"కథంబం"- నేను చదువుతున్న పుస్తకం





నేను చదువుతున్న పుస్తకం 

'కథం'బం కథా సంకలనం ✍️

ఒకరా... ఇద్దరా... ఇరవై మంది రచయితలు. 1950 నుంచి మొదలుపెట్టి, 2005 దాకా చేసిన కథలు. ఆ కథల్లో రకరకాల జీవితాలు... అనుభవాలు. గ్రంథాలయం వెళ్లే అలవాటుంటే మీకూ ఎక్కడో తారసపడకపోదు ఈ పుస్తకం. దొరికితే మాత్రం వదిలిపెట్టకండి. ఇంటికి తీసుకుని వెళ్లి చదివి ఆనందించండి.

ఆణిముత్యాల్లోంచి నేను ఏరిన కొన్ని శకలాలు మాత్రమే ఇవి...

✍️ కోర్టు రమను ప్రశ్నించింది. 'నీ కులం ఏమిటి?'

'మాదిగ'

'మతం?'

'హిందువు'

'క్షత్రియ కాదా?'

'కాదు'

'తండ్రి కులం కూతురి కులం అవుతుంది కదా!'

అది ఎవరైనా చెప్పేమాటే. న్యాయస్థానం, న్యాయవాదులు, న్యాయమూర్తులు అలోచించి వాస్తవం గుర్తించి ప్రకటించి తీర్పు చెప్పాలి. 'భార్యనో ఉంపుడుగత్తెనో కడుపుచేసి వదిలేసిపోయి, పుట్టినబిడ్డను చూడని, పెంచని, పోషించని, పెళ్ళిచేయని కట్నకానుకలివ్వని, మనిషెవరో తెలియని వాడు కూడా తండ్రేనా?'

'తండ్రే!'

క్షేత్రం, బీజం మీద చాలాసేపు ప్రశ్నోత్తరాలు, వాదోపవాదాలు జరిగాయి. ఏమీ తేలలేదు.

-- రమ నా కూతురు, 2005, కొలకలూరి ఇనాక్

----

✍️ "యీ చెంబూ, లక్డీ, చెక్కచెప్పుల్... ఫోటోలో పడాల్నా" అన్నాడు.

"అయ్యో! అవి సాములారి దండ కమండలాలు, పాంకోళ్ళు.... వారి శరీరంలో భాగాలు" అని నెత్తినోరూ కొట్టుకున్నారు శిష్యులు.

"అయితే రఖీ" అనుమతిచ్చాడు కరీముల్లా. నిండా నల్లగుడ్డ ముసుగు వేసుకుని ముల్లా చూస్తుంటే సాములారు తావళం తిప్పుతూ గొణగడం ప్రారంభించారు. "అరె ఛుప్" అన్న కరీముల్లా కేకతో బొమ్మలా వుండిపోయారు. పద్మాసనంలో ఎడమకాలు కొంచెం కిందకి దిగాలన్న ఫుటోగ్రాఫర్ సూచనని భక్తులంతా మూకుమ్మడిగా అమలు చేశారు. టప్మని చిన్న చప్పుడు. ".... మ్మహదేవ” అని పి స్వామి భక్తిభారంతో పెట్టిన మూలుగు వినిపించాయి. చిట్లించిన నుదుటి విబూది వట్టెలు పెళ్ళలుగా వూడిపడ్డాయి. అంతా నిశ్శబ్దం.

-- బైపాస్ సాములారు, 2004, శ్రీ రమణ

----

✍️ దూరంగా, నీలంగా, ప్రశాంతంగా సముద్రం. ఎప్పటిలానే ఏమీ తెలీనట్లే ఎన్ని రోజులిలా గడపలేదు. • సముద్రాన్ని చూస్తూ ఎన్ని సార్లు అతను వస్తాడని ఎదురు చూడలేదు. ఏదో ఒకగాలి తనకు తెలియకుండానే అతను వస్తున్నట్లు కబురు పట్టుకొచ్చేది. బోట్లన్నీ వేటనుంచి తిరిగొచ్చేవి, ఏం చేపలు దొరికాయో! ఎంత రేటు పలికిందో! కబుర్లు చెప్పుకుంటూ గడిపేవాళ్లు. ఒక్కో సారి వేట మానేసి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం సినిమా మీద సినిమా చూసి సరదాగా గడిపేసేవాళ్లు. అలాంటి రోజు యింకోటి రావచ్చు. కదా! మళ్ళీ అలానే రాములు వస్తాడనే కానీ! రాడన్న అనుమానం కూడా ఆమెక అసలు రావడం లేదు. లేదా! అలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతోంది!

-- రెప్ప వాల్చని సముద్రం, 2001, ఎస్.శైలజ

----

✍️ "అసలు మొదట ఫారెస్టు సారు తిరపతిరెడ్డి మమ్మల్ని బూవి సావు జెయ్యమన్నడూ, మళ్లీ తనే "ఆ... అట్టగాదు.. అసలు తిరుపతిరెడ్డి సారు మా లైను అవతలకున్నది. యివతల సెట్టుగొట్టి పాపు జేసుకోండ్రి అన్నడు. యీ లోపుల పెద్ద అమీను సాబుకు జెప్పిండ్రు. అమీనుసాబు జీబేసికొచ్చిండు. సానా మంది పరాలయ్యిండ్రు..... అప్పుడు బుచ్చయ్య, తాటి మత్తయ్య, నేను దొరికినం.

"ఉల్లెందు దీసకెల్లిండ్రు. గాడ సబుజెయిల్లో బెట్టుకోమన్నరు. పోలీటేసను కెల్తే అమాను తెల్లారి సబు జెయిలజేస్తమన్నడు. గప్పుడు బొగ్గుట్టలో స్టైకు నడుస్తుంది. ఉల్లెందుల సబు జెయిల్లో బెట్టిండ్రు. పదకొండ్రోజులాయె ఆండ్ల ఉండబట్టి. జమానతు దీసకరమ్మన్నరు. నేను బైటికొచ్చి అందర్నీ బైట తీసకరావడానికి పైసలు కావాలె అని పూరోళ్లందర్తో అన్న" "ముందు నివ్వియి తరువాత యిస్తమన్నరు. అప్పుడు తోటేసిన బూవినే అమానతు బెట్టి బొగ్గుట్టలో స్ట్రైకుంట కమ్మం బోయి సీటి దెచ్చి అందర్ని యిడిపిచ్చకొచ్చిన గని ఎవరు పైసలు యియ్యిలె"

మరి ఏం జేసినావు?

"ఏం జేసినా...... నా కష్టం బోయిందిగాని. నా సేతులు బోలేదనుకున్న.......... డబ్బులు బోయినయి. బూవి రాలె. గమ్మన ఊకున్నం..... మూడు సంవత్సరాలు కోర్టు దిరిగినం........ బూవులు రాలేదని మా వోళ్ళు డబ్బులియ్యమన్నరు" అని ముగించాడు మల్లయ్య.

-- భూమికోసం, 2001, విద్యాసాగర్

-----

✍️ "నేను రాసుకొన్నది ఆమెకి చదివి విన్పించాను. ఆమె సంతకం తీసుకొమ్మని సిస్టర్కి చెప్పాను. అతి కష్టంగా వంకరటింకరగా సంతకం చేసింది. 

అక్కడి నుంచి సిస్టర్ రూంకి వచ్చాము. డాక్టర్ సర్టిఫై చేసి వెళ్లిపోయాడు. ఇలా ఎంతమందిని చూశానో - ఈ నెలలో ముప్ఫై రెండో వాంగ్మూలం. ఇంత రాత్రి నిజాన్ని దోసిట్లో పట్టుకొందామని వస్తే ఇదీ ఫలితం. వంట వండుతుంటే కొంగు అంటుకొందని కొందరు, స్టౌ పేలి గాయాలైనాయని మరికొందరు అంతా స్టీరియో టైపు. ఆత్మహత్య చేసుకుంటే అదీ చెప్పరు. దానిక్కారణాలూ చెప్పరు.

నిరాసక్తంగా గేటు దాటి జీపు వద్దకి వచ్చాను...

ఆమె భర్తా, హెడ్ కానిస్టేబుల్ ఇద్దరూ సిగరెట్లు తాగుతూ కబుర్లు చెప్పుకొంటున్నారు.

-- పావు, 1994, జింబో

----

✍️ రాజరత్నం నీరసంగా వీధి మలుపుకేసి చూశాడు. గోవిందయ్య రావడం లేదు. 'అసలు వస్తాడో రాడో! ఈ బుడబుక్కల వాడి బుట్టలో పడ్డానికి అతనే గదా కారణం! రానీ, ఈ రోజు అతగాడీ దమ్ము దులిపేస్తాను' అనుకున్నాడు రాజరత్నం. గోవిందయ్య పైనున్న కోపాన్నంతా దాసు వైపుకు మళ్ళించడానికి ప్రయత్నిస్తూ "నువ్వు వలికిందేం నత్యం? ఆ మాటలు ఈ లోకంలో ఎవరుకైనా చెల్లుబాటైపోతాయి. దానికి దక్షిణ గూడానా? పోపో" అన్నాడు.

దాను అయిదు నిమిషాల సేపు రాతిబొమ్మలా కూర్చుండిపోయాడు. ఆ తరువాత, "నేను పుట్టి బుద్దెరిగినాక ఈ మాదిరిగా నాపైన నిందెయ్యలే దెవరూ! సరే, ఇంకోసారి పలకతాను. ఇసుకో అంటూ గొంతు సవరించుకోబోయాడు.

"నీ వలుకూ వద్దు. నువ్వూ వద్దు. పో పో" అన్నాడు రాజరత్నం దుడ్డుకర్రను గడవకేసి విసురుతూ.

"పలికిన పలుకుకు దక్షిణం లేకుండా ఈ గడప కదలను కావాలంటే అంది పేరు చెప్పుకొని ఇక్కడే పాణాచారం జేసేస్తాను" అన్నాడు దాసు.

-- ఒక ఇంద్రధనస్సు విరిసే ముందు, 2001, మధురాంతకం నరేంద్ర

----

✍️ రాహేలు పెయింటర్ వైపు చూస్తూనే మరోసారి పలకరింపుగా నవ్వబోయింది. అటు సలహానీ, ఇటు నవ్వునూ తప్పించుకోవడానికి శూన్యంలోకి చూశాడు పెయింటర్, రాహేలులో అదే చూపు. ఆ చూపులో వంద ఆశ్చర్యాలున్నాయి. ప్లేటులో పెసరట్టూ, చట్నీ వేసి పెయింటర్ చేతికి అందించాడు అప్పల్రాజు.

రెండు నిమిషాల్లో పెసరట్టు ఆరగించేశాడు పెయింటర్.

"పిల్లా! కాత్తంత ప్లేటు కడగవే?" అప్పల్రాజు రాహేలుని అలవోకగా అజ్ఞాపించాడు.

మార్కెట్టు లెక్కల ప్రకారం వినియోగదారు రాజులాంటివాడు. కానీ, అదే వినియోగదారు కింది కులంవాడయితే బానిస రాజవుతాడు. అక్కడ అదే జరిగింది. కాబట్టే రాహేలు సరుక్కి డబ్బిచ్చి కూడా ప్లేట్లు కడగాల్సి వచ్చింది.

-- మూడు అబద్ధాలు, 1997, సతీష్ చందర్

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ