ఎంత కష్టమొచ్చెనప్పా!

 


💚‘స్థానిక' మేళం💚

👉 ఎంత కష్టమొచ్చెనప్పా!


'థూ.. సెత్త బతుకై పొయ్యింది.'

'యేమైందప్పా?'

'ఇంకా ఏం గావాలి?'

'ఇప్పుడేమైందని అడగతావుంటే ఇనకుండా ఆ ఎదురు మాటలేంది?'

'నీకేం తెలస్తాది మా బాద.'

'మీ బాదంటా వుండావు. కుటుంబరంలో ఏదన్నా కష్టమొచ్చిందాప్పా?'

'పాడుమాటలు మాట్లాడబాక. నేను ఇప్పుటికే బాదల్లో ఉండాను.'

'ఏం బాదలప్పా? ప్రాణానికి ఏమన్నా బాగాలేదా యేంది?'

'ప్రాణానికి యేంది.. బేసుగ్గా వుండాది. రావాల్సిన కాసులే ఎగిరెళ్లి పొయ్యినాయి.'

'ఇచ్చిన అప్పు తిరిగి రాలేదా యేంది? యెదవ గుంపు.. కస్టమనొచ్చి కాళ్లు పట్టుకొంటారు. జాలితో అప్పులిస్తే ఎగ్గొట్టి కనిపించకుండా తిరగతారు.'

'అప్పు ఇయ్యడం గాదప్పా. కస్టంనింకా గట్టెక్కించమని ఎవరూ రాలేదనే నా బాద. ఆ మాటకొస్తే మా వార్డులో అందరి బాదా ఇదే.'

'అందేదప్పా? అప్పుకు ఎవరూ రాలేదని ఓ అంటా బాదపడిపోతా వుండావు. అంత ఎక్కవ కాసులుంటే నాకొక లచ్చ గొట్టు. నీ పటం గట్టి దండం పెట్టుకుంటా దినామూ.'

'ఛా.. నీదొక గోల. నేనంత బలిసి లేను, నీకు కాసులిచ్చేంద సావుకారునూ కాను.'

'ఇదిగో.. మూడో టీ గూడా అయిపొయ్యింది. నీ బాదేందో తెలవడం లేదు.'

'మీ వార్డువాళ్లకేం తెలస్తాది మా వార్డు జనాల బాద. మీ వార్డులో క్యాండేటు ఏకగ్రీవమయ్యుంటే తెలిసేది నీకు.. మా బాద ఎట్టాంటిదో.'

'మీ వార్డులో కౌన్సిలరు పోటీ లేకండా ఏకగ్రీవమయ్యాడంట గదా. అయినా దానికి నీ బాదకు లింకు ఏందప్పా. గొడవల్లేకండా జరిగిపొయ్యింది గదా.'

'అయిదేళ్లకొక తూరి వొచ్చే అవకాశం చెయ్యిజారి పొయ్యింది.'

'ఇదిగో.. అర్తం గాకండా వాగినావంటే ఈ టీ గ్లాసుతో బుర్ర బద్దలు కొట్టి జైలుకెల్తా."

'ఇంట్లో వుండే ఓటర్లను లెక్కట్టి ఇచ్చేవోళ్లు. ఆ పార్టీ, ఈ పార్టీ అని గాదు. రొండు పార్టీలనింకా పోటీలో ఉంటే రొండు పక్కలా కాసులు రాలేవి.'

'అదా నీ బాద?'

'అదే మరి. ఎలచ్చన్ల టైంలో ఇంతకన్నా బాదేం గావాలి? ఇప్పుడు ఎలచ్చ న్ లేకండానే మా వార్డు కౌన్సిలరు గెలిచిపొయ్యినాడు. ఇంగ మా మొగమెవురు జూస్తారు?'

'నువ్వు జెప్పిందీ నిజమేనప్పా. మా వార్డులో ఎంతెంతివ్వాలని లెక్కలు ఏసుకుంటా వుండారంట. రొండు పార్టీవోళ్లూ ఎలచ్చన్ ముందు రోజు ఇంటింటికీ వొచ్చి పువ్వుల్లో పెట్టి ఇస్తారని చెప్పుకుంటా వుండారు. బుడ్డీ యేరేగా ఇస్తారంట.'

'మాకా ఛాన్సు లేకండా పొయ్యిందని గదా నా బాద. మళ్లీ అయిదేళ్లదాకా మనవొంక తిరిగి చూసేవాళ్లుంటారా? హు..'

'హు.. కాలం మనది కానప్పుడు ఏం జెయ్యాల? పోదాం పా.. శానా టైమైంది."

కుప్పం మున్సిపాలిటీలో ఏకగ్రీవమైన వార్డుల్లోని ఓటర్ల బాధ ఇది. మున్సి పాలిటీలో 32 వార్డులుంటే 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ వార్డుల్లోని ఓటర్ల బాధ చెప్పనలవి కాకుండా ఉంది. ఎక్కడ చూసినా ఎలక్షన్ల గురించిన చర్చలే. తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ జనం నిట్టూర్పులు విడు స్తున్నారు. ఏకగ్రీవం చేసిన అధికారులను, అందుకు ప్రయత్నించిన నాయ కులనూ తిట్టుకుంటున్నారు. అయిదేళ్లకోసారి అయినా తమ గడపలు తొక్కి ఓట్లను అడుక్కునే దిక్కు లేకుండా పోయిందని చింత పడుతున్నారు. వారు ఇచ్చే తాయిలాలను కోల్పోయామని తెగ బాధపడిపోతున్నారు జనం.

-- కుప్పం, ఆంధ్రజ్యోతి

Comments

Popular posts from this blog

జమీందారీ బంగళా

లోయ అంచుల్లో

పుట్టింరోజు