ఒక నేరం కథ

ఇది ఒకటో నెంబరు బస్సు... దీని యవ్వారం బహు నైసు...మైకు సెట్లోనించీ ఏంటీవొడు ఈరలెవల్లో పాడతా ఉండాడు. మా ఇంట్లో యాపసెట్టుకింద నేను డ్యాంసేస్తా ఉండా. ఎంటీవోడు సిన్మా అన్నా, లొడ్డచెయ్యి, నడ్డీ తిప్పతా నిలబడిన చోటునుంచే వోడేసే డ్యాంసన్నా బలే ఇది నాకు. కాలాస్త్రికి మానాయిన మమ్మల్ని తీస్కబోయ్యేది సమ్మత్సరానికి ఒక్కసారేగానీ, అక్కడ మా అమ్మమ్మోల్ల ఇంటికాడ ఉండే రొందు రోజుల్లో మాయమ్మను ఏపించుకొని తిని ఏంటీవోడి సిన్మా చూసి తీరాల్సిందే. మావూళ్లోకే వోడొచ్చేసి రామ్మందిరం కాడ మైకులో పాత పాద్తా ఉంటే చూసుకోండి, నా సామిరంగా... ఎవురూ పట్టడానికి ల్యాకుండా ఉండాది నా సంతోసం. 

 రాములోరి పట్టాబిసేకం నిన్ననే అయిపోయ్యింది. ఈరోజు వసంతాలు. గూనోడు, తెల్లోడు, గుడ్డెంకటేశులు, ఊసెంకటేశులు, కుంతి సేకరూ... నా సావాసగాళ్ళంతా ఉడ్డగా జేరి ఎగర్తా ఉండాము. ఊడిపోతా ఉండే చల్లాడాలు ఎగేసుకొనేదానికి, కారిపోతాఉండే ముక్కు చీమిళ్ళు ఎగబీల్చుకోడానికి గూడా టయిము లేదు మాకు. ఎగిరెగిరి అలుపొచ్చేసింది. 

 ఒరే, రామ్మందిరం కాడికి పోదామా రా...గూనోడు తల గుడ్డెంకటేశులు మూసుకుపోయిన ఎడంకన్ను మిటకరిస్తా అన్నాడు. 

 పోదాం పదండిరా... అక్కడికి ఎంగటలచ్చిమి, ఇందిర గూడా వొచ్చుంటారు. ఆయమ్మిలతో కలిసి చికుచికు పుల్లాట ఆడుకోవొచ్చు.ఆడంగెదవ ఊసెంకటేసులు కాలెత్తి నిలబణ్ణాడు. పోలోమని అర్సుకుంటా మందిరం కాడికి పరుగులు పెట్టేదానికి రెడీ అయిపోయ్యినాం. 

 యాణ్ణించి ఊడిపణ్ణాడో... మమ్మల్ని తోసుకొని పరుగులు పెడ్తా దూరినాడు చుట్టింట్లోకి నారాయుడు. ఆయన్న చేతిలో ఎద్దుల బండికి బిగించే గుజ్జు కర్ర ఉండాది.. పంచి ఎగబోసి గోచి కట్టుకున్న ఒంటిమీద ఇంక ఏ గుడ్డా లేదు. ముఖమ్మీదా, ఎదురురొమ్ము మీదా, ఈపుమీదా ఎర్రగా కమిలిపోయి ఉండాది. ఇంగ కొంచేపుంటే రాముడి పటం ఊరేగింపుకు వస్తాది. దానికి ముందు, పిల్లకాయలు, పెద్దోళ్ళు ఎగబడి వొచ్చేస్తారు. వాళ్లకి వసంతాల కోసరం పందిట్లో కూకోని పసుపు నీల్లు పెద్ద బక్కిటికి కలపతా ఉండాది మాయమ్మ. నారాయుడి వాలకం జూసిన ఆమెగబుక్కుమని లేసి నిలబడింది, బాగానే ఉండే పైట సర్దుకుంటా.  ఆయన్నను తరుముకుంటా వొచ్చి పడినాడు రమణయ్య. 

 "నా కొ... కా... నీకు నా సేతిలో ఈరోజు మూడిందిరా..." అని రంకెలేస్తా చేతిలోని లోని మొచ్చు కత్తితో నారాయుడి మెడకాయి మింద బలంగా ఏటేసినాడు. ఒకే ఏటు... మెడకాయి సగానికి తెగిన నారాయుడు, కిందపడి గిలగిలా తన్నుకుంటూ పానాలు ఇడిసేసినాడు. అమ్మ కలపతా ఉండే పసుపు నీల్లు, ఆయన్న మెడకాయనుంచీ జూవ్వుమంటా ఎగజిమ్మిన నెత్తురుబడి ఎర్రబారి పొయ్యినాయి.

అక్కడ యాప సెట్టుకింద బకిట్లో కలిపి పెట్టిన పసుపు నీల్లు చూసేతాలికి నా చిన్నప్పడు జరిగిన ఆ సంగతి గెవనానికి వొచ్చింది. చెప్పబళ్ళా... ఒంట్లో వొణుకు పుట్టింది. నా ఎనకాలే వొస్తా ఉండే పెళ్ళాం, పిలకాయిల దిక్కు పారజూసినా. వాళ్లకి ఆ సంగతి తెలీదు కదా...తెలీని పల్లికి వొచ్చిన జంకు తప్ప. అందుకనే గావాల, వోల్లేమో మామూలుగానే ఉండారు.

"ఏమల్లుడా... పుట్టి పెరిగినూరు ఇన్నాల్లకు కనబడిందా?" నిస్టురంగా ఇనిపించిన మాటలకు తల తిప్పి చూసినా. 

 కమలత్త...  నలపై ఏళ్ల ముందు మాదిరిగానే, పరుగులాంటి నడకతో వొచ్చి నా రెండు చేతులూ పట్టుకుని నలిపేస్తా, ఊగించి పారేసింది, అబిమానంగా. ఈ కమలత్త ఎప్పుడూ ఇంతే. ఇంత వొగిసొచ్చినా  మారనే ల్యా. చిన్నపుడు నేను కనబడితే చాలు, ఎక్కడున్నా పరిగత్తుకోనొచ్చి రొండు చేతులు అడ్డాం పెట్టి ఆపేసేది. "నన్ను పెళ్లి చేసుకొంటావా అల్లుడా.." అంటా ఎగతాళికి పొయ్యేది. ఆమె ఎగతాళికి సిగ్గుతో సచ్చిపోయే నాకు ఏడుపు కూడా ముంచుకొచ్చేసేది. మా ఇద్దరి చోద్యం చూస్తాఉండే అమ్మలక్కలు పగలబడి నవ్వేవోల్లు అప్పుడు నాకు బూమి ఉన్నపలంగా రొండుగా చీలిపొయ్యి పాతాళంలోకి దిగబడిపోతే ఎంత బాగుంటాది అనిపించేది. అదంతా గెవనానికి వొచ్చి ఇప్పుడు కూడా సిగ్గు పడబోయి తమాయించున్నాను.

"బాగుండావా కమలత్తా... ఇంకా కుర్రదాని మాదిరితో గెట్టిగానే ఉండావే. గునగునా పరిగెత్తతా వొచ్చేసినావు. ముసిల్దానివైపోయి, మంచంలో పడి ఉంటావనుకున్నానే నేను. సంగటి ముద్దలు బానకు గెలికి, అన్నిట్నీ నువ్వే మింగేసి మా నాగమామను ఎండబెట్టడతా ఉండావా ఏంపాడు ?" సొంతూరు గాలి తగిలినందుకేమో... ఎప్పుడూ రిజర్వుగా ఉండే నాకు ఎకసెక్కాలు పుట్టుకొచ్చేసినాయి తెలీకుండానే. పక్కనే ఉన్న నా పెళ్ళాము, మోచేతితో నడుము మీద పొడిచింది, ఇంక చాలన్నట్టు.

"
చిన్నప్పుడు మూగిగా ఉండేవాడివి గదల్లుడా, ఇప్పుడు బలే మాట్లాడేస్తా ఉండావు. అప్పుడి సిగ్గంతా ఏమైపోయ్యింది. అవున్రా... ఆ పాప నీ పెళ్ళామేనా? ఆయమ్మిదేవూరు? నా కూతురు బాగానే సానబెట్టినట్టూ ఉండాదే నిన్ను. మాటలు మా బాగానే నేర్సినావు." నా పెళ్ళాన్ని గూడా తన జట్టు కలిపేసుకొనింది కమలమత్త.

"
అవునుగానీ... శీనయ్య ఉండాడా అత్తా ఇంట్లో?" అడిగాను.

ఆమాట ఇంటానే గమ్మునైపోయిన ఆమె, మేము నిలుచుకోని మాట్లాడతా ఉండే ఈదికి తూర్పు దిక్కునుండే ఇల్లు చూపించి, దాని పక్కనుండే గుడిసిలోకి ఎల్లిపోయింది ఏదో పంగలేని పని ఉండాదన్నట్టు. మా మాటలు ఇంటానే ఉన్నాడేమో, తన తల్లి కమలత్త అటు ఎల్లగానే, లోపలినుంచి ఈదిలోకి వొచ్చి పలకరించినాడు శీనయ్య.

"
ఎప్పుడొచ్చినావు? అంతా బాగుండారా"" ఆప్యాయంగా భుజమ్మింద చెయ్యెసి ఇంట్లోకి తీసుకోనెల్తా మంచీచెబ్బర్లు అడిగినాడు.  నులక మంచం మీద కూకున్న మాకందరికీ, పెద్ద దోటి చెంబుతో చిక్కటి మజ్జిగ  తాగమని ఇచ్చింది ఒకామె. శీనయ్య భార్య అని తెలస్తానే ఉండాది, ఆమె వాలకాన్నిబట్టి.

"పిలకాయిల సాకుతోనైనా మనూరు వొచ్చిండావు, సంతోషం. మీ నాయిన కుటుంబరంతో ఊరు ఇడిసి పెట్టినాక, నువ్వు మళ్ళీ ఈపక్క కనబళ్ళేదు. ఏమైపొయ్యినావు? ఇప్పుడు ఎక్కడుండావు?" ఆరా తీసినాడు శీనయ్య.


"
నేను ఎక్కడికీ ఎల్లలేదు రా. ఆ మూల కుప్పం దెగ్గిర ఒగ ఫాక్టరీలో చిన్న ఉజ్జోగం దొరికితే అక్కడే కాపరం పెట్టినా. నీకు తెల్సు గదా. మాకు పొలము, పుట్రా ఏమీ లేవని. ఎక్కడ కూటికి దొరికితే అదే సొంతూరు నాకు. పిల్లోళ్లకు పుట్టినూరు చూపిద్దామని తీసుకోనొచ్చినాను, అంతే." చెప్పినాను.

"
ఏమ్మే రత్నా, అయిందా..." ఒకపక్క నా మాటలు ఇంటానే, ఇంగోపక్క చుట్టుగుడిసిలోకి తొంగి చూస్తా కేకేసినాడు.

"
అయిపొయ్యింది బా. ఉస్తుకాయి ఒరుగులు ఏంచుతా ఉండా, బావోల్లు, నువ్వు కాల్లుసేతులు కడుక్కోని  రాపోండి, వొడ్డించేస్తా." పెండ్లాము వోడికి ఏమాత్రం తగ్గకుండా బదులు కేకేసింది. చేతిలోని మొబైల్లో టైం చూస్తే మధాహ్నం పన్నెండున్నర దాటతా ఉండాది.

"
లేదురా. ఇంటికెళ్లి పోవాల, పనుండాది." గెట్టిగా చెప్పినా.

"
యాడికి ఇంటికెళ్లేది? నువ్వు ఫోను జేసినప్పుడే జెప్పలా. ఊళ్ళో శ్రీరామ నవమి ఉత్సవాలు జరగతా ఉండాయని. ఈరోజు సీతమ్మ, రాములోరి వసంతాలు. గుళ్లో భజన, రాములోరి ఊరేగింపు, వసంతాలు, అనాక ఉట్టి కొట్టడం. మీ పిలకాయలకోసమైనా నువ్వు ఉండాల. పిల్లోల్లకి మనూరి రాములోరి ఉత్సవ వైభోగం చూపించాల." గెట్టిగా పట్టుబట్టే సరికి నేనేమీ ఎదురు మాట్లడలేక పోయినాను.

అన్నాలు తిండమైనాక కొంచేపు యాపచెట్టు కింద ఏసిన నులక మంచం మింద నడుము వాల్చి పిలకాయిలతో నా చిన్ననాటి ఊరు సంగతులు చెప్పి మురిపించినాను. నా పెండ్లాము వసంత, పందిట్లో కూసోని ఇంటావిడతో ముచ్చట్లు పెట్టుకొనింది. 

 సాయంత్రం మూడవతా ఉంటే రాములోరి గుడికాడ మైకులో కలకలం మొదులయింది. ఉట్టి కొడతా ఉండారని జెప్పి మమ్మల్నందరినీ తీసుకోని ఊరికి ఆపక్కనుండే రాములోరి గుడికాడికి బయలుదేరినాడు శీనయ్య. పండగనే కానీ ఒక్క ఇంటిలో కూడా ఆ పండగ సంబరమే కనిపించలేదు. 

 ఇంటి గుమ్మాలకు మామిడాకుల తోరణాలు, వీధుల్లో ఈపక్కనుంచి ఆ పక్కకు పురి దారాలకు కట్టిన మామిడాకులు, వేపాకుల సరాలు, రంగురంగుల ముగ్గులు, మధ్యలో బంతి, చేమంతి, దాసాని పువ్వుల అలంకారాలు...  నా చిన్నప్పుడు శ్రీరామ నవమి అంటే ఎంత అందంగా ముస్తాబైపోయేదో మా వూరు. చూడడానికి రెండు కళ్ళు చాలేవి కావు. ఇప్పుడు మామిడాకుల తొరణాలూ లేవు... వసంతాలకోసం, తలాకిట్లలో పసుపునీళ్ల బకెట్లు కనిపించలేదు. రాములోరి గుడి దగ్గరపడతా ఉంటే, అక్కడి జనం రచ్చ కూడా పెద్దగా ఇనిపిస్తా ఉండాది.


"
శీనా... ఒకటి నాకు అర్తంగావడంలేదు. మన చిన్నప్పుడు రాములోరి ఉత్సవంలో గొడవలు ఎందుకు జరిగినాయి? నారాయుడన్నని, రమణన్న ఎందుకు నరికి చంపినాడు?" అడిగినాను నడస్తానే. శానా ఏళ్లుగా నాలో నలగతా ఉండే కొసినది. పిలకాయిలు వోల్ల అమ్మ చెయ్యి పట్టుకోని, ఇంటావిడతో కలిసి మాకు ముందు నడస్తా ఉండారు.

"
ఆ కులం తక్కువ నారాయుడు.. నా కొ... నీకు అన్నెట్టా అవతాడురా?" నా వంక ఉరిమి చూస్తూ గదిమాడు శీనయ్య.

"
మా చిన్నాయిన కూతురు మిందే వసంతాలు జల్లతాడా? దూరంనింటే రాములోరికి మొక్కతామంటే పోనీ గదా అని అల్లంత దూరంలో నిలబడి సూడడానికి ఒప్పుకున్నాము. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నా కొడుకులు. గంగాళాలలో కలుపుకొచ్చిన పసుపునీళ్లతో వసంతాలు ఆడతారా? ఆ నీళ్ళొచ్చి మా ఇంటి ఆడబిడ్డమీద పడితే మేమూరుకుంటామా. కడజాతి నాయాలిని, నరికి పాతరేయకుండా ముద్దుజేసి నట్టింట్లో పెట్టుకుంటామా?" ఉగ్రుడైపోయాడు.

"
ఇప్పుడు కూడా 'వాళ్ళని' ఊళ్లోకి రానియ్యరా..." భయపడుతూనే అడిగాను.

"
ఏంది రానిచ్చేది? వోల్ల నీడ కూడా మా మింద పడనియ్యము. కడాకు పొలాల్లో పనులకు గూడా, పిలవకుండా వోల్లని దూరం పెట్టేసినాము. కూలీ ఎక్కువైనా, మా సాటి కులపోళ్ళతోనే పనులన్నీ. మా ఎగస్పార్టీలో ఉండే ఊరి నా కొడుకులు కొందురు వాళ్ళని నెత్తిమీద పెట్టుకోని ఊరేగతా ఉండారు. అదిగో ఆ పక్కీదిలో ఆ కడజాతోళ్లతో కలిసిపోయి ఏరేగా ఉత్సవం జేసుకుంటా మా మానం, మరియాదా మంట గలపతా ఉండారు." ఆవేశపడి పోయాడు.

వాడి ఆవేశం చూస్తానే నాకు గతుక్కుమంది.

"
సరే, ఆ మాటలెందుకులే కానీ మీ అమ్మకు, నీకు పడదా..." అడిగినాను. వీళ్ళ ఇంటికొచ్చినప్పటినుంచీ ఆమె కనబళ్లేదు. సొంత కొడుకే అయినా ఈపక్క తొంగి సూడలేదు.

"
అది సంసారిదైతే గదా, ఆ లంజముండ ఆ జాతి తక్కువోళ్లతో కలిసిపొయ్యి తైతక్కలాడతా ఉండాది. ఇంట్లో గొడ్లకు పాలుదీసే కాడినుంచీ, ఒడ్లు పండించేదాకా వోళ్లు లేకపోతే దీనికి పొద్దు గడవదు. థు... ఆ బతుకు బతికేదానికన్నా, ఉరేసుకోని చావడం మేలు." క్యాకరించి తుపుక్కున ఎంగిలి ఊసేసినాడు.

అర్థమైంది నాకు. ఆపైన తెలియని భయం మొదలయింది. కూడా పక్కపక్కనే నడస్తా ఉండే నేను, శీనయ్యకు ఎడం జరిగాను. ముందు నడుస్తున్న నా పెండ్లాము, వోడి పెండ్లాముతో తెగ ముచ్చట్లాడుటా ఉండాది. నా పిలకాయిలు, వోడి పిలకాయిలమీద మట్టి పోస్తా, చిన్నచిన్న గులకరాళ్లు ఇసరతా ఆటలాడుకుంటున్నారు సంతోషంగా. నాలోని భయం ఇంకా ఎక్కువయింది. 

 ఇంతలో రాములోరి గుడి దగ్గర పడింది. అక్కడి జనాల్లో కొంతమంది వీడి చుట్టూ మూగినారు. సెల్లుఫోను మోగితే మెడలోని బ్లూటూత్ ఆన్ చేసినాను. 

 "ఏమిరా, మీ వూరు బాగుండాడా? బాగా ఎంజాయ్ చేస్తాఉండావా?” అట్నించి ఫ్రెండు... ఫ్యాక్టరీలో నాకూడా పనిచేసేవాడు. 

 ఆ బాగుండాది. నేను...

 ఫరవాలేదు, మరో రెండు రోజులు ఉండిరా, ఇక్కడ నేను మేనేజ్ చేసుకుంటానులే." ఆఫీసునుంచీ కొలీగ్ భరోసా ఇస్తున్నాడు.


"
ఆ... ఆ... సాయంత్రానికి అక్కడ ఉంటా. నైట్ షిఫ్ట్ కు జాయిన్ అయిపోతా." నా దగ్గరగా వొస్తా ఉండే శీనయ్యను చూస్తా, వోడికి ఇనిపించేటట్టు బిగ్గరగా చెప్పి, ఫోన్ కట్ చేశాను.

"
విన్నావు కదా, అర్జన్ట్ పని ఉందంట. నేను ఉన్నపళంగా వెళ్లి డ్యూటీలో జాయిన్ కావాల. వసంతా ఎనక్కి తిరుగు, ఫోనొచ్చిండాది. ఎల్లాల బిరీన ఊరికి. పిలకాయిలను తీసుకోని బయలుదేరు." కంగారు పడిపోతూ వాడికి చెబుతూనే, నా పెండ్లామును కూడా పురమాయించాను.

"
ఏందిరా, నువ్వు ఉండి రాములోరి వసంతాలు చూస్తావనుకుంటే..." వెనకనుంచీ వాడు యాష్టపోతా అనే మాటలు ఇనిపిస్తానే ఉన్నా లెక్క చేయలేదు.

బండి స్టార్ట్ చేసి, వసంతను, పిలకాయల్ని ఎక్కించుకోని పరుగులు తీయించాను.

"నా పెండ్లాము వసంత, శీనయ్య ద్వేషించే జాతి అమ్మాయేనని వాడికి తెలిసి ఉంటే..."

 శ్రీరామ నవమి పండగ వచ్చినా, పసుపు నీళ్లు ఎక్కడైనా చూసినా... ఆనాటి నా సొంతూరి అనుభవం గుర్తుకొచ్చి ఇప్పటికీ గుండె గుబగుబలాడుతుంది. ఆవెంటనే అంతులేని ప్రశ్నలు చెలరేగుతాయి నాలో.

 ఊళ్ళు మారాలని కోరుకోడం అత్యాశా?

మాలో నిజమైన నేరస్తుడు ఎవడు?

కులమతాలను మొదటినుంచీ గుడ్డిగా ద్వేషిస్తున్న శీనయ్యా... కులాంతర వివాహం చేసుకుని కూడా ధైర్యంగా సమాజానికి ఎలుగెత్తి చాటలేని నేనా...?

 నేను కాకపోతే... ఎందుకు సొంతూరునుంచీ పలాయనం చిత్తగించాను?

 మరి కమలత్త...? కొడుకును కాదనుకుని మరీ ఆమె సాగిస్తున్న జీవితం...?

---------------------------------------------

# మార్చి, 2022 న కథా కౌముది వెబ్ మ్యాగజైన్లో ప్రచురితం.
                                                

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

తాగని టీ

పువ్వాకు ఎంగిలి