‘ఆమె' పేరు తెలీదప్పా!
రిజర్వేషన్స్ ఎంత శాతం పెరిగినా "ఆమె" అక్కడే ఆగిపోతోందా? కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరుగుతోంది?
ఇవాళ్టి ఆంధ్రజ్యోతి దినపత్రికలో నా విశ్లేషణాత్మక రాజకీయ వ్యంగ్య కథనం👇
💚స్థానిక' మేళం💚
👉 ‘ఆమె' పేరు తెలీదప్పా!
'యాందప్పా.. తీరిగ్గా కూసో నుండావు?'
'యాం జెయ్యాలింక? నామినే సన్లు అయిపాయె. చేసేదానికే ముండాది?'
'నామినేసన్లు ఉన్నప్పుడు మాత్తరం నువ్వూ, నేనూ ఏం పన్లు జేసినామో?'
'అదేందప్పా, ఆ మాదిరిగా తీసిపారేస్తావుండావు? మీ వార్డులో ముందే క్యాండేటు ఎవరో తేలిపొయ్యింది. మా వార్డులో అతికార పార్టీనింకా అయిదారు మంది నిలబడుండ్లా.'
'అయిదు మందైతే యేంది? పదేను మందైతే నువ్వు పీకేదేంది?'
'నువ్వేన్నో ఉండావింకా, ఐవీఆర్ఎస్ సర్వే గురిచ్చి తెలీదా నీకు?'
'హ్హ.. హ్హ.. అదా?'
'అదే మరి. కౌన్సిలరు టికట్టు ఎవురికి ఇయ్యాలో మనల్నే చెప్పమన్నాడు గదా బాబుగోరు. నేను ఫోన్లో బటన్ నొక్కపోతే ఈల్లకి టికట్టు ఇస్తారా? అందుకే పోటీలో ఉండే వోళ్లతో ఇన్నాళ్లూ నేను బిజీబిజీ. హ్హి.. హ్హీ..'
'అది సరేగానీ, మీ వార్డునింకా ఎవురు పోటీలో ఉండారప్పా?'
'ఇంగెవురు.. తొలినింకా చెప్తావుండానే, ఆయప్పకే ఇస్తావుండారంట.'
'అవునా.. అయితే గెలస్తాడన్న మాట?'
'దాన్ని గూడా మనమే గదా తేల్చాల. ఎల్లుండినింకా మన చుట్టూ గదా ఆయప్ప తిరగాల.'
'అవునుగానీ మీ వార్డు లేడీకి గదా రిజర్వేషన్ అయింది?'
'అవునాప్పా.. నాకు తెలీదే. ఎవరు జూసినా ఆయప్పే పోటీ జేస్తావుండా రని చెప్తావుండారు.'
'లేదులేదు.. నాకు బాగా తెలుసు. అక్కడ లేడీ రిజర్వేషనే.'
'నువ్వు జెప్తే కరక్టుగానే ఉంటాది. అయినా పొయ్యేదేముండాది? ఆయప్ప బార్యను నిలబెడతాడు.'
'ఆయమ్మ పేరేందప్పా?'
'నాకేం దెలుసు? ఫేస్బుక్కు, వాట్సాపు యాడ జూసినా ఈయప్ప పేరే గదా ఎలగతా వుండాది. ఆయప్ప పేరు ముందు ఏందో ఆడమనిషి పేరు వున్నట్టు ఇప్పుడు నువ్వు జెప్తావుంటే మతిలోకి వొస్తా వుండాది. ఆ పేరేందో మాత్రం గుర్తు రావడం ల్యా.
'నామినేషన్లు ఎయ్యడానికి గూడా ఆయమ్మెవురో ఆయప్ప ఎనకాలే ఉండడం నేను జూసినా. సర్లే.. ఆడమినిషి అయితే యేంది? రేపు ఆయప్ప.. అదే ఆయమ్మ.. కౌన్సిలరు అయినంక ఏ పని కావాలన్నా పోవాల్సింది ఆయప్ప దెగ్గిరికే గదా.'
'అది గాదప్పా.. ఐవీఆర్ఎస్ సర్వేలో పేరు తెలీకుండా నువ్వు ఎవురికి బటన్ నొక్కినావు?'
'అది నువ్వడగ గూడదప్పా ఎందుకంటే.. నాగ్గూడా తెలీదు గాబట్టి..'
కుప్పం మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల విషయంలో చాలాచోట్ల వినిపి స్తున్న సంభాషణలు ఇలాగే ఉంటున్నాయి. మొత్తం 32 వార్డుల్లో 16 మహి ళలకే రిజర్వ్ అయ్యాయి. ఎవరో కొద్దిమందివి తప్ప, ఆ అభ్యర్థుల పేర్లేమిటో చాలామందికి తెలియడం లేదు. వారు నామినేషన్లు కూడా వేసి వెళ్లారు కానీ, భర్తల చాటు భార్యలుగానే మిగిలి పోయారు. అంతకుముందు అభ్య ర్థుల ఎంపిక కోసం అధికార పార్టీ జరిపిన ఐవీఆర్ఎస్ సర్వేలో అభ్యర్థుల పేర్లే వచ్చాయి. అందుకోసమే మహిళా అభ్యర్థుల భర్తలు భార్యల పేర్లతో పాటు తమ పేర్లను తగిలించుకుని తమకే సర్వేలో ఓటు వేయాలంటూ సోషల్ మీడియాలో జనాల వెంట పడ్డారు.
-- కుప్పం, ఆంధ్రజ్యోతి (19.10.2026)

Comments
Post a Comment