నేరేడు పండ్లు

కిటికీ అద్దం కొంచెం పక్కకు జరిపి చూసింది ఖుషీ. ఎప్పటిలాగే ఆ పిల్లాడు చేయి ఊపాడు. వాడి రెండో చేయి కొమ్మను పట్టుకుని ఉంది. కోతిలా వేలాడుతున్నాడు. వాడే కాదు, ఇంకా మరికొంతమంది పిల్లలు అదే చెట్టుకు ఉన్న కొమ్మలమీద కూర్చుని, దూకుతూ, మళ్ళీ ఎక్కి ఊగులాడుతూ.. ఎంత సందడిగా ఉందో అక్కడ. ఒకటి, రెండు, మూడు... లెక్కపెట్టింది. మొత్తం ఆరేడు మంది ఉండవచ్చు. పైన దట్టంగా ఉన్న రెమ్మల మధ్య ఒకరిద్దరు ఉన్నట్టున్నారు దాక్కుని, సరిగా కనిపించడం లేదు. అందరి కళ్ళు మెరుస్తున్నాయి.

ప్రతిరోజూ వాళ్ళను చూస్తూనే ఉంటుంది. వారిలా ఆటలాడాలన్న ఉబలాటం ఆ పిల్లను సీటుమీద నిలువనీయాడు. అలాగని ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తి వెళ్ళే పరిస్థితీ లేదు.

వాళ్ళ కళ్ళల్లో ఆ మెరుపేమిటో ఆలోచిస్తూ అలా వెనక్కు చేరగిలబడిపోతుంది. అలా చేరగిలబడే సమయంలోనే ఆ పిల్లాడు చేయి ఊపాడు.

చేయి ఊపింది తను కూడా.

“రైట్... రైట్...” క్లీనర్ కేకతోపాటు ఆ కార్పొరేట్ స్కూల్ బస్సు కదిలింది నెమ్మదిగా.

“హేయ్ ఎవరక్కడ విండో ఓపెన్ చేసింది. ఆ కాలనీ పిల్లలను చూస్తే మీరు కూడా అలా తయారై చెడిపోతారు. క్లోజ్ ది డోర్.” ఇంగ్లీష్, తెలుగు కలగలిసిన సంకర భాషలో కరుకుగా వినిపించిన గొంతుకు అదిరిపడింది. మూసేయబోయింది.

“ఏయ్... ఇదిగో తీసుకో...” బస్సుతోపాటు పరుగెడుతూ నల్లటి చిన్నచిన్న గోలీల లాంటి పండ్లు ఏవో ఉన్న ప్లాస్టిక్ కవర్ ఉన్న చేతిని విండో లోనుంచి లోపలికి పెట్టాడు.

“ఎందుకు? ఏమిటివి?” అడిగింది బెదురుగా, బస్సులో దూరంగా సీట్లో కూర్చున్న టీచర్స్ ను చూస్తూ.

“చాలా బాగుంటాయ్, తిను...” సంశయిస్తున్న ఆమె చేతిలో ఆ కవర్ ను ఉంచేసి, అంతదాకా పట్టుకున్న విండో రాడ్ ను వదిలేశాడు వాడు. వాడే, ఆ “కోతి” పిల్లాడు.

“మా చెట్టులోనే కాశాయి.” వెనక్కి వెళ్లిపోతున్న అతడి మాటలు గాలిలో కలిశాయి.

ఒడిలో ఎక్కడ పడుతుందోనని చటుక్కున అందుకుంది. అటుఇటూ చూసి స్కూల్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులో దాచేసింది.

మరో అయిదారు నిముషాలకల్లా ‘కోతి’ పిల్లలను చూసిన కాలనీకి పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్ ముందు ఆగింది స్కూల్ బస్సు. బిలాబీల లాడుతూ దిగిపోయారు అందులోనుంచి ఓ పదిమంది దాకా పిల్లలు. వారిలో ఎల్కేజీ నుంచి టెంత్ దాకా చదువుతున్న పిల్లలున్నారు.

“కొంచెం ఆగవే.. నేనూ వస్తున్నాను.” పరుగులాంటి నడకతో అపార్ట్మెంట్ గేటువైపు వెళ్లిపోతున్న ఒక అమ్మాయిని ఆపింది. ఆగిన ఆ అమ్మాయి వెనుదిరిగింది చూసింది.

నిజమే... ఇంతకుముందు ఆ ‘కోతి’ పిల్లాడి కళ్ళలో కనిపించిన మెరుపు దీని కళ్ళల్లో లేదు. మరి తన కళ్ళల్లో... ఏమో ఇంతదాకా గమనించలేదు.

గబగబా ఆమెను దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఆగిన పిల్ల పిలుస్తున్నా వినిపించుకోలేదు. లిఫ్ట్ ఎక్కి, తమ ప్లాట్ ముందు ఆగి కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది.

“హేయ్ హనీ వచ్చేశావా? కమాన్ కమాన్, నీకోసం స్నాక్స్ రెడీ చేసేశా. అదిగో అక్కడ టేబుల్ మీద పెట్టాను, వాష్ రూమ్ కు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తిను.” కిచెన్ గట్టు మీద ల్యాప్ తో కుస్తీ పడుతూనే స్టవ్ మీద బాణలి లో ఏదో చేస్తున్న మమ్మీ చెప్పింది. ఆమెది వర్క్ ఫ్రమ్ హోమ్.

“క్విక్, మళ్ళీ టైమ్ వేస్ట్ అవుతుంది. రేపు స్లిప్ టెస్ట్ ఉందిగా, ప్రిపేర్ కావాలి బాగా. నిన్న క్లాస్ లో థర్డ్ ప్లేస్ ఆని చెప్పావు. షేమ్ కదా, రేపు ఫస్ట్ ప్లేస్ రావాలి.” డోర్ ఓపెన్ చేసిన డాడ్ ఆర్డర్ పాస్ చేసి నైట్ షిఫ్ట్ కు రెడీ కాసాగాడు. ఆయన కూడా మమ్మీలాగే సాఫ్ట్వేర్.

ఎందుకో ఎన్నడూ లేనిది ఏడుపు తన్నుకు వచ్చింది. కంట్రోల్ చేసుకుంది. లేదంటే మళ్ళీ క్లాస్ పీకుతారు.. కాలనీ పిల్లల్లా ఆ ఏడుపెందుకని.

“ఎక్కడికి వెళ్తున్నావు బ్యాగ్ తీసుకుని దాన్ని అక్కడ ఆ సోఫాపై పడేసి వెళ్ళు.” చెప్పింది మమ్మీ.

డేంజర్ అలా చేస్తే. ఒకవేళ ఆ పిల్లాడు ఇచ్చిన అదేవో ఫ్రూట్స్ వీళ్ళు కనుక చూసేసేస్తే... ఇంకేమన్నా ఉందా...

“లేదు మమ్మీ... టైంటేబుల్ మార్చి పెట్టుకోవాలి కదా బుక్స్, అందుకే స్టడీ రూమ్ లోకి తీసుకెళ్తున్నా.” సమాధానం ఇచ్చి వెంటనే రూమ్ లోకి దూరిపోయింది.

గబగబా జిప్ ఓపెన్ చేసి బ్యాగులోనుంచి ప్లాస్టిక్ కవర్ బయటకు తీసి బుక్స్ రేక్ లో దాచేసింది.

వాష్ రూమ్ కు వెళ్ళింది. మళ్ళీ గుర్తుకొచ్చాడు ఆ ‘కోతి’ పిల్లవాడు. తన కళ్ళల్లో ఉన్నదా ఆ పిల్లాడి కళ్ళలో కనిపించిన మెరుపు?

గోడకు ఫిక్స్ చేసిన అద్దం ముందు నిలబడింది. చెమ్మ పడిన అద్దం, మసకగా ఉండి సరిగా కనిపించలేదు. పక్కనే ఉన్న కొలిన్ లిక్విడ్ స్ప్రే చేసి టిష్యూ పేపర్ తో తుడిచింది. ఇప్పుడు క్లీన్ గా ఉన్న అద్దంలోకి కళ్ళు విప్పార్చుకుని చూసింది. ఊహూ... మెరుపు కనిపించలేదు.

ఒకవేళ... అద్దంలాగా కళ్ళు ౠజర కమ్మాయేమో. అందుకే మెరుపు కనిపించడం లేదేమో. అదోరకమైన కసి రేగింది. ఎదురుగా ఉన్న కొలిన్ లిక్విడ్ కళ్ళలోకి స్ప్రే చేసుకుంది. భగ్గున మండాయి. చటుక్కున మూసేసుకుంది కానీ, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. పదేపదే కళ్ళు వాష్ చేసుకుని నెమ్మదిగా తెరిచింది. కళ్లయితే కొలిన్ ప్రభావంతో ఇంకా మండుతున్నాయి, మెరుపు మాత్రం కనిపించలేదు. పైగా చీకట్లు కమ్ముకుంటున్నాయి చూస్తున్న కొద్దీ.

కళ్ళలోనుంచి అద్దంలోకి, అక్కడినుంచీ వాష్ రూమ్ అంతటా ఝుమ్మంటూ వ్యాపించాయి. ఎంత పిల్లని ఖుషీ... పట్టుమని పదమూడేళ్ళు కదా.

భయపడిపోయింది ఆ చీకట్లకు. తను కళ్ళల్లో మెరుపుకోసం వెదికి, కొలిన్ స్ప్రే చేసుకోవడంవల్లే ఇది జరిగిందని మమ్మీ డాడీలకు తెలిసిపోతుందేమోనని అంతకన్నా భీతిల్లిపోయింది. గబగబా ముఖంమీద నీళ్ళు కొట్టుకుని వాష్ రూమ్ నుంచి బయటకు వచ్చేసి టవల్ తో తుడిచేసుకుంది.

“అయిందా...” మమ్మీ కేకతో పరుగున వచ్చి టేబుల్ మీద ఉంచిన స్నాక్స్ తింది. డ్యూటీకి వెళ్తూ వెళ్తూ డాడీ మిల్క్ ఇస్తే తాగింది. మూతి నేప్కిన్ తో తుడుచుకుని స్టడీ రూమ్ కు వెళ్ళిపోయింది.

కళ్ళలోనుంచి బయలుదేరి వాష్ రూమ్ అంతటా వ్యాపించిన చిమ్మ చీకట్లే గుర్తుకొస్తున్నాయి ఇంకా. దానికిమించి రేపు స్లిప్ టెస్ట్ లో క్లాస్ ఫస్ట్ రాకపోతే మమ్మీ డాడీలు చేసే రాద్ధాంతం కూడా.

బుక్ చేతిలోకి తీసుకుంటుంటే జారి కిందపడింది బ్యాగ్ లోనుంచి, ఇంతకుముందు ఆ ‘కోతి’ పిల్లాడిచ్చిన ప్లాస్టిక్ కవర్.

నల్లగా, ఒవెల్ షేప్ లో ఊరిస్తూ కనుపించాయి అందులోని పండ్లు. గబుక్కున చేతిలోకి తీసుకుంది ఖుషీ. ఆ ఫ్రూట్స్ ఏమిటో తెలియలేదు ఆ అమ్మాయికి. అలాగే కాసేపు చూసింది. ఇంతలో ఒక అయిడియా ఫ్లాష్ అయింది. ల్యాప్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ చేసింది. తెలిసింది... ‘నేరేడు పండ్లు’. ఎప్పుడో చాలా చిన్నప్పుడు... అప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ ఉంటుందేమో. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఈ పేరుగల పండ్లు ఏవో తిన్నట్టు లీలగా గుర్తుకొచ్చింది. కొంచెం వగరు. చాలా తీపితో ఉండే అద్భుతమైన రుచి కూడా. నోరు ఊరిపోయింది.

అయినా ఆ పిల్లాడికి ఈ ఫ్రూట్స్ ఎక్కడివి? అసలు వాళ్ళు ఆ చెట్టుకొమ్మల మీద ఆడుతున్న ఆట ఏమిటి?

మళ్ళీ గూగుల్ సెర్చ్... తాను చూసిన దృశ్యాన్ని ఇంగ్లీష్ లో వర్ణించి ఆట పేరు అడిగింది. ‘కోతికొమ్మచ్చి’...

భలే... భలే... ఈ కొమ్మనుంచి ఆ కొమ్మకి. ఆ కొమ్మనుంచి ఈ కొమ్మకూ గెంతుతూ వాళ్ళు ఆడే ఆట, కోతికొమ్మచ్చి అన్నమాట. తెలియకుండానే రెండు చేతులూ కలిపి చప్పట్లు చరిచింది. అంతలోనే శబ్దం బయటకు వినిపిస్తుందేమోనని ఆగిపోయింది.

ఆమె సంబరాన్ని అంతకన్నా సంబరంగా తొంగిచూస్తున్నాయి నల్లటి నేరేడు పండ్లు, ప్లాస్టిక్ కవర్ లోనించి.

“ఏమిటలా చూస్తున్నారు... దెబ్బలు పడతాయ్ మీకు.” చూపుడువేలు చూపుతూ బెదిరించింది.

ఆవెంటనే కవర్ లోనుంచి ఒక పండును బొటనవేలు, చూపుడు వేలితో పట్టుకుని జాగ్రత్తగా బయటకు తీసింది. అటుఇటు తిప్పి చూసింది. నల్లగా నిగానిగలాడుతూ, తొడిమ తునిగినుంచి వెరైన చోట క్రీమీషన్ కలర్లో... నోరు ఊరింది అలా చూస్తుంటే. ఇక ఆగలేక ఆ పండును నోటిదగ్గరకు తీసుకువచ్చి బుల్లి పెదవులు తెరిచింది.

“ఖుషీ...” స్టడీ రూమే కాదు, ఇల్లంతా అదిరిపోయేలా వినిపించిన కేకకు ఆమె చేతిలోని పండు జారి కిందపడి, దొర్లుకుంటూ వెళ్ళి, డస్ట్ బిన్ చాటుగా ఆగింది బిక్కుబిక్కుమంటూ.

“ఈ పాడు పండ్లు ఎక్కడ దొరికాయ్ నీకు? ఎవరిచ్చారు?” ఆ అమ్మాయి చేతిలోని కవర్ విసురుగా లాగుకుంటూ అడిగింది మమ్మీ. ఆమెకు విపరీతమైన కోపం వస్తే అచ్చమైన తెలుగే మాట్లాడుతుంది. ఇంగ్లీష్ మాత్రమే ఇంటా బయటా మాట్లాడాలని కూతురికి పెట్టిన రూల్ మరిచిపోతుంది.

“అక్కడ... అక్కడ... ఆ కాలనీ ఉంది కదా. అక్కడి పిల్లాడు ఇచ్చాడు.”

“ఛీ... ఛీ... మీ నాన్నమ్మ లేకి బుద్ధులన్నీ నీకు వచ్చేశాయ్. ఆమెగారూ ఇంతే... ఆ పల్లెలో అడ్డమైన వాళ్ళందరినీ చేరదీసి, ఉద్ధరించేశానని అనుకుంటూ ఉంటుంది. ఆ కాలనీ అలాగా జనంతో కలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? వాళ్ళిచ్చినవి ఏవీ తీసుకోకూడదని చెప్పానా లేదా?”

“లేదు మమ్మీ, నేను కలవలేదు. వాడే...”

“నోర్ముయ్, చేసిన నిర్వాకం చాలక మళ్ళీ మాటకుమాటా అంటున్నావ్. ముందు బుక్ తియ్యి. రేపు టెస్ట్ లో క్లాస్ ఫస్ట్ రాకపోవాలి, అప్పుడు చెప్తా నీ పని.” అరిచేసి, విసవిసా రూమ్ లోనుంచి బయటకు వెళ్ళి డోర్ ధడాలున క్లోజ్ చేసింది మమ్మీ.

డస్ట్ బిన్ వెనుక అంతదాకా దాక్కున నేరేడు పండు దొర్లుకుంటూ వచ్చి ఆమె ఎదురుగా ఆగి ఖుషీ కళ్ళలోకి సూటిగా చూసింది.

అందులోనుంచి తీగలు తీగలుగా సాగడం ప్రారంభించాయి మళ్ళీ చీకట్లు. చూస్తుండగానే ఆపిల్లను కమ్మేశాయి.

అక్కడ పేరు తెలియని చెట్ల మీద వందలకొద్దీ పిల్లలు కోతికొమ్మచ్చి ఆడుతున్నారు.

వెళ్ళాలి... తను కూడా వెళ్ళి, వాళ్ళతో కలిసి కోతికొమ్మచ్చి ఆడాలి. కానీ ఎలా.. వేలకొద్దీ నేరేడు పండ్లు దారికి అడ్డంగా. వాటిలోనుంచి తీగలుగా సాగుతున్న చీకట్లు. దారి కనిపించడంలేదు.

“ముదనష్టపు ముండా... రేపు అపార్ట్మెంట్లో నేను ఎలా తలెత్తుకు తిరగాలి. ఇదేం ర్యాంక్... నా పరువు తీశావ్ కదే..” వెనుకనుంచి మమ్మీ కేకలు.

ముడుచుకుపోతోంది. లోలోపలికి పాకుతున్న చీకట్లను మరింతగా చేతులు చాచి జవురుకుంటూ అగాథాలలోకి జారిపోతోంది.

-------------------------------

“వాటే సర్ప్రైజ్... సడన్ గా ఊడిపడ్డావ్, కమ్ కమ్...” హగ్ చేసుకుని మమ్మీ లోపలికి తీసుకువస్తున్న ఎవరో ఆంటీ వంక నిరామయంగా చూసి తల తిప్పేసుకుంది ఖుషీ.

“నీ కూతురా?” అడిగింది ఆ పిల్ల పక్కనే వెళ్ళి కూర్చుంటూ ఆంటీ.

“యా...” సమాధానం ఇచ్చింది, ముడుచుకుని పక్కకు జరిగిపోతున్న ఖుషీ వంక చూస్తూ.

“ఇంతపెద్ద కూతురు ఉందా నీకు? ఏం చదువుతున్నావు పాపా?” అడిగింది చనువుగా భుజం మీద చేయి వేస్తూ ఆంటీ. అ చేతినుంచి మెల్లగా పక్కకు జారిపోయి, అక్కడినుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది ఖుషీ.

“ఎయిత్ స్టాండర్డ్” సమాధానం స్నేహితురాలినుంచి వచ్చింది.

“ఏ స్కూల్? ఈ రోజు స్కూల్ కు వెళ్లలేదా? ఏమైంది పాపకు?” ఆశ్చర్యంగా అడిగింది ఆ పిల్ల వెళ్ళిన వైపే చూస్తూ.

“సెవెన్ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్. అది స్కూల్ వెళ్ళి వారం దాటింది.” మళ్ళీ ఆమెదే జవాబు.

“ఏమైంది?”

“అదే మాకూ అర్థం కావడంలేదు. వారం క్రితం స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. మీ డాటర్ వింతగా బిహేవ్ చేస్తోంది, వచ్చి తీసుకెళ్ళమని. వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకు వచ్చారు.”

“ప్రాబ్లం ఏమిటి?”

“ఇదిగో, నువ్వే చూడు.” కూతురి గది దగ్గరగా తీసుకువెళ్ళి డోర్ ఓపెన్ చేసింది.

బెడ్ మీద ఒక మూలకు ముడుచుకుని కూర్చుని ఉంది ఖుషీ. రెండు కాళ్ళు మోకాళ్ళ దగ్గర మడుచుకుని, చేతులు చుట్టి బిత్తర చూపులు చూస్తోంది. డోర్ వేసి ఈవలకు వచ్చేయబోయే సమయంలో చటుక్కున పైకి లేచి సీలింగ్ కు ఉన్న ఫ్యాన్ అందుకోవడానికి ఒక్క గెంతు గెంతింది. పరుగెత్తుకుని వెళ్ళిన మమ్మీ, కూతురిని పట్టుకోబోతే చిక్క లేదు. బెడ్ మీది నుంచి కిందికి దూకి, విండో దగ్గరగా వెళ్ళి కర్టెన్ రాడ్ పట్టుకుని ఊయల ఊగుతూ ఈ ఇద్దరినీ చూసి కిలకిలా నవ్వింది.

“ఆయ్... నేరేడు పండ్లు, నేరేడు పండ్లు...” అంటూ నేలమీద మోకాళ్ళమీద కూర్చుని రెండు చేతులతో కనిపించని దేనినో జవురుకోసాగింది.

తను ఈ మధ్యనే బదిలీ అయివచ్చిన- ఈ అపార్ట్మెంట్స్ కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్, దాని ఆవరణలోని చెట్లు, స్కూల్ వదిలిన వెంటనే వాటి కొమ్మలకు వేలాడుతూ కోతికొమ్మచ్చి ఆడుకునే పిల్లలు గుర్తుకొచ్చారు. అప్పుడప్పుడూ ఆ పిల్లల్లో కొందరు ప్రేమగా తెచ్చి ఇచ్చే నోరూరించే నేరేడు పండ్లు కూడా.

ఇద్దరూ కలిసి ఖుషీని బలవంతంగా పైకి లేపి బెడ్ మీద పడుకోబెట్టారు. ఏదో పిల్ తీసుకొచ్చి కష్టం మీద మింగించి నీళ్ళు తాగించింది మమ్మీ.

“ఇదీ పరిస్థితి. తట్టుకోలేక పోతున్నాను. దాన్నిలా పిచ్చిదానిలా చూస్తుంటే గుండె భరించలేని బాధతో నిండిపోతోంది. ఈ సొసైటీ ఏమనుకుంటుంది?” డోర్ దగ్గరగా లాగి వచ్చి హాల్లో సోఫా మీద స్నేహితురాలి పక్క నే కూర్చుంటూ కన్నీళ్ళ పర్యంతమైంది మమ్మీ.

దీని బాధ కూతురి గురించా లేక ఏదో అంటుందన్న సొసైటీ గురించా... అర్థం కాలేదు.

“ఊరుకో, ముందు ఇది చెప్పు. నీ కూతురు ఎప్పుడైనా కోతికొమ్మచ్చి ఆట గురించి చెప్పిందా? ఆడతానని మారాం చేసిందా? నేరేడు పండ్లు ఎప్పుడైనా ఇంటికి తెచ్చిందా? ఎప్పుడైనా ఆ పండ్లను తినిందా? అవును అడగనే లేదు, నీ కూతురి పేరేమిటి?” భుజం మీద చేతులువేసి దగ్గరగా తీసుకుంటూ అనునయంగా అడిగింది ఆంటీ.

“ఖుషీ దానిపేరు.” అనిచెప్పి కాసేపు ఆలోచించింది. అలా చూస్తూ ఉండిపోయింది స్నేహితురాలిని ఆంటీ.

“కోతికొమ్మచ్చి అంటే... ఆ గుర్తుకొచ్చింది. నువ్వు ఇప్పుడు బదిలీ అయిన స్కూల్లో పిల్లలు ఎప్పుడూ ఆ చెట్లకు కోతుల్లా ఊగుతుంటారు కదా. అదేకదా కోతికొమ్మచ్చి. ఆ ఆట గురించి ఇది ఎప్పుడూ నాదగ్గర ఎత్తలేదు కానీ, వీళ్ళ స్కూల్ బస్సు రోజూ అదే రూట్ లో వస్తుంది.” చెప్పింది మమ్మీ రెండు నిముషాల తర్వాత.

“మరి నేరేడు పండ్ల గురించీ....”

“నిజమే, ఆ పండ్లను ఎవడో కాలనీ పిల్లాడు ఇచ్చాడని ఇంటికి తెచ్చి ఇది. చాటుగా తినబోయింది. విసిరి డస్ట్ బిన్ లో కొట్టి మందలించాను. వయసు పెరిగే కొద్దీ దీనికి బుద్ధి రావడంలేదుకానీ, పాడు అలవాట్లు నేర్చుకొంటోంది.” అంతటి బాధలోనూ ఫైర్ అయింది మమ్మీ.

ఏదో అర్థమైనట్లు తల పంకించింది ఆ టీచర్ ఆంటీ. అయితే తన ఆలోచన నిజమో కాదో తెలియదు. ఇప్పుడు అంతస్తులు మారిపోయిన ఒకనాటి చిన్ననాటి స్నేహితురాలైన ఈ “మమ్మీ” అందుకు ఒప్పుకుంటుందో లేదో కూడా. అయినా ప్రయత్నం చేయాలి...

“ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా పాపకు?” అడిగింది.

“యా... మావారికి తెలిసిన ఫారిన్ రిటర్న్ సైకాలజిస్ట్ ఒకరున్నారు ఆయనకు చూపిస్తున్నాం. అంతేకాదు, హై ఎండ్ ప్లాటినం కార్పొరేట్ హాస్పిటల్ లో న్యూరో ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నాం.”

“గుడ్, అయితే ఒక చిన్న రిక్వెస్ట్...”

“చెప్పవే... నువ్వు రిక్వెస్ట్ చేయడం ఏమిటి? ఆర్డర్ చేయి, ఏదైనా సరే చేసిపెడతా.”

“నాకేమీ అక్కరలేదు. ఒక వారం రోజులపాటు ఖుషీని మా స్కూల్ కు పంపగలవా? పాపను నార్మల్ చేయడానికి నా మార్గంలో నేనూ ట్రై చేస్తాను..”

“మమ్మీ” అస్సలు ఊహించని రిక్వెస్ట్ అది. ఆమె ముఖంలో అయోమయం... సందిగ్ధం...

చిన్ననాటి స్నేహితురాలి సమాధానంకోసం అలా చూస్తూ కూర్చుంది ఆ గవర్నమెంట్ స్కూల్ టీచర్.

----------------------------------------

# “సంచిక” వెబ్ మేగజైన్లో ఆగస్టు 03, 2025 న ప్రచురితం. #

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ