నువ్వు మాత్రమే లేవు
‘చెప్పండి నా...’
రాత్రిపూట అక్షరం కాలేక నిన్ను తడిమితే
మెత్తటి గొంతు...
ఆపైన రేపటి ఉదయం చిలుకకొయ్యకు తగిలించడానికి
నువ్వు నేసే వార్తల వంతు
* * *
యుద్ధంలానూ... శాంతిలానూ...
ఏకకాలంలో ఎలా సాధ్యమో అసలు
చల్లటి చిరునవ్వు మాత్రమే చూశాము కానీ
లోలోపలే తెగి ముక్కలుముక్కలుగా రాలుతున్న చప్పుడు
నీ భార్యాబిడ్డలైనా వినగలిగారా?
* * *
ఇంతగా ఏకాంతాన్ని కౌగిలించుకున్నావని
లోలోపలే ఉండలుఉండలుగా చుట్టుకుని పోయావని
నీ చుట్టూ ఆవరించిన సమూహత పసిగట్టే ఛాన్సే ఇవ్వలేదు కదా
పువ్వు మెత్తగా విచ్చుకోవడం చూడలేదు నేను
కత్తిలా దిగబడ్డప్పుడు మాత్రం నువ్వై కనిపించావు
* * *
నిన్ను నీలోకి దాచేసుకుని
ఎవరెవరివో కన్నీళ్ళు భుజాన మోసుకుని
నడుస్తూ నడుస్తూ రోడ్డు మలుపులో మాయమైపోతావని
ఇక ఎదురుచూపులు లేనేలేవని తెలిసే వుంటే...
ఆయమ్మ కన్నీళ్ళు నిలబెట్టి వుండేవేమో
* * *
అవును, నువ్వొక పరిచిత అపరిచితుడివి
అందరూ వున్న అనామకుడివి
సుపరిచిత దారుల్లో కదులుతున్నట్టే అనిపిస్తూ
విడిచిపెట్టిన వొయాశిస్సుకోసం వెదకులాడే ఎడారి పథికుడివి
* * *
ప్రతి సాయంత్రమూ అక్షరాలు వార్తలుగా మారుతూనే ఉన్నాయి
ఉదయాలన్నీ వార్తాపత్రికలను మోసుకొస్తూనే ఉన్నాయి
రాజకీయాలు.. . కుట్రలు... కుతంత్రాలు...
యథాతథంగా బతుకుతూనే ఉన్నాయి
నువ్వు మాత్రమే లేవు...
* * *
మిత్రమా!
నిట్టనిలువునా కూలిపోయావు కదా
ఆ కత్తిపోట్లను నీ చిట్టచివరి ఊపిరి అడిగే వుంటుంది
‘నేనేం పాపం చేశాను?’
‘సాటి మనిషికి సాయపడడం నేరమా?’ అనికూడా
సమాధానమయ్యే శక్తి ద్వేషం కక్కిన రక్త ధారలకే కాదు
మాకు కూడా లేదు... క్షమించు!
------------------------------------------------
చిత్రం: చిట్టత్తూరు లాస్య
(ఏప్రిల్ 28, 2026 న హత్యకు గురైన ఆత్మీయ స్నేహితుడు, చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఆంధ్రజ్యోతి దినపత్రిక జర్నలిస్టు వి.జగన్మోహన్ రెడ్డి స్మృతిలో- రచయిత)
# మే 15, "సారంగ" వెబ్ మేగజైన్లో ప్రచురితం #

Comments
Post a Comment