ఎక్కడుంది లోపం!

స్వేచ్ఛ... న్యాయ విద్యార్థి... లక్ష్మీదేవి...
ఒకరు ప్రముఖ టీవీ యాంకర్
వేరొకరు న్యాయ విద్యార్థిని
ఇంకొకరు  గృహిణి.

నేపథ్యాలు వేరైనా ముగ్గురూ ఆగమైపోయారు. సమాజం సాగించిన దారుణ వేటకు బలైపోయారు.

👉 స్వేచ్చ

స్వేచ్ఛ వోటార్కర్ (40) న్యూస్ రీడర్, ప్రజెంటర్, యాంకర్ మరియు డిజిటల్ కంటెంట్ క్రియేటర్. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేయగా, తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పని చేస్తున్నారు. స్వేచ్ఛ ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్‌గా కూడా ఎన్నికయ్యారు.

ఈ నేపథ్యంలో ఏ ఒక్కటీ ఆమె మరణాన్ని అడ్డుకోలేకపోయాయి. 2025 జూన్ 27న తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు సిటీ చిక్కడపల్లి ఠాణా పరిధిలోని జవహర్‌నగర్‌లోని ఒక పెంట్ హౌస్ లో 14 ఏళ్ల కూతురితో ఒంటరిగా నివాసముంటున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యానుకు లుంగీతో వేసిన ఉరికి వేలాడుతూ కనిపించారు.

👉 న్యాయ విద్యార్థిని

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతాలోని సౌత్ కలకత్తాలోని లా కళాశాలలో న్యాయశాస్త్రం మొదటి సంవత్సరం చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని. జూన్ 27, 2025 సాయంత్రం జరిగిన ఒక విద్యార్థి సంఘం సమావేశం అనంతరం రాత్రి ఇంటికి పయనమైన సమయంలో దారుణంగా గ్యాంగ్ రేప్ కు గురయ్యారు. ప్రేమించని పాపానికి అదే కళాశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం ఆ కళాశాల ఉద్యోగి అయిన ఒకడు, మరో ఇద్దరు సహచరులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.  చదువుకుంటున్న న్యాయశాస్త్రం, కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయ దేవత కూడా ఆమెను కాపాడలేకపోయాయి.

👉 బోయ లక్ష్మీదేవి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాగూరు గ్రామంలో జూన్ 27, 2025 రాత్రి భర్త బోయ హనుమంతు చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఎదిగిన ఇద్దరు కొడుకులున్న 45 ఏళ్ళ ఈ గృహిణిపై ఆ భర్తకు అనుమానమట. రాత్రి అందరూ కలిసి భోజనం చేశాక కొడుకులు ఇద్దరు ఒక గదిలో, భార్యాభర్తలు ఇద్దరూ మరో గదిలో నిద్రించారు. నడిరాత్రి బోయ హనుమంతు కట్టితో భార్య తలపై పదేపదే మోది కిరాతకంగా అంతమొందించాడు.
ఈ ముగ్గురు మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉంది. తగినంత స్వేచ్ఛ కూడా. అయినా... దారుణాలు ఆగలేదు.
మనం సాధించేశాం అనుకుంటున్న మహిళా సాధికారత ఎక్కడ?

అసలటువంటిది ఒకటున్నదా...
లేక అదొక దిష్టిబొమ్మేనా!

ఎక్కడుంది లోపం...!!
ఏ అథాలోకాలకీ వ్యవస్థ పతనం...!?

ముని ✍️

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

తాగని టీ

పువ్వాకు ఎంగిలి