కుంటి గుర్రం మీద ఎవరు పెడ్తారు?
'మీపక్క ఎవరెవరున్నారు లైన్లో?'
నాకు తెలీదప్పా'
తెలీకండా ఎట్టా ఉంటాది? నాకు చెప్పచ్చులే.'
ఎవరెవరి పేర్లో వినిపిస్తా వుండాయి. మాపక్క అందరూ లైన్లోనే వుండారు.'
'సరే, ఆ డాక్టరు పోటీ చేస్తారంటనా?'
'లైన్లో వుండాడని చెప్తావుండారు కానీ.. ఎవరి చేతుల్లో ఏముంటాది?'
'అవునవున్లే. నువ్వు జెప్పేదీ నిజమే.'
'మాపక్క సరేగానీ, మీపక్క నువ్వు పోటీలో ఉండావాప్పా.'
'లేదులేదు.. ఎవరు చెప్పింది నీకు?'
'లేదులేప్పా, నీ పేరుగూడా ఇనిపిస్తావుండాది. ఎందుకు దాస్తావు?'
'అంటే, టికెట్టు ఇస్తే చేస్తా.'
'బలంగానే ఉన్నాయన్నమాట కాసులు?'
'కాసులా.. నాదగ్గరెక్కడుండాయి? ఒకేళ ఉండినా, కుంటిగుర్రం మీద పందెం ఎవుడు కాస్తాడు? అయితే టికెట్టు ఇస్తే మాత్రం గెట్టి పోటీ ఇస్తా.'
'అవున్లేప్పా, నువ్వు జెప్పేదీ నిజమే. మాపక్క మాత్రం రేసు గుర్రమే గదా. అందుకనే పోటీకి ఇద్దురు ముగ్గురు రెడీగా ఉండారంట. మిగిలినోళ్లు మాత్రం టికెట్టుతోపాటు కాసులు కూడా పార్టీనే పొయ్యాలని చూస్తావుండారంట.
'సర్లేప్పా, ఇంగ లేస్తాం పదా.'
కుప్పంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ ఇది. పాలక మండలి పదవీకాలం ముగిసిన సందర్భంలో నిర్వహించిన విందు సమావేశ మది. అక్కడ అధికార ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఇరువర్గాల వారూ ఉన్నారు. కుప్పమంటే పార్టీ వేదికలమీదే విమర్శలు, ఆరోపణలు, బయటకొస్తే వారూ వీరూ స్నేహాలు, బంధాలు కొనసాగిస్తూనే ఉంటారు. అలా ఇరు పార్టీల వ్యక్తుల మధ్య స్నేహపూర్వక సంభాషణ చోటు చేసుకుంది. విందు ఆరగిస్తూనే మున్సిపల్ చైర్మన్ పదవి రేసులో ఉన్నవారిని గురించి ఒకరినొకరు ఆరా తీసుకున్నారు.
ఇందులో కుంటిగుర్రం వ్యక్తి ఏ పార్టీనో, రేసు గుర్రం వ్యక్తి పార్టీ ఏదో మీరీపాటికి పసి గట్టేసే వుండాలి.
- కుప్పం, ఆంధ్రజ్యోతి
(28.09.2026న ప్రచురితమైన నేను రాసిన రాజకీయ వ్యంగ్య కథనం)

Comments
Post a Comment