నాయన... ఒక శాపగ్రస్తుడు!
ప్యాంటు షర్టు... నడుముకు బిగించిన బెల్టు... చెమటలు కారి కేలర్ పాడైపోకుండా మెడకింద క్రాస్ గా మడిచి పెట్టిన కర్చీఫు... ఎడమ చేతికి నల్ల పట్టీతో బిగించిన హెచ్. ఎమ్.టి. రిస్టు వాచ్... మా నాయన చాలా సాధారణమైన మనిషి.
డొక్కు సైకిలు... దాని బారుకు కట్టిన మూడు గిన్నెల స్టీలు క్యారేజీ... వెనుక క్యారేజీ సీట్లో మడత పెట్టిన కాకి సంచి... ప్రతి ఉదయం సమయానికన్నా అర గంట ముందే చెమటలు కక్కుకుంటూ పది కిలోమీటర్ల దూరంలో ఉండే బడిలో వాలిపోవడం... మా నాయన సామాన్యమైన బడి పంతులు.
ఎందుకో అప్పుడు తెలియదు కానీ, అమ్మకు తిట్లు... ఏడాదిలో ఎప్పుడో అప్పుడు నన్ను చదువుకు కూర్చోబెట్టి వీపుపై పిడిగుద్దులు... నాయన మహా కోపిష్టి.
అమ్మకు సైగ చేసి ప్లేట్లో వడ్డింపజేసే అంగట్లో తెచ్చిన కారాసు పలుకులు... ప్రతి శనివారం నాకోసం ఆకులో మిగిల్చే నూనెకారం తడిసిన రుచులూరే దోసె ముక్కలు... టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు వండించి పెట్టిన ఉలస చేపల కూరలు... జబ్బుపడ్డ నా బెడ్ పక్కనే ఆస్పత్రిలో ఒట్టి నేలపై పడిగాపులు... నాయన బయటపడని ప్రేమిష్టి.
అటకమీద అట్టపెట్టెల్లో గుట్టలుగా కథల పుస్తకాలు... తిన్నెమీద గుడ్డి దీపపు వెలుగుల్లో తీగలుగా సాగే మహాభారత పద్యాలు... చిత్తుకాగితాల్లో ముత్యాల అక్షరాలుగా మిగిలిపోయిన గేయాలు... నాయన ఒక సాహిత్య గని.
ఎక్కడో ఈమధ్యే చదివాను ఒక రచయిత అన్న మాటలు - ‘నాకూ మా నాన్నకూ మధ్య ఆయన జీవితాంతం జరిగిన సంభాషణ రాస్తే ఒక పేజీ మాత్రమే ఉంటుంద’ని. మా తండ్రీకొడుకుల మధ్య మాటలు... మహా అయితే ఇంకో పేజీ ఎక్కువుంటుందేమో!
పదో తరగతిలో నాకు ఫస్టు మార్కులు వచ్చాయని తెలిసి, అమ్మ పాత బంగారు కుచ్చులు కుదువబెట్టి, నన్ను వెంట తీసుకునివెళ్ళి మరీ తెలిసినవాళ్ళందరికీ స్వీట్లు పంచిన నాయన... కొడుకు భవిష్యత్తుపై కన్న బంగారు కలలు ఎన్నో!
డిగ్రీ పరీక్షలు రాయడానికి భయపడి తప్పించుకోవడానికి ఎంసెట్ రాస్తానంటే, ఎక్కడో అప్పు తెచ్చి నెల్లాళ్ళ షార్ట్ షార్ట్ టర్మ్ కోచింగ్ కు పంపాడు నాయన. ఎంసెట్ కాదుకదా, డిగ్రీ కూడా పాసుకాలేక పోయిన నాతో మాట్లాడడం మానేశాడు. ఎప్పటికో డిగ్రీ పూర్తిచేశాక, తన కలలను బడి పంతులు ఉద్యోగానికి కుదించుకున్నాడు. బీయెడ్ చేయమని మామవాళ్ళతో పోరు పెట్టించి అక్కడా ఓడిపోయాడు.
ముసలి తల్లి, భార్య, నేను కాక ముగ్గురు కూతుళ్ళు... నిజంగానే బడిపంతులుగా బతకలేని తనం. అయినా బతికాడు, మమ్మల్ని బతికించాడు.
ప్రైవేటు స్కూళ్లలో టీచర్ గా కొన్నాళ్ళు చేశాక, విలేకరి ఉద్యోగం పట్టుకుని నేను ఊగులాడుతుంటే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. “వీడు ఎలా బతుకుతాడురా” అంటూ మేనల్లుళ్ల దగ్గర నా పరోక్షంలో కుమిలిపోయాడు.
నా చదువుకోసమని సొంత పూరింటిని, పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి ఎప్పుడో శ్రీకాళహస్తి వచ్చేశాడు నాయన. పిల్లి తన పిల్లలను నోటికి కరిచి పట్టుకుని ఇల్లిల్లూ తిరిగినట్టు, అద్దె ఇళ్ళన్నీ తిరిగాడు. ఇరుకిరుకు గదుల్లో బతికాడు.
పట్నానికి కొంచెం దూరంగా వ్యవసాయ పొలాలను ప్లాట్లు చేసి అమ్ముతుంటే- మిగుల్చుకున్నది కొంత, అప్పుచేసి మరికొంత పెట్టి జానెడు ప్లాటు కొన్నాడు. దాని పక్కనే అద్దె ఇంటికి చేరాడు. కొన్న స్థలంలో సొంత ఇల్లు కట్టుకోవాలని, మమ్మల్ని అందరినీ ఆ గూడులో భద్రంగా ఉంచాలని ఎన్నేసి ప్లాన్లు వేశాడో. ఒకసారి పూజలు పునస్కారాలు చేసే మా చిన్నాయన ఒకరిని పిలిపించి ఇంటి నిర్మాణానికి ముహూర్తం కూడా పెట్టించాడు. కానీ కట్టడానికి ధైర్యం చేయలేకపోయాడు. అప్పుల పాలవుతానని భయపడ్డాడు. “అప్పుచేసి ఇల్లు కడతాను సరే. ఒకవేళ నేను పోతే ఈ అడ్డ గాడిద ఎలా తీర్చాలి అన్ని అప్పులు? అసలే ఉజ్జోగం సజ్జోగం లేకుండా ఉండాడు” అని వాపోయేవాడట, ఫ్రెండ్స్ దగ్గర. అలా ఆయన రెండో కల భగ్నమైంది.
ఆస్తిపాస్తులు లేవు... మిగల బెట్టింది అసలు లేదు. ఉన్న బడిపంతులు ఉద్యోగం నుంచి కూడా రిటైర్డ్ అయిపోయాడు. నేనేమో, తిరుపతిలో ఒక వార్తాపత్రికలో విలేకరిగా వెట్టి చాకిరీ. సంసారం ఎలా గడవాలి?
అందుకే, ఒక ప్రైవేటు స్కూలులో తెలుగు టీచరుగా చేరాడు నాయన. రెండుమూడు స్కూళ్ళు మారాడు. ఎక్కడా వృత్తి సంతృప్తి దొరకలేదు. వచ్చే జీతమూ ఒక బియ్యం బస్తాకు సరితూగేది కాదు. అయినా చేయక తప్పేది లేదు.
నిత్యం ఇంట్లో ఎవరో ఒకరిపై ఎందుకో ఒకందుకు నోరు చేసుకునే నాయన, క్రమేణా మూగబోయాడు. టీచరు ఉద్యోగం చేస్తున్న నా భార్యతో కలిసి నేను కుప్పంలో కాపురం పెట్టేనాటికి పూర్తిగా నిశ్శబ్దాన్ని ఆశ్రయించాడు. ఇదేమని అడ్డు చెప్పలేదు.
‘పెళ్లయ్యాక మారిపోయాడు, పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడు...’ అని బంధువులు కొందరు కాకుల్లా పొడుస్తుంటే, నాకు అడ్డుగా నిలబడిపోయాడు. వాడిని నేనే వెళ్ళమన్నానంటూ వాళ్ళ నోళ్ళు మూయించాడు.
ఏదో పనిపడి ఒకసారి ఊరు వచ్చి చూస్తే నాకు పరిచయం అయిన నాయన కనిపించలేదు.
పిచ్చిగా పెరిగిన గడ్డమూ... గుంటలు పడ్డ కళ్ళూ... బయటపడ్డ డొక్కలూ... ఎండు కట్టిపుల్లల్లా ఊగులాడుతున్న కాళ్లూచేతులూ... వొట్టి ఎముకల గూడులా నాయన.
అప్పుడే కాదు, ఈ వ్యాసం రాస్తుంటే ఇప్పుడూ ఏడుపు తన్నుకుని వస్తోంది... నాటి ఆయన రూపాన్ని తలచుకుని.
పదీ పదిహేను రోజులకు వైద్య పరీక్షల్లో తేలింది.
క్యాన్సర్- ఆస్పత్రిలో చెప్పేశారు... ఇక లాభం లేదని.
ఆకాశం బద్దలవలేదు... పిడుగు మీద పడలేదు... నాయనను తీసుకుని ఆయన కొన్న సొంత స్థలం పక్కనే ఉండే అద్దె ఇంటికి వెళ్లిపోయాం.
హాలులో మంచం మీద నరకం చూస్తూ నాయన...
ఆయన చావుకోసం ఎదురుచూస్తూ ఆయన చుట్టూ మేము...
ఎవరి జీవితంలోనైనా ఇంతకన్నా నొప్పి ఏదైనా ఉంటుందా!?
ఒక తెల్లవారు ఝామున నాయన మమ్మల్ని వీడి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు.
ఈ పనికిరాని వాడితో మనకెందుకు అనుకున్నాడో ఏమో... సగం దూరంలోనే చేయి వదిలేసి తనదారి తాను చూసుకున్నాడు.
దహన సంస్కారాలు ముగిశాయి. పెద్ద కర్మ అయింది. ఒంటరిగా మిగిలిన అమ్మను మాతోపాటు తీసుకుని వెళ్ళాలి, రెండుమూడు రోజుల్లో.
ఎవరు ఉన్నా, లేకపోయినా మిగిలినవారు బతకక తప్పదు కదా. కష్టంగానే అనిపించినా ఇది జీవిత సత్యం.
అటకమీద రెండు అట్ట పెట్టెల్లో, సూట్కేసులో నాయనవి బోలెడు డైరీలు. ఆయనవే స్కూలుకు సంబధించిన ఏవేవో రికార్డులు, జెరాక్స్ కాపీల కట్టలు.
ఒక్కటొక్కటే చూసి పక్కన పెడుతున్నాను. డైరీలలో ఆయన చేసిన అప్పులు, ఖర్చులు, ప్రయాణాలు... ఇతరులకు చేసిన సాయాలు... ముత్యాలలాంటి అక్షరాలలో. మధ్యమధ్యలో దాచిపెట్టిన కరెన్సీ నోట్లు బయట పడుతున్నాయి. లెక్క పెడితే దాదాపు ఇరవై వేలు తేలాయి.
ఇంకా శోధిస్తుంటే అప్పుడు వెలికి వచ్చాయి... ఏవో రెండు బాండ్లు. మొదట అవేమిటో అర్థం కాలేదు. తర్వాత తెలిసింది... ఫిక్సడ్ డిపాజిట్ బాండ్లు అవి.
రెండు జాతీయ బ్యాంకులలో, మొత్తం మూడు లక్షలు ఫిక్సడ్ వేశారు నాయన.
ఆయన దృష్టిలో... బతకలేని కొడుకుకోసం మదుపు పెట్టిన సొమ్ము అది.
“రేయ్ గోపీ ఇలా రారా. ఎందుకురా దూరంగా ఉండిపోతావ్. నాతో ఏదైనా మాట్లాడరా...” క్యాన్సరుతో చనిపోవడానికి మూడు రోజుల ముందు బెడ్ మీద ఎముకల పోగులా పడివున్న నాయన, కొంచెం దూరంలో నిలుచున్న నన్ను చూసి ఒక్కటొకటిగా అక్షరాలు కూడదీసుకుని అన్న మాటలివి.
“నువ్వు నన్ను ఎప్పుడు దగ్గరకు తీసుకున్నావ్ నాయనా? అసలు చనువుగా ఎప్పుడన్నా మాట్లాడావా? ఇప్పుడు నాకు మాటలు ఎలా వస్తాయి?” నా నోటినుంచి వెలువడిన సమాధానం తలచుకుంటే ఇప్పటికీ నాకు సిగ్గు వేస్తుంది. చెప్పలేని దిగులుతో గుండె అంతా పచ్చి పుండు అవుతుంది.
గుండెల్లో ప్రేమ లేక కాదు... వెళ్ళడించడం ఎలాగో తెలియక.
నాయనదీ ఇదే దుస్థితి ఏమో... నా విషయంలో.
ఏ తండ్రికీ ఎదురు ఎదురు కాకూడని నాయన చివరి క్షణాలవి.
నాయనంటే నాయనే.
ఆయన దేశాన్ని ఉద్ధరించనక్కరలేదు. పెద్దపెద్ద త్యాగాలు చేయనక్కరలేదు. తనవారిని పిల్లల కోడిలా కాపాడుకుంటే చాలు...
కాకపోతే కాస్తంత నీతి నిజాయితీగా.
... దేశమంటే కుటుంబమేగా.
మా నాయన సామాన్యుడే... అయితే నాకు అసామాన్యుడు.
కానీ... కానీ... నా విషయంలో స్వయంగా శాపగ్రస్తుడు.
నాయనా... నాయనా...
ఒక్కసారి కనిపించవా... నీతో మనసారా మాట్లాడాలి!
మన్నించి ఒక్కసక్షణం ఇటు వచ్చిపోవా... నీ ఫోటో గుండెలమీద పెట్టుకుని గృహప్రవేశం చేసిన మన సొంత ఇంట్లో ప్రతిగదినీ, నీ చేయి పట్టుకుని తిరుగుతూ చూపించాలి!!
👉 రేఖాచిత్రం: చిట్టత్తూరు లాస్య
-----------------------------------------------------------
# సారంగ, జూన్ 15, 2026 #

Comments
Post a Comment