కథ చెప్పవూ
"నెక్స్ట్ ఏమైంది చెప్పుచెప్పు"
"మమ్మీ వస్తోంది వెళ్ళిపో, రేపు త్వరగా
వచ్చేయ్ చెప్తా" అంతదాకా గుసగుసమంటూ వీచిన చల్లటి గాలి అకస్మాత్తుగా ఆగిపోవడంతో
ఉక్కపోత మళ్ళీ మొదలయింది.
"అమ్మూ అక్కడేం చేస్తున్నావ్. ఇలా రా. ఎవరున్నారక్కడ. రోజూ
వెళ్లి వేస్టుగా టైం స్పెన్డ్ చేస్తావ్."
"ఎస్, కమింగ్ మమ్మీ" బాల్కనీలో పైకి
పాకిన సన్నజాజి తీగ దగ్గర నిలబడ్డ పదేళ్ల పాప ఇంట్లోకి పరుగు తీసింది ఖంగారుగా
"మమ్మీ మమ్మీ... టెల్ మీ వన్ స్టోరీ మమ్మీ... ప్లీజ్"
"కథ చెప్పేటట్లే ఉంది నా బతుకు. ఇంట్లో చాకిరీ, మళ్ళీ ఆఫీసులో చాకిరీ చేయలేక చస్తున్నా. అల్లరి చేయకుండా నిద్రపో"
"తేజూ... ఎందుకలా అమ్మును విసుక్కుంటావ్ ? పైగా ఏదేదో మాట్లాడుతున్నావు. చిన్నపిల్లల్తో అలా మాట్లాడొచ్చా ? కమాన్ మై డియర్ అమ్మూ." కాస్త దూరంలో ల్యాప్ తో కుస్తీ పడుతున్న చరణ్
భార్యను వారించి కూతురిని దగ్గరికి పిలిచాడు.
"అయితే నువ్వు చెప్తావా డాడీ స్టోరీ..." పడుకున్న పాప
సంబరపడిపోతూ బెడ్ దిగి ఒక్కుదుటున వెళ్లి నాన్న ఒడిలో వాలింది.
"హేయ్ డిస్టెన్స్ డిస్టెన్స్..." ల్యాప్ ను భద్రంగా
పట్టుకుంటూ సున్నితంగా వెనక్కు నెట్టి కింద దించాడు పాపను.
"ఇంపార్టంట్ ప్రాజెక్ట్ వర్క్ డియర్, ఇంకా
సేవ్ చేయలేదు..." చిన్నబుచ్చుకున్న అమ్మును బుజ్జగించబోయాడు.
"ఇట్సోకే డాడ్, టెల్మీ స్టోరీ..."
సీ దిస్ వెబ్ సైట్... వండర్ఫుల్ కార్టూన్ స్టోరీస్ ఉన్నాయ్..."
"ఓహ్ బోర్... ఐ వాంట్ కింగ్ అండ్ క్వీన్ టెల్గూ స్టోరీస్...
యామ్ నాట్ ఇంట్రస్టెడ్ దిస్ టైపాప్ బుల్షిట్ ఇంగ్లీష్ స్టోరీస్..."
"మా నాన్నననాలి. హెల్త్ చెకప్ కోసం తీసుకొచ్చి టూఫోర్ డేస్
ఉంచుకున్నామో లేదో... ఈ పిల్లను చెడిపేశాడు, రాజులు, రాజ్యాలు, మాయలు, మంత్రాలంటూ
ఏవేవో రబ్బిష్ స్టోరీస్ నెరేట్ చేసి. స్టడీస్ మీద కనీసం శ్రద్ధ లేకుండా పోయింది దీనికి."
ఈసారి తేజు అందుకుంది.
"హు... మీకంటే ఆ అక్క గుడ్. బోలెడు కింగ్ స్టోరీస్
చెబుతుంది" విసురుగా వఛ్చి అమ్మ పక్క అటు తిరిగి పడుకుని ఏడుస్తూనే నిద్రలోకి
జారిపోయింది పాప.
ఆ అక్క ఎవరని వీళ్ళడగలేదు... అమ్ము చెప్పలేదు.
వీళ్ళు అడిగున్నా... పాప చెప్పున్నా ఈ కథ వేరేగా ఉండేదేమో.
ఉలిక్కిపడి నిద్ర లేచింది పాప ఎవరో తట్టి లేపినట్టు. అమ్మ పక్కన
లేదిప్పుడు. తనకే ప్రత్యెయించిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉంది. అది అమ్ముకు
అలవాటే. పడుకునేది మమ్మీ డాడీలతోనే అయినా, ఉదయం లేచేసరికి
ఇక్కడ తన బెడ్రూమ్ లోనే తేలుతుంది. విపరీతమైన చలి... వొణుకు పుడుతొంది. ఏసీవైపు
చూసింది. పదిహేనులో ఉంది. ఎపుడూ ఇరవై ఐదు దాటనివ్వదు
మమ్మీ. ఉక్కపోత ఎక్కువగా ఉన్నదని రైజ్ చేసిందేమో. పక్కనే టీపాయ్ మీదున్న రిమోట్
అందుకుని అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నించింది. ఉహు... ఏమాత్రం వీలు కాలేదు.
"అ... అ... అ... మ్ము... మ్ము... మ్మూ..." చెవిలో గాలి
గుసగుస.
అవును... ఆ అక్కే. పక్కింట్లో ఆంటీ వాళ్ళక్క. ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందన్న మాట. తనకు మాత్రం కనిపిస్తుంది.
మల్లి తీగ దగ్గరికి పిలిచి ఎన్నేసి కింగ్ స్టోరీస్ చెబుతుందని...
"అక్కా వొచ్చేశావా. చూడు... మా మమ్మీ డాడీ స్టోరీస్ చెప్పమంటే
నన్ను తిడుతున్నారు. ఎప్పుడూ స్టడీస్... స్టడీస్. ఫస్ట్ ర్యాంక్ వచ్సినా తిడుతూనే
ఉంటారు... మార్కులు తక్కువయ్యానని." ఏడుపొస్తోంది పాపకు.
"అవున్రా అమ్మూ... నేను కూడా అందుకే కదా దేవుడి దగ్గరికి
వెళ్ళిపోయింది."
"అవునా అక్కా."
"నిజం... సిక్స్త్ క్లాస్ నుంచే నన్ను మా డాడీ కార్పొరేట్
స్కూల్లో వేసేశాడు. వెళ్ళిన ఫోరార్ సిక్స్ మంత్స్ ఒకటే ఏడుపు. మమ్మీ డాడీలు
గుర్తుకొచ్చేవారు. తర్వాత అలవాటై పోయింది. టెంత్ క్లాసులో అటు స్కూల్, ఇటు హోమ్ లో ర్యాంకులకోసం పెట్టే టార్చర్ తట్టుకోలేక పోయా. ఫెస్టివల్క్
ఇంటికొచ్చినా మమ్మీ డాడీలది అదే టార్చర్. మనం కూర్చుని కథలు చెప్పుకుంటామే,
అక్కడ ఆ మల్లె తీగ దగ్గరే రెయిలింగ్ ఎక్కి కిందకు దూకేశా. ఇప్పుడెంత
హాయిగా ఉందో ."
"అవునాక్కా..."
"అవున్రా... అక్కడో స్టోరీ టెల్లర్ ఉన్నాడు. స్టోరీస్
చెప్పడంలో కింగ్ అనుకో. కింగ్ స్టోరీస్ ఎన్ని చెబుతాడనుకున్నావు..."
ఊరించింది.
"రియల్లీ..."
"రియల్లీ... నీకు నేనెందుకు అబద్ధం చెబుతాను చెప్పు. నువ్వూ
వస్తావా..."
"మమ్మీ డాడీలు... పాపం... నేను కనబడకపోతే ఏడవరూ..."
"హి... హ్హి... హ్హీ..." పైశాచికమైన నవ్వు.
"కథలు చెప్పమని నువ్వేడుస్తుంటే వారు
పట్టించుకుంటున్నారా"
"న్నో... న్నో..."
"మరి ? వాళ్ళనలాగే ఏడవనివ్వాలి. మా మమ్మీ
డాడీల లాగా"
"బలే బలే..." క్లాప్స్ కొట్టింది పాప.
"జుయ్..." మంటూ హోరు గాలి సుడి తిరిగింది.
బెడ్రూమ్ డోర్ లాక్ క్లిక్ మనే శబ్దంతో ఓపెన్ అయింది.
అలాగ్గా గాల్లోకి లేచింది పాప.
హిస్ మన్న శబ్దంతో మమ్మీ డాడీల బెడ్రూమ్ ముందు కాసేపు ఆగింది.
హాల్లో డోర్ లాక్ ఊడి చప్పుడు చేయకుండా కార్పెట్ మీద పడింది.
గుమ్మం గుండా విసురుగా దూసుకెళ్లి, తలకిందులై
రెయిలింగ్ కు గుద్దుకుని అదే వేగంతో ఆ ఫోర్త్ ఫ్లోర్ నుంచీ కిందకు విపరీతమైన
వేగంతో పడిపోసాగింది.
బాల్కనీలో మల్లెతీగ... అపార్ట్మెంట్స్ తెల్లటి ఫ్లోరు... అమ్ము పసి
రక్తాన్ని పంచుకుని ఎర్రబారాయి.
-------------------------------------------------
# "గోతెలుగు.కామ్" లో ఆగస్టు 11, 2025న ప్రచురితం. #
Comments
Post a Comment