పకపకా నవ్వింది ఆయమ్మ. బుగ్గన పెట్టుకోనుండే పువ్వాకును వగసారి వక్కాకుతో కలేసి వడేసి నమిలింది. కొంచెం సారాన్ని మింగింది. చూపుడు వేలు, మజ్జేలు కొంచెం ఎడంగా జేసి పెదాల మీద పెట్టుకొని మిగిలిన రసాన్ని తుపక్కన ఉమ్మేసింది. “ఏందట్టా బయపడతా ఉండావు సారూ, నేను ఊరికినే ఎవురిమిందా ఉయ్యను. నా బతుక్కు అడ్డామొస్తే గమ్మునుండను.” మళ్ళీ పకపకా నవ్వేసి అనింది. నామీద ఆ పువ్వాకు ఎంగిలి ఎక్కడ పడి బట్టలు పాడవతాయేమోనని గబుక్కున పక్కకు జరిగిన సర్దుకుని నిలబడ్డాను. ఆమె ఊంచిన ఎంగిలి, ఎవురిని నిలదీయడానికోగానీ మురుగు కాలవలో కొట్టుకొని పోతావుండాది ఊరుదిక్కు. “అదిగాదకా.. అక్కడ పెద్దపెద్ద ఆపీసర్లు జుట్లు పీక్కుంటా వుండారు. నువ్వేమో ఈడ ఇలాసంగా కూకోని పువ్వాకు, వక్కాకు కలేసి వడేస్తా ఉండావు..” అన్నాను. “చూడు సారూ.. నువ్వెందుకొచ్చినట్టు నా దెగ్గిరికి ?” తలెగరేసి అడిగింది. “ఏమీ లేదకా.. నీ కస్టం ఏందో కనుక్కొని ఎల్దామని..” చెప్పినాను. “అంటే ఉండే బూమి, ఇల్లు పోతావుంటే ఏమీ జెయ్యలేక కన్నీళ్ళు ఇడస్తా ఉంటానని వొచ్చినావా?” “అదిగాదకా.. నీకు జరిగిన అన్యాయం రాసి పేపర్లో ఏస్తే కలెక్టర్ జూసి, నీకు ...
Comments
Post a Comment