిగి ఉండాయి. ఉన్నట్టుండి అక్కడ అలికిడి అయింది. ఆకులు కదిలినాయి.

అవ్వ మా తొట్టు జూసి మూతిమింద ఏలుపెట్టుకొని సైగ జేసింది. అంతే, గలాంబులాంగా గొడవజేస్తా ఉండే మా పిలకాయిల నోటికి తాళం పడింది.

అప్పుటి దాకా బొ.. బో.. అని పిలస్తా వుండిన అవ్వ గూడా గమ్మున ఉండిపొయ్యింది. కానీ ఆమి కళ్ళు చూపులు పాదరసం కంటే ఎక్కవగా చుట్టుపక్కలా ఉండే చెత్తాచెదారం, చెట్లు, పొదలు అంతా పారాడతా ఉండాయి. ఎక్కడా అలికిడి ల్యా. కొమ్మిచెట్లు మటుకు ఉండుండి కదలాడతా వుండాయి. అడుగులో అడుగులేసుకుంటా ఆపక్కకి నడిసింది మాయవ్వ. దెగ్గిరికి బొయ్యి సైగ్గా నిలబడింది. అక్కడ కొమ్మిచెట్లు, గొంజి చెట్లేగాదు, బలిజిచెట్లు గూడా వుండాయి. ఈ మూడూ కలగలిసి పెరగతా ఉండాయి. ఒళ్ళంతా ముళ్లతో వుండే బలిజి పొదలో రక్తాలు కారందే బయటకు తియ్యలేం. కానీ అక్కడుండేది మాయవ్వ. వాళ్ళమ్మ తన చిన్నప్పుడు మెట్ట బూముల్లో ఎన్నేసి కంపచెట్లు కొట్టి యవసాయం జేసిందో ఇప్పుటికీ కతలుకతలుగా జెప్తాడు మా నాయిన.

బలిజి పొదముందర మోకాళ్ళ మింద చేతులు ఆనించి వొంగి నిలబడింది మాయవ్వ. ఆమి సూపులు సురుగ్గా పొద లోపలికి దూరినాయి. పిలకాయిలం జూస్తానే ఉండాం. ఎప్పుడు జరిగిందోగానీ, కంప సందుల్లో దూరుకోనుండే పుంజును ఒడుపుగా పట్టి సంకలో ఏసుకొని సిద్విలాసంగా నవ్వతా మా దెగ్గిరికి వొచ్చి నిలబడింది మాయవ్వ.

మాతోబాటు బిగబట్టుకోనుండే ఊపిరిని అప్పుడు వొదిలినాడు మా నాయిన. “ఆబ్బా... దొరికిందిరా నాయాలి కోడి.” అంటా మాతోబాటు ఎగిరి చప్పట్లు గొట్టినాడు. "ర్రే... కన్నప్ప యాడన్నా ఉంటే పిల్సుకోని రాబో..." చెప్పినాడు అదే ఊపన.

అవ్వకు దప్ప మా ఇంట్లో ఎవురికీ కోణ్ణి గోసేదానికి రాదు. దాని పొట్టలో ఏందో "పిచ్చు" అనేదుంటాదంట. ఎట్టబడితే అట్ట కోసేస్తే, అది నలిగిపొయ్యి కూరంతా చేదు గొడతాదంట. అవ్వ కమ్మగా కూరొండి పెడతాదికానీ, బిడ్డ మాదిర్తో పెంచుకున్న కోడిని చూస్తాచూస్తా కొయ్యలేనని ఎనక్కి తగ్గతాది. ఇంగ పని జరగాలంటే కన్నప్ప ఒక్కడే దిక్కు.

రామ్మందిరం, ఇనాయకుడి గుడి, అంగట్రాజమ్మిల్లు, చెంగాళరెడ్డెమ్మ అంగిడి... అన్నీ ఎతికేసినా. కడాకి రోడ్డుమింద గంగిరేణి సెట్టుకింద ఊలోల్లు తాగి పారేసిన ముక్క బీడీలు ఏరుకుంటా కనిపిఛ్చినాడు కన్నప్ప. మాసిపోయిన పొట్టి పచ్చ చెడ్డీ, దానిపైకొచ్చి నడుం దెగ్గిర వొదులుగా ఏలాడతావుండే ఎర్ర మొలతాడు, మెళ్ళో తెల్లగా సత్తు కంటి, టెంకాయ పీచు ఎంటికలు, ముందరికి పొడుసుకోనొచ్చిన పొట్ట, కుడిసేతిలో ఎదురుకట్టి...  బూమికి మూడున్నర అడుగులెత్తులో పిట్ట మాదిర్తో ఉండాడు కన్నప్ప. బుజంమింద మాసిపొయ్యిన ఎర్ర తుండుగుడ్డ ఏసినాడు.

"కోడిని గొయ్యాల కన్నప్పా, నాయిన ఇంటికి పిల్సుకోని రమ్మన్నాడు." ఇంగా చెప్తానే ఉండాను... “కోడిని గోస్తా వుండారా? ఊర్నించి అత్తోళ్ళుగానీ వొచ్చినారా?” అడిగినాడు. ఆయన్న మొగం ఎలిగిపోతా వుండాది నా మాట యినంగానే.

“ఇంగా రాలేదు కన్నప్పా. మజ్జానానికి వొస్తారంట. కోడికూర జేస్తావుండాము.” చెప్తావుండే నాకేగాదు, కన్నప్ప నోట్లో గూడా నీళ్ళూరతా వుండాయేమో, బుజంమింద తుండుగుడ్డ చేతల్లోకి తీసుకొని గెట్టిగా మూతి తుడుసుకున్నాడు. కోడిగోసినాక నాయినిచ్చే కోడికాల్లు, తలకాయను తల్సుకోని గావాల... నోరు చప్పరించినాడు. జొల్లుతో తడిసిపొయ్యిన బీడీముక్క నోట్లోనుంచి తీసి, పక్కనే వుండే సెట్టుకొమ్మకు రుద్ది ఆర్పి, ఎడమ చెవ్వు ఎనకాల దోపినాడు.

"పదబయా పోదాం..." ఎదురుకట్టి భూమికి పొడుసుకుంటా బైల్దేరినాడు ఆత్రంగా.

అంత పొట్టిగా ఉంటాడా. నడక గాదు, అది పరుగే. గబగబా నడస్తా ఎల్లిపోతావుండే కన్నప్పను కలుసుకోడానికి ఒగురుస్తూ లగెత్తినాను.

“వొచ్చినావారా కన్నప్పా. అమ్మోళ్లు వొచ్చే యాలవతా ఉండాది. ఇంకో గెంటలో కాలాస్త్రినించీ వొచ్చే అద్దాలబస్సు మిట్టకండ్రిక్కి ఎల్తాది. దాంట్లోనే దిగాల దిగితే సిన్నమ్మోళ్లు. అదిగో అక్కడ పందిలి గుంజకు కట్టేసుండాది కోడి. గబగబా పని కానియ్యాల, ఫో..” ఆయన్నను జూస్తానే ఆత్రంగా పురమాయించినాడు నాయిన.

“ఎంతసేపబయా, సిటికిలో కోసి సట్టిలో ఏసెయ్యనా..” అంటా

గుంజకు కట్టేసుండే కోణ్ణి ఎడం సేత్తో పట్టుకోని పెళ్ళో తొట్టి దెగ్గిరికెల్లినాడు కన్నప్ప. ఎడం కాలికింద కోడి కాళ్ళను అదిమిపెట్టుకున్నాడు. నన్ను దాని తలకాయ పట్టుకోమని జెప్పి, కొంచిం దూరంగా రొండో పక్క ఆయన పట్టుకొన్నాడు. అమ్మిచ్చిన చూరుకత్తి మా రొండు చేతుల మజ్జలో మిగిలిన కోడి మెడకాయమింద పెట్టి పరపరా కోసినాడు. సిలుం బట్టిన కత్తిగదా ఒగ పట్టాన తెగలేదు.

తనకలాడతా ఉండాది కోడి. రెక్కలు టపాటపా కొట్టుకొంటా ఉండాది. చెప్పబల్లా.. అంతదాకా కోడికూరకోసరం నోట్లో జొల్లు   కార్సుకొంటా దాని ఎంతబడిన నాకే ఏడుపు వస్తాఉండాది. తల ఈపక్కకు దిప్పేసినాను.

ఇంగ మాయవ్వ కత జెప్పాలా. సజ్జలు రాగులు బెట్టి ముదిగారంగా పెంచుకోనొచ్చిన కోడి సావు తనకలాట జూస్తా, తెల్ల దాసాని చెట్టుకింద గూసోని కన్నీళ్ళు ఇడస్తా ఉండాది. “ఒరే కన్నప్పా , కొంచిం సిన్నగా బాద తగలకుండా కొయ్యిరా.. అసలే గుడ్డుకొస్తావుండే కోడిరా.. అది తట్టుకోలేదు.” పిచ్చిగా మాట్లాడతా ఉండాది.

ఎట్టయితే ఏంది... మెడ తెగి కోడి చచ్చింది. దాని బొచ్చు పీకడానికి, పసుప్పొడి ఒల్లంతా రాసి, కోసి తునకలు కొట్టడానికి అరగంట పైన్నే బట్టింది కన్నప్పకు. నేను కూడానే ఉండి సాయిం జెయ్యికపొతే గంటన్నా బట్టున్ను నిజింగా.

అంతా అయినాక... నాయిన దానం జేసిన కోడి కాల్లు, తలకాయ ఎడం సెయ్యి పిడికిలి బిగించి గెట్టిగా పట్టుకొన్నాడు కన్నప్ప. కోణ్ణి గోసినందుకు నాయినిచ్చిన రొండ్రుపాయిల బిళ్ళ చెడ్డీ పక్క జోబులో ఏసుకున్నాడు.

"పొయ్యొస్తా సామీ, గంగిరేని సెట్టుకాడే ఉంటాను. మునెమ్మ గట్టిచ్చిన ఇనాయకుడి గుడి కాడే పొనుకుంటాను. ఎప్పుడు గావాలంటే అప్పుడు పిలవనంపండి, లగెత్తుకోనొచ్చేస్తా..”

 

గారబట్టిన ఎలిక పొల్లు బయటబెట్టి ఇశాలంగా ఇకిలిస్తా ఈదిలోకి నడిసినాడు కన్నప్ప.

“మాపటికి గిన్నెనెత్తుకోని రారా. ఇన్ని మెతుకులేసి ఇంత కోడి కూరాకు పెడతా.” ఎనకనుంచి అరిచి చెప్పింది మాయవ్వ.

ఆ రాత్రికి వొచ్చి కోడికూర, అన్నం పెట్టిచ్చుకుని వెళ్ళిన కన్నప్ప  మల్లెప్పుడూ మా ఇంటికి రాలా.

----------------

“చెప్పు నాన్నా. కన్నప్ప ఏమైపోయాడు?” నా పదేళ్ళ కూతురు భుజం పట్టుకుని ఊపేస్తా అడిగింది.

నా తొమ్మిదేళ్ల కొడుకు ఎగరడం ఆపి నా దిక్కే చూస్తా ఉండాడు.

ఏం చెప్పేది? ఇది కథ కాదు, ఏదో ఒక ట్విస్ట్ పెట్టి చెప్పేదానికి. ఉన్న విషయం చెబితే చప్పగా ఉంటాది.

అందుకే, “పదండి టైమయింది, బువ్వ తిందాం.” చెప్పి పైకి లేచాను.

వాళ్ళ అమ్మ సెల్ కు ఎవరో తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో మొబైల్ తీసుకుని మాటల్లో పడింది నా కూతురు.

ఆపేసిన ఆటలు మళ్ళీ మొదలుపెట్టాడు నా కొడుకు.

కన్నప్ప మళ్ళీ మనసులో మెదిలాడు. ఆయన్న కులమేందో నాకిప్పటికీ తెలీదు. ఊరందరికీ కోళ్ళు కోసిపెట్టి వాళ్లిచ్చే తృణమో ఫణమో తీసుకుని పొట్టపోసుకునే వృత్తి ఆయన్నది. ఏ ఇంట్లోనూ కోడి తెగనప్పుడు ఇల్లిల్లూ బిచ్చమెత్తి కడుపు నింపుకునేవాడు.

అటుమంటి కన్నప్ప, తెల్లారి ఊరి చెరువులో శవమై తేలాడు. గట్టుమీద సత్తుగిన్నిలో సగం తిని వదిలేసిన కోడికూర. ఆపక్కనే దొర్లుతున్న కల్లు సీసా.

ఊరు ఎందుకు ఏడుస్తుంది..?

ఏడవలేదు.

కన్నప్ప పేణం కోడిపాటి ఇలవకూడా కాకపాయెనే.. ఊరోల్ల మాటలు ఇంటా నాకు గుండెకాయి కలుక్కమనింది.

పైగా.. “ఊరోళ్ళు పెట్టింది దొబ్బితిని, తినింది అరక్క తాగి చచ్చినాడు పుండాకోర్..”  దీవెనలు కురిపించింది.

నిజమేనా.. కడుపుకింత కూడు ఉంటే చాలా..!

మనిషికి ఇంకేమీ అక్కరలేదా..!
--------------------------------------------------------

("ఆంధ్రజ్యోతి" దినపత్రిక ఆదివారం అనుబంధంలో (18.05.2025) ప్రచురితం)

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

తాగని టీ

పువ్వాకు ఎంగిలి