ఇష్టంగా బతకాలి

“కూసో అబయా..” యాపసెట్టు కింద నులకమంచం వాల్చినాడు ఆయన్న. జంకతా కూసున్నాను.

“ఇప్పుడు నువ్వు కూసోనుండా, ఈ జాగా ఎవురిదో తెలుసా అబయా?” నెత్తికి చుట్టిన తలగుడ్డ తీసి ఇదల్చతా మోకాళ్ళు రొండూ వొంచి మంచం పట్టీ పట్టుకొని గొంతు కూర్చుని నా మొగంలోకి చూసినాడు.

చుట్టూ చూసినాను. కొంచెం దూరంలో నా ఎదురుగా బర్రిగొడ్లు కొయ్యి కూసాలకు కట్టేసుండాయి. వొక వారగా నేరేడు చెట్టుకు కుడితి తొట్టి ఆనించి ఉండాది. ఇంగో పక్క తురాయి చెట్టు మొదుట్లో కళ్ళాపి బాన గావాల, పచ్చిగా అదోరకం వాసన కొడతా వుండాది. జోబులోనించి చేతిగుడ్డ బయటకు తీసి ముక్కలకు అడ్డం పెట్టుకున్నాను.

“నాకెలా తెలుస్తుంది నా. ఈ ఊరిలో జాగాల సంగతి?” నా మాటలో యాస కనిపిచ్చకుండా చేయాలంటే కష్టంగా అనిపిస్తా వుండాది.

“ఇది మీ జాగానే. నువ్వు కుచ్చోనుండా, ఈ యాపసెట్టు మీ వాకిట్లో సెట్టే.” నవ్వు మొగంతో ఆయన్న చెప్పిన మాట యినంగానే మంచం మీద కిందికి ఏలాడేసిన కాలుపై పెట్టిన కుడికాలు కిందకి జారిపొయ్యింది.

“నేనెవురో తెలుసానా మీకు?” అడిగాను కొంచెం ముందుకు వొంగి.

“ఎందుకు తెలీదబయా. ఆ ముక్కూమొగం అంతా మునిరాంబావ నోట్లో నించి ఊడిపడినట్టే ఉండ్లా .” అప్పుడే కయ్యినుంచి వొచ్చినాడు గావాల, మట్టి పారను చేతల్లో పట్టుకోనుండే మనిషి తటక్కన నా గుట్టు ఇప్పినాడు.

ఈళ్లల్లో ఎవురూ నన్ను గుర్తు పట్టలేరని అనుకున్నాను. ఎందుకంటే, నేను ఊరు ఇడిసిపెట్టి ఈ రోజుటికి ఇరవై యేళ్ళు పైగా అయిపొయ్యింది. అంతకుముందు ఆరో తరగతి నుంచీ కాలేజీ దాకా కాలాస్త్రిలోనే గదా సదివింది. అయినా మా నాయిన మొక్కట్లు పట్టిచ్చేసినాయి నన్ను.

ఇంగ ప్యాషనుగా మాట్లాడి లాబం లేదు వూలోళ్ల దెగ్గిర.

“ఏందబయా యోచన జేస్తా ఉండావు?” వీరారెడ్డి అడిగినాడు.

ఊళ్ళోకొస్తానే ఆయన్నను గుర్తుపట్టినాను నేను. మా ఇంటి పక్కనే చిన్న పూరిల్లు కట్టుకుని ఉండేవాళ్లు. కానీ పేరే గుర్తుకు రాలేదు ఇంతసేపూ. వుడ్డగా మూగి ఉండే వోళ్ళల్లో ఇంగా ఇద్దురు ముగ్గుర్ని గూడా గుర్తుపట్టినా, ఎవురూ తెలీనట్టే యాక్సన్ జేసినాను. కానీ నన్ను వాళ్ళందరూ గుర్తు పట్టేసినారాని తెలిసినాక, ఆయన్న పేరు గూడా నాకు గెవనానికి వొచ్చేసింది.

“ఏంలేదు నా. ఎంకమ్మ అనే ఆడామె కాశీకి తీర్థయాత్రలకు ఎల్లి అక్కడ గంగలో మునిగి చచ్చిపొయ్యిందని తెలిసింది. వాళ్ళ ఇల్లు ఎక్కడనా?” తేరుకొని అడిగినాను.

“సిన్నక్క గురించా నువ్వు అడగతా ఉండేది? అవును, ఆయమ్మ యాత్రలకు ఎల్లి చచ్చిపొయ్యిందంట. కట్టిని తెచ్చేదానికి కొడుకు ఎల్లుండాడు.” చెప్పినాడు.

“చచ్చినామె పేరు ఎంకమ్మ అని చెప్పినారే. ఈ సిన్నక్క ఎవురు?”

“నువ్వు చిన్నప్పుడు మీ ఇంటి ఎనకాల్నే ఉన్నారు గదా సిన్నక్కోళ్లు. నీ సావాసగాడు నరసిమ్మ గుర్తుండాడా... వోళ్ళమ్మే గదా సిన్నక్క. ఆమి అసలు పేరు ఎంకమ్మ.”

చీమిడి ముక్కల సిద్ధడు గెవనానికి వొచ్చినాడు ఆ మాటలతో నాకు. ఎండావానా అనే తేడా లేకండా ఎప్పుడూ కారతా ఉండే ముక్కును ఎగబీలస్తా, పిర్రలు దాటి జారిపోతావుండే సల్లాడాన్ని ఎగేసుకుంటా తిరిగే నరసిమ్మడికి మా సావాసాగాళ్ళం పెట్టుకున్న ముద్దు పేరది.

“బాగానే జూస్తాడానా నరసిమ్మడు వోళ్ళమ్మను? నిజింగానే గంగలో మునిగి చచ్చిపొయ్యిందా, ల్యాకపోతే వోడు జూడడం లేదన్న మనేదతో కావాలనే దూకేసుంటాదా?” నాలోని జర్నలిస్టు బైటికి వొచ్చినాడు. ఎందుకైనా మంచిదని మెల్లగా అడిగాను వీరారెడ్డికి మాత్రమే ఇనబడే మాదిరి. తలెత్తి చురుగ్గా చూసినాడాయన్న నా కళ్ళల్లోకి సూటిగా.

“పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనబడతాదబయా...” అనేసి అక్కడి నుంచి గబక్కన పైకి లేసినాడు.

“మ్మేయ్ మంగా, మన మునిరాంబావ కొడుకు వొచ్చిండాడు. సంకటి ఉంటే ఉంటాదిగానీ, వొరి బువ్వ వొంచు, మనింట్లో చెయ్యి కడిగి ఎల్లబారతాడు.” భుజమ్మింద ఉండే తువ్వాలు వగసారి తీసి ఇదిల్చి మళ్ళీ ఏసుకుంటా ఈది అంతా ఇనబడే మాదిరి కేకేసినాడు.

“అట్టాగే బావా” అదే మోతలో ఇనిపించింది ఎదురుగా ఉండే స్లాబు ఇంట్లోనుంచి ఒక ఆడ గొంతు.

“లేదు నా, నేను ఎల్లాల. ఈ వార్త పేపరుకు పంపాల. ఇంగోసారి వొచ్చినప్పుడు తింటాలే.” నేనుగూడా పైకిలేచి బండి దెగ్గిరికి నడిచినాను.

*                                         *                                  *

“గంగలో కలిసిన అమ్మ”

‘కాశీ యాత్రకని వెళ్ళిన ఒక అమ్మ, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అక్కడే గంగలో మునిగి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. వెంకమ్మ అనే ఆ మహిళ మృతిపై గ్రామస్తులు భిన్న కథనాలు వినిపిస్తున్నారు. కొందరు ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు చెబుతున్నారు. మరికొందరేమో ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. కొడుకు, కోడలు సరిగా చూడకపోవడంవల్లే ఆ మనోవేదనతో పవిత్రమైన గంగానదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని నమ్ముతున్నారు.’... ఈ మాదిరి రాసేసి, ఆఫీసుకు పంపించి సిస్టమ్ ముందు నుంచి పైకి లేచినాను. కొంచెమైనా మసాలా లేకపోతే ఆ న్యూస్ కు రీడబిలిటీ ఉండదని మా జర్నలిజంలో నేను నేర్చుకున్న పాఠం.

వీరారెడ్డి చూపులు గుచ్చుకుంటానే ఉండాయి నన్ను. రేత్రి నిద్ర గూడా రాలేదు శానాసేపు.

ఊరిని ఇడిసిపెట్టి వొచ్చేసినాక మళ్ళీ ఇన్నాళ్ళకు ఈరోజే వెళ్ళింది. ఎంత అందంగా ఉండేది ఆ ఊళ్ళో ఇల్లు. అర్ద ఎకరా జాగాలో చిన్న రెండు నిట్రాళ్ళ పూరిల్లు. అడివి మండల కంపను ఆనుకోని చుట్టూ పదీ పన్నిండు యాపసెట్లు. ఇంటెనకాల ఉలీంద్రం చెట్టు, ముందు వాకిట్లో పచ్చగన్నేరు, తెల్లగన్నేరు, కాగితాలపూల చెట్లు. తెల్లారిలేసి చూస్తే వాకిలంతా తెల్లగా, పచ్చగా, ఎర్రగా... ఆకాశం నించి ఇంద్రధనుసు రంగులు ఊడి, నేలమింద చిందరవందరగా పడినట్టు ఉండేది. 

నాయిన్ని ‘బావా’, ‘అనా’ అని – అమ్మను అక్కా, వొదినా అని పిలస్తా ప్రీతిగా మాట్లాడే మనుషులు... పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఊరంతా కలిసి చేసుకొనే సంబరాలు...

*                                      *                                        *

“ఎవుర్రా నాయనా ఊళ్ళో సచ్చిపొయ్యింది?” రేత్రి పేపరుకు వార్తలు పంపిచ్చేసి, యాపారం లెక్కలు చూసుకుంటా వుంటే వొచ్చి అడిగింది అమ్మ.

“దుడ్లు లెక్కపెట్టేటప్పుడు మజ్జలో వొచ్చి పనికిమాలిన ఆరాలు తీయొద్దని ఎన్నిసార్లు చెప్పినాను నీకు?” విసుక్కున్నాను.

“లేదురా నాయనా, ఇంతకుముందు నీ కొడుకు కంప్యూటరులో నువ్వు రాసిన వార్త చదివి ఇనిపించినాడు. సచ్చిపొయ్యింది నిజ్జంగా సిన్నక్కేనంటరా?” అమ్మ గొంతులో వొణుకు.

“అవును ఆ ఎంకమ్మే గంగలో దూకేసి చచ్చిపొయ్యింది. కొడుకు నరసిమ్మ దెగ్గిర బాదలు పడలేక కాశీకి వెళ్ళి ప్రాణాలు తీసుకునిందంట.” ఇంక వొదిలేరకం కాదని చెప్పినాను.

“ఆ నరసిమ్మ వాళ్ళమ్మను బాదపెట్టే రకం గాదురా. పదిరోజుల ముందు గూడా సిన్నక్క ఫోంజేసి చెప్పిందిరా నాకు. కర్సురా వొద్దు... అంటావున్నా ఇనకండా కొడుకు కాశీకి పంపిచ్చినాడంట.” గొణుగుకుంటా వెళ్ళిపోయింది.

నేనైతే సొంతూరు వెళ్ళి ఇరవై ఏళ్లయిందికానీ, అమ్మ మాత్రం ఊరోళ్ళతో రోజూ ఫోన్లో మాట్లాడతానే ఉంటాది. ఐదేళ్ళ ముందు పోరుబెట్టి ఫోను తీసుకునింది. ఎట్టా పట్టిందో కానీ సిన్నక్క నెంబరుతోపాటు, ఇంకా కొందురు సావాసగత్తెల నెంబర్లు పట్టేసింది. ఈ విషయంలో అమ్మ మనవడు, అదే నా పుత్రరత్నం మిందే అనుమానం నాకు.

ఆ రాత్రి నాకు ఒక పట్టాన నిద్రపట్టలేదు. తెల్లారి నేను కుచ్చున్న యాపసెట్టు, నేరేడు మానుకు ఆనించిన కుడితితొట్టి, తురాయి చెట్టు మొదుట్లో పెట్టిన కళ్ళాపి బానే గెవనానికి వస్తావుండాయి.

“వొద్దురా, ఈ నేలను అమ్మొద్దు. టౌన్లో యాపారం జేసేది మనలాంటోల్లకు లాకీ కాదు. కాదు, చేస్తానంటే నా పెన్షన్ దుడ్లు లక్షదాకా ఉంటాయి. ఇంకా నీ కొడుకు పేరుతో డిపాజిట్ చేసిన లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టుకో. టౌను ఎంతదూరం మనకు.. మూడునాలుగు మైళ్ళే కదా. ఆంగిడి ఏదైనా పెట్టి, రోజూ ఇంటికి వొచ్చి ఎల్తా వుండు. నేను పుట్టిపెరిగిన ఊరురా ఇది. ఈ జానెడు నేలను అమ్మేసి, నన్ను నా వూరికి ఈ మనుషులకు దూరం చెయ్యొద్దు.”

టౌన్లోని అద్దె ఇంటి జానెడు వరండాలో మంచం మీద అనారోగ్యంతో ఉన్న నాయిన కలవరింతలు ఒకటే చెవుల్లో పోటెత్తతా ఉండాయి.

ఊళ్ళో ఇంటి జాగా అయితే అమ్మేసినాను. వొచ్చిన దుడ్లు, నాయిన పెన్షన్ డబ్బులు, ఆయన మనవడి పేరుమీద వేసిన డిపాజిట్ దుడ్లు అన్నీ కలేసి ఇంకో టౌన్లో కొత్తగా పరిచయమైన సావాసాగాడితో కలిసి సెల్ఫోన్ రిపేర్ అండ్ సేల్స్ అంగిడి పెట్టినాను.

అంగిడితోపాటు ఒక తెలుగు పత్రికలో విలేకరి పని చేసుకుంటా ఈ అద్ది ఇంట్లో బతుకును ఈడస్తా ఉండాను.

కరెంట్ పొయ్యి గంటయి ఉంటాది. ఒకటే ఉక్క. ఈ ఫ్యాన్లు వొచ్చి, ఇంట్లో విసనకర్రలు కూడా పెట్టుకోవడం లేదు.

పైకిలేచి నిలబడి పక్కనే పడుకోనుండే భార్య దిక్కు జూసినాను. ప్రశాంతంగా నిద్రపోతా కనిపించింది. నిజంగానే ప్రశాంతంగా ఉండాదా శాంత? నన్ను కట్టుకున్నందుకు ఎన్ని బాదలు దీనికి? ఇంగ ఆలోచించడానికి బయమేసింది. ఏసుకున్న బనీను గూడా తీసి కొక్కీకి తగిలించి, గుహ మాదిరిగా ఉండే ఇంట్లోనుంచి బైటికి నడిచినాను.

అక్కడ వరండాలో ఉండాల్సిన అమ్మ లేదు. యాడికి ఎల్లింది ఈ యాళప్పుడు? కంగారు పెరిగి పొయ్యింది.

ఆపక్కనే పరీక్షలకు చదువుకుంటా ఉండే కొడుకు అట్టే సోఫాలో పడి గురక పెడతా ఉండాడు.

“రేయ్ యిజయా.. రేయ్...” తట్టి లేపినాను.

“డాడీ...” మూడోసారి గెట్టిగా తట్టినాక లేచినాడు ఉలిక్కిపడి.

“అవ్వెక్కడ రా?” అడిగినాను.

“ఈడనే గదా పొడుకొని ఉండాల, ఎక్కడికి పొయ్యింది?” ఎదురు కొసిన్ జేసినాడు.

“అదేరా నేను నిన్ను అడగతా వుండాను? నీ పక్కన మంచంమ్మిందే గదా పొడుకోనుండాల అవ్వ, యాడ?”

“ఏమో డాడీ, నాకు తెలీదు. నైట్ చదువుకుంటా చదువుకుంటా అలాగే నిద్రపోయినాను నేను.” కంగారుగా పైకి లేచినాడు.

*                                  *                                  *

“ఏందయ్యా, అట్టా మూగిలా కూసోనుండావు? ఏమయ్యింది?” ఊరంతా తిరిగేసొచ్చి దివాన్ మింద కూలబడిన నా పక్కన కూసుంటా అడిగింది శాంత.

“రేయ్ నాయినా, మనవొల్ల గాదురా. యాపారం అంటే మోసం తెలియాల. ఎవుర్నీ సులువుగా నమ్మగూడదు. చెప్పిన మాట ఇనరా.” చెవినిల్లు గట్టుకొని నాయిన పోరితే ఇన్నాడా? ఇప్పుడు అనుబవిస్తా ఉండాడు.

మనుషుల మింద గొప్ప నమ్మకంతో జీవితాంతం ఆయన సంపారిచ్చిన ఆస్తిపాస్తులు తెగనమ్మి టౌనుకు వొచ్చేసినాడు.

ఏమయ్యింది ఇప్పుడు. సొంతూరు వొదిలి తట్టాబుట్టా సర్దుకోని వలస వొచ్చిన మనేదతో నాయిన మంచం పట్టి చచ్చేపొయ్యినాడు.

అమ్మ...? ఆమి మాట నేను యినింది ఎప్పుడూ లేదు. మూగిమొద్దులా పడుండి, పడుండి కడాన ఇల్లు ఇడిసిపెట్టి ఎల్లిపొయ్యింది. సిన్నక్క సావు వార్త మనవడితో సదివించుకున్న రోజు కనిపిచ్చకుండా పొయ్యిన అమ్మ, మూడురోజులైనా అడ్రసు లేదు. ఇప్పుడు... నమ్మిన సావాసాగాడు అంగిడిమింద అప్పులు మిగిల్చి, తెంచేసుకొని నట్టేట్లో ముంచేసినాడు.

“అయ్యో, ఏందయ్యా... ఆ కళ్ళల్లో నీళ్ళేంది?” శాంత తకమికలైపొయ్యింది. నా చెయ్యిని తన చేతిలోకి తీసుకొనింది.

“ప్చ్... ఏం లేదు.” చేతిని ఇడిపించుకోని, రూములోకొచ్చి కూసున్నాను.

“ఏందయ్యా... ఏందా రాతలు? మతి వుండే రాస్తా ఉండావా? అసలు నీకేమైందయ్యా?” ఏడుపు కలిసిన శాంత మాటలు ఇనిపించడంతోపాటు ఆయమ్మి స్పర్శ తెలియడంతో కీ బోర్డు మింద కదలతా ఉండే చేతులు టక్కమని ఆగిపొయ్యినాయి.

“తల్లిదండ్రుల ఉసురు పోసుకున్న జర్నలిస్టు: ఉన్న భూమిని అమ్ముకుని అనామకంగా ఆత్మహత్య”

‘ఒక జర్నలిస్టు  అనామకంగా మృతి చెందాడు. అమ్మానాన్నల ఉసురు తగిలి ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత ఊళ్ళో ఉన్న చేరెడు భూమిని, గుడిసెను తెగనమ్మి, పట్టణం వచ్చి ఆయన మొదలుపెట్టిన వ్యాపారం దివాళా తీసింది. సొంత ఊరినుంచి వలస వచ్చిన మనోవ్యాధితో నాన్న అంతకుముందే మంచం పట్టి, మృతి చెందగా, అమ్మ ఈమధ్యే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల బాధకు కారణం అయినందువల్లే ఆ పాపం శాపంగా మారి, జర్నలిస్టు ఆత్మహత్యకు దారితీసిందని ఆయన సొంత గ్రామస్తుడు వీరారెడ్డి వ్యాఖ్యానించారు...’

తెల్ల స్క్రీన్ మింద టైపు చేసిన అక్షరాలు నల్లగా చీకట్లను నా కళ్ళలోకి చిమ్మినాయి.

“అవునత్తా కంప్యూటరు మింద టైపు జేస్తా జేస్తా అమాన కుర్చీ చేతిమిందకు ఒరిగిపొయ్యి కళ్ళు తేలేసినాడు. పక్కనే నిద్ర మాత్రల డబ్బా ఖాళీగా ఉండాది. ఆస్పత్రిలో జేర్పించి ఈ పొద్దుటికి రొండు రోజులు అవతా ఉండాది. ఇంకా మనలోకి రాలా. నాకు చానా బయంగా ఉండాదత్తా. అందుకే నీకు ఫోంజేసినా.” శాంత ఏడుపు గొంతు ఇనిపించింది, కొంచెం తెలివి వొస్తానే.

అంటే అత్తాకోడళ్ళు టచ్ లోనే ఉండారా? నన్ను ఎర్రి ఎదవని జేసి ఆడించినారా ఇన్ని రోజులు?... ఆవేశం తన్నుకోని వచ్చింది.

“డాక్టర్... డాక్టర్... పేషెంట్ బీపీ, పల్స్ పెరిగిపోతున్నాయి.” సూది చేతిలో పట్టుకోని అప్పుడే వొచ్చిన నర్సు బెడ్డు పక్కనే వుండే మిషను జూసి కేకలు పెట్టింది.

*                                        *                                       *

“మేము కూడా నీతో కలిసి మనూరికి వొచ్చేస్తామమ్మా...” చెప్పినాను అమ్మ చేతులు పట్టుకోని.

నా కళ్ళలోకి సూటిగా చూసింది... ఆరోజున వీరారెడ్డి చూసినట్టు. గెద్ద కాలిగోళ్లకు చిక్కిన కోడిపిల్ల మాదిర్తో తనకలాడిపొయ్యినాను.

“వొద్దురా, నువ్వు రావొద్దు.” ఖరాఖండిగా చెప్పింది.

మా ఇద్దరి మజ్జన కొంచేపు మాటలు మూగిగా కుచ్చున్నాయి.

“మీ నాయిన మనం జేసుకుంటా వుండే పొలం అమ్మినాడు కానీ, సిన్నక్క కొడుకు నరసిమ్మకు కౌలుకిచ్చిన ఎకరం పొలం జోలికి పోలా. ఎప్పుడూ సదువులూ, అనాక ఉజ్జోగాలు అంటా టౌనులోనే ఉండిపొయ్యిన నీకు ఆ కయ్యి గురిచ్చి తెలీదు. తల్లివేరులాంటి ఊరిమింద నీ అయిష్టం జూసినాక మేమే కావాలని తెలీనియ్యలేదు. కష్టాల్లో ఉండావు గాబట్టి, ఊరికి వచ్చేస్తానంటావు. రేపు మళ్ళీ మొహం మొత్తితే పట్నం వొచ్చేసేదానికి, దాన్ని కూడా తెగనమ్మేదానికి జూడవని గ్యారంటీ ఏంది?”

“అదిగాదు మా...”

“అవును అదే... నేను చెప్పిందే కరెట్టు. నీ దారి ఎప్పుడో ఏరైపొయ్యింది. నువ్వు నిజంగా ఉండాలన్నా ఇంగ మనూల్లో ఉండలేవు. కాదని దుర్బుద్దితో వొచ్చినా, మనకు మిగిలిన పొలాన్ని అమ్మలేవు. ఎందుకంటే, నేను చచ్చినాక మాత్రమే ఆ బూమ్మింద నీకు హక్కు వస్తాది. నా కట్టి కాలేదాకా, నరసిమ్మే చేసుకొంటాడు. అందుట్లో వొచ్చిన ఫలితం నాకింత పెట్టి, వోళ్ళు ఇంత తింటారు. మనఊరి మింద ఇప్పుడు కాలవ కూడా పోతావుండాది, గవుర్మెంటు తొవ్వించింది. కయ్యిలో బంగారం పండతా వుండాది.”

అర్థమైపొయ్యింది నాకు... అమ్మ నన్ను ఊరికి రానియ్యదు... బొందిలో ప్రాణముండగా బూమిని అమ్మనియ్యదు.

“నీ ఇష్టం మా...” అనేసినాను. నా ఇష్టం జరగదని అంత కచ్చితంగా చెప్పేసినాక ఇంక అనడానికి ఏముండాది, దీనికి మించి.

“ఇదిగో శాంతా, దీన్ని నీ దెగ్గిర పెట్టుకో. ఆ పుణ్యాత్ముడు పోతాపోతా ఈ పింఛను దుడ్లు మిగిల్చి పొయ్యినాడు నాకు. మీరు వాడుకోండి. మళ్ళీ ఈ కర్మాత్ముడు చావుజోలికి ఎల్తే అదోడి కర్మ.”

“మీ ఖర్చులకు...” అత్తిచ్చిన ఏటీఎం కార్డు జూస్తా కోడలు గొణిగింది.

“నాదేముండాదమ్మా... ముసలిముండను. మనూళ్ళో పెద్ద ఖర్చులేం ఉంటాయి? కౌలుకు ఇచ్చిన కయ్యిలో వొచ్చే తృణమో, పణమో బతకడానికి సరిపోతాది. ఇంకా ఏదైనా సాయం కావాల్సి వొస్తే నీకు ఫోను జేస్తే ఇవ్వనంటావా?”

“అవ్వా.. ఆటో వొచ్చేసింది.” కింద నుంచి మనవడు కేకేసినాడు.

“వొరే ఒకమాట జెప్తా ఇను. మనిషి చావడానికి ఎంతసేపు, వక్క కొరికే టైము చాలదా.  బతకాలిరా, బతికి చూపించాలి. పిరికోడిలా చావడం ఏందిరా కొడకా. నేనూ బతకడానికే ఎల్తన్నా మనూరికి. నా ఇష్టం అక్కడ ఉండాది. నీకక్కడ కుదరలేదని ఈడిదాకా వొచ్చినావు గదా. నీ ఇష్టం ఇక్కడ ఉండాది. ఎక్కడైనా సరే, ఇష్టంగా బతకాలి. కష్టాలకు, కన్నీళ్ళకు ఎదుర్రొమ్ము ఇచ్చి నిలబడాలి. అనాక నీ ఎనకాల ఈ అమ్మ ఉండాది.” నా చెంపలు రెండు చేతులతో మృదువుగా నిమిరింది అమ్మ.

“అవ్వా...” ఇంగోసారి మనవడి కేక.

“ఆ... వొచ్చేవొచ్చే. వస్తాన్రా నాయినా... ఆరోగ్యం జాగర్త.” చెప్పి మెట్లు దిగేసింది అమ్మ.

-----------------------------------------------
# “కౌముది” వెబ్ మేగజైన్, జనవరి, 2026 #

Comments

  1. పాత్రలన్నీ కళ్ళముందే దర్శనం ఇచ్చేలా చక్కని మాండలికపు నుడికారంతో నడిచి బాగా ఆకట్టుకుంది కథ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పుట్టింరోజు

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ