బంధం
చేతిలోని పొగలు కక్కుతున్న కాఫీతోపాటే ఆమెలో ఆలోచనలు కూడా అంతకంతకూ వ్యాపిస్తున్నాయి. అంతరంగమంతా తిరుగుతూ ఎప్పటఎప్పటివో జ్ఞాపకాలను తవ్వి బయట పడేస్తున్నాయి.
చిన్నపాటి పట్టణంలో ఊరికి కాస్త దూరంగా
విసిరేసినట్టుగా ఉన్న ఇల్లది. ఒక బెడ్రూం, హాలు, కిచెన్ అంతే. పడమటి ద్వారంతో
కట్టిన ఆ ఇంటి ముందు ఇరవై అడుగుల సిమెంటు రోడ్డు. వెనుక మరో ఇల్లు. ఆ ఇంటికి ఈ
ఇంటికి మధ్య సగానికి లేపిన గోడ, శ్లాబ్ కు అంటిన ఇనుప కమ్ముల గ్రిల్. ఇంటి పక్కనే
వీళ్ళదే ముప్పైకి నలభై అడుగుల స్థలం. మామిడి, జామ, సపోటా, దానిమ్మ. అరటి..
రకానికొకటి తెచ్చి నాటిన మొక్కలు. మనిషి ఎత్తు పెరిగిన జామ అప్పుడే కాయలు కాయడం
నేర్చుకుంటోంది. మామిడి నేలకు అంటుకున్నట్టుగా బాగా గుబురుగా పెరుగుతోంది. రోజా,
రెక్క మందారం, ముద్ద మందారం, గన్నేరు మొక్కలు విరబూశాయి. గాలికి తలలూపుతున్నాయి.
ఇంటి వెనుక ద్వారం ముందు, గ్రిల్ కు ఈవలగా
కూర్చుని కాఫీ సిప్ చేస్తున్న ఆమె చూపులు మూడు శాఖలుగా విస్తరించి ఇంకా కొంచెం
వంగినట్టుగానే నిలబడి ఉన్న గన్నేరు మొక్కపై నిలిచాయి. సత్తువ లేని ఇసుక నేలలో
నిటారుగా నిలబడలేక వంగిపోతుంటే తనే ఒక చిన్న కట్టిపుల్ల తెచ్చి, దానిపక్కనే నేలలో
పాతి, పాత చీర పేలికతో కట్టి నిలబెట్టింది.
ఆ చేర్పు గన్నేరు మొక్కకు ఎదుగుతున్నప్పుడు
అవసరమైంది. మరి తమకు..!?
ఆమెకు చిన్నప్పటి ఊరు... తమ ఇంటిముందున్న
చుట్టుగుడిసె గుర్తుకొచ్చాయి. అవెందుకు గుర్తుకొస్తున్నాయంటే అక్కడ మస్తానమ్మ
ఉండేది కాబట్టి. నిజానికి మొదట గుర్తొచ్చింది మస్తానమ్మే. తర్వాతే మిగిలిన రెండూ
కూడా. అంతేనా.. చిన్ననాటి చిట్టెమ్మ కూడా పదేపదే తలపుల్లోకి వచ్చేస్తోంది. అమ్మ
నీళ్ళకోసం చేదబావికి వెళ్ళినప్పుడు ఆమెకు తెలియకుండా మస్తానమ్మతో పంచుకున్న
కబుర్లు కూడా. మరి ఆమె కొడుకుతో ఆడుకున్న ఆటలు...
మస్తానమ్మ అయితే ఏం చేసివుండేది? ఈ సమస్యను ఏ
విధంగా పరిష్కరించి ఉండేది?
తెలియదా తనకు.. ఆమె ఏం చేసివుండేదో నిజంగానే
తెలియదా!?
--------------------
వేపచెట్టు చల్లని నీడలో నులక మంచం మీద పడుకుని
తెలుగు వాచకం తిరగేస్తోంది ఆ అమ్మాయి. ఆకుల సందులలోనుంచి దూసుకొస్తున్న సూర్య
కిరణాలు పొడలుపొడలుగా ఆ పిల్ల మీద
పారాడుతున్నాయి. వాకిలంతా పండిన రాలిన వేపకాయలతో నిండింది. తొక్కలు తొలగిపోయి బయటపడిన
కాయల గింజలు ఎండ పొడలు పడి మెరుస్తున్నాయి. ఊరిని ఆనుకుని ఉన్న అడవినుంచి
కొట్టుకొచ్చిన అడవి మండలతో అల్లిన దట్టమైన దడి ఆకుపచ్చటి వాసనలు మోసుకొస్తోంది. ఆ
దడిలోనుంచి అక్కడక్కడ తొంగిచూస్తున్న కొమ్మి మండల విరిగిన రెమ్మలకు ఉబికి వచ్చిన
పసుప్పచ్చటి కొమ్మి సాంబ్రాణి గుడ్లుగుడ్లుగా కనిపిస్తోంది. కొమ్మి సాంబ్రాణి ధూపమంటే
ఎంత ఇష్టమో ఆ పిల్లకు.
మండుతున్న పొయ్యిలోనుంచి ఒక కొరివిట్టి
లాక్కునివచ్చి, ఈ కొమ్మి సాంబ్రాణి గిల్లి ఆ నిప్పుమీద చల్లినామంటే పసుప్పచ్చటి
పొగలతో అదోరకమైన గమ్మత్తైన సువాసన చుట్టుముడుతుంది.
చదువుతున్న తెలుగు వాచకం పక్కన పడేసి పైకి
లేచింది ఆ పిల్ల. “అమ్మా.. పొయ్యి మండతా ఉండాదా? నాకు ఒక కొరివికట్టి ఇస్తావా?”
పిలుస్తూ ఆ పక్కనే ఉండే రెండు నిట్రాళ్ళ సపారలోకి వెళ్లబోయింది. వంటావార్పూ చేసేది
ఆ సపారలో వెలిగించే మట్టిపొయ్యి మీదే.
“చిట్టెమ్మా.. అమ్మ ఉండాదా?” ఎవరో పిలిచినట్టు
అనిపించడంతో వెనుదిరిగి చూసింది.
తలవాకిట్లో చేతిలో చిన్న కుండపెంకుతో
నిలబడివుంది ఒక ఆడది. వెడల్పాటి ముఖం. నుదుటిన నాగపడగ ఆకారంలో పచ్చబొట్టు. బండ
ముక్కు, పగిలిన పెదాలు. ఎత్తైన బుగ్గలు. సాధారణ పల్లెటూరి మహిళలకంటే మొరటుగా ఉన్న
ఆ ఆడదాని మొరటు ముఖంలో ఏదో తెలియని కళ కూడా కనిపించి విడ్డూరమనిపించింది
చిట్టెమ్మకు. తర్వాత తెలిసింది ఆ కళ ఏమిటో.. ఎందుకు ఆ బండ ముఖంలో కనిపిస్తుందో.
“నా పేరు చిట్టెమ్మ కాదు, అసలు ఎవరు నువ్వు?”
కొంచెం విసురుగానే అడిగింది.
“మీ పేరు ఏందో నాకు తెలీదమ్మా. తెల్సినా ఎవుర్నీ
పేరుపెట్టి పిలిచే అంతటోల్లం కాదు చిట్టెమ్మా. అందుకే తులశమ్మ బిడ్డకాబట్టి
చిట్టెమ్మ అని పిల్సినాను తల్లీ. పొయ్యి రగలతా ఉంటే ఇంత నిప్పుగల్లు కావాలమ్మా.”
చేతిలోని కుండపెంకు ముందుకు చాస్తూ చెప్పింది.
“ముసిలోడికి పొద్దు గూట్లో పడగూడదు.. గిన్నిలో
ముద్ద పడాలి..” స్వగతంగా గొణుక్కుంది.
“ఎవరే అదీ..” అడుగుతూ పాకలోనుంచి ఈవలకు వచ్చింది
తులశమ్మ.
“నేనమ్మా, మస్తానమ్మను. నిప్పుగల్లుకోసం
వొచ్చినానమ్మా..” ఆ వెడల్పాటి ముఖం కలిగిన ఓ మోస్తరు లావుపాటి ఆడది ఒకడుగు వెనక్కు
వేసి సమాధానం ఇచ్చింది.
“ఏందే, నిప్పుగల్లు అడగతా ఉండావు.. ఏంది కత? మంగలిశెట్టికి
మాంసం కూరాకు వండి విందు బోజనం పెడతా ఉండావా ఏంది..” అదోరకం వ్యంగ్యంతో కూడిన
మాటలు అన్నది తులశమ్మ.
“లేదమ్మా, ఆ ముసిలోడికి మాంసం కూరొకటే
తక్కవయింది. అయినా మా ఎట్టి బతుకులకు మాంసాలు, ఇందు బోజనాలూ యాడనించి వస్తాయమ్మా. కోడి
కూతతోనే లేసి గొరిగేదానికి పక్కూరు ఎళ్లిన సచ్చినోడు, పొద్దు తీర్థాల కొండ ఎనక్కు జారుకుంటాదనంగా
గుడిసి గడప తొక్కినాడు. పది మైళ్ళు నడిచి వొచ్చినాడు గదా.. శోష వొచ్చినట్టు
ఏలాడిపోతా ఉండాడు. ఆ ఊళ్ళో ఇంత ముద్దన్నా ఎవురన్నా కబళం ఏసినారోలేదో. ఇన్ని గెంజి
నీళ్ళన్నా కాసి పోద్దామని..”
“అంటే.. ఊరోళ్ళు అందురూ నీ మిండగాడి దగ్గర మంగలి
పని చేయించుకొని కూడయినా ఎయ్యకుండా మిమ్మల్ని మాడబెడతా ఉండారనా నీ ఉద్దేశం.
మంగలిశెట్టిని గూడా ఇన్నాళ్లుగా చూస్తా ఎరిగి ఉండాముగానీ, నీ మాదిర్తో రైతుల మీద
ఇరగబడడం నేను ఎప్పుడూ జూళ్ళా..”
“అయ్యో తల్లీ నన్ను అపార్తం జేసుకుంటా ఉండారు.
నేనామాట అన్లా. ముసిలోడు ఆకలితో
ఉండాడేమో.. గుక్కిడు గెంజి కాసి పోద్దామని నిప్పుగల్లుకోసరం వొచ్చినానని చెప్తా
ఉండాను అంతేనమ్మా.”
“నువ్వీ ఊరొచ్చి నాలుగు దినాలవతా ఉండాదా..
అప్పుడే ఊరు మీద ఇరగబడి పోతావుండావే. అయినా ఇంత కండకావరం పనికిరాదే నీకు మస్తానా.”
పక్కింటి పశువుల కొట్టంలో బర్రెలకు గెడ్డివామినించీ పెరక్కొచ్చిన ఎండుగడ్డి పరకలు
మేతగా వేస్తున్న ఓబులమ్మ అందుకుంది.
అంతే.. మళ్ళీ ఒక్క మాట మాట్లాడలేదు మస్తానమ్మ.
చేతిలోని కుండ పెంకును కింద పడిపోతుందేమో అన్నంత గట్టిగా బిగించి పట్టుకుని అలాగే మౌనంగా
నిలబడింది.
“అయినా పొద్దు గూట్లో పడినాక నీకు నిప్పుగల్లు
ఎవురు ఇస్తారే తిక్కదానా. మడిమట్టు, మంచీమర్యాదా, పద్ధతిపాడూ లేవు నీకు. ఉంటే
కాటికి కాళ్ళు జాపుకున్న ముసిలోడు మంగలిశెట్టిని తగులుకుంటావా. అదిగూడా ఎవుడితోనో కడుపు
జేసుకొని గన్న కొడుకుతో దిగిపొయ్యి. నిన్నుగాదు, ఆ శెట్టిని మొగం మీద క్యాకరించి
ఊంచాల. మదంబట్టిన ఆటలు ఆడతా ఉండారు వోడూ, నువ్వూ గలిసి. ఆ ముండమోపోడికి లేవు సరే, సిగ్గూ శరం నీకు ఉండొద్దా అని.”
వంగిపోయిన నడుముమీద ఒక నీళ్ళ బిందె పెట్టుకుని. రెండో చేతితో నిండుగా ఉన్న సత్తు
బకెట్ మోసుకుంటూ చేదబావి దగ్గరినుంచి ఇంటికి వెళ్తున్న వనవ్వ తలవాకిట్లో బకెట్
కింద పెట్టి గస తీర్చుకుంటూ ఆ కాసేపట్లోనే దులిపేసింది.
పక్కనే ఉన్న ఊర్లోని హైస్కూల్లో ఆరవ తరగతి చదువుతోంది
ఆ పిల్ల. తను ఉన్న ఊర్లో ప్రాథమిక పాఠశాల తప్ప ఉన్నత పాఠశాల లేదు. అందుకే సుమారు
పదీపదిహేనుమంది పిల్లలు రోజూ అయిదారు మైళ్ళ దూరంలోని పక్క ఊరికి పొలాల గట్ల మీదుగా
నడుచుకొని వెళ్ళి మరీ హైస్కూల్లో చదువుకుంటున్నారు. రెండవ శనివారం కలిసి రావడంతో
రెండు రోజుల సెలవులు. తెలుగు సబ్జక్ట్ అంతే చాలా ఇష్టం ఆమెకు. వీధి వాకిలికి ఈవల
రెండు నిట్రాళ్ళ సపార ముందు నిలబడివున్న ఆ అమ్మాయికి ఆ ఆడవాళ్ళ మాటలు సరిగా అర్థం
కాలేదుకానీ, అందరూ కలిసి మస్తానమ్మ అనే ఆ స్త్రీని తిట్టిపోస్తున్నారని తెలిసి మాత్రం
తెలుస్తోంది. కుక్కురుమనకుండా ఆ తిట్లను భరిస్తున్న ఆమెను చూస్తుంటే అయ్యోమనిపించింది.
మంగలిశెట్టి చాలా చిన్నప్పటి నుంచీ తెలుసు
ఆమెకు. పల్లెటూర్లో తమ ఇంటి ముందున్న పేడదిబ్బ పక్కనే చిన్న గుడిసె వేసుకుని
ఉన్నాడు ఆయన. ఆమె పుట్టినప్పటినుంచీ ఎరుగును మంగలిశెట్టిని. నాన్నకే కాదు,
ఊరందరికీ కటింగ్, షేవింగ్ చేసేది ఆయనే. అందుకు ప్రతిఫలంగా మంగలిశెట్టికి దక్కేది
రెండు పూటలా ఇంత ముద్ద, ఏడాదికోమారు రైతులు దయతలచి ఇచ్చే ఇన్ని మేర గింజలు.. అంతే.
ఈ మస్తానమ్మ ఎవరో.. మంగలిశెట్టి ఇంటికి ఎందుకు
వచ్చిందో తెలియలేదు చిట్టెమ్మకు. ఆమెను తిట్టిపోస్తున్న ఆడవాళ్ళ మాటలను బట్టి, ఆమె
తన కొడుకుతో కలిసి మంగలిశెట్టితోనే ఉన్నదని మాత్రం అర్థం అయింది.
**********************
“ముడ్డి కిందికి ఏళ్లు వస్తావుండాయి కానీ,
బుద్ధి రాలేదెసే నీకు. ఆ కులం తక్కవొడితో ఆడొద్దని ఎన్నిసార్లు జెప్పినా నీకు?”
ఎడమ చేతిలో ఉన్న నీళ్ళ బకెట్ ను నేలమీద పెట్టి, పక్కనే ఉన్న కంప పుల్లను ఇంచుకుని
దాంతో ఫెడీ ఫెడీ మని పిర్రల మీద తగిలించింది కూతురుకు తులశమ్మ. ఒళ్ళంతా కోపంతో
అదిరిపోతోంది ఆమెకు. చంకలో నిండుగా ఉన్న బిందెలో నుంచి నీళ్ళు తొణికి కింద
పడుతున్నాయి.
“వోలమ్మల్లో.. వోయక్కల్లో.. మాయమ్మ నన్ను
చంపేస్తా వుండాదిరో...” పూలపూల పావడకింద ఎర్రగా కమిలిపోయిన పిర్రలు తడుముకుంటూ
వీధిలో పరుగులు పెట్టింది చిట్టెమ్మ.
“ఈసారి ఆ మస్తానమ్మతో కానీ, ఈ లండీకొడుకుతో గానీ
కనబడు చెప్తాను.. చెవడాలు ఊడదీస్తా.” చేతిలోని కట్టిపుల్లను దూరంగా విసిరేసి.
నేలమీద ఉంచిన బకెట్ ను తిరిగి చేతిలోకి తీసుకుంది తులశమ్మ.
తీర్థాల కొండకు, ఊరికి మధ్య వ్యాపించిన చిట్టడవిని ఆనుకుని ఉన్న ఆశ్రమంలో భజన ఉందంటే,
పక్కింటి ఓబులమ్మతో కలిసి వెళ్ళింది తులశమ్మ. ఆశ్రమమంటే ఏమీలేదు. నాలుగు
నిట్రాళ్ళు నిలబెట్టి, పెండ్యాలు కట్టి, వాటిమీద బోద కసువు కప్పిన సపార, అంతే.
డానికి గోడలు కూడా లేవు. అటూ ఇటూ వాలుగా కప్పును వంచి గుంజలతో నిలబెట్టారు అంతే.
చిత్తానూరునుంచి వచ్చిన కర్ణమోళ్ళ యశోదమ్మ పూనుకుని ఆ సపార వేయించింది. మొగుడు
కాలం చేశాక బిడ్డలను కాదనుకుని ఈ ఊరు చేరింది ఆయమ్మ. అక్షరం ముక్కలు రాని ఆ వూరి
ఆడవాళ్లకు యశోదమ్మ మాట వేదవాక్కుగా మారింది. ఆధ్యాత్మికత వైపు తిప్పింది నెమ్మదిగా
యశోదమ్మ వాళ్ళను. ఇప్పుడు ఆమె పెట్టిన భజన కార్యక్రమానికే తులశమ్మ, ఓబులమ్మ వెళ్ళి
ఉండేది.
సాయంత్రం ఆరు గంటలకే వచ్చేశారు ఇంటికి పొలం
పనులు ముగించుకుని తులశమ్మ, ఆమె భర్త నారాయణ. నారాయణ ఏడు గంటలకే ఇంత ముద్ద నోట్లో
వేసుకుని పందిట్లో వేసిన నులకమంచం మీద అప్పుడే గుర్రు పెడుతున్నాడు.
ఏడవ తరగతి చదువుతున్న ఆ పిల్ల, నిద్రపోతున్న
ఏడేళ్ళ తమ్ముడికి కాపలాగా ఇంట్లోనే ఉంది.
బయట పుచ్చపువ్వులా కాస్తున్నది వెన్నెల. పున్నమి
వెళ్ళిన రెండో రోజేమో.. పరిసరాలు వెన్నెలలో మెరిసిపోతున్నాయి.
అదిగో, అప్పుడు వాకిట్లోకి వచ్చింది మస్తానమ్మ. “చిట్టెమ్మా..
చిట్టెమ్మా..” అంటూ గొంతు తగ్గించి పిలిచింది.
“మస్తానమ్మా.. రా.. రా.. మాయమ్మ ఇంట్లో లేదులే..
రా..” సంబరంగా లేచి పందిలి దాటుకుని ఇవతలకు వచ్చి నిలబడింది చిట్టెమ్మ.
“నేను గూడా జూసినానమ్మా, మీయమ్మ ఓబులమ్మతో కలిసి
ఆశ్రమం కాడికి ఎల్లబారడం. అందుకే గదా చిట్టెమ్మా.. వొచ్చింది. ఇదిగో.. ఈ
తాటిముంజెలు ఎంత తియ్యగా ఉండాయో జూడు. ముసిలోడు గొరిగేదానికి పొయ్యినప్పుడు యాడనో
కొట్టకొచ్చినాడు.” పెద్దపెద్ద బూరగాకులు రెండు చేర్చి కుట్టిన దొన్నె
చేతికిచ్చింది. నోరు ఊరిపోయింది లేతగా జవజవలాడుతున్న ముంజెలు చూడగానే ఆ పిల్లకు.
వెనక్కు తిరిగి పందిట్లోకి చూసింది. నాయన ఎద పైకీ కిందికీ కదులుతోంది. గురక
వినిపిస్తోంది. అంటే గాఢ నిద్రలో ఉన్నాడన్న మాట.
చటుక్కున లాగేసుకోబోయింది ఆ బూరగాకుల దొన్నెను
చిట్టెమ్మ. ఇవ్వలేదు మస్తానమ్మ. వెనక్కు తీసేసుకుంటూ, రెండో చేతితో ఆ పిల్లను
జవురుకుని పందిలి ముందు కాగితాల పూల చెట్టు కింద వేసివున్న రాతిబండ మీద కూర్చుంది.
“అనగనగా ఒక రాజ్యమంట. ఆ రాజ్యాన్ని పాలించే
రాజుకు చిట్టెమ్మ అనే కూతురు ఉండాదంట...” కొండలు, కోనలు, నదులూ అరణ్యాలు,
రాక్షసులూ, మాంత్రికులూ, మునులు దేవతలూ.. వింతైన లోకంలోకి తీసుకు వెళ్లిపోతోంది
మస్తానమ్మ. ఆమె చేతిని పట్టకుని వచ్చిన తనకన్నా చిన్న వయసు బుడ్డోడితో కలిసి కళ్ళు
విప్పార్చుకుని వింటూ, తాటిముంజెలు జుర్రుకుంటూ ఆ ఊహాలోకంలో అబ్బుర విహారం
చేస్తోంది చిట్టెమ్మ.
*****************************
ఇంటి లోపల డైనింగ్ టేబుల్ మీద పెట్టిన మొబైల్
రింగ్ అవడంతో చేతన ఆలోచనలకు తెగిపోయాయి. వెళ్ళి తీసి చూసింది. అదే.. దీప. ఆన్
చేసింది.
“మమ్మీ, ఆలోచించుకున్నావా? ఏం డిసైడ్ చేశావ్?” దాదాపు
నెల్లాళ్ళుగా వింటున్న అదే ప్రశ్న రిపీట్ చేసింది.
“ఎవరు చేతూ, అమ్మాయేనా?” బెడ్రూం లోనుంచి
బలహీనమైన గొంతు.
“ఆ.. అవును బాలూ, అమ్మాయే. నీకు డయాలసిస్ మళ్ళీ
ఎప్పుడు చేయంచాలి అని అడుగుతోంది.” ఫోన్ ఆన్ లోనే ఉంచి సమాధానం ఇచ్చింది.
“పిచ్చిపిల్ల, నేనంటే ఎంత ప్రేమో. అమ్మాయి
దగ్గరికి వెళ్లిపో చేతూ అంటే వినడం లేదు నువ్వు.” కంప్లయింట్ చేస్తున్నట్టున్న ఆ
గొంతులో విషాదపు జీర.
“సరే లే, వెళ్తాను. ఇదిగో ఇప్పుడే అమ్మాయితో
మాట్లాడి వచ్చేస్తా, మనం హాస్పిటల్ కు వెళ్దాం.” మృదువుగా అని, ఇంటి వెనుక ద్వారం
వద్దకు చేరుకుని చైర్లో కూర్చుంది చేతన.
“అంటే నువ్వు మారవా? ఆయనను వదిలి రావా?” ఇద్దరి
సంభాషణ వింటూనే ఉన్న దీప రెట్టించింది.
“విన్నావుగా, బాలూ ఏమన్నాడో. నీకు తనంటే ప్రేమట.
అది ఆయన ఊహ ఉత్తిదేనని నేను ఎప్పుడూ చెప్పలేదు, ఇకమీదట కూడా నిజం చెప్పి, అసలే
అస్వస్థతలో ఉన్న ఆ మనసును గాయపరచలేను. ఇందాకా అడిగావుగా, ఆలోచించుకున్నావా అని.
ఆలోచించుకున్నాను, నువ్వు జేమ్స్ ను వదిలించుకున్నంత ఈజీగా నేను బాలూను
విడిచిపెట్టలేను. మీ తరానికి లివ్ ఇన్ రిలేషన్షిప్ లు- మనసులు పంచుకోవడానికా లేక
దేహ వాంఛలను తీర్చుకోవడానికా... నాకు ఎప్పటికీ కన్ఫ్యూజనే.”
“మమ్మీ.. మళ్ళీ సోది అందుకున్నావా..”
“లేదే దీపూ. నాకునేను చెప్పుకుంటున్నాను.
ఇందులోనే నీ ప్రశ్నకు సమాధానం కూడా దొరకొచ్చేమో, కొంచెం ఓపికగా విను. మా తరం మీలా
కాదు. కంటికి నదురుగా కనిపించగానే అతుక్కుపోయి- బర్త్ డే గుర్తు
పెట్టుకోలేదనో, వ్యాలంటైన్స్ డేకి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వలేదనో
రాత్రికిరాత్రి విడిపోయి... ఉదయానికల్లా మరో రిలేషన్షిప్ లోకి వెళ్లిపోగలిగే లివ్
ఇన్ లు మాకు తెలియవు. అవసరాలకోసం దగ్గరవడం, అవి తీరగానే లోపాలను వెదికి దూరంగా
పారిపోవడం లేదా ద్వేషం పెంచుకోవడం... అట్లీస్ట్ నాకు నచ్చని వ్యవహారం. పెళ్ళిళ్ళు
అయి, ఎవరికివారం సంసారాలు సాగించాక ఎందుకు కలిశామో తెలియదు.. మలి సంధ్యలో కలిశాం.
రోగమనో, చాకిరీ చేయడం కష్టమవుతున్నదనో ఇప్పుడు విడిపోలేను. బాలూను ఈ పరిస్థితుల్లో
వదిలి, నీదగ్గరకు రాలేను, సారీ.”
“అంతేనా, ఇదేనా ఫైనల్.”
“అవును, ఇదే ఫైనల్ డెసిషన్. కానీ ఒకమాట. ఇంకొకరితో
రిలేషన్లోకి వెళ్ళినా ఈ ఇంట్లో చోటు ఉంటుంది నీకు. ఎప్పటిలా మా ఇద్దరి ప్రేమ కూడా
దొరుకుంది. ప్రేమకు సరయిన నిర్వచనం నాకు తెలియదు కానీ, ప్రేమంటే అవసరాలు
తీర్చుకుని వదిలేసే స్వార్థం మాత్రం కచ్చితంగా కాదు.”
చేతన ఇంకా ఏదో మాట్లాడబోయింది కానీ, కాల్
కట్టయింది. ఇప్పుడిప్పుడే ముడుతలు పడుతున్న ఆమెలో తెలియని ప్రశాంతత అలముకుంది.
చిన్నప్పుడు మస్తానమ్మలో చూసిన అదే కళ... ఇప్పుడిప్పుడే ముడుతలు పడుతున్న తులశమ్మ ముఖంలో.
“నా కులమేందో తెలీదు, మతమేందో తెలీదు. సిన్నబిడ్డను
చంకనేసుకొని కడుపు చేత్తో పట్టుకోని అంగలారస్తా ఈ వూరొవచ్చినప్పుడు గుడిసిలో
చోటిచ్చినాడు. కడుపుకింత కూడు, ఈ ఒంటికింత బట్ట పెట్టినాడు. మంగలిపని చేయలేక
ముసిలోడు మూలపడినాడని, పనిచేసి సంపారిచ్చలేక పోతావుండాడని ఇప్పుడు నేను శెట్టిని
ఇడిసిపెట్టి పోతే, నాకూ గొడ్డుకూ తేడా ఉంటాదా? నేనంత పాపకర్మురాలిని కాలేనమ్మా. ఆశ్రమం
కట్టిచ్చిన కర్ణమోళ్ళ యశోదమ్మ కూడా ఎప్పుడూ ఇదేమాట చెప్తావుంటాది. ఒక మనిషి మనల్ని
నమ్మినాక కట్టి కాలేదాకా తోడుగా ఉండాలంట. ఎన్ని కష్టాలొచ్చి నెత్తిమీద పడ్డా, ఒకరిని ఒకరు వొదులుకోకూడదంట.” ... మస్తానమ్మ మాటలు
చేతన- అదే, చిట్టెమ్మ చెవుల్లో గింగురుమంటున్నాయి.
అక్కడ ఆమెకు కూడు, నీడ దొరికింది. ఇక్కడ తనకు కుటుంబ
హింస గడిచాక, బాలూ సాంగత్యంలో నిజమైన ఆత్మీయత దక్కింది.
“లేచి రెడీ కండి, హాస్పిటల్ కు వెళ్ళివద్దాం.”
మూగబోయిన మొబైల్ స్క్రీన్ మీద నవ్వుతున్న దీపూను చూస్తూ ఇంట్లోకి నడిచింది ఆమె.
దు:ఖేష్వనుద్విగ్నామనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే
అంటే... దు:ఖాలలో మనసు కలత చెందని వాడు, సుఖాలపట్ల కోరికలు లేనివాడు, అనురాగము, భయము, కోపము నశించినవాడు... అయిన
వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటున్నాడు గీతాకారుడు. అనగా మానవ సంబంధాలలో, అది ఎటువంటిదైనా కావచ్చు.. స్థిరత్వం, భావోద్వేగ నియంత్రణ, సమభావం ఉండాలి. అప్పుడు లభించే ప్రశాంతత ఉత్తమమైనది...
దూరంగా ఉన్న గుడిలో సాగుతున్న భగవద్గీతా ప్రవచనం, గాలి తరగలపై తేలివస్తోంది.
*****************************************************
"ఈమాట" వెబ్ మాసపత్రికలో జూలై, 2025 న ప్రచురితం.
Comments
Post a Comment