కాపీనం
పురాణాలు, జానపద కథల్లో చదవడం తప్ప ఆజానూబాహుడంటే ఎలా ఉంటాడో పురుషోత్తం ఇదివరకు చూడలేదు. డెబ్బయ్యేళ్లు దాటుతున్నా మెలితిరిగి కనిపిస్తున్న ఆ ముసలాయన చాపిన రెక్కలను చూస్తున్నాడు ఇప్పుడు.
కరెంటు స్తంభానికి కట్టేసిన ఆవు, సత్తు బక్కెట్లో పోసిన కుడితి తాగుతోంది. అర్ధాంతరంగా ఆపేసిన అసంపూర్తి బిల్డింగు గోడకు వాలుగా కట్టిన చిరుగుల టార్పాలిన్ సపార కింద కూలబడ్డ రెండో ఆవు, తన ముందేసిన జొన్న కట్టిని కన్నెత్తి చూడకుండా అరమోడ్పు కళ్ళతో తీరిగ్గా నెమరేస్తా ఉండాది. ట్రాక్టరును కడిగినారో ఏమో, బైపాస్ రోడ్డు నుంచి పురుషోత్తం ఇంటిదాకా పదడుగుల వెడల్పుతో వేసిన సిమెంటు రోడ్డు మింద నీళ్ళు కాలవలై పారుతోంది. పొద్దు పది దాటుతోన్నా, మంచు దుప్పటి తొలగించి ముఖం చూపించడానికి సూరీడయ్య బద్ధకిస్తా వుండాడు.
“డ్డోయ్... మళ్ళిట్టా...” కాంతారలో హీరో కేకకు కూడా పురుషోత్తం జడవలేదు. వినిపించిన అరుపుకు అదిరిపడి చూసేసరికి, కట్టు తెంపుకుని ఉడాయిస్తున్న ఆవు వెనుక ఉరుకుతున్నాడు ముసలాయన.
చిటికెలో పగ్గం పట్టుకుని లాక్కొచ్చి తిరిగి కరెంటు స్తంభానికి కట్టేశాడు. మోకాళ్లకు పైకి కట్టిన ముతక ధోవతికి రెండు చేతులూ తుడుచుకుంటూ సంగటి క్యారేజీ ముందు కూర్చున్నాడు. కుడికాలు మడిచి, ఎడమకాలు డానిమీదుగా కిందికి వేలాడేశాడు. ఉడుకుడుకు సంకటిలోనుంచి నిమ్మకాయంత మాత్రం తుంపి గిన్నెలో నీళ్ళనీళ్లగా కనిపిస్తున్న టమాటా గుజ్జులో ముంచి నోట్లో వేసుకుని గుటుక్కుమని మింగాడు.
ఆవెంటనే ఏదో పొరపాటు జరిగిపోయినట్టు పురుషోత్తంకేసి తలయెత్తి చూసి అన్నాడు. “అయ్యో మరిచేపొయ్యినాను యావనుకోబాక. సద్ది తాగినావా అబయా? రా రా... వగముద్ద తినిపోదువుగానీ...” ఆప్యాయంగా ఆహ్వానించాడు.
కళ్ళు నులుముకుంటూ ఇంట్లోనుంచి వెలుపలికి వచ్చి యథాప్రకారం వాకింగ్ మొదలు పెట్టిన పురుషోత్తాన్ని, ఆ ఖాళీ షాపురూము ముందుకు రాగానే ముసలాయన జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. ఈ లేఅవుట్ లో జానెడు జాగా కొని కొత్తగా ఇల్లు కట్టుకుని మొదటిసారి వాకింగ్ చేస్తున్నప్పుడు- ముసలాయన కంట పడినప్పటి దృశ్యాలు, మాటలు మనోఫలకంపై కదిలాయి. నిన్నటిదా ఆ ఖాళీ షాపురుములోనే ఉండేవాడు. ఇప్పుడక్కడ లేడు. ముసలాయన ఎప్పుడూ కూర్చునే షట్టర్ ఎత్తివుండే అసంపూర్తి షాపు రూము గట్టు, ఆలోపల ఆయన నడుం వాల్చే నులకమంచం ఖాళీగా కనిపిస్తున్నాయి. మిగిలిపోయిన రెండు ఆవులూ, తమముందు కత్తిరించకనే పడేసివున్న బారాటి పచ్చి జొన్నగడ్డిని మాటిమాటికీ మూచూసి అడ్డంగా తలాడిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అప్పుడప్పుడూ తలయెత్తి ఖాళీ షాపురూము ముందున్న ఖాళీ జాగావైపు చూస్తూ కన్నీరు విడుస్తున్నాయి.
తన ఇంటినుంచి బైపాస్ రోడ్డుకు వెళ్ళేటపుడు పదడుగుల సిమెంటు రోడ్డుమీద ఒక యాభై అడుగులు వేస్తే కుడివైపు కనిపిస్తుంది ఆ రెండంతస్తుల అసంపూర్తి బిల్డింగ్. ఏదో ఆక్రమణ ఉన్నదని మున్సిపాలిటీ వాళ్ళు అభ్యంతరం చెప్పాక నిర్మాణం ఆపేసిన యజమాని, తర్వాత ఇటు తలతిప్పి చూడలేదు. బిల్డింగ్ కింది భాగంలో మూడు షాపురూములున్నాయి. అందులోని మధ్య షాపురుములోనే నిన్నటిదాకా ముసలాయన నివాసం.
సిమెంటు రోడ్డుకు కుడివైపు అంటే అసంపూర్తి బిల్డింగుకు సరిగ్గా వ్యతిరేక దిశకు అప్రయత్నంగా పురుషోత్తం చూపు మళ్ళింది. అక్కడ సగం కూలిన పాడుబడ్డ గూనపెంకుల పైకప్పు మట్టి ఇల్లు, ఇక నాకు దిక్కెవరంటూ బావురుమంది.
ఎందుకో ఒక శూన్యం ఆవరించుకుంది పురుషోత్తం మనసును. బలవంతంగా పది నిముషాలు నడిచాడు కానీ, మరి ముందుకు సాగలేకపోయాడు. ఇంటిముందున్న టీ షేపు సిమెంటు రోడ్డుమీద చేస్తున్న నడక చాలించుకుని ఇంటికి వచ్చేశాడు.
“పాపం, ఎంత ఆశపడ్డాడో... ప్చ్ ,,,” కుర్చీలో కూర్చున్న భర్త చేతికి టీ ఇస్తూ శ్రీమతి పెదవులు చప్పరించింది.
“ఎవరిగురించి?” అడిగాడు పేపర్ చేతిలోకి తీసుకోబోయి ఆగి పురుషోత్తం.
“మీరు ఎవరికోసం ఆ ఖాళీ షాపురూము ముందు నిలబడ్డారు?”
ఎప్పుడూ ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఆమెనుంచి రావడం అలవాటైపోయింది అతడికి.
గోడగడియారం వైపు చూశాడు. సమయం ఎనిమిదిన్నర చూపిస్తోంది. పిల్లలింకా లేవలేదు. ఇప్పుడే లేపే ఉద్దేశం కూడా లేడు. మంచు కురిసే వేళలు పోయి ఇప్పుడిప్పుడే వాతావరణం వెచ్చదనం పుంజుకుంటున్న కాలం. అసలే ఆదివారం. హాల్లో పక్కనే ఉన్న మరో కుర్చీని ఎదురుగా లాక్కుని దానిమీద కాళ్ళను జాపుకుంటూ రిలాక్స్ అయ్యాడు పురుషోత్తం. ‘నేనూ సంభాషణకు సిద్ధం’ అన్న మాటలకు ఈ ఆసనం ఒక సంకేతంగా వాడతాడు అతడు.
“నిజమే... పాపం, అసలు ఎలా జరిగిందంట?” ప్రశ్న వేశాడు.
“రాత్రి మీరు క్యాంప్ కు వెళ్ళి ఆలస్యంగా వచ్చారని మొత్తం చెప్పలేదు, నిన్న తెల్లవారు ఝాము నాలుగున్నర ప్రాంతంలో కొడుకుకు మెళకువొచ్చి చూస్తే, పడుకున్న మంచం మీదనే లేచి కూర్చోవడానికి నానా అవస్థలు పడుతూ కనిపించాడట.”
“ఎప్పుడూ ఒక్కడే కదా ఉంటాడు, ఒంటరిగా...”
“నిజమేకానీ, ఆవు నిండుచూలుది కావడంతో ఏ వేళలో ఈనుతుందోనని ఆ రాత్రి కొడుకు కూడా ఇక్కడే పడుకున్నాడట.”
“వూ...”
“గుండెలు పట్టుకుని వంగిపోతూ విలవిలలాడి పోయాడట. ఆఖరికి ఏమనుకున్నాడో ఏమో, ఒకసారి ఎదురుగా కనిపిస్తున్న పాడుబడ్డ గుడిసెను చూసి ‘నన్ను మన ఇంటికి తీసకపో కొడకా..’ అనేసి కుప్పగా కొడుకు చేతుల్లో కూలిపొయ్యాడట.”
పురుషోత్తం మరేమీ మాట్లాడలేకపోయాడు. ఖాళీ అయిన టీ కప్పు శ్రీమతి కందించి మౌనంగా పేపరు చేతిలోకి తీసుకున్నాడు.
భర్త మూడ్ తెలిసినట్టు నిట్టూర్పు విడిచి వంట ఇంట్లోకి నడుస్తూ మరోసారి అంది నిరసనగా ఆమె, “అయినా మనిషికి అంత కాపీనం ఉండకూడదు.”
ఆరోజంతా తింటున్నా, కూర్చున్నా, పడుకున్నా, రాస్తున్నా.., ఏ పని చేస్తున్నా ముసలాయనే గుర్తుకొస్తున్నాడు అతడికి.
మనిషి ఎందుకోసం ఈ భూమ్మీదికి వచ్చాడు? అసలు అతడికి ఏం కావాలి?
రెండే ప్రశ్నలు మనసులో పదేపదే తిరుగుతున్నాయి.
సుమారు పదేళ్ళ క్రితం ఈ చిన్న లేఅవుట్లో ఇల్లు కడుతుంటే అక్కరకొచ్చింది ఆ ముసలాయన గూనపెంకుల మట్టి గుడిసె. అప్పటికే పాక్షికంగా శిథిల స్థితిలో ఉన్న ఆ గుడిసెలో పలుగు, పారలతోపాటు ఇంటి నిర్మాణ సామగ్రి పెట్టుకునేవారు కూలీలు. లేఅవుట్ లో పురుషొత్తానిదే మొదటి భవనం. ఇక్కడికి స్థలం కొనేందుకు అడుగుపెట్టినప్పుడు కంటికి కనిపించిన మొదటి మనిషీ ఆయనే.
విశాలమైన నుదురు, చిన్న కళ్ళు, పొడవు ముక్కు, వెడల్పైన ఛాతీ, మెలితిరిగిన నరాలతో బలమైన కాళ్లూచేతులూ. వయసు అరవయ్యే కానీ యాభై లోపే అనిపించే నల్లటి దృఢమైన దేహం. తెల్లటి తలపాగా, మోకాళ్ళ పైకి కట్టిన తెల్లటి ముతక ధోవతి. కటి పైభాగం ఏ ఆచ్చాదనా లేకుండా నగ్నంగా విడిచేసేవాడు.
అప్పుడు కూడా ఒక వెదురుకట్టి చేతిలో ఉండేది. అయితే తర్వాతి కాలంలో అవసరమైనట్టు నడవడానికి ఊతంగా కాదు- గొడ్లను, కుక్కలను, అప్పుడప్పుడూ దొంగలను అదిలించే ఆయుధంగా.
“నీకు తెలీదబయా... ఈ చెరువు కింద వందల ఎకరాల సేద్యం చేసినాను నేను.” చెబుతున్నప్పుడు ముసలాయన ఛాతీ పొంగేది.
“ఇప్పుడు చెరువూ లేదు, చేలూ లేవు. బూముల్ని షావుకార్లు ప్లాట్లు జేసి నీబోటి ఉజ్జోగస్తులకు తెగనమ్మేసినాక యాడినింటి ఉంటాదిలే...” అంతలోనే దీర్ఘమైన నిట్టూర్పు వెలువడేది.
“ఏళ్లతరబడి నేను కాపలా కాసిన బూముల్ని తెగనమ్మేసినారు. చెరువును చెరబట్టేసినారు. ఎవురో పుణ్యాత్ముడు జానెడు నేల యిస్తే యిగ్గో ఈడ గుడిసేసుకోని రొండు గొడ్లు పట్టుకోని బతకతా వుండా.” బతుకు తీపి బయటకు వచ్చేది.
లేఅవుట్లో పురుషోత్తం ఇల్లు కట్టుకుని స్థిరపడ్డ అయిదారేళ్లకు ఉన్నట్టుండి మున్సిపాలిటీవాళ్ళు ముసలాయన గుడిసెపై దండెత్తారు. పొక్లయినర్ తో సగందాకా కూల్చేశారు.
“మా బతుకు కూల్చిన నాబట్టలు బాగుపడతారా... మట్టిగొట్టుకొని పోతారు. వాండ్ల పెళ్ళాల పుస్తెలు దెగా... వాండ్ల పిల్లోళ్లకు దూము తగలా...” ముసలాయన పెళ్ళాం దిబ్బలో మట్టి జవిరి తూర్పార బట్టింది.
“షావుకారు మోసం జేసినాడబయా. ఈ గుడిసేసుకోమని జెప్పి ఆయనిచ్చిన అగ్గిపెట్టేంత నేల, పొరంబోకు గవుర్మెట్టు బూమంట అబయా.” చెబుతున్న ముసలాయన మాటల్లో కోపమో, ఆవేశమో లేదు. ఎవరికో మూడో వ్యక్తికి ఆ అన్యాయం జరిగినట్టు నిర్లిప్తంగా నివేదించాడు.
కానీ ఆయన కళ్ళల్లో మరేదో కదలాడుతోంది. కోపతాపాలకు పోతే భవిష్యత్తు ఫలితమేదో చేజారిపోతుందన్న భావమేమో తెలియడంలేదు.
గుడిసె కూలింది కానీ, ఆపక్కనే రోడ్డుకు ఇటువారనున్న భారీ అసంపూర్తి బిల్డింగ్ ను అధికారులు ఏమీ చేయలేకపోయారు. అందుకు “అధికారం” అడ్డుపడింది.
అదిగో అప్పుడు మారింది ముసలాయన మకాం, కూలిన గుడిసె నుంచి ఆ బిల్డింగులోని షాపురూములోకి.
ఒక నులకమంచం, ఒక సత్తు నీళ్లపాత్ర ఆ షాపురూములో ముసలాయనతోపాటు ఉండే ఆస్తి. అప్పుడప్పుడూ ఆయన భార్య ముసలామె కనిపించేది. ఆయనకు ప్రపంచంతో ఏ సంబంధమూ లేదు- చివరకు కట్టుకున్న పెళ్ళాంతో కూడా.
రెండు ఆవులతోనే ముసలాయన సాహచర్యం. ప్రతిరోజూ కొడుకు పొలం నుంచి తెచ్చిపడేసే జొన్న గడ్డిని తుంటలుతుంటలుగా నరికి, ఆవులకు మేతగా వేసేవాడు. అప్పుడప్పుడూ వాటి శరీరాలను కడిగి శుభ్రం చేసేవాడు. జోరీగలు, పిడుదులు ముసురుతుంటే దగ్గరే ఉండి పైగుడ్డతో విసిరేవాడు. మూడుపూటలా కొడుకు ఇంటినుంచి టిఫిను క్యారేజీలో తెచ్చే సంకటి ముద్దలు తిని ఆకలి తీర్చుకునేవాడు.
ఎండయినా, చలయినా... వానయినా, వరదైనా... షట్టర్ మూసేది లేదు. ఆ అసంపూర్తి షాపురూము విడిచి ఎక్కడికీ వెళ్ళేదీ లేదు.
ఆఖరికి ముసలాయన జీవంలేని కట్టె మాత్రమే అక్కడినుంచి బయటకు కదిలింది.
ముసలాయనకు ఇద్దరు కొడుకులు. ఒకరు మేస్త్రీ అయితే ఇంకొకరు ఏదో పాల డెయిరీలో పనిచేస్తున్నారు. ఇద్దరూ బాగానే సంపాదిస్తున్నారు. ఇక్కడే ఆ కనిపించే గుట్టకు వెనుక, మునిగాళ్ల మీద నిక్కి చూస్తే కనిపించేంత దూరంలో స్వంత ఇల్లు ఉంది.
మరి ఈయనకు ఎందుకీ తాపత్రయం? తాపత్రయపడి చివరాఖరికి నెత్తిమీద ఏం మూటకట్టుకుని వెళ్ళాడు?
చూస్తున్న పేపర్ పక్కనపెట్టి లేచి బయటకు వచ్చాడు పురుషోత్తం. ఇంతకుముందు లాగే ఖాళీగా కనిపించింది మధ్య షాపురూము. ముసలాయనే ఉండుంటే గొడ్లకు కుడితి పెడుతూ వుండేవాడు ఈ సమయంలో. ముక్కలుగా నరికి ఆకుమాత్రమే ఉండే జొన్నకంకి మేతగా వేసేవాడు. ఇప్పుడాపని ఆయన చిన్న కొడుకు చేస్తున్నాడు. మేత మేయకుండా మొరాయిస్తున్న గొడ్లను జొన్న కర్రతో బాదుతున్నాడు.
“ఆ ముసలాయనకంటే పనీబాటా లేదు. జొన్న కంకి తుంటాలుగా నరికి మీ ముట్టెల్లో దోపడానికి నాకు పనేమీ లేదనుకుండారా? మెయ్యకపోతే మాడిసావండి, నాకేం?” తెచ్చిన జొన్న కర్రను తెచ్చినట్లే వాటిముందు వేసి తిట్లకు లంకించుకున్నాడు.
అయిదు నిముషాల తర్వాత పాలు తీయడానికి ఆవు పొదుగుముందు కూర్చున్నాడు. ఒక్కదగ్గర నిలవడం లేదా ఆవు. వెనుక తొక్కుళ్లు తొక్కుతూ అతడిని విదిలించేస్తోంది. మాటిమాటికీ ఖాళీ షాపురూమును చూస్తూ “అంబా...” అంటూ అంగలారుస్తోంది.
“బతికినన్నాళ్ళూ ఆ ముసిలోడు ఏపుకుతిన్నాడు. ఇబ్బుడు మీరు సంపకతింటారా...” అరుస్తున్నాడు ఆవుల మీద.
“ఆ ముసిలోడు ముదిగారం జేసిజేసీ గదా ఈ గొడ్లిట్టా యాసమేసేదానికి నేర్సుకుండాయి. ఇబ్బుడు నువ్వూ వోటి వట్టల్ని సమ్మగా పిసికితే అవతాదా... రొవంత తాళు జెప్తా...” ఎక్కడినుంచి తీసుకొచ్చిందో ముసలాయన కోడలు అనుకుంటా... పొడవాటి చింతమెల్లితో ఆవు ముట్టిమీద చావబాదింది.
“నాయనా, ఆడ షాపురూములో మునెప్ప అనే ముసలాయన ఉండాల. కనిపిచ్చడం ల్యా. యాడికి బొయ్యినాడో నీకేమన్నా తెలుసునా?” ఇంతలో నాకు కుడివైపు నుంచి వినిపించింది వొణుకుతున్న గొంతు ఒకటి.
తిరిగి చూద్దుడు గదా, ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అచ్చం చనిపోయిన ముసలాయన వేషధారణలోనే కనిపించాడు.
“మీరు ఎవరు పెద్దాయనా? మునెప్ప ఎవరు?” అడిగాడు పురుషోత్తం.
“ఈడనే గదా మీ ఇల్లు. మునెప్ప తెలీదా నీకు. అగ్గో ఆ గొడ్లు ఆయప్పవే. ఆడ కనిపిస్తా వుండే షాపురూములోనే గదా ఉండేది మునెప్ప. నేనాయప్ప సావాసాగాన్ని. ఈటికి పది మైళ్ళ దూరం మావూరు.” వివరంగా చెప్పాడు.
పదేళ్లుగా పరిచయం వుండి, ఎవరూ మనిషన్నవాడే లేనప్పుడు చేతనైన సాయం చేసి, కనిపించినప్పుడల్లా ఆప్యాయంగా పలుకరించే షాపురూము ముసలాయన పేరు ఇన్నాళ్ళూ తెలుసుకోలేక పోయాడు- సిగ్గేసింది అతడికి.
“నాక్కూడా రాత్రిదాకా తెలియదు పెద్దాయనా. మునెప్ప చచ్చిపోయాడట. ఆయన ఫ్రెండ్ అంటున్నారు, మీక్కూడా తెలియదా?” ఆశ్చర్యపోయాడు.
“అయ్యో, మునెప్ప ఎళ్లిపోయినాడా...” ఎదురుగ్గా నిలబడ్డ ముసలాయన రెండు చేతులతో తలపట్టుకుని, సత్తువ లేనట్టు అమాంతం రోడ్డుమీదనే కూలబడినట్లు కూర్చుండి పోయాడు వృద్ధుడు.
స్నేహితుడిని తలచుకుని కుమిలిపోతున్నాడు కాబోలు. ఆ పెద్దాయన భుజాలు రిథమిక్ గా కదులుతున్నాయి.
“ఎల్లగాలం ఈ బూమినే నమ్ముకుని బతికినాడే. జానాబిత్తిడి నేలకోసరం పాకులాడినాడే. కడాకి కోరిక తీరసుకోకుండానే పాయ గదరా దేముడా...” రాగాలు తీస్తున్నట్టుగా వున్న ఏమాత్రం తడిలేని ఆ వృద్ధుడి బొంగురు గొంతులో, విచిత్రంగా విషాదం ఒలుకుతోంది.
కాటికి కాళ్ళు చాపుకున్న ముసలాయన, తనదికాని భూమికోసం, భార్యా పిల్లలూ అందరూ ఉండి, ఇల్లూవాకిలీ కలిగికూడా అనాథలా ఈ షాపురూములో బతుకీడ్వడం... బుద్ధి చెప్పాల్సిన ఈ వృద్ధుడు, స్నేహితుడు కోరిక తీరాకుండానే పోయాడని ఏడ్వడం...
పురుషోత్తానికి చిర్రెత్తుకొచ్చింది.
“ఏందా ముసలాయన కోరిక. ఎవరో తన స్థలమని మోసపుచ్చి దానంగా ఇచ్చిన ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా సొంతం చేసుకోవడమేనా? దానికోసం కనీసం తిండితిప్పలు సరిగా లేకుండా, అందరూ ఉండి కూడా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఈడ అనాథలా బతుకుతూ కడాకి దిక్కులేని చావు చావడమేనా?” చచ్చిన ముసలాయన తీరుపై అంతదాకా కడుపులో వున్న కోపాన్ని కక్కేశాడు.
ముసలాయన ఎవరో, తనెవరో? ఆయన అనాథలా చస్తే తనకేమిటి, మహరాజులా కాటికేగితే ఏమిటి?
కానీ ఆ ముసలాయన మీద ఉన్న అభిమానం పురుషోత్తాన్నలా కోపానికి గురిచేసింది. ఇక్కడ జానెడు జాగా కొని ఇల్లు కట్టుకుని, కాపురం పెట్టిన నాటినుంచి చచ్చేదాకా ఆయనతో ముడిపడిన తెలియని అనుబంధం అలా మాట్లాడించింది.
అభిమానించే మనుషులనే కదా కోప్పడ గలుగుతాం!
తల పట్టుకుని ఇంటిముందు రోడ్డుమీద గొంతు కూర్చున్న వృద్ధుడు మోకాళ్ళు పట్టుకుని నెమ్మదిగా పైకి లేచాడు. ఆయన కళ్ళు గాజుగోళీల్లా మెరుస్తున్నాయి. వొదులొదులుగా నరాలు తేలుతున్న చేతులు, కాళ్ళు సన్నగా వొణుకుతున్నాయి. ముడతలు పడిన ముఖంలో కాస్త లోతుకు పోయిన బొక్కి నోరు కదులుతోంది.
“రొవంత తాళబయా...” ఎడమ చేతితో పురుషోత్తాన్ని పక్కకు తోశాడు. కుడిచేతిని నోటి దగ్గరకు తీసుకువెళ్ళి చూపుడు వేలు, మధ్యవేలు పెదాలకు నిలుగా పెట్టి ఆ వేళ్ళ సందులోనుంచి తుపుక్కుమని వూశాడు. తుంపర్లుగా బయటకు వచ్చిన పువ్వాకు ఎంగిలి, రోడ్డుకు ఆవార వున్న చెత్త పొదను పావనం చేసింది.
“నీకు బూముండాదా అబయా?” అడిగాడు పైగుడ్డతో పెదాలు తుడుచుకుంటూ.
తను అన్నదేమిటి, ఈయన అడుగుతున్నదేమిటి?
“లేదు...” అయోమయంగానే సమాధానం ఇచ్చాడు పురుషోత్తం.
“ఎప్పుడైనా సేద్యం...” అడగబోయి ఆగి అతడి ముఖంవంక చూశాడు వృద్ధుడు.
“అయినా బూమే లేనప్పుడు, సేద్యం యాట్నించి అవతాదిలే?” అన్నాడు.
“చచ్చినోడు నీకు చెప్పేవుండాల. ఇదిగో ఈ బూముల్లోనే సేద్దిం సేసింది నా సావాసగాడు మునెప్ప. ఆయప్ప తీయని పంటలేదు, మడక కట్టని సాలులేదు. బూములు అరవోళ్ళవే గానీ, సొంతగాడు తానేననన్నట్టు సెమట కార్సినాడు. మునెప్ప ఆసిపడింది అప్పనంగా వొచ్చే జానిడు గవుర్మెట్టు బూమి కోసరమని నువ్వనుకుంటా వుండావు. కానేకాదు, ఆ బూమితో ముడిపడిన బతుకు తీపికోసరమని నీకే కాదు, నీబోటోళ్లు శానామందికి తెలీదు. మీకాయప్పది కాపీనం... అంతే” నిరసనగా చూసి కదలబోయాడు వృద్ధుడు.
“అదికాదు పెద్దాయనా...”
“బూమికి, గొడ్డుకు, మనిషికి మజ్జన వుండే సమ్మందం ఏందో నీకు తెలీదు... తెలీదబయా. అదిగో ఆడ ఆ మూగజీవాన్ని సావబాదతా వుండే ఆ పుండాకోరు మొగుడూపెళ్లాలతో సగా ఎవురికీ తెలీదు...” వెనుక తొక్కుళ్ళు తొక్కుతూ పాలు ఇవ్వడానికి ఇంకా మొరాయిస్తున్న ఆవును చావబాదుతిన్న మునెప్ప కొడుకూకోడళ్ళను వేలుపెట్టి చూపుతూ గిరుక్కున వెనుదిరిగాడా వృద్ధుడు.
___________________________________________________# “ఆంధ్రజ్యోతి” దినపత్రిక ఆదివారం అనుబంధం- ఏప్రిల్ 12, 2026 #








Comments
Post a Comment