" మ్మోవ్, ఊరంతా దిరిగినా ఎక్కడ కోడినమ్మేవోడే కనబళ్ళా. యాంజేసేదో అర్తం గావడంల్యా.” పందుంబుల్ల నోట్లో పెట్టుకోని పద్దననగా పైగుడ్డ బుజిమ్మిందేసుకొని ఈదిలో పడిన నాయిన , పందిలి నీడ చిన్న రాయికాడికొచ్చినాక ఇంటికొచ్చినాడు ఈసురోమంటా. పందిలి ముందు యాపసెట్టు కింద ఉండే బండ మింద సతికిలబడినాడు. " అయ్యో, ఈ పాడుబడిన ఊళ్ళో ఒక్కటంటే ఒక్క కోడిని అమ్మేవోడు గూడా లేడా. దుదుగుంటోళ్ల రమణయ్యను అడిగినావా? ల్యాకపోతే నీ సావాసగాడు నాగయ్యను కనుక్కోరాదా సిన్నోడా..” రాగం దీసింది అవ్వ. “ఆ ఇద్దురినీ అడిగినా. వోల్లు లేదన్నాకే, ఊరుమింద బడినా. చెంచత్త, పొట్టేక్క, పుల్లారెడ్డి మావ, నారి బావ.. ఎవుర్ని అడిగినా లేదనేవోళ్ళే.” మళ్ళోసారి తుండుగుడ్డతో మొగం తుడుసుకున్నాడు. కొక్కో... ర్... కొక్కర్... క్రో.. ర్.. అంటా దిబ్బలో యారక తింటా ఉండే కోళ్ళ గుంపు అదే టయానికి ఈపక్క వొచ్చింది. వోటిని కొంచేపు ఎగాదిగా జూసింది మాయవ్వ. ముక్కలగుండా ఇంత పొడగన గాలి వొదిలింది. “ఇంగేమి జెయ్యాల సిన్నోడా , మన పుల్ల రెక్కల బూడిద పెట్టనే కొయ్యాల. సిన్నమ్మోళ్ళు సిత్తానూరు నించి ఎప్పుడైనా దిగొచ్చు. కోడికూరైనా పెట్టకపోతే మీ బా...