నేను చదువుతున్న పుస్తకం- విషాద కామరూప
👉 విషాద కామరూప
మూలం: ఇందిరా గోస్వామి
అనువాదం: గంగిశెట్టి లక్ష్మీనారాయణ
ప్రాంతం ఏదైనా, భాషలు వేరైనా గతం కొద్ది భేదాలతో ఒకటే. జమీందారీ వంశాలకు ఒక్కోచోట ఒక్కో పేరు. అస్సాంలో గోసాయిలంటారు. ఇక్కడ వైష్ణవ మఠాల ఆధిపత్యం తక్కువేమీ కాదు. ఒకప్పుడు వైభవంగా వెలిగిన ఈ గోసాయీలు, మఠాలు అనంతరం ఎంత క్షీణ స్థితికి చేరాయో.. నాటి వితంతువులు గడిపిన దుర్భర పరిస్థితులేమిటో 320 పేజీల ఈ నవల మన కట్టెదుట ప్రదర్శిస్తుంది. నాటి చారిత్రక పరిణామాలని కథలో కలగలిపి చిత్రిక పడుతుంది. కాదనుకుంటే... మూల రచయిత, అనువాదుకుల తొలి, మలి పలుకుల్లో కొంచెం కొంచెం కింద ఇచ్చాను, వినండి.
ముని ✍️
ఈ నవలలోని పాత్రలన్నీ కల్పితాలే. అయితే నా అనుభవాలు, జీవితంలో ఎదురైన కొందరు వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు వీటికి ప్రేరణనిచ్చాయి. అస్సాంలోని కామరూప జిల్లాలో మారుమూల ఓ సత్రా* చుట్టూ ఉన్న చిన్న గ్రామాన్ని గురించి ఈ నవల వర్ణిస్తుంది. పందొమ్మిదవ శతాబ్దం ప్రథమ పాదం (1820) మొదలు బ్రిటిషు పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన సంవత్సరం (1947-48) దాకా, సుమారు వందా పాతికేళ్ళపాటు ఓ గోసాయి కుటుంబంలో జరిగిన విషాద గాథ ఈ నవల ఇతివృత్తం. గోస్వామి కుటుంబాల యజమానులు క్రమంగా అధికారు* లవుతారు. సత్రాలకు సంబంధించిన భూములను ఎక్కువ భాగం అస్సామును పాలించిన అహోమ్ మహారాజులు దానంగా ఇచ్చారు. భూదానాలకు సంబంధించిన చట్టాలను బ్రిటిష్ పాలకులు జనరల్ జంకిన్స్ కాలంలో మార్చారు. స్వాతంత్ర్యం తరువాత వచ్చిన భూసంస్కరణలు భూములపై అధికారుల హక్కులను మరింత దెబ్బ తీశాయి. ఒకానొక వైష్ణవ సత్ర రాజపుభూరి సత్ర-విషయం ఈ నవలలో చోటు చేసుకుంటుంది కూడా.
-- ఇందిరా గోస్వామి, రచయిత్రి
మొదట ఈ పుస్తకాన్ని చూడగానే, 'ఇదేమిటి చారిత్రక నవలను అభ్యర్థిస్తే, సామాజిక నవలను, సూచించారు, అనుకొన్నాను. తర్వాత చదవగా చదవగా తెలిసింది. ఇది ఎంత మహత్తరమైన ఆధునిక చారిత్రక నవలో! ప్రాచీన చరిత్ర పై ఆధారపడ్డ నవలలో కాల్పనికతకు కావలసినంత చోటుంటుంది. కాని ఆధునిక చారిత్రక నవలలో, విధిగా వాస్తవికతకు పట్టాభిషేకం జరగాలి. నవలలో ఇచ్చిన వివరాలు, అనుబంధంలోని వివరణల్లో చెప్పిన అంశాలు, రచయిత్రి ఎంత ప్రగాఢంగా ఆధునిక చరిత్రను, సత్రాలపై పరిశోధనలను అధ్యయనం చేసి ఈ నవలను రచించారో స్పష్టం చేస్తాయి. అస్సాం సంస్కృతి, సంప్రదాయాలకు ఒకప్పుడు పట్టుగొమ్మలైన సత్రాల ప్రస్తుత దయనీయస్థితిని అత్యంత సన్ని హితంగా పరిశీలించి, ఈ నవలలో అద్భుతంగా, సజీవంగా రచయిత్రి చిత్రించారు. పేర్లు, సంఘటనల క్రమం మాత్రమే కల్పితాలు, వాటి అంతస్తత్వాలు పూర్తి వాస్తవికాలే. ఈ నవలలోని ప్రధాన పాత్రలు రచయిత్రి రక్త బంధువుల చిత్రాలే. ఆ సంఘటనలు వాస్తవంగా కొంచెం అటూ ఇటూగా జరిగినవే. రచయిత్రి ఆత్మకథ "An unfinished autobiography' ఆ వాస్తవాలను మనస్సుకు కదిలించేలా కళ్లెదుట చూపిస్తాయి. ఈ కథలోని సత్తా, వారిదే. ప్రతిపత్రమూ వారి ఇంటిలో లభ్యమైనదే. వాటిని ఆత్మీయంగా అధ్యయనం చేసి, చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి ఆధునిక అస్సాం సాంస్కృతిక చరిత్రలోని ఒక మహత్తర అధ్యాయానికి అక్షరరూప మిచ్చారు రచయిత్రి. ఒకప్పుడు సర్వకళా తంత్రశాస్త్రాల అధ్యయనానికి పెట్టింది పేరు కామరూపం. దేశంలోని ఈ చివరనుండి కూడా అక్కడ వైష్ణవ తంత్రాలను అధ్యయనం చేయడానికి వెళ్లేవారు. అలాటి సాంస్కృతిక నిలయాల ప్రస్తుత విషాద గాథ, ఈ నవల.
-- గంగిశెట్టి లక్ష్మీనారాయణ, అనువాదకులు (ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ వీసీ)
వసారాలో ఉన్న గిరిబాలకు, దుర్గ వెంట్రుకల్ని బాగా ముడివేసి కొన్నట్లు కనిపించింది. ఆమె చాలా చురుకైంది. ఆ చెవులూ, చూపులూ బలే చురుగ్గా వుంటాయి. ఎక్కడేం జరుగుతూందో ఇట్టే గ్రహించేస్తుంది. బహుశ ఇప్పుడు ఇటువైపు రాకపోవచ్చు. గిరిబాల పల్లకీ గదిలోకి పరుగు తీసింది. మాంసం, నల్లచిక్కుడు కూర కుండను బయటికి తీసింది... అంతా మరచి పోయింది... మతం, ఆచారం, వివేకం, నిగ్రహం... అన్నిటినీ మరిచి పోయింది. గబగబా ఆబగా తినసాగింది.
విధవరాలయ్యాక అన్నం, పప్పు మాత్రమే తినేది. ఆ పప్పులోనూ ఏవో కాస్త కూరలు, మరీ కొద్ది ఉప్పు! ఆవునెయ్యి వుండేది. ఆ తిండితో జిహ్వ చచ్చిపోయింది.
అబ్బ! ఎంత కమ్మటి రుచి! ఆమె ముద్ద తరువాత ముద్ద మింగుతోంది.
ఆమనియారి- కినియారి ఆడది, తన మగని కోసం, అలాగే రుచిగా వండి వుండ వచ్చు. కూర చాలా రుచిగా ఉండడంతో, ఆమె తినిపిస్తున్నప్పుడు, ఆమె వేళ్లను కూడా విడవకుండా ఆయన చప్పరించి వుండవచ్చు. గిరిబాల మరో పెద్ద ముక్కను నమిలింది. ఏవో తెలియని వింత ఆలోచనలతో ఆమె తల తిరుగుతోంది. అయితే తినడం ఆపలేదు. దాదాపు కుండను ఖాళీ చేసింది. మొట్టమొదటిసారి, ఓ గోపాయి ఆడపడుచు, ఆ సత్తా మహల్ అంత పాపపు పని చేసింది.
కీచుమంటూ అరిచిన అరుపు గిరిబాలను అదర గొట్టేసింది. గాభరాగా అన్ని వైపులా చూసింది. గుమ్మం దగ్గర దుర్గ దాదాపు తెలివి తప్పి పడి పోతున్నట్లుంది. ఇద్దరు యజమాన్ బ్రాహ్మలు భయంతో వణికిపోతూ నిశ్చేష్టులై నిలబడి వున్నారు. ఎవరో అరిచారు. ''అమ్మో! అదే! మాంసం కూర కుండ. ఆమె చేతిని పట్టుకోండి. పట్టుకోండ్రా! ముందామెను ఆ గదిలో నుంచి బయటికి లాగేయండి."
ఆ అరువుల్ని విని, కర్మకు వచ్చిన వాళ్లు ఆ గుమ్మం వద్ద గుమికూడడం మొదలు పెట్టారు. కాస్సేపట్లోనే పెద్ద గుంపయింది.
ఆ మాట వినగానే గోసాయినీ వంటిల్లు వదలి గబగబా అక్కడికి వచ్చింది. ఆ దృశ్యం చూసి పూనకం వచ్చినట్లయింది. గిరిబాల జుట్టు పట్టుకులాగి, దబ దబా బాదడం మొదలు పెట్టింది. ఆమె రెచ్చిపోయిన పులిలాగుంది. కోపంతో గిచ్చి, గిల్లి, గీరి, కండలూడి వచ్చేలా కొరికేసింది.
అందరూ నోళ్లు తెరుచుకొని చూస్తున్నారు. వాళ్ల మతి పోయినట్లుంది. అందరూ దుర్గను గురించి మరిచి పోయారు. ఆమె ఇంకా అలాగే పల్లకీ గది గుమ్మం దగ్గర, తెలివి తప్పి, శవంలా పడుంది.
-- విషాద కామరూప (పేజీ 130), ఇందిరా గోస్వామి (మూలం), గంగిశెట్టి లక్ష్మీనారాయణ (అనువాదకులు)

Comments
Post a Comment