Posts

Showing posts from June, 2025

కిరోసిన్ బుడ్డీ

❤️ కిరోసిన్ బుడ్డీ ❤️            చూపుల చేతులు చాచి  ఆప్యాయంగా కళ్ళు కౌగిలిస్తాయి   పురాతన రాగమేదో గుండె గట్ల వెంట  అలలు అలలుగా సాగుతుంది  కిరోసిన్ బుడ్డీ చిమ్నీ లోంచి వెలుగు   ఎర్రెర్రగా... పచ్చపచ్చగా... బలహీనంగా...  గదితోపాటు హృదయాన్నీ ఆక్రమిస్తుంది  తాను బూడిదై కాంతిని త్యాగం  చేసిన అగ్గిపుల్లపై  కృతజ్ఞత వెల్లువవుతుంది  ముఖం మాడ్చుకున్న విద్యుత్ బల్బును చూసి  కసికసిగా నవ్వాలనిపిస్తుంది  కృత్విమత్వాన్ని ఖండఖండాలుగా నరికి  సహజత్వ మైదానంలో వెదజల్లినంత ఆనందం     వెన్నెల నీడలలో విరజిమ్మబడ్డ  ఆరుద్ర పురుగుల  చమక్కులన్నింటినీ  వస్తూ వస్తూ దీపప్పురుగు మోసుకొస్తుంది  చూరుకింద అరుగుమీద వల్లెవేసిన  పెద్దబాలశిక్ష నీతి వాక్యాలను  బుడ్డీ కింద రెపరెపలాడుతున్న నీడ  కొసరి కొసరి గుర్తుకు తెస్తుంది     కీచురాళ్ళ సంగీతం  అడవి మండల కల్లకు బిగించిన బిర్రుకర్ర  వేపమానుల తియ్యటి చేదు వాసన…  ఈ దీపపు నీడలలోనే వడివడిగా దొర్లిపోయిన  పల...

ఎక్కడుంది లోపం!

స్వేచ్ఛ... న్యాయ విద్యార్థి... లక్ష్మీదేవి... ఒకరు ప్రముఖ టీవీ యాంకర్ వేరొకరు న్యాయ విద్యార్థిని ఇంకొకరు  గృహిణి. నేపథ్యాలు వేరైనా ముగ్గురూ ఆగమైపోయారు. సమాజం సాగించిన దారుణ వేటకు బలైపోయారు. 👉 స్వేచ్చ స్వేచ్ఛ వోటార్కర్ (40) న్యూస్ రీడర్, ప్రజెంటర్, యాంకర్ మరియు డిజిటల్ కంటెంట్ క్రియేటర్. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేయగా, తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పని చేస్తున్నారు. స్వేచ్ఛ ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్‌గా కూడా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఏ ఒక్కటీ ఆమె మరణాన్ని అడ్డుకోలేకపోయాయి. 2025 జూన్ 27న తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు సిటీ చిక్కడపల్లి ఠాణా పరిధిలోని జవహర్‌నగర్‌లోని ఒక పెంట్ హౌస్ లో 14 ఏళ్ల కూతురితో ఒంటరిగా నివాసముంటున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యానుకు లుంగీతో వేసిన ఉరికి వేలాడుతూ కనిపించారు. 👉 న్యాయ విద్యార్థిని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతాలోని సౌత్ కలకత్తాలోని లా కళాశాలలో న్యాయశాస్త్రం మొదటి సంవత్సరం చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని. జూన్ 27, 2025 సాయంత్రం జరిగిన ఒక విద్యార్థి సంఘం సమావేశం అ...

చెరువుకట్టమీద

ఎగిరిపోతున్న పిట్ట ఒకటి తీయటి పాట వినిపిస్తుంది కదిలిపోతున్న గాలి తెమ్మెర కాస్త ఆగి వీవన పడుతుంది మంద్రంగా అలల గలగలల సడి సంగీత సాధన చేస్తుంది సంధ్యాకాశం ముద్దులో నీటికన్నె బుగ్గ సిగ్గుపడి ఎర్రబారుతుంది ఆద్యంతాలు లేని లోకమేదో కట్టెదుట ఆవిష్కృతమవుతుంది ఆ చెరువు కట్ట మీద కాలం ఘనీభవించి అనిర్వచనీయ శాంతిలోకి మనసు జారుతుంది ముని ✍️ (కుప్పం డీకే పల్లె చెరువు, నీటితో నిండిన సమయంలో.. కట్ట మీద నిలబడినప్పుడు నేను పొందిన అనుభూతి స్మృతిలో..)

పుట్టింరోజు

       నోట్లో పెట్టుకోబోతా వుండే చద్ది ముద్ద గిన్నిలో వొదిలేసి అమాన సెల్లు ఎడమ సెతిలోకి తీసుకొన్నా.         మా మేడాము పుట్టింటి కెల్లుండాది. నాధ్ గాడికి పొయ్యిన కాణ్ణించి ఒకటే పడిసింపట్టుకోనుండాదంట.. నిన్న మాపటేల కాణ్ణే ఫోంజేసి జెప్పింది. ఈలుంటే ఒగసారొచ్చి పొమ్మనుండాది. పెడద్దరం మనిసిని గదా... నేంబోతానా ? ఇపుడేం ఉబద్దరొచ్చి పడుండాదో. నాద్ గాడికేమైందోనని దిగులొకపక్క... నా పెల్లాము ఏం దొబ్బులు పెడతందోనని బయమింకోపక్క.          “ఉన్నారా లైన్లో... ఏమండీ... “ ఆయమ్మి ఆర్సిన అరుపుతో చెవ్వు గియ్యిమనింది. ఎప్పుడు ఆనయ్యిండాదో ఆనయ్యిండాది సెవ్వులో వుండే సెల్లు. నాకు తెలికండానే సెవ్వుగ్గూడా అంటుకొనేసుండాది.         “ఆ... ఆ... ఉండా... ఉండా... ఇంటా ఉండా... “         “హ్యాపీ బర్త్ డే అండీ... ” సెప్పలేనంత ఇస్టమంతా జేర్చి... గుత్తొంకాయి కూర్లో మసాల పట్టించుండే మిరిం మాదిరిగా అబ్బా ... బలే ఉండాదా గొంతు.     ...

యోగా అంటే..!

 శరీరాన్ని నాలుగైదు వంకరలు తిప్పేసి, ముక్కు మూసుకుని శ్వాస ఎగాదిగా పీల్చేసి, మ్యాట్ సర్దుకుని చంకన ఇరికింఛుకుని చక్కా ఎక్కడివారక్కడ వెళ్లిపోవడం యోగా కాదు. అదే యోగా అయితే.. నిత్య జీవన వ్యవహారాలలో అష్టావధానం చేసుకుంటూ  రోజువారీ విధులు నిర్వహిస్తున్న అందరూ యోగా గురువులే అయిపోతారు.   మరి యోగా అంటే ఏమిటి? యోగా అనేది సంపూర్ణ జీవన విధానం. అనూచానంగా తరతరాలుగా పరంపరగా వస్తున్న మనదైన.. భారత జాతికే సొంతమైన సంస్కృతీ సంప్రదాయాలు అందించిన ఆనంద తీరమది. మానవుడికి అసలేం కావాలి? ఏది ఉంటే అతడికి తృప్తి లభిస్తుంది? పూర్వం ఏమోకానీ, అనేకమైన మానసిక ఒత్తిడులు ఇప్పుడు మానవ సమాజాన్ని చుట్టుముట్టాయి. ఆరోగ్యాలు మననుంచి దూరమైపోయాయి. కార్పొరేట్ వైద్యశాలలు మనపేరు చెప్పుకోకుండానే వ్యాపారాలు చేస్తూ కాసులు లెక్కకు మిక్కిలిగా గడిస్తున్నాయి.సంతృప్తి.. అసహనం.. ఎవరినీ నిందించలేని అసహాయత. మానవ జీవితంలో ఇవి లేని క్షణం లేదు. ఇదిగో.. ఇటువంటి దుర్భర క్షణాలను ఇట్టే కరిగించేసి...  సంపూర్ణ ఆయురారోగ్యాలతో అనంతమైన ఆనందాన్ని ప్రసాదించేది యోగం.. అంటే  నేటి పరిభాషలో యోగా. అస్థిరమైన మనసు చంచలమై, అలవికాని కోర...

దోషి

  “నాన్నా , వొద్దు నాన్నా... వొద్దు నాన్నా వేపచెట్టును కొట్టొద్దు” ఏడుపు కలగలసిన మూలుగులు విని తిరిగి చూశాను. నిద్రలో కలవరిస్తోంది నా ముద్దుల కూతురు. దాని తలను చేతితో నిమిరి గుండెలకు పొదువుకున్నాను. ఇంకో నాలుగ్గంటల్లో తెల్లారిపోతుంది. ఎప్పటినుంచో మేమంతా ఎదురు చూస్తున్న రోడ్డు వేయడానికి పనివాళ్లు వచ్చేస్తారు. వాళ్ళు పని మొదలు పెట్టాలంటే నేను ముందు డెసిషన్ తీసుకోవాలి. మా ఇంటిముందునుంచీ మెయిన్ రోడ్డుదాకా వేయబోయేది కేవలం పదేపది అడుగుల రోడ్డు. ఆ రోడ్డు పడాలంటే మా ఇంటి గోడకు ఆనుకుని పెంచుకుంటున్న కరివేపాకు , కిచ్చిలి , నిమ్మ , జామ మొక్కల్ని వదులుకోవాలి. లేదా... ఏపుగా ఎదుగుతున్న వేపచెట్టును పెళ్లగించేందుకు ఒప్పుకోవాలి. ఛాయిస్ నాకే వదిలేశాడు మున్సిపల్ కాంట్రాక్టర్. వేపచెట్టును తలచుకోగానే , దానితో ముడిపడ్డ మా కుటుంబంలోని అందరి జ్ణాపకాలూ గుర్తుకొచ్చాయి. “నాన్నా , చూడుచూడు టెడ్డీబేర్ వేపచెట్టు కొమ్మను ఎలా ఎక్కేస్తోందో …” రెండు చేతులూ శూన్యంలోకి చాస్తూ మురిసిపోతోంది లాస్య. పాపలో కలవరింత కంటిన్యూ అవుతోంది. పాప వీపు తట్టాను పరధ్యానంగా. ఒక వాన పూట , మన్నులోంచీ తలెత్తి పచ్చగా తొంగి చ...

పువ్వాకు ఎంగిలి

 పకపకా నవ్వింది ఆయమ్మ. బుగ్గన పెట్టుకోనుండే పువ్వాకును వగసారి వక్కాకుతో కలేసి   వడేసి నమిలింది. కొంచెం సారాన్ని మింగింది. చూపుడు వేలు, మజ్జేలు కొంచెం ఎడంగా జేసి పెదాల మీద పెట్టుకొని మిగిలిన రసాన్ని తుపక్కన ఉమ్మేసింది. “ఏందట్టా   బయపడతా ఉండావు సారూ, నేను ఊరికినే ఎవురిమిందా ఉయ్యను. నా బతుక్కు అడ్డామొస్తే గమ్మునుండను.” మళ్ళీ పకపకా నవ్వేసి అనింది. నామీద ఆ పువ్వాకు ఎంగిలి ఎక్కడ పడి బట్టలు పాడవతాయేమోనని గబుక్కున పక్కకు జరిగిన సర్దుకుని నిలబడ్డాను. ఆమె ఊంచిన ఎంగిలి, ఎవురిని నిలదీయడానికోగానీ మురుగు కాలవలో కొట్టుకొని పోతావుండాది ఊరుదిక్కు. “అదిగాదకా.. అక్కడ పెద్దపెద్ద ఆపీసర్లు జుట్లు పీక్కుంటా వుండారు. నువ్వేమో ఈడ ఇలాసంగా కూకోని పువ్వాకు, వక్కాకు కలేసి వడేస్తా ఉండావు..” అన్నాను. “చూడు సారూ.. నువ్వెందుకొచ్చినట్టు నా దెగ్గిరికి ?” తలెగరేసి అడిగింది. “ఏమీ లేదకా.. నీ కస్టం ఏందో కనుక్కొని ఎల్దామని..” చెప్పినాను. “అంటే ఉండే బూమి, ఇల్లు పోతావుంటే ఏమీ జెయ్యలేక కన్నీళ్ళు ఇడస్తా ఉంటానని వొచ్చినావా?” “అదిగాదకా.. నీకు జరిగిన అన్యాయం రాసి పేపర్లో ఏస్తే కలెక్టర్ జూసి, నీకు ...

కన్నీరు విడుస్తూనే..

 గాలిలో తేలిక కావాల్సిన దేహాలు బరువై నేలకు రాలిపోవడం.. కన్నీరు విడుస్తున్నాము సరే కారణాలు ఎన్నటికైనా తేలుతాయా అని కంటితుడుపు పరామర్శలు సరే.. ఆత్మీయులను కోల్పోయిన ఆక్రందనలకు.. ఆవేదనలకు బాధ్యులెవరు? అంతదాకా ఒక కన్ను అటు వేసే ఉంచాలి వారెవరైనా..   కన్నుగప్పి జారిపోకుండా చూడాలి 💐అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు అశ్రు నివాళి💐

జాగ్రత్త

 బతుకు పుస్తకంలో  ఎన్ని పేజీలో తెలుసా ఎవరికైనా చివరి పుటలో ఏముందో చూశారా ఎవరైనా చిరగకుండా పేజీలు  తిప్పగలిగారా ఎప్పుడైనా పేజీవెంట పేజీ తిరగడమే.. అందులో ప్రమేయం ఎవరికుంది చిట్టచివరి పుట  ఆఖరి అక్షరం చదివేశాక  మొదటి పుట మొదటి అక్షరానికి  తిరిగి వెళ్లలేం కదా అందుకే... పుస్తకం తెరచినప్పుడే జాగ్రత్త పడాలి తప్పులు లేకుండా వీలైనంత తక్కువ చిరుగులతో బతుకు పుస్తకం ముడవాలి

చందమామ

 "నక్క విందు" కథ తెలుసా మీకు.  అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకునే రోజులు. మా ఊరి ఇస్కూల్లో నాలుగో తరగతి చదవతా ఉండే నేనే మొగలాయి తెలుగు చదవడం, డిక్టేషను రాయడంలో. మా జయమ్మ మేడంకు నేనంటే అందుకే చాలా ఇష్టం. అప్పుడు "బాలచంద్రిక" అనే మంత్లీని మేడమ్ తనతోపాటు తెచ్చేది. అడగతానే నాకు ఇంటికి ఇచ్చేది. కొత్త పుస్తకం వాసన ఎంత కమ్మగా ఉండేదో. నేనూ, నా క్లాసే చదువుతున్న మా అక్క ఇద్దరం ఆ పత్రిక ముందేసుకొని ఒకటే చదవడం. అప్పటి ఆ ఆనందం అంతాఇంతా కాదు. ఇప్పుడు మళ్లీ తిరిగీ రాదు. అదిగో ఆ బాలచంద్రికలో నేను  తొలిసారి చదివిన కథ "నక్క విందు". తర్వాత "చందమామ"కు అప్గ్రేడ్ అయింది నా కథల చదువు. దానితోపాటు బాలమిత్ర, బాలచంద్రిక, బుజ్జాయి.. ఎన్నేసి కథల బొమ్మల పుస్తకాలో. ఆపైన మరెన్నో కథలు.. నవలలు.. బోలెడు చదివి పడేశాను. ఇంకా పడేస్తున్నాను కూడా. కానీ చందమామ ఇచ్చిన మత్తు మరేదీ ఇవ్వలేదు. విచిత్రమైన సాహస, మాంత్రిక, నీతి గాథలు.. పేజీపేజీకి కనిపించే రంగురంగుల బొమ్మలు అద్భుత లోకాల్లోకి తీసుకెళ్లి పోయేవి. ఆ పత్రిక ముఖ చిత్రం ఒక అబ్బురమే. ఏదో వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన అక్టోబర్ 2012 నాటి చందమా...

నాయన

“నాతో నువ్వేప్పుడైనా క్లోజుగా ఉన్నావా నాయినా , ఇప్పుడు నీతో క్లోజుగా ఉండడానికి ? ఇంట్లో ఎప్పుడైనా ఉండనిచ్చినావా నన్ను ? ముడ్డికి తాటాకుగట్టి తరిమేసేవోడివే. ఇప్పుడు అమాన మాట్లాడమంటే మాటలెట్టా వొస్తాయి చెప్పు ?” ఆ మాటలకు నిరామయంగా చూసినాడు నాయన నాదిక్కు. ఎదుర్రొమ్ముమీద బర్రెముకలు పైకీకిందికీ ఊగుతున్నాయి. ఊపిరి పీల్చుకోలేక ఆయన పడుతున్న యాతన అది. అప్పుడప్పుడూ గొంతులోంచి ఎగదన్నుకొస్తున్న ఎక్కిళ్ళు , బాధను భరించలేక పెడుతున్న మూల్గులు. రెండు చేతుల మణికట్లు ఉబ్బిఉన్నాయి. ఇక ఏ వైద్యమూ పనిచేయదని ఆ మణికట్లనుంచి వేరై పక్కనే మంచంమీద వేలాడుతున్న సెలైన్ బాటిల్ నుంచి వచ్చిన సన్నపాటి పైపు చెబుతోంది. పైన సీలింగుకు తిరుగుతున్న ఫ్యాన్ , ఉక్కపోతను ఆపలేకపోతోంది. ఈ ఉక్కపోత నిజంగా మండుతున్న వేసవిదేనా ? బయట... అంటే వోరగా మూసిన తలుపుల వెనుక ఓ నాలుగైదడుగుల దూరంలో అక్కా , బావా , అత్తా , మామా ఎవరెవరో బంధువులు గుసగుసగా మాట్లాడుకుంటున్న మాటలు లోనికి వినవస్తూనే ఉన్నాయి. బహుశా మా మాటలూ వారికి వినిపిస్తూనే ఉంటాయి. అలా వినిపించడమే మంచిదేమో. లేకపోతే ఏ ఆస్తిపాస్తుల గురుంచో , ఇంకేదైనా రహస్యాల గురించో చెప్పడా...