నేను చదువుతున్న పుస్తకం.. అన్నా ఫ్రాంక్ డైరీ



అన్నా ఫ్రాంక్ ఒక జర్మన్ యూదు బాలిక. 1933 లో హిట్లర్ నాయకత్వంలో నాజీ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. జర్మనీలో యూదుల నిర్మూలనకు పూనుకుంది. ఫ్రాంక్ కుటుంబంతోపాటు మరో కుటుంబం... మొత్తం 8 మంది సభ్యులు రహస్య జీవనంలోకి వెళ్లిపోయారు. ఎప్పుడు ఎవరొచ్చి పట్టుకుపోతారో... ఏ బాంబు వచ్చి మీద పడుతుందో, ఏ విమానం నెత్తిమీద కూలుతుందో. క్షణం... క్షణం... భయం... భయం. అప్పటికి 13 ఏళ్ల బాలిక అయిన అన్నా, సాధారణ జీవనంలో ఉన్నప్పుడు తన పుట్టిన రోజున 1942, జూన్ 12న ప్రారంభించిన డైరీ ఇది. తర్వాత కొన్నిరోజులకే రహస్య జీవనంలోకి వెళ్లిపోయినా... 1944 ఆగస్టు 4 దాకా రెండు సంవత్సరాలా రెండు నెలలపాటు రాయడం కొనసాగించింది పట్టు విడవకుండా. ఆపైన నాజీలకు పట్టుబడి, కుటుంబ సభ్యులతో వేరై నిర్బంధంలోకి నెట్టబడిందా చిన్నారి. అక్కడే టైఫస్ వ్యాధితో చనిపోయింది దురదృష్టవంతురాలు అన్నా ఫ్రాంక్.

బాధ... ఆవేదన... కోపం... ప్రేమ... నిస్సహాయత... నిర్లిప్తత... ఆశ... నిరాశ... కౌమార దశలోని బాలిక అంతరంగ ఆవిష్కరణ ఈ డైరీ. నాటి దారుణ చరిత్రకు సాక్షీభూతం. అంతటి దుర్భర పరిస్థితుల్లోనూ ముట్టడిస్తున్న చావు భయాన్ని ఎదిరిస్తూ భవిష్యత్తు మీద ఆశను చివరిదాకా నిలబెట్టుకున్న ఒక చిట్టితల్లి ధైర్యం కూడా.


ముని ✍️


అన్నా ఫ్రాంక్ డైరీనుంచి మచ్చుకు కొన్ని ఘట్టాలు👇

నోట్: కిట్టీ అంటే అన్నా తన డైరీకి పెట్టుకున్న ముద్దుపేరు.


👉 సోమవారం సాయంత్రం, నవంబరు 8, 1943

... ఈ సాయంత్రం ఎల్లీ ఇక్కడ ఉండగానే తలుపు దగ్గర దీర్ఘమైన పెద్దమోత వినిపించింది. ఒక్కసారి నాకు భయంవేసింది. కడుపునొప్పి వచ్చింది. గుండె దడదడ లాడింది. అన్నీ భయం వల్లనే. రాత్రి నేను మంచంమీద పడుకున్నప్పుడు అమ్మానాన్న లేకుండా నేను ఒంటరిగా చెరసాలలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్కొక్కపుడు ఒంటరిగానే.. రోడ్డు పక్కన తిరుగుతాను. లేకపోతే మా రహస్యగృహం అగ్నికి ఆహుతి అవుతుంది. లేదా వాళ్ళే మమ్మల్ని తీసుకుపోవడానికి రాత్రి వస్తారు. ప్రతీదీ నేను నిజంగా జరుగుతున్నట్లు చూస్తాను. అందువల్ల ఇది నాకు త్వరలో జరుగుతుందన్న భావన కలుగుతుంది. ఇంతటి, ప్రశాంతతను అనుభవిస్తున్నందుకు మేమంటే అసూయగా ఉందని మెయిప్ అంది. అది నిజం కావచ్చును. కానీ ఆమె మా భయాల గురించి ఆలోచించడం లేదు. ప్రపంచం మాకు మళ్ళీ మామూలుగా ఉంటుందని నేను ఊహించలేను. నేను యుద్ధం తర్వాత అంటాను. కానీ అది ఎప్పుడూ నిజం కాబోని గాలిమేడలే. నేను మా పాత ఇల్లు, మా స్నేహితురాళ్ళు, పాఠశాలలో పరాచికాలు,- వీటిని తలచుకొంటే దానిని నేను కాక మరెవరో అనుభవించారేమో అనిపిస్తుంది.

మా రహస్య గృహంలో ఉండే ఎనిమిది మందిమీ నీలాకాశంలో చిన్న తునకలా అనిపిస్తాం. చుట్టూ నల్లటి వాన మబ్బులు మేము నిలబడ్డ నిర్దిష్ట ప్రదేశం ఇప్పటికీ భద్రమే. కానీ మబ్బులు మమ్మల్ని మరింతగా చుట్టు ముడుతున్నాయి. మమ్మల్ని సమీపిస్తున్న ప్రమాదం నుండి వేరు చేస్తున్న వృత్తం మరింత చిన్నదై మమ్మల్ని బిగిస్తోంది. మేము ఇప్పుడు ప్రమాదం చీకట్లచేత ఎంతగా చుట్టుముట్ట బడ్డామంటే, మేము తప్పించు కుందామని చేసే ప్రయత్నంలో ఒకళ్ళ నొకళ్ళం గుద్దుకుంటున్నాం. మేము కిందకు చూస్తే అక్కడ ప్రజలు ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. పైకి చూస్తాం. అక్కడ అంతా ప్రశాంతంగా చక్కగా ఉంటుంది. ఈ లోగా ఘనమైన చీకటి మమ్మల్ని వేరు చేసి పైకి పోనీయదు. మాముందు అది దుర్భేద్యమైన గోడలా నిలబడి ఉంటుంది. అది మమ్మల్ని నలిపివేద్దామని ప్రయత్నిస్తుంది. కానీ అలా చేయలేదు. నేను ఏడవగలను. "అబ్బా ఆ నల్లవృత్తం తప్పుకొని మాకు దారి ఇస్తే ఎంత బాగుండును."


👉 బుధవారం మార్చి 29, 1944

ప్రియమైన కిట్టీ,

బోల్నెస్టీన్ అనే ఎమ్.పి. లండన్ నుండి వెలువడే డచ్ వార్తలలో మాట్లాడాడు యుద్ధం తరువాత వాళ్లు డైరీలు, ఉత్తరాలు పోగుచేయాలని అన్నాడు. వెంటనే వాళ్ళు నాడెరీ వైపు దూసుకువచ్చారు. రహస్య గృహం గురించిన కల్పనను నేను ప్రచురించినట్లు ఊహించుకో. ఎంత ఆసక్తికరంగా ఉంటుంది. శీర్షికను బట్టే ప్రజలు ఇది డిటెక్టివ్ పుస్తకం అనుకుంటారు.

యుద్ధం అయిన పది సంవత్సరాల తరువాత యూదులమైన మేము ఏవిధంగా జీవించాం, ఏమితిన్నాం, ఏమి మాట్లాడాం అన్నది చెబితే నవ్వులాటగా ఉంటుంది. నేను నీకు ఎంతో చెప్పినా, నీకు మా జీవితాల గురించి కొద్దిగానే తెలుస్తుంది.

విమాన దాడులలో ఆడవాళ్ళు ఎంత భయపడతారు. ఉదాహరణకు 350 బ్రిటీష్ విమానాలు అరమిలియన్ కిలోల బాంబుల్సి ఐజూమడెన్ మీద కురిపించినప్పుడు ఇళ్ళు గాలిలో గడ్డిపరకలు కంపించినట్లు కంపించాయి. ఇప్పుడు ఎన్ని అంటు వ్యాధులు ప్రబలుతాయో ఎవరికి తెలుసు? ఈ విషయాల గురించి నీకేమీ తెలయదు. ప్రతీదీ నీకు వివరంగా చెప్పాలంటే నేను రోజంతా రాస్తూనే ఉండాలి. ప్రజలు కూరగాయలు, ఇతరవస్తువులకు వరుసలలో నిలబడవలసివస్తోంది. వైద్యులు రోగుల్ని చూడలేక పోతున్నారు. కారు దిగి నడుస్తూంటే కారు దొంగిలిస్తున్నారు. దొంగతనాలు పెచ్చు మీరుతున్నాయి. డచ్ వాళ్లు ఒక్కసారిగా దొంగలయిపోవడానికి ఏమైందను కుంటున్నావు. ఎనిమిది తొమ్మిదేళ్ళ పిల్లలు కిటికీలు బద్దలుకొట్టి, ఏది దొరికితే అది దొంగిలిస్తున్నారు. ఇళ్ళను ఎవరూ ఐదు నిముషాలు కూడా వదలడానికి సాహసించడంలేదు. నువ్వు వెళితే నీ వస్తువులూ వెళ్ళిపోతాయి. ప్రతిరోజు పోయిన టైపురైటర్లూ, పర్షియన్ రగ్గులు, ఎలక్ట్రిక్ గడియారాలు, బట్టలు మొదలైనవి పోయాయని పత్రికలలో ప్రకటనలు వెలువడుతున్నాయి. తిరిగి ఇస్తే ప్రతిఫలం ఇస్తామంటున్నారు. వీధులలోని ఎలక్ట్రిక్ గడియారాల్ని ముక్కముక్కలు చేస్తున్నారు. వారానికి ఇచ్చే రేషన్ రెండు రోజులకు మాత్రమే వస్తుంది. కాఫీకి బదులుగా ఇచ్చిందే ఎక్కువ రోజులు వస్తోంది. ఆక్రమణ అనేది చాలాకాలం తరువాత వ్యవహారం.

ప్రజలు జర్మనీ వెళ్ళాలి. పిల్లలు జబ్బుగానో లేకపోతే పోషకాహార లోపంతోనే ఉంటున్నారు. ప్రతివాడూ పాత చెప్పులూ, పాతబట్టలూ ధరిస్తున్నాడు. నల్ల బజారులో కొత్త మడమకు చర్మం ఖరీదు 7.50 ఫ్లోరిన్లు. చెప్పులు కుట్టేవాళ్ళు చెప్పుల మరమ్మత్తుకు ఒప్పుకోవడంలేదు. ఒప్పుకుంటే నువ్వు నెలలు వేచిఉండాలి. ఈ లోగా చెప్పులు మాయమైపోతాయి.

-- అన్నా ఫ్రాంక్ డైరీ

Comments

Popular posts from this blog

జమీందారీ బంగళా

లోయ అంచుల్లో

మరీచిక