నాయన

“నాతో నువ్వేప్పుడైనా క్లోజుగా ఉన్నావా నాయినా, ఇప్పుడు నీతో క్లోజుగా ఉండడానికి? ఇంట్లో ఎప్పుడైనా ఉండనిచ్చినావా నన్ను? ముడ్డికి తాటాకుగట్టి తరిమేసేవోడివే. ఇప్పుడు అమాన మాట్లాడమంటే మాటలెట్టా వొస్తాయి చెప్పు?”

ఆ మాటలకు నిరామయంగా చూసినాడు నాయన నాదిక్కు.

ఎదుర్రొమ్ముమీద బర్రెముకలు పైకీకిందికీ ఊగుతున్నాయి. ఊపిరి పీల్చుకోలేక ఆయన పడుతున్న యాతన అది. అప్పుడప్పుడూ గొంతులోంచి ఎగదన్నుకొస్తున్న ఎక్కిళ్ళు, బాధను భరించలేక పెడుతున్న మూల్గులు. రెండు చేతుల మణికట్లు ఉబ్బిఉన్నాయి. ఇక ఏ వైద్యమూ పనిచేయదని ఆ మణికట్లనుంచి వేరై పక్కనే మంచంమీద వేలాడుతున్న సెలైన్ బాటిల్ నుంచి వచ్చిన సన్నపాటి పైపు చెబుతోంది. పైన సీలింగుకు తిరుగుతున్న ఫ్యాన్, ఉక్కపోతను ఆపలేకపోతోంది. ఈ ఉక్కపోత నిజంగా మండుతున్న వేసవిదేనా?

బయట... అంటే వోరగా మూసిన తలుపుల వెనుక ఓ నాలుగైదడుగుల దూరంలో అక్కా, బావా, అత్తా, మామా ఎవరెవరో బంధువులు గుసగుసగా మాట్లాడుకుంటున్న మాటలు లోనికి వినవస్తూనే ఉన్నాయి. బహుశా మా మాటలూ వారికి వినిపిస్తూనే ఉంటాయి. అలా వినిపించడమే మంచిదేమో. లేకపోతే ఏ ఆస్తిపాస్తుల గురుంచో, ఇంకేదైనా రహస్యాల గురించో చెప్పడానికే నాయన మమ్మల్ని లోనికి పిలిచివుంటారని అపోహపడేవారేమో. అమ్మ చెదిరిన జుట్టుతో, బలహేనమైన దేహంతో ఆయనకు తలవైపు ఉంది. మంచంకోడుపై తల ఆనించి నాయన ముఖంవైపే దీనంగా చూస్తోంది. నాలుగైదు నెలలుగా భర్తకు చాకిరీ చేసిచేసీ అలసిపోయిందేమో... వదనం పూర్తిగా వదలిపోయి ముడుతలు పైకితేలి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు అత్యంత సామీప్యంలో కోడలు, అంటే నా భార్య నీలిమ నిలుచుని ఉంది. ఆమె కళ్లనిండా నీళ్ళు. ఇక్కడున్న వీరిద్దరిలోనే కాదు, ఈ గదికి బయట ఉన్న అందరిలోనూ అంతులేని దు:ఖపు ఛాయలు. ఎటొచ్చీ నా ముఖమే... అక్కడేమీ జరగనట్లు, ఆ మంచమ్మీద అంతిమ ఘడియల్లో ఉన్న మనిషి నాకేమీ కానట్లు... నిర్వికారంగా, నిరామయంగా కనిపిస్తున్నదేమో.

అసలు నాయన నన్ను, నా భార్యను మాత్రమే గదిలో ఉండమని చెప్పి, మిగిలినవాళ్లనందరినీ బయటకు వెళ్ళిపొమ్మని చేయి ఊపగానే వాళ్ళందరూ ఏమనుకుని ఉంటారో. నెలారెణ్ణెళ్లపాటు ఆలారోగ్యంతో తీసుకుంటున్న తనను ఇంట్లో తెచ్చిపెట్టుకుని, ఏమాత్రం చీత్కరించుకోకుండా మలముత్రాలు కూడా ఎత్తిపోసి సేవ చేస్తున్న మా బావ చిన్నబోయి ఉండడా? ఒకోసారి కనీసాకిసంతరించిన సొంత కూతురైనా విసుక్కుని ఉంటుందేమో కానీ, ఆయన చాటుగా కూడా ఆపని చేయలేదు. సొంత మేనమామే అయినా, ఆయనకేం పట్టిందని, మా నాయనకు ఇటువంటి సేవ చేయడానికి. బదిలీ కావడంతో ఎక్కడో మారుములనున్న మండల కేంద్రానికి వెళ్ళిపోయి, ఉద్యోగం చేసుకుంటూ పెళ్ళాంపిల్లలతో ఉంటున్న నాకులేని అక్కర ఆయనకేం ఉందని. అటువంటి బావను కూడా అందరితోపాటు బయటకు వెళ్ళిపోమ్మని ఎలా అనగలిగాడు. నాపట్లే కాదుమరెవరిపట్లా ఆయనకభిమానమనేది లేదా? నాయనంత కఠినాత్ముడా. ఎవరేమనుంటారో అన్న వెరపు లేకుండా ఇంతటి తీవ్ర అనారోగ్యంలో కంటికి రెప్పలా ఇన్నాళ్ళూ కాపాడుకొచ్చిన కూతురు, అలుళ్ళను సైతం విశ్వాసంలోకి తీసుకోని నాయనపై ఏవగింపు కలిగింది.

ఎంతైనా ఆయన నా కన్నతండ్రి. ఇన్నేళ్లపాటు ఏ ఉద్యోగం, సద్యోగం లేకయినా పల్లెత్తు మాటనకుండా మౌనంగా పోషిస్తూ వచ్చిన కుటుంబ యజమాని. అయినా ఇదేమిటికంటిపాపలపై పలుచని నీటిపోరైనా లేకపోయిందే. అంటే... నాయనంటే నాకు ప్రేమ లేదా? పిసరంత ఆప్యాయత కూడా లేకుండాపోయిందా ఆయనపట్ల. నిజమా... అదే నిజమైతే నా అంతటి దౌర్భాగ్యపు కొడుకుని కన్న ఆయనంతటి దురదృష్టవంతుడు వేరెవరైనా ఉంటారా?

ఆయనడిగిందేమిటి...

“రేయ్ కృష్ణా ఎందుకు నాతో మాట్లాడవు. ఇలా రారా... ఇప్పుడైనా నాలుగు మాటలు మాట్లాడరా...” అని కదా.

“ఎందుకు మాట్లాడను నాయనా. మాట్లాడుతూనే ఉంటా. నువ్వు అప్పుడే వెళ్ళిపోవద్దు. ఉండిపో, ఇక్కడే ఉండిపో. నేనూ ఇదిగో నీ దగ్గరే ఉండిపోతా. నీకు నా మాటలేగా కావాల్సింది. నీకు బాగయ్యేంతవరకూ నీ దగ్గరే కూచుని నువ్వు ఇక వద్దనేదాకా కబుర్లు చెబుతా. ఇదిగో, ఈ పత్రికలో నీ అభిమాన రచయిత సీరియల్ ఈవారమే మొదలైంది. వారంవారం చదివి వినిపిస్తా. నువ్వు నాకు కావాలి నాయనా. నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఎవరితో ఆడుకుంటారు? తాతయ్య వాళ్ళకి కావద్దూ. నీకు త్వరలోనే బాగైపోతుంది. మనూరికి వెళ్ళిపోదాం... సరేనా...”

ఆయనలా దీనంగా అడగ్గానే నా గుండె లోతుల్లో కొట్లాడిన మాటలివి. నాయనకు దగ్గరగా కూచుని ఆయనను చిన్నపిల్లాడిలా పొదివిపట్టుకుని చెప్పాలనుకున్న మాటలు. మరి బయటకు వచ్చిన మాటలు... “నువ్వు నన్నెప్పుడూ దగ్గరికి తీయలేదు కాబట్టి నీతో నేనెలా మాట్లాడతాన”న్న ఎదురు ప్రశ్నలు. అవి కేవలం మాటలేనా... నాలుగు నెలలుగా అనారోగ్యంతో తీసుకునితీసుకుని స్విమ్స్, సీఎంసీ ఆసుపత్రులు తిరిగితిరిగీ, చివరకు “ఇది క్యాన్సర్. చివరి స్టేజ్ లో ఉంది. ఇప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. ఇక ఏం చేసినా లాభంలేద”న్న డాక్టర్ల మాటతో తీసుకొచ్చి, మంచమ్మీద పడేసిన ఆ శల్యావశిష్ట బక్క దేహాత్మను ఛిద్రంచేసే శరాఘాతాలు కావా. క్యాన్సర్ తో పోరాడిపోరాడి చివరికిలా మరణంకోసం ఎదురుచూస్తున్న ఆయన శరీరం ఇంతకాలం పడిన బాధ ఎక్కువా లేక నా సమాధానంతో నాయన మనసు ఈ క్షణంలో అనుభవించిన నరకయాతన ఎక్కువా? సమాధానం నాకు తెలుస్తూనే ఉంది... ఆయన ముఖ కవళికల్లో.

నా నలభయ్యేళ్ళ జీవితంలో అసలు నాయనతో నేరుగా నేను మాట్లాడింది ఎన్నిసార్లు? అందులో తండ్రీకొడుకులుగా మాట్లాడుకున్న సంఘటనలెన్ని? ఒకటా, రెండా లేక మూడా ... నిజంగా నాకు గుర్తుకు రావడంలేదు.

*******************************************

“రేయ్... ఆ ఇంగ్లీష్ నోట్సు తీసకరాపో...”

వొణుకుతూ తీసుకెళ్లడం. డిక్టేషన్... “బ్యాట్... పాట్...”

పల్లెటూరి బళ్ళో, వానాకాలపు చదువులు. తెలుగు నేర్వడమే ఎక్కువ.  ఇక ఇంగ్లీషు పదాలెక్కడ? అంతే... ఎడమచేత్తో జుట్టుపట్టుకుని తల వంచి కుడి అరచేత్తో చెళ్ళుచెళ్ళమంటూ దెబ్బల వరద.

“గాడిదలా పెరిగితే చాలా. అదిగో, ఆపిల్ల కాళ్ళ కింద దూరుపో సిగ్గయినా వస్తాది. నిన్ను నరికినా పాపంలేదు గదరా. నేనొచ్చేసరికి అన్ని స్పెల్లింగులూ కంఠతా పట్టి టకటకా చెప్పాలి. లేకపోతే చెవడాలుడిపోతాయ్ ఎదవా...” పంచె ఎగ్గట్టి, టవలొకటి భుజాన వేసుకుని వీధిలోకి నడిచిపోతూ నాయన హుకుం. మళ్ళీ ఇంటికి ఆయన రాక, గూట్లో దీపం వెలిగాకే. అప్పటికి నేను మా అక్కాచెల్లెళ్లతో కలిసి బువ్వ తేనేసి మట్టి ఇంటిముందు పందిలికింద వేసిన నులక మంచంలోకి చేరేది. మూడునాలుగు నెలలకోసారి ఇలాంటి సంఘటనలే పునరావృతం. ఇదీ చిన్నప్పుడు నాయనతో నాకున్న అనుబంధం.

శ్రీకాళహస్తి దగ్గర్లో చిన్న పల్లెటూరు తిమ్మసముద్రం  మావూరు. అక్కడినుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోవనూరులో బడిపంతులుద్యోగం నాయనది. ఉదయమే అమ్మ కట్టిచ్చిన క్యారేజీ సైకిల్ కు తగిలించుకుని అంతదూరమూ తొక్కుకుంటూ బడికెళ్లడం, తిరిగి ఏ సాయంత్రానికో ఈసురోమంటూ ఇల్లు చేరడం. కాఫీ తాగి పంచెకట్టుమీద కండువా వేసుకుని ఊళ్ళోని రామ మందిరానికి వెళ్ళి స్నేహితులతో పిచ్చాపాటీ కబుర్లాడడం. మందిరమంటే పెద్ద గుడేమీ కాదు. పదికి పది అడుగులు కొలతతలతో మట్టి గోడలు, రెల్లు కప్పుతో చిన్నపాటి పాక, అంతే. అదే మా బడి కూడా.

*************************************

“య్యోడు సెంటీమీటర్లు తీసుకోవాలి. ఇదిగో ఈ కోణమానినితో ఈపక్కన ఇరవై డిగ్రీలు, ఆపక్కన 80 డిగ్రీలు పెట్టి త్రికోణం తేయాలి.”

ఎవరికి తెలుసా లెక్కలు? అర్థమయ్యేట్టు చెప్పేవాళ్లెవరు? మా పల్లెటూరి బడిలో చెప్పిందెంత. నేను నేర్చుకున్నదెంత? శ్రీకాళహస్తి కోనేటిదగ్గరున్న బాబు అగ్రహారం మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఏ పాఠమైనాసరే నాకర్థమైతే వొట్టు. ఆరో తరగతిలో మా పెదత్తోళ్ళ ఇంట్లో పెట్టాడు మా నాయన. అక్కడుండి స్కూల్ కు వెళ్ళి రావడం. బడిలో పల్లెటూరిబైతునైన నన్ను సాటి విధ్యార్థులు ఒకాటాడుకోవడం. అవమానం, అవహేళనలు. తల్లిదండ్రులకు దూరంగా, దగ్గరి బంధువులైనా సరే వేరేవాళ్లింట్లో ఉంటూ చదవలేక, సాటి పిల్లలతో కలిసిపోలేక పదీపన్నెండేళ్ళ బాలుడు పడే బాధలు నాయనకు తెలుసా? బడి ఇంటర్వెల్లో రోడ్డుమీద అమ్మే ఉప్పూకారం రాసిన మామిడికాయల బద్దలంటే నాకెంతిష్టమో. బడిగేటుకున్న ఇనుప కమ్ముల్లో చేయిదూర్చి కొనబోతే, తోటి పిల్లోళ్ళు నెట్టేస్తే ఎన్నిసార్లు మట్టిలోపడి ఏఢ్చానో. టీచర్లు పాఠాలు చెబుతుంటే, పక్కన కూచున్న పిల్లోళ్ళు సైలెంటుగా పెన్సిల్ ముల్లు గుచ్చి పెట్టే హింసను ఎలా భరించానో. బడి వదిలిపెట్టాక నేరుగా ఇంటికి రాకుండా ఎదురుగా ఉన్న కోనేటి మెట్లమీద ఒంటిగా కూచుని అమ్మను తలచుకుంటూ ఎంతగా కుమిలిపోయానో.

**************************************

“కృష్ణా కిలోకి ఎన్ని గ్రాములు?”

ఆరో తరగతిలో నేర్చుకున్నదేమీ లేకపోయాక నా ముఖానికి ఏమి తెలుస్తుంది?

“వంద సార్...” నేను చెప్పిన సమాధానం విని సారు నవ్విన నవ్వు నాకు ఇప్పటికీ గుర్తే. నేనెందుకూ పనికిరాని దద్దమ్మనని చెప్పకనే చెప్పే గమ్మత్తైన నవ్వది. ఫలితం... మా క్లాస్మేట్ కోమటోళ్ళ కిష్టయ్యవాళ్ళ అంగడిలో వాడి నాయన దగ్గరికి వెళ్ళీ, కిలోకు వెయ్యిగ్రాములన్న పాఠం నేర్చుకోవాల్సి రావడం. అంగడికి వచ్చిపోతున్న వాళ్ళందరూ చూస్తుండగా ఆ ఫ్రెండుకు కరతలామలకమైన కిలోగ్రాము లెక్కలు నేర్చుకోవాల్సిరావడంకంటే హీనమైన పరిస్థితి ఏడో తరగతి పిల్లోడికి ఇంకేమన్నా ఉంటుందా? ఏడు ఎనిమిది తరగతులు రెండూ మా సొంతురికి కేవలం ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోని ఇంకో పల్లెటూరిలో మా నాయనకు, బెస్ట్ ఫ్రెండ్ అయిన మా బడి అయ్యోరి ఇంట్లోనే ఉంటూ వెలగబెట్టిన చదువు. పైగా ఆయన ముగ్గురు పిల్లలతో ఊళ్ళోవాళ్ళూ అడుగడుగునా పోలికపెట్టి నా అసమర్థతను ప్రతిపనిలో వేలెత్తిచూపడం. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నా అసమర్థతకు బాధ పడడం, బాగా చదువుకోమని కోప్పడడం తప్ప, సారు కానీ, సొంత కొడుకులాగే చూసుకున్న ఆయన భార్య కానీ నన్ను పల్లెత్తు మాట అనలేడెప్పుడూ. పైగా పొద్దున స్నానంచేసి రాగానే వంటింట్లోకి పిలిచి నాకొక్కడికోసమే కాచిన టీ, గ్లాసుతో గ్లాసుడు ఇవ్వడం. కూరలూ, ఫలహారాలూ రుచికరంగా వండివడ్డించేదాయక్క. దగ్గర అమ్మ లేకపోయాక, నాయన ఆప్యాయమైన పిలుపు వినబడకపోయాక, ఊరోళ్ళ హేళనలు తూట్లు పొడుస్తున్నాక... ఏ రుచులు ఉండి, ఏ తిట్లు లేకపోయి ఏం లాభం?

పది, ఇంటర్, డిగ్రీలన్నీ బంధువులింట్లో ఉండి వెలగబెట్టడమే. మూడేళ్లలో పూర్తి కావాల్సిన డిగ్రీని ఏకంగా అయిదేళ్ళు చదవాల్సిన పరిస్థితులకు పునాది ఆ చిన్ననాటి అవహేళనలు, అవమానాలు కాదూ? వాటన్నింటికీ బాధ్యతెవరిది?

ఇంటర్ ఫస్టియర్ లో ఒక సబ్జెక్ట్ తప్పిపోయినప్పుడు నాయన గొడవ చేయలేదు కానీ... ఆయనతో దూరం మాత్రం మరింతగా పెరిగిపోయింది. ఇప్పుడు చాలీచాలని జీతంతో బతుకుబండి లాగుతూ చిన్న ప్రైవేటు జాబ్.

రే కృష్ణా... నీకేమీ చేయలేకపోయానని మీ నాయన ఒకటే బాధపడుతుంటారురా...” చెప్పాడు బావొకసారి మేమిద్దరమే ఉన్నప్పుడు. అంటేనాకంటూ ఆస్తిపాస్తులెవీ కూడబెట్టలేదని ఆయన బాధ కావచ్చు. నాకా బాధ ఎప్పుడూ లేదు. తండ్రీకొడుకుల మధ్య ఉండాల్సిన ఆప్యాయతానురాగాలేవీ లేకపోవడం... అదీ బాధ. ఇంతకాలం నన్ను బాధించిన అదే లోటిప్పుడు నానుంచి ఎదురవడం, అవసాన దశలో నాయనను క్యాన్సర్ కంటే ఎక్కువ బాధించడం... భరించలేకపోతున్నాను నేను. అలాగని ఆయనకు ఉన్నపళంగా దగ్గరైపోలేకపోతున్నాను. మనసులోని భావాలు- అది ద్వేషమైనా కావచ్చు లేదా ప్రేమైనా కావచ్చు... అవతలివారికి వ్యక్తపరచలేకపోవడమంత దురదృష్టం మరేమీ ఉండదేమో.

ఆలోచనల సుడిలో కొట్టుకుపోయి గట్టున పడేసరికి  నా భార్య నీలిమ నాయన మంచం పక్కనే కింద కూచుని ఉంది. ఆమె అరచేయి మా అమ్మ చేతిలో వారిద్దరి చేతులూ నాయన చేతిలో ఉన్నాయి. కారీకారీ ఎండిపోయిన కన్నీళ్ళు, సూదంటి ముక్కుకు రెండువైపులా లోతుకుపోయిన చెంపలమీద చారికలు కట్టాయి. గుంతలుపడ్డ ఆ కళ్ళల్లో ఇప్పుడో మరుక్షణమో ఆరిపోతానన్నట్లుగా ప్రాణదీపం రెపరెపలాడుతోంది. అలా ఇద్దరి చేతులూ పట్టుకుని నాదిక్కు చూశాడు నాయన. ఒక్క క్షణమే... చూపులు నా భార్య నీలిమవైపు మళ్లించేశాడు. సత్తువను కూడదీసుకుని ఎడమచేతిని కొంచెం పైకిలేపి దగ్గరగా జరగమన్నట్లుగా ఊపాడు. ఉబికి కారిపోతున్న కన్నేళ్లను అలాగే వాటిమానాన వాటిని వదిలేసి ఆయనపైన తన ఎడమచేతిని భరోసా చెబుతున్నట్లుగా వేసి, తల మరింత దగ్గరగా వంచింది ఆమె వినడానికన్నట్లుగా.

తల్లీ నీకు నేనేం చేయలేకపోయాను. ఇక చేయలేను కూడా. నన్ను క్షమించు. ఒక్కమాట చెబుతాను, వింటావు కదమ్మా...” మాటలు వచ్చీరాని చిన్నపిల్లాడిలా పట్టీపట్టీ మాట్లాడాడు.

“అలా అనకండి మామయ్యా. మీరు మాకుంటే చాలు. అదే కొండంత అండ. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అయినా ఆయనను కనీ పెంచీ నాకిచ్చారు అది చాలు. చెప్పండి, మీరేం చెప్పినా వింటాను. తప్పకుండా మీరు చెప్పింది చేస్తాను.” దు:ఖంతో బొంగురుపోతున్న గొంతు పెగల్చుకుని అంది నీలిమ.

నాది స్వార్థమే అనుకో... మరేమైనా అనుకో. మీ అత్తను మాత్రం బాగా చూసుకోమ్మా. అది పిచ్చిదమ్మా. లోకం తెలియని అమాయకురాలు. దాని బాగోగులు ఇక నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావు కదూ...”

తన రెండు చేతులతో నాయన చేతిని గట్టిగా పట్టుకుని చెప్పింది నా భార్య, “మామయ్యా మీరు వేరే చెప్పాలా. అత్తయ్యవేరు, మా అమ్మ వేరూ కాదు నాకు. మా అమ్మలాగే చూసుకుంటాను. మీరు దిగులు పడకండి...”

ఒక్కసారిగా నాయన కళ్ళల్లో వేయిదీపాల కాంతులు వెలిగి... అంతలోనే ఆరిపోయాయి.

జీవం లేని ఆ కళ్ళు నా వైపే చూస్తున్నాయి.

నిలువలేకపోయానిక అక్కడ.

గదిలోంచి బయటకు వచ్చేశాను పరుగులాంటి నడకతో.

ఎవరో ఏదో అడుగుతున్నారు. ఇంకెవరో పెడబొబ్బలు పెట్టి ఏడుస్తున్నారు.

**************************************

అంత్యక్రియలు పూర్తి అయి మూడురోజులైంది. లక్ష రూపాయల అప్పు తేలింది. తీర్చేదెలాగో తెలియలేదు. ఆ సంగతి తర్వాత, ముందు అద్దె ఇల్లు ఖాళీ చేసి అమ్మను మాతోపాటు తీసుకెళ్లాలి. నాయన వాడిన పాత సూట్కేసుతోపాటు ఆయన వస్తువులన్నింటినీ తీసి పరిశీలిస్తున్నాను. తన బడిపంతులు జీవితంలో పదిలంగా దాచుకున్న ఎస్సార్ తోపాటు క్రమం తప్పకుండా ఇంటి జమాఖర్చు లెక్కలు, రోజువారీ కార్యక్రమాలు రాసుకున్న పదులకొద్దీ డైరీలు ఉన్నాయి. అన్నీ తీసి పక్కన పెడుతున్నాను. ఇక మిగిలినవి చిత్తుకాగితాలు అనుకుని వదిలేశాను అలాగే. నీలిమ ఆ సూట్కేసును బొళ వేసింది విదిలించడానికి. అప్పుడు బయట పడ్డాయవి. రెండు బ్యాంకుల్లో అయిదు లక్షల రూపాయలు డిపాజిట్ చేసిన పత్రాలు.

“నేత్తీనోరూ కొట్టుకుని చెప్పినా. చదువుకున్నావా? ఇప్పుడుచూడు... గొడ్లు కాయడానికి కూడా పనికిరాకుండా పోయావు. నువ్వూ నీ గొర్రెతోక ఉద్యోగం. నెలంతా గొడ్డుచాకిరీ చేసినా అయిదువేళ్ళూ నోట్లోకి వెళ్తాయిరా గాడిదకొడకా. కనీసం నేను చస్తే తలకొరివి పెట్టే  స్తోమతైనా ఉందారా ఎదవా నీకు. ఏం చెయ్యనురా నిన్ను. నిలువునాకోసి పాతరేసినా పాపం లేదు...”

ఎదురుగా నిలబడి నాయన మానంమర్యాద లేకుండా కడిగేస్తున్నాడు... ఆ డిపాజిట్ పత్రాలను నామీదకు విసిరికొడుతూ.

మా నాయన ఇపుడు లేడు  కానీ, అప్పుడు నా భార్య చూసిన చూపు నేనీ జన్మలో మరచిపోలేను.

-----------------------------------------------------

# ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో (14 ఆగస్టు, 2022) ప్రచురితం.

 

 

 

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ