కుందేలుమామ తెలివి
అనగనగా ఒక అడవిలో ఒక సింహరాజు ఉండేవాడు. చాలా మంచి వాడైన ఆ రాజు పాలనలో జంతువులన్నీ సుఖసంతోషాలతో జీవించేవి. ఇలా ఉండగా ఒకరోజు ఆ అడవి రాజ్యానికి ఎక్కడినుంచో ఒక బలిసిన యువ సింహం వచ్చింది. ఆ యువ సింహం చాలా పొగరుగా ఉండేది. కుందేళ్ళు, జింకలు వంటి బలహీనమైన జంతువుల పట్ల దురుసుగా ప్రవర్తించేది. అప్పుడప్పుడూ చాటుగా వాటిని వేటాడి తినేసేది కూడా. అంతేకాదు, ఇప్పుడున్న రాజు వృద్ధుడైపోయాడని, అడవి రాజ్యాన్ని, అందులోని జంతువులను ఇతర ప్రాంతాలనుంచి వచ్చే క్రూర జంతువులనుంచి అతడు రక్షించలేడని అక్కడక్కడా అది వాగడం మొదలుపెట్టింది. విషయం గద్ద వేగుల ద్వారా తెలుసుకున్న సింహరాజుకు దిగులు పట్టుకుంది. పొగరుబోతు యువ సింహాన్ని ఎదిరించేది ఎలాగో తెలియక తల పట్టుకుంది.
ఒకరోజు సింహరాజు దిగులుగా ఉన్న సమయంలో నక్క మహామంత్రి ఆయన దగ్గరకు వచ్చింది.
"మహారాజా,
ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ?" అని
దిగులుగా ఉన్న సింహరాజును నక్క మహామంత్రి
అడిగింది.
పేరుకు మంత్రే కానీ,, నక్క కూడా
జిత్తులమారిది. అప్పుడప్పుడూ సింహరాజు శత్రువైన యువ సింహాన్ని రహస్యంగా కలిసి
వచ్చేది. ఈ నిజం కూడా సింహరాజుకు వేగుల ద్వారా తెలిసింది. అందుకే నిజం చెప్పకూడదు
అనుకుంది.
"ఏమీ లేదు మహామంత్రి. ఒంట్లో కాస్త నలతగా ఉంది, అంతే. కొంచెం విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుంది. పొద్దు పోతోంది.
మీరు మీ నివాసానికి బయలుదేరండి." అన్నాడు సింహరాజు.
"అలాగే మహారాజా, మీరు మాత్రం జాగ్రత్త. ఒంటరిగా
ఎక్కడా తిరగొద్దు. ఆ సింహ యువకుడు కాచుకుని కూచున్నాడు. మిమ్మల్ని ఎలాగైనా
దెబ్బతీసి సింహాసనం కాజేద్దామని ఉవ్విళ్లూరుతున్నాడు." తియ్యటి మాటలు చెప్పి
గుహనుంచి బయలుదేరింది నక్క మంత్రి.
తీవ్ర ఆలోచనలో పడ్డాడు సింహ మహారాజు. అవును,
మొన్నామధ్య సభలో కొలువుదీరినప్పుడు ఆ కుందేలు మామ, ఆపదనుంచి
గట్టెక్కే ఉపాయమేదో చెప్పబోయాడు. ఈ నక్క పడనివ్వలేదు. "కుందేలువి, నీకేమి తెలుసు" అంటూ గేలి చేశాడు. ఆ మాటలకు చిన్నబుచ్చుకున్న కందేలు
మామ సభనుంచి మౌనంగా నిష్క్రమించాడు.
బయటకు తొంగి చూశాడు సింహారాజు. వెన్నెల విరగ్గాస్తోంది. దట్టమైన
పొదల్లో చీకటి ముడుచుకుంది. ఈ సమయంలో గుహ వదిలి బయటకు వెళ్లడం అంత మంచిది కాదు.
శత్రువులు పొంచి ఉంటారు. ఏ క్షణంలోనైనా దాడి చేసి గాయపరిచే ప్రమాదముంది. అయితే
అంతకన్నా ప్రమాదం పొరుగు అడవినుంచి వచ్చిన సింహ యువకుడి నుంచి ఉంది. తనకు పదవులు,
అధికారంమీద మోహంలేదు. ఇంతకాలం అడవిని, అడవిలోని
జంతువులను సంరక్షించడానికే కాలాన్ని వెచ్చించాడు. అందుకే జంతువుల మన్ననలు పొంది
ఇంతకాలం ఏకఛత్రాధిపత్యంగా పాలించగలిగాడు. ఆ సింహ యువకుడిలో నిలువెల్లా స్వార్థం
కనిపిస్తోంది. స్వలాభంకోసం జంతు ప్రజల ప్రయోజనాలను బలిపెట్టే ఆలోచనలు అతడి మాటల్లోనే
తెలిసిపోతున్నాయి.
ఆలోచనలు పక్కన పెట్టి కుందేలు మామ ఇంటివైపు బయలుదేరాడు సింహరాజు.
శత్రువులు గమనించే అవకాశం లేకుండా చీకటి పొదల మాటున అడుగులో అడుగులు వేసుకుంటూ ముందుకు
సాగాడు.
బొరియ బయట, పొదలను చాటుగా చేసుకుని కుందేలు
మామతో గంటసేపు మంతనాలు సాగాయి. వ్యూహాలు పదునెక్కాయి. తానున్నానంటూ భరోసా ఇచ్చి సింహరాజును
సాగనంపింది కుందేలు మామ.
మరుసటిరోజునుంచి కొండలను కూల్చాయి గజరాజులు. అందులోని మెరుస్తున్న
స్ఫటిక శిలలను మరింత సానబట్టాయి విశ్వాసపాత్రులైన జంతువులు. ఈ పనులు అహోరాత్రులు
సాగాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యాయి.
ఆ అడవి రాజ్యంలో ఉన్నట్టుండి ఒక వింత ప్రచారమైంది. సింహరాజుకు వారి
పూర్వీకుల ద్వారా కొన్ని శక్తులు హఠాత్తుగా వచ్చి పడ్డాయట. ఏకకాలంలో అనేకంగా మారి
శత్రువుల పని పట్టే శక్తి పొందిందట. దానికి తగ్గట్టుగా తనతో తలపడి గెలిచి రాజ్య
సింహాసనాన్ని సొంతం చేసుకోవాలంటూ సింహ యువకుడికి సవాలు విసిరింది సింహారాజు.
ఇన్నాళ్ళూ నిశ్శబ్దంగా ఉండి, ఇప్పుడు పోరుకు
పిలుస్తున్నదంటే ఏదో శక్తి నిజంగానే ఉందని సందేహించాడు యువక సింహం. ఠాట్ అదేమీ
లేదంది జిత్తులమారి నక్క మహామంత్రి. తాను రోజూ మహారాజు దర్శనం చేసుకుంటున్నానని,
ఎటువంటి శక్తులూ ఆయనలో లేవని ఘంటాపథంగా చెప్పింది. నేరుగా తలపడి
గెలిచే శక్తిలేక యువక సింహాన్ని భయపెట్టి పారిపోయేలా చేయడానికే ఇటువంటి అబద్ధపు
ప్రచారాలు చేయిస్తున్నారని నమ్మబలికింది. నమ్మక తప్పలేదు యువ సింహానికి.
అడవి మధ్యలో కొంత ప్రదేశాన్ని చెట్లు నరికి ధ్వంధ్వ యుద్ధానికి
సిద్ధం చేశారు. తలపడే ముహూర్తం రానే వచ్చింది. మైదానానికి అటువైపు అంచులో
నిలబడింది యువ సింహం. మహారాజు శక్తుల గురించి దాని మనసులో భయంగానే ఉంది. అందుకే
దూరంగానే నిలబడింది.
సింహారాజు ఠీవిగా ప్రవేశించింది మైదానంలోకి. ఆశ్చర్యం... చుట్టూ
పదుల సంఖ్యలో సింహారాజులు. కొద్దిగా మసగ్గా కనిపిస్తున్నాయి కానీ వాటిలోనూ అదే
ఠీవి.
బిత్తరపోయింది యువ సింహం. ఒక అడుగు వెనక్కు వేసింది.
పంజాను బలంగా నేలకు తాకించి గర్జించింది సింహారాజు. తలపడదాం రమ్మంటూ
తలెగరేసి పిలిచింది.
చుట్టూ ఉన్న సింహారాజులన్నీ అచ్చు అది చేసినట్టే చేశాయి.
ఆమ్మో, ఎన్ని సింహరాజులో. వీటితో పోరుచేసి
గెలవగలదా ? నిస్సంశయంగా ఓటమి తప్పదు. తర్వాత తనను ఈ
సింహారాజు చీల్చి చెండాడక తప్పదు. బతికుంటే బలుసాకు తినొచ్చు.
ఈ ఆలోచన రాగానే యువ సింహం తోక ముడిచింది. ప్రాణ భీతితో వెనక్కు
తిరిగి పరుగులు తీసింది.
"సింహరాజుకూ జై..." జయజయ ధ్వానాలు చేశాయి అడవి
జంతువులన్నీ.
బాగా సానబట్టి మైదానంలో చుట్టూ నిలబెట్టిన స్ఫటిక శిలల్లో తన
ప్రతిబింబాలను చూసుకుంటూ మీసం దువ్వుకుంది సింహారాజు.
“కుందేలు మామా, ఇంకా ఆ పొదల వెనుక ఎందుకు దాగుకుని ఉంటావు, ఇలా రా...” పిలిచింది.
“మహారాజా...” అంటూ బయటకు వచ్చి వినయంగా తలవంచుకుని నిలబడ్డాడు కుందేలు మామ.
“మామా, నీ బుర్ర అమోఘం. సానబట్టిన స్ఫటిక శిలలల్లో మా రూపం అనేకమై కనిపిస్తుందని ఊహించి, అపాయాన్ని ఉపాయంతో దాటవేయించావు. ఇక మీదట నువ్వే మాకు మహామంత్రివి.” అంటూ పంజాతో కుందేలు మామ వెన్ను తట్టి మెచ్చుకున్నాడు సింహరాజు.
ఇదంతా చూసిన జిత్తులమారి నక్కకు తనకు మూడిందని తెలిసిపోయింది. మెల్లగా అక్కడినుంచి జారుకోవడానికి ప్రయత్నించింది.
“ఆ కుట్రదారు నక్కను బంధించి కారాగారంలో పడేయండి.” అది గమనించిన సింహరాజు తనకు ఇరుపక్కలా విచ్చు కత్తులతో నిలబడ్డ ఖడ్గ మృగాలకు ఆదేశాలు జారీ చేసింది.
నమ్మక ద్రోహం
చేయడానికి ప్రయత్నించి భంగపడ్డ ఆ జిత్తులమారి నక్క, తన
దుస్థితికి చింతిస్తూ ఖడ్గమృగాల వెంట నడిచింది.
రేపు జిత్తులమారి నక్కకు కొరత వేసి, ఈ ఉపాయంతో
అపాయాన్ని అవలీలగా దాటించిన కుందేలు మామను, ఆ మైదానంలోనే
ఘనంగా సత్కరించాడు సింహరాజు.
___________________________________________________
# "సంచిక" వెబ్ మేగజైన్ (బాల సంచిక)లో ఆగస్టు 17, 2025 న ప్రచురితం #
Comments
Post a Comment