యోగా అంటే..!

 శరీరాన్ని నాలుగైదు వంకరలు తిప్పేసి, ముక్కు మూసుకుని శ్వాస ఎగాదిగా పీల్చేసి, మ్యాట్ సర్దుకుని చంకన ఇరికింఛుకుని చక్కా ఎక్కడివారక్కడ వెళ్లిపోవడం యోగా కాదు. అదే యోగా అయితే.. నిత్య జీవన వ్యవహారాలలో అష్టావధానం చేసుకుంటూ  రోజువారీ విధులు నిర్వహిస్తున్న అందరూ యోగా గురువులే అయిపోతారు.  

మరి యోగా అంటే ఏమిటి? యోగా అనేది సంపూర్ణ జీవన విధానం. అనూచానంగా తరతరాలుగా పరంపరగా వస్తున్న మనదైన.. భారత జాతికే సొంతమైన సంస్కృతీ సంప్రదాయాలు అందించిన ఆనంద తీరమది.

మానవుడికి అసలేం కావాలి? ఏది ఉంటే అతడికి తృప్తి లభిస్తుంది? పూర్వం ఏమోకానీ, అనేకమైన మానసిక ఒత్తిడులు ఇప్పుడు మానవ సమాజాన్ని చుట్టుముట్టాయి. ఆరోగ్యాలు మననుంచి దూరమైపోయాయి. కార్పొరేట్ వైద్యశాలలు మనపేరు చెప్పుకోకుండానే వ్యాపారాలు చేస్తూ కాసులు లెక్కకు మిక్కిలిగా గడిస్తున్నాయి.సంతృప్తి.. అసహనం.. ఎవరినీ నిందించలేని అసహాయత. మానవ జీవితంలో ఇవి లేని క్షణం లేదు. ఇదిగో.. ఇటువంటి దుర్భర క్షణాలను ఇట్టే కరిగించేసి...  సంపూర్ణ ఆయురారోగ్యాలతో అనంతమైన ఆనందాన్ని ప్రసాదించేది యోగం.. అంటే  నేటి పరిభాషలో యోగా.

అస్థిరమైన మనసు చంచలమై, అలవికాని కోరికలకు ఆలవాలమై, అవి అందనప్పుడు... మానసిక ఒత్తిడులు, శారీరక రుగ్మతలు మానవుడిని తమ వశం చేసుకుంటాయి. అది జరిగినప్పుడు దుఖం అనివార్యమై  జీవనం దుర్భరమవుతుంది. మనో వాక్కాయ కర్మలను ఏకం చేసినప్పుడు... అంటే మనసు, మాట, చేసే  పనిమీద లగ్నమైనప్పుడు  విజయం సిద్ధిస్తుంది. అలా సిద్ధించిన విజయం... మానసిక్ ఉల్లాసాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇలా ప్రసాదితమైన ఉల్లాస, ఆరోగ్యాలు మరో విజయానికి బాటలు వేస్తాయి. ఈ పరిణామమంతా మొదలైంది ఎక్కడో గమనించారా.. మనో వాక్కాయ కర్మలను ఏకం చేసినప్పుడే. అదిగో.. ఈ ఏకం చేసే కార్యాన్ని యోగ ధ్యానాదులు మనలో నిర్వర్తిస్తాయి.

మనవైన సంస్కృతీ సంప్రదాయాలు నిజంగానే ఘనమైనవి. విమానాలు మనమే తయారు చేశాం... క్యాన్సరు మహమ్మారికి మనమే మందు కనిపెట్టాం.. అంటూ శోధనకు నిలబడని అతిశయోక్తులను పక్కనపెడితే- అత్యంత ప్రభావపూర్ణమైన యోగ ధ్యానాలను ప్రసాదించాయి మన సంస్కృతీ సంప్రదాయాలు. వాటిని జీవన విధానాలుగా పాటిస్తూ వచ్చాయి తరాలకు తరాలు. మన ప్రాచీన సంస్కృతిలో యోగ ధ్యానాలు  అంతర్భాగాలు. 

మనకు నిత్య పఠనీయ గ్రంథమైన భగవద్గీత ప్రవనం ఏమిటంటే... యోగా అనేది కేవలం శారీరక ఆసనాలు మాత్రమే కాదు. అది కర్మ యోగం (నిష్కామ కర్మ), జ్ఞాన యోగం (ఆత్మ జ్ఞానం), భక్తి యోగం  (మనసును నియంత్రించగలగడం) అనే త్రి మార్గాలను సూచిస్తుంది. 

యదా హినేన్ద్రియార్థేషు న కర్మస్వనుజ్జతే
సర్వసజ్కల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే

అంటే పంచేంద్రియాలు అందించే భౌతిక విషయ లోలతను, చేసే కర్మ (పని)లోనూ ఆసక్తిని వదిలిపెట్టి కోరికలను ఎవరైతే త్యజిస్తాడో, అప్పుడు యోగంతో మనిషి ఉన్నత స్థాయికి చేరుకుంటాడట- ఆధ్యాత్మిక.. భౌతిక మార్గంలో కూడా.

ఇక్కడ ఆసక్తిని వదిలిపెట్టడమంటే మన ప్రయత్నం ఏమాత్రం చేయకుండా గాలిలో దీపం పెట్టి 'దేవుడా నీవే దిక్కు' అని ఊరుకోవడం కాదు. చేసేపనిపట్ల చిత్తశుద్ధి కనబరచాలి. విజయంకోసమే చివరిదాకా తపించాలి. కానీ అంతిమ ఫలితం గురించి ఆలోచించకూడదు. అప్పుడే గెలుపోటములను నిమిత్తమాత్రంగా తీసుకోగలిగే స్థితప్రజ్ఞత అలవడుతుంది. మళ్ళీ కర్మ పట్ల మనసును లగ్నం చేయడానికి ఈ నిమిత్తమాత్రత ఉపయోగిస్తుంది. యోగ ధ్యానాలు ఇటువంటి ఉన్నత స్థితిని మనకు కల్పిస్తాయి. వీటివల్ల మనసుకు శాంతించి, ఆవేశ ఉద్వేగాలు అదుపులోకి వస్తాయి. మానసిక్ ఒత్తిడులు దూరమై, రుగ్మతలు మాయమై సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడం సాధ్యమవుతుంది. 

భారత ప్రధాని మోదీనో లేదా మరొకరో యోగా గురించి చెబితే ఏదో మొక్కుబడిగా పాటించడం కాదు... ప్రాచీన భారతంలో యోగం అంటే యోగాకు ఎంతో చరిత్ర ఉంది. క్రీస్త్తు పూర్వం 2వ శతాబ్దికి చెందిన పతంజలి యోగి "యోగ సూత్రాలు" అనే గ్రంథమే రాశారు. "పతంజలి యోగ సూత్రాలు" పేరుతో ప్రసిద్ధమైన ఈ గ్రంథమే యోగాకు మూల గ్రంథం అని చెప్పవచ్చు. ఇందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ సూత్రాలను ఆయన వివరించారు. ఆధునిక యోగాకు ఈ "పతంజలి యోగ సూత్రాలు" గ్రంథమే మూలాధారం. 

పతంజలి యోగి తన అష్టాంగ యోగ సూత్రాల ద్వారా మాట, మనసు, దేహం.. మూడింటి దోషాలను పరిహరించి, మానవుడు ఆనందంగా ఉండే మార్గాన్ని నిర్మించాడు. ఆ మార్గంలో నడవడమొక్కటే మనముందున్న లక్ష్యం కావాలి. అప్పుడే  సంపూర్ణ ఆయురారోగ్య ఆనంద తీరాలకు చేరగలం. తద్వారా ఆరోగ్య సమాజ నిర్మాణం చేయగలం.

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

తాగని టీ

పువ్వాకు ఎంగిలి