వానమబ్బు

 “ఏమండీ... ముఖానికా పేపరు కాస్త అడ్డం తీస్తారా’’ అంటూ పొగలు కక్కుతున్న కాఫీతో దర్శనమిచ్చింది శ్రీమతి. కప్పు అందుకోబోతుండగా పై వాటా ఖాళీ అయ్యి ఇప్పటికే నెలన్నర పైగా అవుతోంది. దాన్ని రెంటుకిచ్చేదేమైనా ఉందా లేదా?’’ అంటూ మొదలు పెట్టింది

  

నీకు తెలియనిదేముంది సృజనా. రోజూ పేపర్లో, టీవీలో చూస్తూనే ఉన్నావు కదా కరోనా ఎంత తీవ్రంగా ఉందో. మన కుప్పంలో కూడా ప్రతి రోజూ కేసులు వందకు తగ్గడంలేదు. ఈ పరిస్థితుల్లో వేరే ఎవరినో అద్దెకు తెచ్చి పెట్టుకుని, మనందరి ప్రాణాలను ప్రమాదంలో పడేయమంటావా. ఇళ్లను అద్దెకివ్వడం కాదుకదా... చాలామంది ఓనర్లు, అద్దెకున్న వాళ్ళను ఇప్పటికే ఖాళీ చేయించేశారు.”

 

ఇంటిమీదున్న లోను, నెలనెలా కట్టాల్సిన చీటీలు, ఎల్లైసీ ప్రీమియంలువీటి సంగతేమిటి మరి

  

నిజమేననుకో. ఇట్లాంటి కాలం వస్తుందని కలలోనైనా అనుకున్నామా? ప్రాణాలు నిలుపుకోవడం ముఖ్యం కదానా వాదనకు తల ఒగ్గిందో లేదో గానీ ఖాళీ కప్పు తీసుకుని వంటగదిలోకి నడిచింది. హమ్మయ్య, ఇప్పటికైతే తప్పింది అనుకుంటూ ఉండగా, “సార్...” అంటూ బయటనుంచి వినిపించింది.

 

ఒక యువ జంట గేటుకావల నిలబడి ఉంది.

  

సృజనా... ఆ మాస్కు ఇలా తీసుకు రా...’’ అంటూ లేచి నిలబడ్డాను వాళ్ళు గేటు తీసుకుని ఎక్కడ వచ్చేస్తారోనన్న ఆందోళనతో.

 

అంతతదాకా మెడకు వేలాడుతున్న మాస్కులను మూతులమీదకు గబగబా లాగేసుకుంటూఇల్లు అద్దెకుందని తెలిసి వచ్చాం సార్అంది అమ్మాయి.

 

హబ్బే... లేదు.” అని నా గొంతులో మాట బయకు రాకముందేఉందుంది... రండిఅంటూ ఊడిపడింది సృజన.

  

పైవాటా చూపించి రండి’’మరోమాటకు అవకాశం ఇవ్వకుండా తాళాలు నా చేతిలో పెట్టింది. నాకు మాత్రమే అర్థమయ్యేలా కళ్ళలో లాలన రంగరించి విసిరింది. గ్రిల్ గేటు ఓపెన్ చేస్తూ ఎవరన్నట్లుగా చూశాను వాళ్లవైపు.

   మాది గుడుపల్లె మండలం సంగనపల్లె సార్. ఇక్కడ కుప్పం దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఫ్యాక్టరీలో ఆయన సూపర్వైజర్. నైట్ షిఫ్టులప్పుడు అక్కడినుంచీ వచ్చి పోవాలంటే ఏనుగుల భయం. అందుకే టౌన్లో కాపురం ఉందామనుకుంటా ఉందాం.’’ అని వివరణ ఇచ్చింది ఆ అమ్మాయి.

  

అవున్సార్’’ ముక్తాయించాడు అబ్బాయి.

  

ఎంతమంది ఉంటారు ?’’

 

మేమిద్దరమే సార్’’ ఠపీమని వచ్చింది ఆ పిల్లనుంచి సమాధానం.

 

వెంటనే మా ఆవిడ అందుకుంది, ఇంకెవరూ లేరు కదా... మనుషుల్ని వదిలేసుకోమనేంత కర్కోటకులం కాదుకానీ, కాలాలు ఆలా ఉన్నాయిపుడు. ఎవరికి పాజిటివో, ఎవరికి నెగెటివో అర్థం కావడంలేదు.’’ ఈసారి కూడా వచ్చిన వారిని ఏదో సాకు చెప్పి ఎక్కడ తరిమెస్తానో అనే తాపత్రయం ఆమెది.

  

ఊహూ...’’ తలలు అడ్డంగా తెగ ఊపేశారు ఇద్ధరూ.

  

ఇక చేసేదేముంది. ఇల్లు చూపించక తప్పదని అర్థమైపోయింది.

  

రెంటెంత సార్ ?’’

  

చెప్పాను... అద్దెతోపాటు, అడ్వాన్సు కూడా బాగా పెంచేసి చెప్పాను. అలాగైనా ఇల్లు వద్దని వెళ్లిపోతారేమోనని, నా పాచిక.

  

సరే సార్. రేపే వచ్చి చేరిపోతాం’’ అంటూ మరో అవకాశం ఇవ్వకుండా, అడ్వాన్సు ఫోన్ పే చేసేశారు.

       

పాపం రెంటు, అడ్వాన్సు మరీ ఎక్కువ చెప్పారేమోనండీ...’’ అంది మా ఆవిడ వాళ్లలా దిగి వెళ్లగానే. ఇష్టంలేకుండా ఇల్లు ఇచ్చిన చిరాకులో ఉన్నాను నేను. ఆ చిరాకును ప్రకటిస్తే ఇక యుద్ధం మొదలవుతుంది. తప్పించుకోవడానికి బయటకు వెళ్ళే వీలు కూడా లేదాయే, కరోనా వల్ల.

  

అమ్మాయి ముస్లిం, అబ్బాయి హిందూ. మతాంతర వివాహమట. అబ్బాయి లోకలే కానీ, అమ్మాయిది మాత్రం అనంతపురమట. ఇతనక్కడ ఏదో పని చేస్తున్న సమయంలో  వారిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం, ప్రేమగా మారి,  చేసుకున్నారట. ఇదంతా పై వాటాలో వాళ్ళు హడావిడిగా అద్దెకు దిగిన రెండో రోజుకు గానీ తెలియలేదు. అసలే పరువు హత్యలు జరుగుతున్న దుర్మార్గపు కాలం. అందునా మతాంతర పెళ్లి. ఇల్లిచ్చి చిక్కుల్లో పడ్డామా అని దిగులు మొదలైంది. అయితే వీళ్ళు పెళ్లి చేసుకుని కాపురం పెట్టి ఏడాదిన్నర పైగా  అవుతున్నదట. అమ్మాయి తరఫు నుంచీ ఇంతదాకా ఏ ప్రాబ్లమూ రాలేదట. అమ్మాయికే... అత్తారింట్లో పడక వేరు కాపురం పెట్టారట అని విచారించి కనుక్కాకనేహమ్మయ్యఅని ఊపిరి పీల్చుకున్నాం.

 

#                                      #                                      #

 

అవునా, ఎప్పుడు జరిగింది ?”

 

తిరప్తిలో నా. ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఈ తెల్లారి.”

 

బాడీ ఇస్తారా?”

 

ఏ విషయం తెలీదింకా.”

 

అయినా బాడీని ఇవ్వరనుకుంటాలే. అయితే చిన్నమ్మ, ఇద్దరు పిలకాయలూ ఎక్కడుండారు?’’

 

చిత్తూర్లోనే ఇంట్లోనే ఉండారు. పిలకాయలిద్దరికీ పాజిటివేనంట. వెంకట చిన్నాయనొక్కడే తిరప్తికి బొయ్యి ఆస్పత్రిలో జేరిపోయినాడంట. తికమక అవతా ఉండాని తెలిసి పోయినట్టుండాది. ఆక్సీజెన్ లెవల్స్ బాగా పడిపొయ్యిందంట. తెల్లరేకొందికి ఇట్టా జరిగిపొయ్యింది.వెళ్ళి హాస్పిటల్లో చేరినాడు. రాత్రి ఫోనొచ్చిందంట- ఆక్సిజన్ లెవల్స్ యాభైకన్నా కిందికి పడిపొయ్యాయి, పల్స్ కూడా అందడం లేదని. తెల్లారేసరికి ఇలా జరిగి పొయ్యింది.’’

 

అవునాఆ తర్వాత మాట సాగలేదు.

 

ఉమ్మదంగా ఉంది. వాతావరణం. పోద్దెక్కినా ఎండ పొడ వరండాలోకి పడడంలేదు. దట్టంగా మబ్బులు పట్టి ఉంది ఆకాశం.

 

ఎంత పొడి మాటలు... చనిపోయిన వ్యక్తి మాకేమీ కానట్టు. ఎంత తేలిగ్గా... ఇలా ఎలా ? గుండె ఏమాత్రం తడి దేరకుండా... కను కొలుకుల్లో ఒక్కటంటే ఒఖ్ఖ నీటి చుక్క నిలువకుండా...

అటువైపునుంచి చెబుతోంది... ఇటువైపునుంచి వింటోంది ఆమెకు సొంత అక్క, చెల్లెళ్ల కొడుకులం. ఆత్మీయుల చావుల్లాంటి విషాద సందర్భాలకు వల్లకాట్లకు చేరి, ఒకరి భుజంపై ఒకరు తల వాల్చి దు:ఖ భారం దించుకునే వాళ్ళం. పెళ్ళిపేరంటాళ్ళ లాంటి శుభ కార్యాలకు పొలోమంటూ హాజరైపోయి సంబరాలు చేసుకునే వాళ్ళంఇప్పుడెందుకింత దూ... రం... గా... పరాయిగా  మిగిలిపోయాం ?

       

పేరుకే చిన్నమ్మ. అమ్మకన్నా మిన్నగానే నన్ను చూసుకునేది. స్నానం చేయించి లాలించి గోరు ముద్దలు పెట్టడం నుంచీ, ఆఖరికి ముడ్డి కడగడందాకా అన్నీ తానే. నేను ఇంజినీరింగ్ చేసి రిమీద పడి బలాదూరుగా తిరిగేస్తుంటే ఈ చిన్నమ్మ వెంటబడడంతోనే మండలాఫీసులో నేనిపుడు చేస్తున్న ఉద్యోగం నాకు మా చిన్నాయన చూసిపెట్టింది. నా పెళ్లి చేసిందీ వాళ్ళిద్దరే. ఇప్పుడేం చేయాలి? కుప్పం నుంచి బయలుదేరి చిత్తూరుకు వెళ్ళడం... ఇటువంటి పరిస్థితుల్లో!

 

వందల కేసులు, పదుల మరణాలు... రోజూ ఇవే లెక్కలు. వెళ్ళడం రిస్క్. మరి వెళ్లకపోవడం? తిరుపతిలో చనిపోయిన చిన్నాయన్ని చిత్తూరుకు తెచ్చేది ఉండదు. అందరూ ఉండి చిన్నాయన తిరుపతి శ్మశానంలో దిక్కులేని శవంగా తగలబడి పోవాల్సిందేనా? పోనీ చిత్తూరు పకరింపులకు పోదామన్నా, వాళ్ళేమో  పాజిటివ్. ఇంట్లో భార్యా బిడ్డల్ని పెట్టుకుని వెళ్ళిరావడం... అంత ధైర్యం చేయాలనా? ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉన్నాయి. ఫ్యాను తిరుగుతూనే ఉన్నా ఉక్కపోత భరించరానంతగా ఉంది. నాలుగు చినుకులన్నా రాలితే బావుణ్ణు.

 

హలో... హలో... యినపడతా ఉందా నా...”

 

ఇంటావుండాన్లే చెప్పు రా... ఇప్పుడేం చేద్దామంటావు?”

 

ఎవురు మాత్రం ఏం చేయగలం నా... కదిలే పరిస్థితి ఉందాదా? నేనూ ఇంట్లోనే ఉండా.”

 

అవున్లే మమెవరేం చేయగలంలే...”

 

సరే నా ఉంటా...”

 

ఎంత క్రూరమైన పదాలుఆత్మీయుల చావు కబురు ఓ పక్క వింటూ... మరో పక్క ఊరట చెందడమేమిటి? ఎంత అమానవీయమైన అసందర్భమిది? ఎంతటి హేయమైన అనుభూతులివి? నిజానికి ఇటువంటి సందర్భంలో పడాల్సింది బాధ కదా... గుండె గోడలకు అంటాల్సింది వదిలించుకోలేని దిగులు చిత్తడి కదాలోపలినుంచి అమ్మ ఏడుస్తోంది.

 

ఎవరి చావుకు వారిని వదిలేసే ఇంట బండ తనం మనిషికి ఎట్లా వచ్చిందో! పరాయీకరణ మనిషిలోపలికి కొత్తగా జొరబడిందాదాగివున్నదే బయట పడిందా? కనిపించని వైరస్ ఎంత చేసిందీ! దినపత్రిక క్రైమ్ కాలంలోగుర్తు తెలియని వ్యక్తి దుర్మరణంఅని వార్త చదివినంత తేలిగ్గా అయినవారి మరణాన్ని ఎలా తీసుకోగలిగాము? మూడునాలుగు రోజులు అస్థిమితంగానే గడిచాయి.

 

మబ్బులు తరుముకుని వస్తాయి గానీ, వాన కురవదు... ఎండ కాయదు... గాలి తోలదు. ఎక్కువ కాలం చల్లగానే ఉండే కుప్పంలో ఈ రెండు నెలలూ వాతావరణం చిరాకు పెడుతూ ఉంటుంది.

 

అంకుల్ ...’’ వరండాలోంచి వినిపించిన ఆ గొంతులో ఆందోళన ధ్వనించింది.

 

హాల్లో కుర్చీలో కూర్చుని చేతిలో పేపరు పట్టుకొని పరధ్యానంలోకి జారుకున్న నేను, ఉలిక్కిపడి చూశాను. పై వాటాలో అద్దెకు దిగిన అమ్మాయి.

ఏమ్మా... ’’ అసంకల్పితంగానే చిరాకు ఉట్టిపడింది నా గొంతులో.

 

ఆయనకు ఆరోగ్యం బాగా లేదంకుల్, మొన్న ఉదయంనుంచీ ఒకటే దగ్గు. నిన్న ఉదయం టెస్టు చేస్తే ఇప్పుడు మెసేజ్ వచ్చింది పాజిటివని...”  ఆ అమ్మాయి గొంతునిండా భయం.

తెలియకుండానే ఆ భయం నాలోనికీ జొరబడింది. మాట రాలేదు. ఆమె వైపు చూస్తూ ఉండిపోయాను.

 

రాత్రినుంచీ ఊపేరి కూడా సరిగా తీసుకోలేక ఆయాస పడుతున్నారు...’’ అణచిపెట్టుకున్న దు:ఖం బయట పడడానికి సిద్ధంగా ఉంది. తెలియకుండానే సన్నని వణుకు మొదలైంది నాలో.

 

నాకు నెగెటివే అంకుల్...” నా ముఖంలో మారుతున్న భావాలను గమనించి ఖంగారుగా చెప్పింది.

 

అనుకున్నంతా అయింది. భయపడిండే జరిగింది. ఇప్పుడేం చేయాల్రా భగవంతుడా. ఇంటినిండా పిల్లలు. మా ఇద్దరు పిల్లలూ కాక, కరోనా కాలంలో కూడా ఇద్దరు పిల్లలతో వచ్చి దిగిన చెల్లెలూ, నేనూ, నా భార్యా, అమ్మాఇంతమంది నెత్తిన కరోనా భూతం వాలింది. దిక్కుతోచడం లేదు. పాజిటివ్ అనే మాట వింటూనే నా అడుగు వెనక్కి పడడం, కుడిచెయ్యి తటాలున తలుపు మూయడం... అసంకల్పిత ప్రతీకార చర్యలు ఒకదానివెంట ఒకటిగా వెంటవెంటనే జరిగిపోయాయి. ఆమె దిగులుగా నా వైపే చూస్తోంది.

 

నాలో చిరాకు పెరిగిపోతోంది. అనవసరంగా ఇల్లు అద్దెకు ఇచ్చి నెత్తికి తెచ్చుకున్నాం. ఇద్దరే ఉంటామని చెప్పి దిగినా ఎప్పుడూ వచ్చీపోయే బంధుగణంతో పైవాటా కిటకిటలాడేది. కరోనా స్పృహే లేకుండా ఒకటే సందడి. పిల్లల ఆటలు. ఎవరెవరో గేటు తీస్తూ వేస్తూ... నాకు ఒకటే టెన్షన్. ఏం మోసుకొస్తారో ఇంటికి అని. భయపడినంతా జరిగిపోయింది.

 

దిగ్గున వెలిగి ఆరిన మెరుపు కాంతితో పాటే చీకట్లు కమ్ముకున్నాయి. ఆ వెంటనే ఢమఢమ మంటూ ఉరుముల శబ్దం ఎక్కడో పిడుగు పడినట్లే ఉంది. ఏ క్షణమైనా వాన విరుచుకుపడేట్లే ఉంది.

 

తల్లీ నీకు దండం పెడ్తాఅన్నాను కట్టలు తెగకుండా కోపాన్ని అణచుకుంటూ.

 

ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి.”అంకుల్ అంకుల్... ప్లీజ్ అంకుల్...” గొంతులో దు:ఖం పొంగుతోంది.

 

నాలోపల అసహనం కూడా పెరిగిపోతూనే ఉంది. ఎంతో జాగ్రత్తగా ఉన్నాం ఇప్పటిదాకా. అనుక్షణం అప్రమత్తంగానే ఉన్నాం. ఇప్పుడు వీళ్ళవల్ల కరోనా జొరబడిపోయి ఇంట్లో ఎవరికైనా వస్తే తట్టుకోగలమా? వద్దు వద్దనుకున్నా ఇంటిని అద్దెకు ఇవ్వాల్సి వచ్చింది. బాధ్యత లేకుండా ప్రవర్తించి ఇప్పుడొచ్చి దీనంగా నిలబడ్డారు. దారినపోయే కంపను నెత్తినేసుకోవడం అంటే ఇదేనేమో!

   ముందు ఇల్లు ఖాళీ చేసి పొండిఅని గట్టిగా అరిచేశాను నా కోపాన్నంతా ప్రదర్శిస్తూ.

ఏడుపు ఎగతన్నుకొస్తుండగా ఆ అమ్మాయి మిద్దెమీదకు తిరిగి పరుగున వెళ్ళిపోయింది.

ఇంట్లోనుంచి నా భార్యా, మా అమ్మా వింటున్నారని నాకు తెలుసు. లోపలికి అడుగు పెడుతూ ఉంటే ఎందుకో కాస్త సిగ్గుగా అనిపోంచింది. నేరుగా గదిలోకి వెళ్ళిపోయాను.

 

ఉరుములూ, మెరుపులే తప్ప చినుకు రాలలేదు ఆ పూట కూడా. మధ్యాహ్నం దాకా మంచం మీదే మసలుతూ ఉండిపోయాను. ఆకలవుతున్నా ఇంకా పిలుపు రాలేదేమిటా అనుకుంటూ ఉండగా వినిపించాయి మాటలు.

  

వాడు కోపంతో ఉన్నాడు కదా. ఇప్పుడివన్నీ ఎందుకు చేస్తావు. వాళ్ళ బాధలేవో వాళ్ళు పడతారు. బంధువులెవరన్నా ఉంటే ఫోన్ చేయమను. వాళ్ళు వచ్చి చూసుకుంటారునాకు వినిపించకూడదన్నట్లు గొంతు తగ్గించి కోడలిని మందలిస్తోంది అమ్మ.

  

పాపమత్తయ్యా, నిన్న రాత్రినుంచీ వాళ్ళింట్లో పొయ్యి వెలిగించలేదంట, మెట్లమీద పెడితే తీసేసుకుంటారు. అనుమతికోసం చూడకుండా గిన్నెలు పట్టుకుని మిద్దెమీదకు వెళ్లింది సృజన.

 

రాత్రి కూడా ఇదే తంతు నడిచింది. కాకపోతే మా అక్క కొడుకు తెచ్చిచ్చిన పేపరు ప్లేట్లలో భోజనం పెట్టి తీసుకువెళ్లింది. నాతో కనీసం సంప్రదించకుండానే ఈమె వాళ్ళకు పూట పూటా భోజనాలు వండి పెట్టడం నాకు నచ్చలేదు. ఉక్రోషం, కోపం కలగలిసిన మానసిక స్థితిలో ఉడికిపోతున్నాను. ఆ రోజంతా ముభావంగానే గడిచిపోయింది. సృజన కూడా నన్నేమీ పెద్దగా పట్టించుకోనట్లే తిరుగుతోంది. అది మరీ చిరాకుగా ఉంది.

  

రాత్రి వంటగదిలో అన్నీ స్ర్దెశాక వచ్చి పక్కన పడుకుంది. నేను అటువైపు తిరిగాను.

  

పాపం, కరోనా వచ్చిందని తెలిసి పై ఉన్నోళ్ళ ఇంటికి బంధువులంతా రావడం మానేశారండీ. ఇంతకాలం మందలు మంలుగా వచ్చి ఇంట్లో తిష్ట వేశారా, ఇప్పుడు ఫోన్ చేస్తే, కషాయాలు తాగండి, బాగా తినండి అని జాగ్రత్తలు చెప్పి పెట్టేస్తున్నారంతా. మందులు తెచ్చీమని అడిగితే కూడా పలకడం లేదంట.”

  

నేను పలకకపోయినా ఈమె ఆపలేదు. “ఎందుకో ఆ అబ్బాయిని చూస్తుంటే లాక్ డౌన్లో బెంగళూరులో ఇరుక్కుపోయిన మా తమ్ముడు గుర్తుకొస్తున్నాడుఆమె గొంతులో దు:ఖం తొణికిసలాడుతోంది. ఇటు తిరిగి ఆమె మీద చేయి వేశాను, అనునయిస్తున్నట్లుగా. కిటికీలోంచి చల్లటి గాలి తెమ్మెర వచ్చి తాకింది. ఎక్కడో దూరంగా వాన కురుస్తున్నట్టుంది.

 

#                #               #

 

ఉదయం ఫోన్ మోగడంతో బద్ధకంగా నిద్రలేచాను. “బావా గేటు టీ బావా. అక్క రమ్మనింది ఎందుకో.” అంటు విక్కీ గొంతు వినిపించింది ఫోన్లో.

  

సృజనా...” అని పిలుస్తూ వెళ్ళి తాళం తీశాను. వెనకే వచ్చి, మందుల లిస్ట్, డబ్బులు వాడి చేతిలో పెట్టింది. నేను బాత్రూంకి వెళ్ళి వచ్చేటప్పటికి మందులతో మెత్ట్లు ఎక్కుతోంది.

  

జాగ్రత్త. ఎప్పుడు ఏ టైంలో అయినా పిలువు. ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, తగ్గిపోతుంది  కిందికి రాగానే హ్యాండ్ వాష్ తో చేతులు కడుక్కుని, మూతికి పెట్టుకున్న క్లాత్ మాస్కు తీసి సర్ఫ్ నీళ్ళల్లో పడేసి, వంట పనిలోకి దిగింది.

  

ఏమిటీమె వ్యవహారం,ఇంట్లో చిన్న పిల్లలున్నారు. వయసు మీరిన అమ్మ ఉంది. ఇవేవీ ఆలోచించలేదా? జంకు అనేదే లేకుండా వాళ్ళకి అవీ ఇవీ ఇచ్చి వస్తోంది. ఇంట్లో పిల్లలెవరైనా ముక్కు చీదితే చాలు నిద్ర మానేసి దగ్గర కూర్చునే మనిషేనా ఇట్లా తెగించి చేస్తున్నది? ఎప్పుడూ నా మాట దాటని మనిషి నా ఉనికినే గుర్తించకుండా ప్రవర్తిస్తోంది చాలా కొత్తగా కనిపిస్తోంది సృజన నాకు.

  

ఆ రాత్రి పిల్లలు తిన్నాక, పెద్దవాళ్లమంతా భోజనాలకు కూర్చున్నాం. సృజన మొబైల్ మోగింది. వంటింట్లోనుంచి గిన్నెలో కూరలేవో సర్ది డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చేలోగానే రెండుమూడుమార్లు విరామం లేకుండా రింగైంది. చీర చెంగుకు చేతులు తుడుచుకుంటూనే లిఫ్ట్ చేసింది. ఆమె ముఖంలో ఆందోళన. నా వైపు చూస్తూ మాట్లాడుతోంది. “ఆయనతో మాట్లాడి ఇప్పుడే ఫోన్ చేస్తానుండు. నువ్వేమీ భయపడొద్దు, ధైర్యంగా ఉండుఫోన్ కట్ చేసి నావైపు తిరిగింది.

  

ఏమండీ, పైనింటి అబ్బాయి శ్వాశ అందక ఇబ్బంది పడుతున్నాడంట.ఆమె గొంతులో ఫణుకు. నా గుండెల్లోనూ దడ మొదలైంది. చీకటి కమ్మినట్టు అనిపించింది.

  

సృజన మాత్రం వెంటనే తేరుకుని చకచకా మెట్లు ఎక్కేసింది. ‘దేవుడా ఈమె ఏం చేస్తోంది...’ అనుకుంటూ అటే చూస్తున్నాను. బహుశా గ్రిల్స్ బయటే నిలబడి అనుకుంటాను వాళ్ళకి ధైర్యం చెబుతోంది.

 

వెంటనే దిగి వచ్చి, “మీ ఫ్రెండొకరు పీఈఎస్ లో న్నారు కదా. ఫోన్ చేయండి. బెడ్ దొరుకుతుందేమో కనుక్కోండి. వెంటనే హాస్పిటల్ కి పంపిస్తే మంచిది. ఆక్సిజన్ అవసరం అయ్యేట్టుంది ఆ అబ్బాయికి. ప్లీజ్ ఫోన్ చేయండిఅంటు నా ఫోన్ చేతికందించింది.

 

వంటిల్లు కూడా పెద్దగా దాటని సృజనేనా ఇదంతా చేస్తోంది! తటపటాయింపుగానే ఫోన్ అందుకున్నాను. అవతల ఫోన్ తియ్యడం లేదు.

  

ఏమండీ... హాస్పిటల్ సూపర్నెంటుకి చెయ్యండి. వార్తలకోసం వాళ్ళు మీకు చేస్తూనే ఉంటారు కదా. ఇట్లాంటప్పుడు వాడుకోవడం తప్పు కాదు. చెయ్యండిఆదేశిస్తోంది ఆమె. ఆమె కళ్ళల్లోకి చూశాను. నా సంకోచం పటాపంచలు చేస్తున్నాయి ఆమె చూపులు.

  

సూపర్నెంటుకి చేశాను. బిజీ వస్తూనే ఉంది. సృజన మళ్ళీ ఒకసారి మిద్దె మీదకు వెళ్ళి అతని పరిస్థితి ఎలా ఉందో కనుక్కుని వచ్చింది. నేను హాస్పిటల్ పీయార్వోకి, ఇంకా నాకు తెలిసిన నెంబర్లకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆమె మళ్ళీ మిద్దె మీదకు పరుగున వెళ్ళిఏం టెన్షన్ పడద్దు. మా ఆయన హాస్పిటల్ కి ఫోన్ చేస్తున్నాడు. అంబులెన్స్ వస్తుంది. ఈలోగా బోర్లా పడుకోమని చెప్పండిభరోసా ఇస్తోంది.

  

నేను సాలోచనగా మెట్లదిక్కు చూస్తూ ఉండగానే ఫోన్ రింగైంది, సూపర్నెంటు నుంచి. పరిస్థితి వివరించాను. నిజానికి బెడ్ ఏదీ ఖాళీ లేదు.

  

ఎలా అయినా చూడండి సార్... మాకు దగ్గరవాళ్లు... మా ఆవిడకి కజిన్ సార్...” ఈ మాటలంటున్న నా వైపు చూస్తున్న సృజన కళ్ళలో తడి మెరుస్తోంది.

  

బెడ్ దొరికే దాకా స్ట్రెచర్ మీదనే పెట్టి ఆక్సిజన్ పెడతామని, వెంటనే పంపమని ఆయన చెప్పారు.

  

కాసేపటికే కుయ్... కుయ్... మంటూ అంబులెన్స్ ఇంటి ముందు ఆగింది.

  

సృజనతోపాటు ఈసారి నేను కూడా మిద్దె మెట్లు ఎక్కాను. ఇద్దరం కలిసి ధైర్యం చెప్పి వెంట తీసుకెళ్ళాల్సినవి ఏమిటో సూచనలు ఇస్తూ వాళ్ళని అంబులెన్స్ ఎక్కించాం.

  

అంబులెన్స్ కదలబోతుండగా ఆ అమ్మాయి దు:ఖం బద్దలైంది. వెక్కివెక్కి ఏడుస్తున్న ఆమె భుజం మీద చేయి వేసి, “ఏం కాదమ్మా... ధైర్యంగా ఉండు. డాక్టర్ తో కూడా మాట్లాడాను కదా. ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉంటాను. ఏదైనా అవసరం అయితే పిలువుఅనునయిస్తున్న నా వైపు చూస్తున్న సృజన కళ్ళల్లో వీధి దీపపు ఫెలుగు తళుకులీనుతోంది.

 

ఉరుముగానీ, మెరుపుగానీ లేకనే హఠాత్తుగా ఒక జల్లు మొదలైంది. నేలను తాకుతున్న వాలు చినుకులు కమ్మటి మట్టివాసనను మోసుకొచ్చాయి. చూస్తుండగానే వాన జోరు పెరిగి హోరున ముంచెత్తి పోసింది. అంతదాకా మనసును ఆవరించిన దిగులు మేఘాలు పటాపంచలై మనసు తేలిక పడింది.

 

చిత్తూరులో ఒంటరి దు:ఖాన్ని అనుభవిస్తున్న దేపా చిన్నమ్మ నన్ను మన్నించి దీవించినట్లే అనిపించింది ఆ క్షణం.

                                                    

(ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో (ఆగస్టు 8, 2021) ప్రచురితం.)

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

తాగని టీ

పువ్వాకు ఎంగిలి