పులి ఉన్నది జాగ్రత్త

“గుళ్ళోకి పులి చొరబడిందంట” గుప్పుమంది పుకారు. ఉలిక్కిపడింది ఊరు.

అప్పుడెట్లా ఉంది ఊరు? భగ్గుమంటోంది. ఇంకొన్ని నెలల్లోనే ఎలక్షన్లు. నాయుడుగారు, రెడ్డిగారి మధ్య పచ్చగడ్డి వేయనక్కరలేకుండానే విభేదాల మంటలు నాలుకలు చాస్తున్నాయి. చాలదన్నట్లు నాయుడుగారు వూళ్ళోవాళ్లందరికీ అన్నదాన సంతర్పణ తలపెట్టి అందుకోసం వెదురుబొంగులతో వేసిన షెడ్ ను రాత్రికిరాత్రి ఎవరో కూల్చేశారు.

అదిగో అటుమంటప్పుడు చొరబడిపోయింది మిడిమేలపు పులి. అది అలాంటి ఇలాంటి పులి కాదంట. చేయెత్తు మనిషికి నడుం దాకా వొచ్చే ఎత్తు, రెండు బారల పొడవుతో భయంకరంగా ఉన్నదట. నీకు ఎవరు చెప్పారంటారాఅనరని నాకు తెలుసు. అంటే మిమ్మల్ని పిచ్చోళ్ళ కింద లెక్కేసేస్తారని మీకు తెలుసు. అరచేతిలో చిన్న పెట్టి. అందులో ఏదైనా పెట్టి, ప్రపంచం మొత్తం తిప్పేయగల సోషల్ మీడియా ఉన్నపుడు మళ్ళీ ఎవరో చెప్పాలా తెలుసుకునేందుకు.

ఎక్కడైనా, ఏ విషయంలోనైనా కొంతమంది అనుమానపు మనుషులు ఉండనే ఉంటారు. పులీలేదు, గిలీ లేదు... అంటూ అటువంటివాళ్లు నోళ్ళు చప్పరించేస్తారు.

“ఓరి మీ అనుమానాలు గూలా... నిప్పు లేనిదే పొగ రాజుకుంటుందా. తోకైనా కనిపించనిదే పులి ఉన్నదన్న పుకారు పుడుతుందా?” దేన్నైనా ఇట్టే నమ్మేసే మనుషులు వాళ్ళ అనుమానాలు తోసిపారేశారు. అంతేనా మొబైళ్ళు తీసుకుని, వాట్సాప్ గ్రూపుల్లో ఆ విషయాన్ని రసవత్తరంగా అల్లి, అందమైన చిరుత ఫోటో గూగుల్ నుంచి తీసి భయంకరంగా అలంకరించి ప్రపంచం మీద తోసేశారు. ఈ తోయడమనే కార్యం జరిగి అప్పటికే అర్ధగంట లేదా ఒక గంట అయిపోతోంది.

అప్పుడు నేను, ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉండే న్యూస్ పేపర్ల శెట్టి అంగడికాడ  నిలబడుకొని టీ సేవిస్తా, భ్రష్టుపట్టిన రాజకీయాల గురించి చుట్టూ ఉన్నవాళ్లకు ఉపన్యాసాలు ఇస్తా ఉండాను. ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం ముందు కూలిపోయిన అన్నదానం షెడ్ నా ఆవేశానికి కారణం.

“అయినా ఎంత అన్యాయమప్పా. పేదోళ్ళకు ఉచితంగా కూడుబెట్టే షెడ్ ను కూల్చడం ఎంత దుర్మార్గం. నిన్న సాయంత్రమే కదా, షెడ్ వేసింది. ఈరోజునుంచి పేదోళ్లందరికీ ఫ్రీగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తానని నిన్న జరిగిన మీటింగులో నాయుడుగారు వాగ్దానం గూడా జేసినారే. ఇప్పుడీ షెడ్ కూల్చేసే దుర్బుద్ధి ఎవరికి వచ్చి ఉంటుంది.?” ఎవరో ఆవేశపడిపోతున్నారు.

“అయినా ఎలక్షన్ల డ్రామాలు కాకపోతే ఈళ్ళకు మటుకు ఉన్నట్టుండి పేదోల్లమింద ఈ అక్కర ఎందుకొస్తాది? లాస్ట్ టైము నాయుడుగారేగదా పంచాతీని ఏలింది. ఇంగా ఊరికే పెట్టే కూడుకోసం దేబిరించే మనుషులు ఉండారంటే ఎవరిది తప్పు?” ఇంకో మనిషి అందుకున్నాడు.

“నువ్వు జెప్పేది, అందరి దరిద్రాన్ని ఆయప్ప తీర్చేయ్యాలనా? సాద్యమవతందా అది. అయినా సర్పంచిగా వూర్లో రోడ్లు ఎయ్యించినాడు గదా. అదిగో, ఆ బస్టాండ్ కట్టించింది ఎవరు? నాయుడుగారు కాదా. ఇక్కడే గదా ఆయప్ప సర్పంచిగా ఏలేటపుడు పండక్కి, పబ్బానికి పేద కుటుంబరాలను పిల్సి, కొత్తబట్టలు పెట్టి, విందు భోజనం కూడా తినిపించి పంపిస్తా ఉండింది. ఇప్పుడీ ఆన్నదాన సంతర్పణ ఎలక్షన్లకోసమే అంటే నేనొప్పుకోనబ్బా.” ఇంకెవరో చేసిన వాదనను అక్కడున్నవారిలో చాలామంది సమర్థించారు. అదే నోటితో షెడ్ కూల్చింది రెడ్డి మనుషులేనని తేల్చేశారు. ఆయన రాజకీయాల్ని పడదిట్టి పోశారు. ఇవన్నీ గుడిలోకి పులి దూరక ముందుదాకా జరిగిన సంగతులు.

“ఏంబా ఎక్కడుండావు? పులి గుడిలో దూరిందంట. నీకు ఆ టీ బంకుకు వెళ్ళి, మాటలు పెట్టుకుంటే టైమే తెలీదు. వస్తావుండావా లేదా ఇంటికి?” ఇంతలో నా శ్రీమతినుంచి ఫోన్.

ఇప్పుడిక్కడ ఒక్క మనిషి లేడు. కూలిన షెడ్ చుట్టూ మూగి రెడ్డి మనుషుల దౌర్జన్యం గురించి, వారి అరాచకాల గురించి మాట్లాడుకుంటున్న జనం, పులి భయంతో ఎప్పుడో పలాయనం చిత్తగించారు.

“వాడు వొచ్చాడా ఇంటికి?” అడిగాను.

“ఇంకా రాలేదు. అదే భయంగా ఉండాది.” శ్రీమతి.

“ముందు నీ పుత్ర రత్నం ఎక్కడుండాడో చూడు. ఏదో కొంపలు మునిగే పని ఉండాదని ఇంతముద్ద నోట్లో ఏసుకుని రాత్రికిరాత్రి గడప దాటినోడు, ఈ పొద్దు నేను వాకింగ్ కు బయలుదేరే వరకు ఇల్లు చేరలేదు. ఒకసారి వాడికి ఫోన్ చెయ్యి.” అటు వెళ్తున్న మా వీధిలోని తెలిసిన మనిషిని బలవంతంగా ఆపి, అతడి బైక్ ఎక్కుతూ అన్నాను.

“మీ తండ్రీకోడుకుల మధ్య నేను నలిగిపోతున్నాను. ఎప్పుడో చేశాను. ఆ రెడ్డి ఇంట్లో ఉండాడంట. ఏమీ భయంలేదన్నాడు. ముందు నువ్వు ఇంటికి రా...” కంగారుగా చెప్పింది శ్రీమతి.

“వీడికి రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఇంటికి రానీ చెప్తా...” కాల్ కట్ చేశాను.

గుళ్ళో పులి ఉండాదంట నాయనా. ఎప్పుడు ఎవరిపై పడుతుందో తెలీదు. అసలే మోకాళ్ళనొప్పులు. తెలియక బజారుకు వచ్చాను. కొంచెం మా ఇంటిదగ్గర దింపేయి నాయనా వెనక్కు తలతిప్పి, నన్ను చురచురా చూస్తున్న యువకుడికి చెప్పాను.

“అవనవును ఫారెస్టు వాళ్ళు గూడా వొచ్చినారంట ఇప్పుడే. నేనుగూడా అక్కడికి వెళ్ళాల.” చెప్పాడు అతడు.

“ముందు నన్ను కనీసం వీధి మొదట్లో అన్నా దించేసి వెళ్ళు నాయనా. మా అబ్బాయిలా కనిపిస్తున్నావు. నీకు పుణ్యముంటుంది.” బతిమాలాను.

ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఎవరి ఫోన్లలో వాళ్ళు తల దూర్చేసి కనిపించారు. చివరకు మా అమ్మ కూడా. డొక్కు బటన్ ఫోన్ పక్కన పడేసి, అమ్మకు కూడా ఇటీవలే ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను.

“ఒరే నాయనా, ఈ వీడియో చూడరా...” అంటూ నన్ను చూస్తూనే పట్టేసిన మోకాళ్ళ నొప్పులు కూడా లెక్క చేయకుండా గబగబా నా దగ్గరికి వచ్చి, ఆ ఫోన్ చేతిలో పెట్టింది.

ఈమెకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చినప్పటినుంచీ యూ ట్యూబ్ లో సీరియల్స్ పిచ్చి ఎక్కువైపోయింది, అనుకుంటూ చూశాను.

ఎవరో కాషాయ దుస్తుల్లో కనిపిస్తున్నాడు వీడియోలోని వ్యక్తి. వయసు సుమారు అరవై ఏళ్ళు ఉంటాయేమో. పూజారిలా ఉన్నాడు. మాట్లాడుతున్నాడు. నాచేతిలోకి మొబైల్ వచ్చేసరికి, వీడియో అయిపోయింది. ఏదో యూ ట్యూబ్ చానల్ లింక్ అది.

ఏముంది ఇందులో..” కొంచెం చిరాగ్గా అడిగాను. అసలే పులి భయం. ఇంట్లోని వాతావరణం చూస్తే ఇంకా నా పనికిమాలిన కొడుకు ఇంటికి వచ్చినట్లు లేదు. వాడీమధ్య రాజకీయాలు అంటూ చెడ తిరుగుతున్నాడు. ఎక్కడ చచ్చాడో. కొంపదీసి పులిని చూడడానికి వెళ్లాడా... గుండెల్లో భయం బయలుదేరింది.

“చూడరా నీకే తెలుస్తుంది. నాకు చాలా భయంగా ఉన్నదిరా. ఏ క్షణంలో ఆ పులి గుళ్ళోనుంచి బయటకు వచ్చి, ఏ ఇంట్లో దూరుతుందో. పైగా నీ కొడుకు ఇంకా ఇంటికి రానేలేదు.” అమ్మ గొంతు వొణికింది.

మాట్లాడకుండా వాట్సప్ గ్రూపులో వచ్చిన ఆ వీడియో లింక్ ఓపెన్ చేశాను. అదే వ్యక్తి. కళ్ళు సరిగా కనిపించలేదేమో, కనుబొమలకు కుడిచేయి అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఆయన చిరుత దూరిన ఈశ్వరుడి గుడి పూజారి.

“ఈరోజు తెల్లవారు ఝామున ఎప్పటిలాగే స్వామికి అభిషేకం చేయడానికి గుడికి వెళ్ళాను. గ్రిల్ గేటు తాళం తీసి, ముందున్న బావిని దాటి ఒక అడుగు ముందుకు వేశాను. ఎదురుగా ఏదో జంతువు నిలబడినట్లు తోచింది. కళ్ళు చికిలించి చూశాను. ముందు కుక్క అనుకున్నాను. కానీ కాదు. దాని వొంటిమీద పసుపురంగు, నల్ల చుక్కలు ఉన్నట్లు తోచింది. చిరుత పులి. గేటు చప్పుడుకు బెదిరినట్లు ఉంది. నన్ను చూడగానే, ఎగిరి దూకి, కొంచెం దూరంలో ఉన్న గుడి సత్రం బాత్రూంలో దూరింది.” భయంతో, ఉద్వేగంతో ఆయన గొంతు వణుకుతోంది. వీడియో కూడా అక్కడికి కట్ అయిపోయింది.

అది పులికాదేమో అని నాలో ఏమూలనో ఉన్న అనుమానం అక్కడితో తీరిపోయింది. భయం మరింతగా పెరిగి, ఇంకా ఇంటికి రాని కొడుకుమీద కోపం పెరిగింది. అంతలోనే కంగారు అధికమైపోయింది.

“రేయ్ ఎక్కడ చచ్చావ్...?” ఫోన్ చేసి గట్టిగా అరిచేశాను.

“పొద్దున్నే కన్న కొడుకును పట్టుకుని ఆ అపశకునపు మాటలేమిటండీ. అసలే ఊళ్ళో పరిస్థితులు బాగాలేవు. బస్టాండ్ దగ్గర అన్నదానం షెడ్ ఎవరో కూల్చేశారంట కదా. గూండాలు, రౌడీలు పెరిగిపోయారు. షెడ్ కూలితే కూలింది, మళ్ళీ ఆ పార్టీవాళ్లు కట్టుకుంటారు. ఇప్పుడీ పులి ఊళ్ళో దూరింది. ఏమవుతుందో, ఏమో...” చీవాట్లు పెట్టింది శ్రీమతి. ఆ మాటల్లో అంతర్లీనంగా తన కొడుకుకు ఏమవుతుందోనన్న భయం దాగుంది.

ఇంకా  చావలేదు కానీ, నువ్వు ఫోన్ పెట్టు, నేను సీరియస్ పనిలో ఉన్నాను.” కొడుకు విసుగు మాటలతోపాటు కాల్ కట్ అయింది.

ఇక ఇంట్లో ఉండలేకపోయాను. కొడుకు ఎక్కడున్నాడో తెలియదు. పులిమాత్రం గుడిలో ఉంది. ఒకవేళ అక్కడే నా కొడుకు కూడా ఉంటే. ఆ పులి వాడిమీదకు దూకి... ఇక ఆలోచించలేకపోయాను. ఇంట్లో ఉండబుద్ధికాలేదు.

గబగబా ముఖం కడుక్కుని, ఇంటినుంచి బయట పడ్డాను. అమ్మ, శ్రీమతి అరుస్తూనే ఉన్నారు వెనుకనుంచి వెళ్లవద్దంటూ. నా ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు మొబైల్ నుంచి కనీసం తలయెత్తి చూడలేదు.

గుడివైపు బయలుదేరాను. ఆర్టీసీ బస్టాండు మీదుగానే వెళ్ళాలి అక్కడికి. బస్టాండు దగ్గరికి వచ్చేసరికి. కూలిన షెడ్ లో చిన్న కొయ్యముక్క కూడా అక్కడ కనిపించలేదు. పంచాయతీవాళ్లు అన్నింటినీ ట్రాక్టర్ లో వేసుకుని అప్పటికే బయలుదేరుతున్నారు. సర్పంచి రెడ్డిగారు చెప్పడంతో అక్కడ అన్నదానం చేయడానికి ఇచ్చిన పర్మిషన్ ను తాత్కాలికంగా రద్దు చేశారట. అప్పటికే పులి భయంతో దుకాణం మూసేస్తున్న న్యూస్ పేపర్ల శెట్టి నా చెవిలో వేశాడు.

“అది మంచిదే కదా. ఇక్కడ జనం ఉడ్డజేరి, ఆ పులి దూరితే పరిస్థితి ఏమిటి? ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతకచ్చు.” అని కూడా అన్నాడు. నాక్కూడా అదే అనిపించింది.

నా కొడుకు ఎక్కడున్నాడో, వాడికి ఆ పులివల్ల ఏదైనా  ప్రమాదం ముంచుకొస్తుందేమోనన్న భయం అక్కడ నిలువనివ్వలేదు. అక్కడొకరు, అక్కడొకరు తప్ప, వేరెవరూ మనుషులు లేరు కూడా ఆ ప్రాంతంలో.

అక్కడినుంచి కదిలి గుడి మార్గం పట్టబోతుంటే, ఎదురుపడ్డాడు వాడు. వాడంటే నా సుపుత్రుడు. ఒంటరిగా కాదు, బైక్ పై వాడి వెనుక మరో యువకుడు ఉన్నాడు. నన్ను చూసి కూడా ఆగలేదు వాళ్ళు.

“రేయ్...” కేక వేశాను. ఊహూ వినిపించుకోలేదు.

“నువ్వు ఇంటికి వెళ్ళు నాన్నా. నేను వచ్చేస్తాను.” వాడు కూడా అరిచి చెప్పాడు. ఆవెంటనే మలుపు తిరిగి మాయమై పోయాడు. వెనుక కూచున్న యువకుడు ఎందుకో తేడాగా అనిపించాడు నాకు. కానీ అదేమిటో తెలియలేదు.

హమ్మయ్య, వీడు కనిపించాడు, చాలు. అంటే పులి వున్న గుడి దగ్గరకు వెళ్లలేదన్నమాట. ఒకవేళ వెళ్ళినా తిరిగి వచ్చేశాడు. మనసు కుదుట పడింది. తిరిగి ఇంటిదారి పట్టాను.

ఇంటికి వచ్చేసరికి లోకల్ చానల్ లో డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు,

“కొంచెం వ్యాల్యూమ్ ఎక్కించు...” చెప్పి, ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడ్డాను.

విసుక్కుంటూ వెళ్ళి, వ్యాల్యూమ్ పెంచింది నా కూతురు.

“అవును. ఈశ్వరుడి టెంపుల్ చౌల్ట్రీ బాత్రూంలో చిరుత దూరిందని చూసినవాళ్లు చెబుతున్నారు. అందులో మీ న్యూస్ చానల్ రిపోర్టర్ కూడా ఉన్నారు. అంతేకాదు... పులిని చూసిన ప్రత్యక్ష్య సాక్షి గుడి పూజారి ఉన్నారు. ఇంకా ఒకరిద్దరు స్థానికులు కూడా చూశామంటున్నారు. ఇదిగో అక్కడ పులి పాదాల గుర్తులు కూడా ఉన్నాయి. మీరు చూడచ్చు.” ఆయన చేయి చూపించినవైపు తిరిగింది కెమెరా. పరిశీలనగా చూశాను. నిజమే, ఏవో జంతువు పాదాల ముద్రలు అస్పష్టంగా కనబడుతున్నాయి.

“అయితే గుడిలో నిజంగానే చిరుత ఉన్నదంటారు?” చానల్ రిపోర్టర్ ప్రశ్నించాడు.

“అనే చెబుతున్నారు చూసినవాళ్లు. మాకున్న ప్రాథమిక సమాచారాన్నిబట్టి మేము కూడా అదే నమ్ముతున్నాం. అది బాత్రూంలో దాక్కుని ఉంది. తిరుపతి నెహ్రూ జులాజికల్ పార్కునుంచి సాయత్రానికి నిపుణులు వస్తున్నారు. వాళ్ళు వచ్చాక పులికి మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి, బంధించడానికి సన్నాహాలు చేస్తున్నాం. కానీ ఈలోగా ఆ చిరుత అందులోంచి బయటపడి టౌన్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.” హెచ్చరిస్తున్నాడు ఆ ఆఫీసర్.

దడదడమంటూ ఇంతలో ఏదో శబ్దమైంది. ఇంట్లో అందరి పై ప్రాణాలూ పైనే పోయాయి. బిత్తరపోయి చూశాము శబ్దం వచ్చిన పెరటివైపు. అటువైపు ఉన్న రేకు తలుపు తీస్తున్నాడు నా పుత్రరత్నం. అందువల్ల వచ్చిన శబ్దం అది. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాం.

“వెధవా నీకు బుద్ధి ఉందా. అసలే పులి భయంతో ఇక్కడ అందరం భయపడి చస్తున్నాం.” గట్టిగా అరిచాను.

”ఎందుకలా బిగుసుకుపోతారు అందరూ. రిలాక్స్... రిలాక్స్ గా ఉండండి.” చిద్విలాసంగా నవ్వుతూ, పసుపురంగు వస్త్రం లాంటిదేదో దాస్తున్నాడు వాడు.

నాకు మండిపోయింది. ఇంతదాకా ఎక్కడ తిరిగి చచ్చావురా. చిరుత ఎప్పుడు ఎవరిమీద దూకుతుందో తెలియదని ఈ ఫారెస్టు ఆఫీసర్ చెబుతున్నాడు. నువ్వేమో కనీసమైన భయం లేకుండా ఇలా...” ఏడుపు తన్నుకొచ్చింది మాట్లాడుతుంటే వాళ్ళమ్మకు.

“సరే... సరే... వచ్చేశానుగా. ఇక భయం లేదు. సాయంత్రానికల్లా అంతా సర్దుకుంటుంది. చిరుత వెళ్లిపోతుంది.” చిరునవ్వు చెదరకుండా అన్నాడు.

“అవును, వీడో పెద్ద జ్యోతిష్కుడు. జరుగబోయేది చెబుతున్నాడు...” వాడి బామ్మ అంటుకుంది. చిరునవ్వే నా కొడుకు సమాధానం అయింది.

విచిత్రమేమిటంటే కొద్ది గంటల తర్వాత వాడి భవిష్య వాణి నిజమైంది. గుడిని దాటి, పక్కనున్న పొదల్లో దూరి, చిరుత ఎటో వెళ్లిపోయిందని అదే డీఆర్వో సాయంత్రం ఆరు గంటలు అవుతుండగా ప్రకటించాడు. లోకల్ చానల్ తోపాటు సోషల్ మీడియాలో ఆయన అలా చెబుతున్న వీడియో విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఏ చానల్ తిప్పినా, ఏ సోషల్ మీడియా పోస్ట్ చూసినా అదే వార్త, చిలువలు పలువలుగా.

“నేను చెప్పలా...” అన్నట్లు చూశాడు నా ముద్దుల కొడుకు నావైపు.

ఉదయం అన్ని పేపర్లలో చిరుత వార్తలే. అన్నదానం షెడ్ గూండాల దాడిలో కూలిన సంఘటన ఎక్కడో జోన్ పేజీలలో ఒక మూలకు పరిమితమైంది.

అప్పుడు గుర్తుకొచ్చాడు నా కొడుకు వెనుక బైక్ మీద కూచుని కనిపించిన యువకుడు.

అవును, అతడిలో కనిపించిన తేడా ఏమిటో ఇప్పుడు తెలిసివస్తోంది. వాడి శరీరంపై దుస్తులను దాటి దళసరి పసుపురంగు కోటులాటిదేదో కనిపించింది. బక్కపలుచగా ఉండే వాడు, కొద్దిగా బలిసినట్లు కూడా అనిపించాడు.

“చూశావా నాన్నా చిరుత దెబ్బకు, ఆ నాయుడిగారి ప్రోగ్రాం ఎలా ఫెయిల్యూర్ అయిందో...” గర్వంగా అన్నాడు, అప్పుడే నాయకుడి పిలుపు అందుకుని బయటకు నడుస్తున్న నా కొడుకు, కొంచెం ఆగి నా ఎదురుగా నిలబడి.

“నిజమే. కానీ ప్రతిసారీ పులులు, సింహాలు మీ దౌర్జన్యాలను కాపాడలేవు.” చెప్పాను, చదువుతున్న న్యూస్ పేపర్లోంచి తలెత్తి.

మాట్లాడలేదు వాడు. చిరునవ్వు నవ్వి అన్నాడు చిద్విలాసంగా, అధికారులు మావైపున్నారు.”

“ఉండచ్చు, నువ్వు, మీ నాయకుడు అనుకుంటున్నంత మూర్ఖులు కారు జనం.”

“లెటజ్ సీ...” ఒకచూపు విసిరి బయటకు నడిచాడు. వీడు, వీడి గ్రూపు సాధించిన ఘనతకు వాళ్ళ నాయకుడు పార్టీ ఇస్తున్నాడట.

జనాల అజ్ఞానం మీద వాడికి, వాడి నాయకుడికి ఉన్న అపారమైన నమ్మకం కనిపించింది ఆ చూపులో.

చిరుత పులి ఉన్నదని నమ్మినప్పుడు కాదు... ఇప్పుడు వేసింది నిజమైన భయం నాకు.

వాడి నమ్మకంచూసి ఒక్క క్షణం వొళ్ళు గగుర్పొడిచింది.

పొదల్లో దూరిన పులి ఎటువెళ్ళిందో, ఇప్పటిదాకా చూసినవాడు ఊళ్ళో ఒక్కడుకూడా లేడు.

( కౌముది వెబ్ మేగజైన్ లో జులై, 2023 ప్రచురితం )

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ